ఐ పి సి తెలుగు విభాగం
పరిశుభ్రత రెండు రకాలు:
(అ) ఘనపాటి అశుద్ధత నుండి శుద్ధి పొందడం (ఆ) తేలికపాటి అశుద్ధత నుండి శుద్ధి పొందడం
1 పెద్దదయిన అశుద్ధత నుండి శుద్ధి పొందడం:
నజస్ అంటే భాషాపరంగా మురికి,మాలిన్యం ప్రతి విధమయినటువంటి అశుద్ధత.
షరీయతు పరంగా నమాజు నెరవేరడానికి అడ్డు తగిలే అశుద్ధత, రక్తం, మూత్రం వంటివి.
నజాసతె ఐనియ్యా:
కంటికి కనబడే సహజంగా మనిషి అసహ్యించుకునే అపరిశుద్ధత. రంగు,వాసన వంటి స్పష్టమైన గుణం కలిగి ఉండేది. ఉదాహరణకు మలం, మూత్రం, రక్తం.
నజాసతె హుక్మియ్యా:
మన కంటికి కనబడకుండా కేవలం షరీయతు ద్వారా మాత్రమే అపరిశుభ్రమ యినదని తెలిసే అశుద్ధత. తనలోని వాసన, రంగును కోల్పోయి ఎండబారి కనబడకుండా ఉండే ప్రతి అశుద్ధత. ఉదాహరణకు: బట్టలకు మూత్రం అంటుకుంది కాని ఎండిపోవడం వల్ల దాని తాలూకు ఆనవాళ్ళు కనబడకపోవడం.
అశుద్ధత రకాలు వాటి నుండి శుద్ధి పొందే విధానం:
1. నజాసతె ముగల్లజా:
కుక్క, పంది సంబంధించిన అశుద్ధత. ఇవి అశుద్ధం అవడానికి ఆధారం ఏమిటంటే ఇతర అశుద్ధాల వలే వీటిని ఒకసారి నీటితో శుభ్రపర్చడం సరిపోదు.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ఒక వేళ మీ పాత్రల్ని కుక్క ఎంగిలి చేస్తే వాటిని ఏడుసార్లు కడగాలి. మొదటసారి మట్టితో కడగాలి. ఇలా చేస్తే అవి శుభ్రమవుతాయి.” (ముస్లిం 279)
శుద్ధి పొందే విధానం:
మురికి పడ్డ ప్రదేశాన్ని ఏడుసార్లు, వాటిలో ఒకసారి మట్టితో కడగటం ద్వారా శుద్ధతను పొందగలం. అశుద్ధత ఐనియ్యాకు సంబంధించినదయినా, హుక్మియాకు సంబంధించినదయినా అది శరీరం, బట్టలు, స్థలం మీద ఉన్నా సరే. ఇదే ఆదేశం వర్తిస్తుంది. కుక్క, పందిని తీసుకోవడంలో గల ఆంతర్యం ఏమిటంటే ఈ రెండూ పరమ అశుద్ధమయినవి గనక.
2. నజాసతె ముఖఫ్ఫఫా: రెండేండ్లు నిండని కేవలం పాలు మాత్రమే త్రాగే పసికందు మూత్రం. అది తేలికపాటిది అనడానికి ఆధారం దాని మీద నీటి తుంపరలు చల్లడం. క్రింది హదీసులో చూడండి:
”ఉమ్మెఖైస్ బిన్తె మిహ్సన్ (ర) పాలు తప్ప ఇతర ఆహారం తీసుకోని తన పసికందుని తీసుకుని దైవప్రవక్త(స)వారి సన్నిధికి వచ్చారు. ఆ బాలుడు ఆయన(స) దుస్తులపై మూత్రం పోసేశాడు, అప్పుడు ఆయన (స) నీరు తెప్పించి చల్లారు కాని ఆ బట్టను కడగలేదు. (బుఖారి 2021, ముస్లిం 287)
శుద్ధి పొందే విధానం:
అశుద్ధమయిన ప్రదేశంపై నీటి తుంపరలను చల్లడం ద్వారా శుద్ధి పొందవచ్చు.
3.నజాసతె ముతవస్సిత:
మధ్యే రకపు అశుద్ధత. కుక్క,పంది ఏమి తినని, బాలుడి అశుద్ధతను మినహా మిగతావన్నీ దీని క్రిందికి వస్తాయి.
అ) మద్యం, ద్రవ రూపంలోగల ప్రతి మత్తు పదార్థం.
”ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు- ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్ చేష్టలు, కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు.” (మాయిదా: 90)
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్(ర)కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు ”మత్తునిచ్చే ప్రతిదీ మద్యమే. ప్రతి విధమయినటువంటి మద్యం నిషిద్ధమే. ( ముస్లిం 2003)
ఆ) శవం: షరీయతు పద్ధతిని అనుసరించి మినహా మరణించిన ప్రతి జీవి ఈ కోవలోకి వస్తుంది. అలాగే బ్రతికున్న జంతువు శరీరం నుండి కోయబడిన భాగం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇవి నిషిద్ధం. అదేలాగు విగ్రహాల ముందు బలివ్వబడిన పశువులు, అల్లాహేతర పేరుతో జిబహ్ చేయబడిన పశువులు సయితం శవం క్రిందికే వస్తాయి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ”మృత పశువు రక్తం పంది మాంసం, అల్లాహ్ పేరు గాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది మీ కొరకు నిషేధించబడ్డాయి.” (అల్ మాయిదా 3)
వీటి నుండి మనిషి, చేప, మిడతలు మినహాయించబడ్డాయి.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్(ర) కథనం: ”ముస్లిం సజీవంగా ఉన్నప్పుడు గాని, మరణించిన మీదటగాని అశుద్ధం కాడు”. (బుఖారి కితాబుల్ జనాయిజ్)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: మీ కోసం రెండు శవాలు, రెండు రక్తాలు ధర్మసమ్మతం చేయబడ్డాయి. రెండు శవాలు చేప, మిడతలు. రెండు రక్తాలు గుండెకాయ, కాలేయం”. (ఇబ్నెమాజా 3314)
ఇ) ద్రవ రూపంలో ఉన్న రక్తం మరియు చీము.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”ఓ ప్రవక్తా! వారికి చెప్పు (వహీద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం….” (అన్‌ఆమ్: 145)
ఈ) మనిషి మరియు నిషిద్ధ జతువుల మలమూత్రాలు:
అనస్(ర) కథనం: ఒక పల్లెవాసి మస్జిద్‌లో మూత్రం విసర్జించాడు. సహాబా అతన్ని దండించడానికి లేవగా వారినుద్దేశించి ఆయన(స) ఇలా అన్నారు:”అతన్ని మూత్రం పోసుకోనివ్వండి. తర్వాత దానిమీద ఒక బింద నీళ్ళు కుమ్మరించండి”. (బుఖారి 5679)
ఎ) బ్రతికున్న జంతువు యొక్క ఏదైనా అవయవం విరిగినదయితే లేదా కోయబడినదైతే అవి అశుద్ధం.
”దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు:”బ్రతికుండగా పశువుల నుండి కోయబడినది ముర్దార్ అనబడుతుంది.” (హాకిమ్)
అయితే వాటి గోళ్ళు, కొమ్ములు, వెంట్రుకలు లాంటి రక్తం ప్రవహించని భాగాలు మాత్రం పరిశుభ్రమయినదే.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ” ఇంకా వాటి ఉన్నితోనూ,రోమాలతోనూ,వెంట్రుకలతోనూ ఆయన (అల్లాహ్) ఎన్నో సామానులకు కొంత కాలం వరకూ ఉపయోగపడే వస్తువులను తయారు చేశాడు.” (నహ్ల్ 80)
ఏ) నిషిద్ధ జంతువుల పాలు. గాడిదలాంటివి వాటి మాంసంలాగే వాటి పాలు కూడా నిషిద్ధమే.
వీటి నుండి శుద్ధి పొందే మార్గం:
ఈ అశుద్ధత దాని మీద నుంచి నీరు ప్రవహించి దాని ప్రభావం తొలిగిపోతే రంగు,రుచి,వాసన నశిస్తే – ఆ అశుద్ధత ఐనియా అయినా, హుక్మియా అయినా పరిశుభ్రమయిపోతుంది. అది శరీరం మీదున్నా, బట్ట, స్థలం మీదున్నా సరే. కొన్ని వేళల్లో రంగు తొలగకపోయినా ఫరవాలేదు. ఉదాహరణకు రక్తం.
చచ్చిన జంతువుల తోలు శుభ్రపర్చడం:
కుక్క మరియు పంది చర్మాల్ని మినహాయించి ఇతర చచ్చిన జంతువుల చర్మాల్ని దిబాగ్ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా శుద్ధ పర్చవచ్చు. దిబాగ్ అంటే చర్మంపై గల తడి పదార్థాన్ని కొన్ని పదార్థాలను కలిపి నీటిలో ఉడకబెట్టడం ద్వారా దూరం చేయడం. తర్వాత మళ్ళీ ఆ చర్మాన్ని మంచినీటితో కడగాలి.
”దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”చర్మం దిబాగ్ చేయబడిన మీదట పరిశుద్ధం అవుతుంది”. (ముస్లిం 366)
మినహాయించబడిన కొన్ని అశుద్ధాలు:
(అ) బట్టకు శరీరానికి తేలికపాటి మూత్రం అంటిన ప్రదేశం మీద నీటి తుంపర్లు చల్లుకోవడం.
(ఆ) లేలికపాటి రక్తం మరియు చీము ఈగల లద్దె.
(ఇ) గాయాల చీము, రక్తం అది ఎక్కువ శాతంలో ఉన్నా, అయితే అవి అదే మనిషి గాయానికి చెందినవై ఉండాలి. అందులో అతని ప్రమేయం ఉండకూడదు.
(ఈ) పాలు పితికే సమయంలో పాలలో పడే తేలిక పాటి పేడ.
(ఉ) చేపల లద్దె, పక్షుల రెట్ట. ముఖ్యంగా అవి ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో. ఉదాహరణకు మక్కా మదీనాల్లో.
(ఊ) తక్కువ శాతంలో బట్టలకు అంటే రక్తం.
(ఎ) మాంసానికి అంటుకుని ఉండే రక్తం.
(ఏ) వాంతి ద్వారా అశుద్ధమయిన బాలుడి నోరు. అమ్మ దగ్గర పాలు త్రాగేటప్పుడు.
(ఐ) రక్తం లేని చచ్చిన పురుగులు, ఈగ, తేనెటీగ, చీమ, అవి తమంత తాముగా ద్రవ పదార్థంలో పడితే. అవి పడటం వల్ల దాని స్థితి మారకూడదు.
అబూ హురైరా (ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు:”మీలోని ఎవరి పాత్రలోనయినా ఈగ పడిపోతే దాని పూర్తిగా ముంచి తీసిపారేయండి. నిశ్చయంగా దాని ఒక రెక్కలో స్వస్థత ఉంటే, మరో రెక్కలో రోగం ఉంటుంది.” (బుఖారి 5445)