గుండెలోని ప్రాణం గొంతు దాటక ముందే….

Originally posted 2013-05-17 22:11:46.

soul-group
మనిషి ఏమంత బలాఢ్యుడు కాడు. చెప్పాలంటే ప్రకృతిలో అత్యంత బలహీనుడు – ఉత్త రెల్లు కర్ర వంటివాడు. అతని ఆహాన్ని అణచడానికి విశ్వమంతా ఎత్తి రానవసరం లేదు. ఒక చిన్న అగ్ని కణం చాలు – అతన్ని, అతని అహాన్ని అణచడానికి. ఆరాధనాలయంలో భక్తుడు, చెరసాలలో నేరస్థుడు, అవసరాల కౄర హస్తాల మధ్య అజ్ఞాని, తన దైన్య స్థితికి – అణగారిన జీవితానికి మధ్య దరిద్రుడు, దురాశ – స్పురణల మధ్య ధనవంతుడు, సంధ్యా సమయంలో పొగమంచుకీ – జీవన ఉషోదయానికీ మధ్య సగటు మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే…మానవుని మనుగడ, మనిషి జీవితం కడలిపై తేలియాడే నురుగు లాంటిది. నీటి మీద క్షణం పాటు ప్రతక్ష్యమయ్యే బుడగ వంటిది.  క్షణభంగురమది. గాలి వీస్తే గల్లంతే. మృత్యు వస్తే, అందరూ అంతే! దేహం లేని ఆత్మ ఉత్త శూన్యం. ఆత్మ లేెని దేహం, అర్థం లేని చట్రం.
  మడతలు పడిన ఆశలు, కలలు, వాంఛలు ముసలివాని ముఖ కవళికలు మాదిరిగా మారుతాయి. మనం మళ్ళీ చూసేటప్పటికి, అందు మన ముఖమే కనబడుతుంది. శీతాకాలంలో చెట్ల ఆకుల్లాగా 60, 80 సంవత్సరాలు మన జీవన వృక్షం నుంచి రాలి పోతాయి. అయితే భక్తిపరులకు జీవితం మృత్యువూ రెండూ  సమానమే! కాదు, కాదు. వారికి జీవితం కన్నా మృత్యువే మనోహరం!! జీవితం పరీక్ష అయితే మృత్యువు పరమోన్నత మిత్రునికి చేరువ చేసే మహత్తర సాధనం. వారు మృత్యువును ప్రేమించినంతగా మరి దేన్నీ ప్రేమించరు. జీవితం మనిషిలోని కోర్కెలకు ఆజ్యం పోసినప్పుడు అది ఆశల ఆత్రాన్ని పెంచే, వెర్రితనాన్ని రెచ్చగొట్టే, దైవ అవిధేయతకు ఉసిగొల్పే చేష్టలే ఎక్కువగా చేస్తుంది. మృత్యువు మనిషిని అన్ని విధాల ద్రోహాల నుండి, ప్రాపంచిక వ్యామోహాల నుండి ఆపుతుంది. హద్దుల అతిక్రమణ, ఇహపరాల  నాశనం చేసే హాలాహలమని, అహంకారం అనర్థదాయకం అని,    బంధుత్వ    విచ్ఛిన్నత భయంకర నేరమని, అవినీతి, అక్రమం, అన్యాయం శాశ్వత అంధకారమని హితవు చేస్తుంది. మరణం లేదు, రాదు అన్న భ్రమ కన్నా, మృత్యువు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్న వాస్తవమే మనిషిని అదుపులో ఉంచుతుంది. జీవితం మత్తుని కలిగిస్తుంది. మత్తెక్కించేలా వ్యవహరిస్తుంది.
  మృత్యువు మత్తును వదలగొడుతుంది, మత్తెక్కకుండా కాపాడుతుంది. మనిషికి ఇన్ని మేళ్ళు చేసే ఆ మృత్యువు గురించి మహా ప్రవక్త (స ) వారు ఏమన్నారో గమనించండి! ”మజాలను హరించేదాన్ని, అంటే మృత్యువును ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉండండి. ప్రజలారా! అల్లాహ్‌ాను స్మరించండి. శరీరంలో దడ పుట్టించేది వచ్చేసింది. దాని తర్వాత వచ్చేది కూడా సమీపించింది. మృత్యువు తన భీతావహ రూపంలో వచ్చేసింది. తొందర చేయండి. ఏడు భయంకర దుస్థితులు దాపురించక మునుపే త్వరగా మంచి పనులు చేసుకోండి. ఏమిటి, మిమ్మల్ని (ధర్మం) మరిచిపోయేటట్లు చేసే