స్వర్గధామం 1

 

స్వర్గధామం 1  ”మరి ఎవరయితే తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనసుని దుష్ట వాంఛలకు దూరంగా ఉంచాడో అతని నివాసం స్వర్గం అవుతుంది. అతను దానిలో సదా ఉంటాడు”.(నాజిఆత్‌: 40,41)

”నిజం – ఎవరయితే నరకాగ్ని నుండి కాపాడ బడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారే అసలు సిసలయిన విజేతలు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 185)

a-new-heaven-and-a-new-earth

అల్లాహ్  ప్రీతిని పొందే ఉద్దేశ్యంతో ముందుకు సాగే వ్యక్తి శ్రమ ఎన్నటికీ వృధా కాదు.

కాలం నిర్విఘ్నంగా ముందుకు దూసుకుపోతూ ఉంది. ప్రతి వ్యక్తి జీవన యాత్ర చేస్తూ గమ్యం వైపునకు సాగిపోతున్నాడు.  ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకుని, దాన్ని ఛేదించే దిశలో దూసుకుపోతు న్నారు. కాని ఈ లక్ష్య సాధనలో అందరూ సఫలీకృతులు కాలేరు. ఎందరో అలసిసొలసి విఫలురై పోతారు. అయితే అల్లాహ్  ప్రీతిని పొందే ఉద్దేశ్యంతో ముందుకు సాగే వ్యక్తి శ్రమ ఎన్నటికీ వృధా కాదు. అలాంటి వ్యక్తి నోట సదా ఈ వేడుకోలు వచనం జాలువారుతూ ఉంటుంది – ”ఓ మా ప్రభూ! ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మాకు మంచిని ప్రసా దించు. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు”. (బఖరా: 201)

అతని కోసం సృష్టిలోని సకల జీవరాసులు దుఆ చేస్తాయి. ఈ దుఆలు మరియు జనుల, దైవ దూతల దీవెనలు స్వర్గ రూపంలో ప్రతిఫలిస్తాయి. ఇంతకీ ఎవడా అదృష్టవంతుడు? ఈ మహా భాగ్యం ఎవరి ఖాతాలో చేరుతుంది? అతడు – పడుకునేటప్పుడు వుజూ చేెసుకొని నిద్రపోయాడు. ‘అస్స లాతు ఖైరుమ్మినన్‌నౌమ్‌ – నిద్రకన్నా నమాజు మేలయినది’ అన్న ముఅజ్జిన్‌ పిలుపు చెవిలో పడగానే సుఖ నిద్రను పరిత్యజించి లేచి వుజూ చేసుకున్నాడు. నమాజు కోసం బయలుదేరాడు. భక్తీప్రపత్తులతో నమాజు చేశాడు. అల్లాహ్‌ాను ఎంతో తాదాత్మ్యంతో స్మరించాడు. ఆ భక్తిపరుడు ఎన్నో పనులతో తలమునకలయి ఉన్నాడు. కానీ, ‘హయ్యా అలస్సలాహ్‌ా -నమాజు వైపునకు రండి!  అన్న పిలుపు వినబడింది. అల్లాహ్‌ా విధిని నిర్వర్తించడానికి సకల పనులను ప్రక్కన పెద్ద మస్జిద్‌ వైపు నడవనారం భించాడు.