పేదరికం, దారిద్య్రం కోసం నిరీక్షిస్తున్నారా? లేక హద్దు మీరి ప్రవర్తించేటట్టు చేసే కలిమిని కోరు కుంటున్నారా? లేక మీ ఆరోగ్యాన్ని పాడు చేసే, మిమ్మల్ని చింర వందర చేసే మహమ్మారి కోసం ఎదురు చూస్తున్నారా? లేదా బుద్ధిని, వివేకాన్ని చెడగొట్టే వృద్ధాప్యం కోసం వేచియున్నారా? లేక తృటిలో ప్రాణం తీసే మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారా? లేక దజ్జాల్‌ రాక కోసం ఎదురు చూస్తున్నారా? అతడు అగోచరాల్లో అత్యంత చెడ్డవాడు. లేదా ప్రళయం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రళయం అతి భయంకరమైనది, అత్యంత చేదైనది. మీరు మీ కోరికల్లో నిమగ్నులై ఉన్నంతలోనే అకస్మాత్తుగా మిమ్మల్ని కబళిస్తుంది. కాబట్టి మీరు ప్రపంచంలో ఓ అపరిచితునిలా, పరదేశీయునిలా, ఓ బాట సారిలా   జీవించండి. (సాయంత్రమైతే తెల్లారే దాక వేచి చూడకండి. తెల్లారితే సాయంత్రం వరకు ఆగి ఉండకండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్య  పరిస్థితుల  కోసం,   మీ   జీవితం లోంచి మరణానంతర జీవితం కోసం కావాల్సిన సామగ్రిని సమకూర్చుకోండి.
  విశ్వసించిన జనులారా! మీ సిరిసంపదలూ, మీ సంతానమూ, మిమ్మల్ని అల్లాహ్‌ా సంస్మరణ నుండి ఏమార్చరాదు. మీకు ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు పెట్టండి. కర్మల వ్యవధి ముగిసిపోయిన వారికి ఇక వ్యవధి అంటూ ఇవ్వబడదు. ”ఓ మా ప్రభూ! మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పినవారము. ఓ స్వామీ! ఇక మమ్మల్ని ఇక్కడ్నుంచి బయటకు తీయి. తరువాత మేము అలాంటి పాపాలు చేస్తే ఒట్టు” అని లెంపలేసుకునే దుస్థితి దాపురించక ముందే మంచి కార్యాలు చేపట్టండి. ప్రపంచం వెనక్కి మరలి (వీపు చూపించి) పారిపోతూంది. పరలోకం (ఆఘమేఘాల మీద) ముందుకు దూసుకు వస్తూంది. ఎవరికి ఏ భూభాగంపై మృత్యువు రానున్నదో ఏ వ్యక్తికీ తెలియదు. ఆ ఘడియ ఆసన్నమైనప్పుడు ఒక్క నిమిషం కూడా వెనకా ముందూ కాజాలదు. సత్కార్యాలు చేయండి. సజ్జనుల సాంగత్యాన్ని ఆశ్రయించండి. నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశ పెట్టబడేవారు మాత్రమే నిజానికి సఫలీకృతులన్న సంగతిని మరువ కండి.
  (మృత్యువు మనోహరమైనదే) కాని, మీలో ఏ ఒక్కరూ (కావాలని) చావుని కోరుకోరాదు. మీరు మంచివారైతే (జీవించి ఉంటే) మరిన్ని మంచి పనులు చేసుకోవచ్చు. మీరు చెడ్డవారైతే చేసిన నిర్వాకంపై (మున్ముందు) పశ్చాత్తాపం చెందవచ్చు! కాబట్టి మీలో ఎవరు కూడా తనకేదయినా నష్టం కలిగినప్పుడు చావుని కోరుకోరాదు. గత్యంతరం లేదనుకుంటే, ఖచ్చితంగా చావే కావాలనుకుంటే ”అల్లాహుమ్మ అహ్‌యినీ మా కానతిల్‌ హయాతు ఖైరన్‌లీ, వ తవఫ్ఫనీ ఇజా కానతిల్‌ వఫాతు ఖైరన్‌లీ”. (ఓ అల్లాహ్‌! జీవితం నా పాలిట ప్రయోజన కరమైనంత వరకు నన్ను సజీవంగా ఉంచు. ఒకవేళ మరణమే నా కోసం మేలయితే అప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు) అని ప్రార్థిస్తూ ఉండండి.

Related Post