శుక్రవారం నాడు తన షాపు ముందు చాలా మంది కష్టమర్లున్నారు. వ్యాపారం మంచి ఊపు మీద ఉంది. అంతలోనే ‘హయ్యా అలల్‌ ఫలాహ్  – సాఫల్యం వైపునకు రండి!’ అన్న నినాదం కర్ణపుటాలకు తాకింది. తక్షణమే అతనికి అల్లాహ్‌ చేసిన హితువు గుర్తుకొచ్చింది- ”ఓ విశ్వసించినవారలారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచిన ప్పుడు అల్లాహ్  సంస్మరణ వైపునకు పరుగెత్తండి. క్రయావిక్రయా లను వదిలి పెట్టండి…నిజంగా వినోదక్రీడలకంటే, వ్యాపారంకంటే అల్లాహ్‌ా వద్ద ఉన్నదే శ్రేష్ఠమయినది. అల్లాహ్  అందరికంటే మేలయిన ఉపాధప్రదాత”. (జుమా: 9) అంతే, షాపు మూసేసి మస్జిద్‌ వైపు జుమా నమాజు కోసం సాగిపోయాడు. ఆ సత్యప్రియుడు గదిలో కొందరు స్నేహితులతో కూర్చొని ఉన్నాడు. ఏదో విషయమయి గొప్ప చర్చే జరుగుతోంది. ఉన్నట్లుండి వ్యర్థ ప్రలాపనలు, అశ్లీల పరాచికాలు మొదలయ్యాయి. అంతే. అతను వెంటనే దైవాగ్రహానికి కారణభూతమయ్యే ఆ స్థలానికి, అట్టి స్నేహానికి స్వస్తి పలికాడు. ఆ సద్వర్తనుడు చాడీలు చెప్పి, తమ సాటి సోదరుని మృత కళేబరాన్ని భక్షించే వారి సమావేశాల్లోకి వెళ్లడుగాక వెళ్లడు. ఒకరి వీపు వెనకాల మాట్లాడటం, ఎదుటివారిలో చిచ్చు పెట్టి వేెడుక చూడ టం అతని బొత్తిగా నచ్చదు. ఆ పుణ్యాత్ముడు పలికితే సత్యమే పలుకు తాడు. దైవాదేశాలకు, దైవప్రవక్త (స) నియమావళికి లోబడి జీవిస్తాడు. రమజాను ఉపవాసాలుంటాడు. జకాత్‌ను విధిగా చెల్లిస్తాడు. విరివిరిగా దానధర్మాలు చేస్తాడు. అనాథలకు ఆశ్రయం ఇస్తాడు. నిరు పేదలు, వితంతువులు, వికలాంగుల బాగోగులను గమనిస్తాడు. ఇరుగు పొరుగు వారి శ్రేయాన్ని కోరుతాడు, తల్లిదండ్రులను సేవిస్తాడు. పగవారితో సయితం ప్రేమగా వ్యవహరిస్తాడు. సంతానానికి సరైన సంస్కారాన్ని నేర్పుతాడు. భార్యతో ఉదారంగా వ్యవహరిస్తాడు. చిన్న చీమ మొదలు స్వర చేప వరకూ ప్రతి జీవి క్షేమాన్ని మనసారా కాంక్షిస్తాడు. అందరి లాగే అతనికీ మరణం సంభవించింది.

దైవ సన్నిధి –   ఆ దాసుడు అల్లాహ్  ముందు నిలబడి ఉన్నాడు. అల్లాహ్  అతన్నుద్దే శించి: ‘ఓ నా దాసుడా! నీ వల్ల జరిగిన ఫలానా పాపాన్ని గుర్తుచేసుకో’ అంటాడు. దాసుడు గుర్తు చేసుకుమటాడు. ‘ఓ నా ప్రభూ!నేను సర్వ నాశనమయి పోయాను’ అని మొరపెట్టుకూమటాడు. దానికి అల్లాహ్ : ‘నువ్వు ఈ పాపంపై పశ్చాత్తాపం చెందావు గనక ప్రపంచ జీవితంలో నీ ఈ పాపాన్ని పరుల నుండి కప్పిపుచ్చాను. నువ్వు నన్నే నుమ్ముకున్నావు గనక ఈ రోజు నిన్ను క్షమిస్తున్నాను’ అంటాడు. ఇక ఆ దాసుని ఆనం దానికి మేరే ఉండదు.

మిత్రులరా! మనలో పాపం చేయని వారు ఎవరు? అయితే పాపం చేసి పశ్చాత్తాపం చెందిన వారే ధన్యులు. నిజ దైవ దాసుల లక్షణం కూడా అదే – ”వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరి ని అవలంబిస్తారు. అలాంటి సదాచార సంపన్నులనే అల్లాహ్  ప్రేమిస్తాడు. మరియు వారు తమ ద్వారా ఏదయినా నీతిబాహ్య మయిన పని జరిగి పోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదయినా అన్యాయం చేెసుకుంటే వెంటనే అల్లాహ్‌ాను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్‌ా తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు? – వారు తమ వల్ల జరి గింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు”.(ఆలి ఇమ్రాన్‌: 134-135) ”వారికే తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభిస్తుంది…ఈసత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!”. (ఆలి ఇమ్రాన్‌: 136)

దాసుడి లెక్కల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడింది. వెంటనే తన వారి వైపునకు పరుగులు తీశాడు. ఈ రోజు అతని ఆనందానికి అవ ధులు లేవు. సంతోషంతో అతని ముఖం అరవిందంలా విప్పారింది. తన ప్రగతి పత్రాన్ని అందరి ముందూ ప్రదర్శిస్తూ – ‘ఇదిగో,చూడండి! నా కర్మల పత్రాన్ని. మీరు చదవండి….నా కర్మలకుగాను మంచి ప్రతి ఫలం లభిస్తుందని నేను అనుకుంటూ ఉండేవాడను. ఓ మహ్షర్‌ మైదానంలో ప్రోగయి ఉన్న ప్రజలారా! చూడండి! నా కర్మల పత్రం నా కుడి చేతిలో ఇవ్వబడింది. ఏం చూస్తున్నారు? ఇది నమాజు! ఇది అన్న దానం! అదేమో ఉపవాసాలు! అవేమో హజ్జ్‌ ఉమ్రాలు, దుఆ,జిహాద్‌లు – ఇవన్నీ పుణ్యాలే. మీకు కానరావడం లేదా? నిశ్చయంగా నా ఈ కర్మల పత్రంలో పశ్చాత్తాపం – తౌబా ఉంది, క్షమాభిక్ష – ఇస్తిగ్ఫార్‌ ఉంది. దేవుని స్తుతిస్తోత్రాలు, పవిత్రతా కీర్తనలు – తస్బీహ్ , తహ్మీద్‌, తహ్లీల్‌ కూడాఉన్నాయి. అల్లాహ్  వైపుకు ఆయన దాసుల్ని సాదరంగా ఆహ్వానించడం, ధర్మాన్ని, ఖుర్‌ఆన్‌ని నేర్చుకొని ఇతరులకు నేర్పించడ మూ ఉంది.  బాగా చూడండి! ఇది ఫజ్ర్‌,  జుహ్ర్  ,  అస్ర్‌, మగ్రిబ్‌, ఇషా నమాజు. అదేమో తహజ్జుద్‌,  ఇష్రాఖ్‌,  ఇస్తిఖారా, ఇస్తిస్ఖా,  తసీబీహ్‌ నమాజు. నేను మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి వచనాన్ని ఇహ లోకంలోనే గ్రహించాను ‘ఖుర్‌ఆన్‌ను నేెర్చుకొని ఇతరులకు నేర్పేవాడు మీలో ఉత్తముడు’ అని. (బుఖారీ)

‘మరెవరయితే తమ ఫ్రభువుకు భయపడేవారో వారిని బృం దాలు బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవడం జరుగు తుంది”.(జుమర్‌:73) ఈ సౌభాగ్యవంతులు స్వర్గం వైపునకు తీసుకు పోబడతారు. అక్కడికెళ్ళి అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమయింది? ఈ ఎదురు చూపులు ఎవరి కోసం? అవునవును….వారు తమ ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) కోసం వేచి ఉన్నారు. మనుషుల్లో మహామనీషి! ప్రవక్తలందరిలో అగ్రజులు!! విశ్వ కారుణ్యమూర్తి! మానవ మహో పకారి!! దివ్యతేజస్సుతో కాంతులీనుతూ దేదీప్యమానమయిన ముఖార విందంతో ప్రజల ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు అందరూ మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)తో కలిసి స్వర్గం తలుపుల దిశగా అడుగులు వేస్తారు.

స్వర్గం – స్వర్గానికి ఎనిమిది ద్వారాలు. స్వర్గాన్ని స్వయంగా అల్లాహ్‌ా\, ప్రియమైన దాసుల కోసం తన స్వహస్తాలతో అలంకరించాడు. స్వర్గం లో ఒక బాణం పెట్టుకునేంత చోటు లభించినా అది ప్రాపంచిక సకల సంపదలకంటే ఎంతో ఘనతరమయినది. అందులో మొదట ప్రవేశించే అదృష్ట సముదాయం మహా ప్రవక్త ముమహమ్మద్‌ (స) వారి సముద యం. ఇదిగో! మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) అడుగు ముందుకు వేశారు. స్వర్గం తలుపు తడుతున్నారు. ‘ఎవరు మీరు?’  స్వర్గదూతలు ప్రశ్నిం చారు. ”నేను…ముహమ్మద్‌ని (స)”.’ఓ ప్రవక్తా! మీ గురించి మాకు ఆజ్ఞాపించబడింది’.’ఏమని?’ ‘మీరు వచ్చే వరకూ స్వర్గ ద్వారాలు తెరవకూడదని’. అల్లాహు అక్బర్‌! స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి. ”వారు అక్కడకు చేరుకునేటప్పడికే దాని ద్వారాలు తెరవబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారి నుద్దేశించి, ‘మీపై శాంతి కురియుగాక! – సలామున్‌ అలై కుమ్‌’. మీరు హాయిగా ఉండండి” అని (సాదరంగా స్వాగతిస్తారు) అంటారు. (జుమర్‌: 73)

అది ఎలాంటి సన్నివేశం?! అందరి ముఖాలు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాయి. వారు అనందాతిశయంతో అల్లాహ్‌ ఘనకీర్తిని చాటుతున్నారు. స్వర్గ నిర్వహణాధి కారులు వారితో – ‘మీరు భాగ్యవంతులయ్యారు. మీరు ఇహలోకంలో మంచిగా మసలుకున్నారు. అం దుకే స్వర్గంలో ని సకల భోగబాగ్యాలను అనుభవించేందుకు అందులో ప్రవేశించండి. ”అక్కడ దయాసాగరుడయిన అల్లాహ్  తరఫు నుండి వీరికి ‘సలామ్‌’ చెప్పబడుతుంది’. (యాసీన్‌:58) ఎంత అదృష్టం! మరెంత భాగ్యం!!

స్వర్గద్వారాల వద్ద నిలబడి దైవదూతలు పిలుపునిస్తున్నారు: ‘క్రమం తప్పకుండా నమాజు చేసినవారలారా! రండి, ‘బాబుస్సలాత్‌ – నమాజు ద్వారం’ గుండా స్వర్గంలో ప్రవేశించండి. నిష్ఠగా ఉపవాసం పాటించే వారలారా! మీ కోసం బాబుర్రయ్యాన్‌ సిద్ధంగా ఉంది. నిజాయితీగా జకాతు చెల్లించే వారలారా! మీరు బాబుజ్జకాత్‌ ద్వారా స్వర్గంలో ప్రవే శించండి. పుణ్యఫలాపేక్షతో దానధర్మాలు చేసినవారలారా! మీ కోసం బాబుస్సదఖా ఉంది. ప్రాణాలొడ్డి దైవ మార్గంలో పోరాడిన ఓ జిహాద్‌ యోధులారా! దేవుడ స్వయంగా ఈ బాబుల్‌ జిహాద్‌ను తయారుచేశాడు రండి. కొందరు భాగ్యవంతుల్ని రెండేసి ద్వారాల గుండా పిలుపునివ్వ డం జరుగుతుంది. మరికొంత మంది అదృష్టవంతుల్ని మూడు ద్వారాల గుండా, ఇంకొందరిని నాలుగు ద్వారాల గుండా పిలవడం జరుగు తుంది. వారిలో మరీ అదృష్టవంతులుంటారు. వారిని స్వర్గపు అన్నీ ద్వారాల గుండా స్వాగతించడం జరుగుతుంది. అల్లాహ్‌ాను తన ప్రభు వుగా, ముహమ్మద్‌ (స)ను తన ప్రవక్తగా నమ్మి, అయిదు పూటల నమాజు చేసి, రమజాను ఉపవాసాలు ఉండి, జకాత్‌ చెల్లించి, హజ్జ్‌ చేసి, తన భర్తతో మంచిగా నడుచుకున్న మహిళామూర్తులు కూడా ఈ జాబితాలో చేరతారు అని మహా ప్రవక్త ముహ్మద్‌ (స) వారే స్వయంగా సెలవిచ్చారు. వారికి నచ్చిన ద్వారం గుండా వారు స్వర్గంలో ప్రవేశించ వచ్చు. సుబ్హానల్లాహ్!

సోదరా, సోదరీ! స్వర్గపు ఒక్కో ద్వారం వెడల్పు ఎంత ఉంటుందనుకుం టున్నావు? నలభై సంవత్సరాలు ఆగకుండా నడిచినా తరగనిదంత! ఇక్కడో విచిత్రం ఉంది. అదేమిటంటే – ఆ రోజు ఆ ద్వారాలే స్వర్గ వాసులతో కిటకిటలాడుతుంటాయి. అల్లాహు అక్బర్‌! !

సోదరా, సోదరీ! ఆలోచించు! నీవు స్వర్గవాసివన్న శుభవార్త ఇవ్వబ డింది. దైవకృపతో నువ్వు పుల్‌సిరాత్‌ను దాటుకొని ఖన్తర అనే ప్రదేశానికి చేరుకున్నావు. నీలోని కల్మషాన్ని, కల్లాకపటాన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆనక నువ్వు స్వర్గపు తలుపుల దగ్గరకు వచ్చావు. ‘బిస్మిల్లాహ్‌ా’ అంటూ నీ కుడి పాదాన్ని  స్వర్గంలో మోపావు. ఏం కనబడుతోంది? అక్కడ నువ్వు ఎటు చూసినా దైవానుగ్రహాలే. ‘ఒక మహత్త సామ్రాజ్య వైభవం అక్కడ నీకు కనబడుతుంది’.ఒకేఒక్క అడుగు – దాసుడు ప్రపంచపు సకల బాదలను, దుఃఖాలను మరచిపో తాడు. అసలు ఇహలోకమన్నదే అతనికి జ్ఞప్తికి రాదు. నమాజు అలసట ఎటెళ్ళింది? జిహాద్‌ అలసట ఎటు మాయమయింది? భార్యాబిడ్డల, తల్లిదండ్రుల కోసం ధర్మసమ్మతమయిన సంపాదన కావాలని పడిన శ్రమంతా ఏమయింది? అన్నీ పోయాయి..మిగిలిందొకటే…అది అతని అదృష్టం! ఒక్క పాదమే కదా మోపింది! ఇంతలోనే అంత మహిమ.మరి ఇప్పుడతను రెండో పాదం మోపుతున్నాడు. ఎలా ఉంది స్వర్గం?

Related Post