సమాజంలో బలవంతులు, బలహీనులపై దీన నిరుపేద జనాలపై దౌర్జన్యాలకు పాల్పడటమనేది తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. ఈ దమన నీతికి, దుర్మార్గాలకు అధికంగా బలయ్యేది అబలలైన స్త్రీలు, దళిత ప్రజలు, అనాథలే. ఈ బలహీన, నిరుపేద జనాల కోసం ధర్మం కల్పించిన హక్కులు వారికి దక్కకుండా చేయడం బడా బాబులకు, బలవంతులకు, అగ్ర గణాలకు మామూలే. ఒకవైపు వారి కనీస హక్కుల్ని కాలరాస్తూ మరోవైపు వారిని రక రకాలుగా వేధించటం, చిత్రహింసలకు గురి చేయడం వీరి హాబి అయి వుంటుంది. దైవప్రవక్త (స) ఇలాంటి దౌర్జన్యపరులకు పరలోకంలో వినాశం తప్పదని హెచ్చరించారు. బలవంతులు, బలహీనుల హక్కుల్ని దోచుకోవడాన్ని ఖండించారు. ఈ విషయమై నేడు మనం సైతం ఆత్మ పరిశీలన చేసుకో వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన నడవడిక ద్వారాగానీ, మనం అవలంబిస్తున్న ఆచార వ్యవహారాల వల్లగానీ ఇస్లాం ధర్మానికి మచ్చ రాకుండా చూసుకోవాలి. ఇస్లాం బోధించే అభ్యుదయ సుమగంధాల్ని లోకానికి తెలియ జేసేందుకు శాయశక్తులా కృషి చేయాలి. అలా చేయని పక్షంలో ఆత్మ విరోధులై మన ధర్మం గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నందుకు మనం రేపు ప్రళయ దినాన రెండింతలు పాపాన్ని మోయవలసి ఉంటుందని గ్రహించాలి. మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఈ విషయంలో మనకు ఏ విధమైనటువంటి మార్గదర్శకం చేశారో గమనిద్దాం.
ఈ బలహీనుల చలువ వల్లనే మీకు (దైవం తరఫు నుంచి) సహాయం లభిస్తుందని, ఉపాధి దొరుకుతుందని గ్రహించండి. ఒకవేళ మీరు నన్ను చేరుకోదలిస్తే, నన్ను బలహీనుల్లోనే అన్వేషించండి. స్వర్గంలో మీకు నా సహచర్యమే ఇష్టమైతే పేదరికాన్ని ప్రేమించండి. నేను ఇద్దరి విషయమై మిమ్మల్ని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు: అనాథలు. రెండవ వారు: స్త్రీలు.
వితంతువుల, నిరుపేదల బాగు కోసం పరిశ్రమించేవాడు దైవ మార్గంలో పోరాడే యోధుడితో సమానం అని నేను మీతో అంటున్నాను. అతడు అలుపెరగ కుండా దైవారాధన చేసే భక్తుడితో, నిరంతరంగా ఉపవాసాలు పాటించే ధర్మపరాయణుడితో సమానం. అగత్య పరులు వస్తుంటే వద్దని, రాని వారి కోసం వెంపర్లాడే మీ విందులు అత్యంత ఘోరమైనవని మరువకండి. ‘స్వర్గంలో నా సహచర్యంలో చోటు లభించడం గొప్ప అదృష్టం’ అన్న విషయం మీకు తెలుసని నాకు తెలుసు. అనాథల్ని ఆదరించండి. వారి పోషణా బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరించండి. వారితో దురుసుగా, కఠినంగా వ్యవహరించకండి. ఈ నా ఆజ్ఞల్ని గైగొన్నవారు మరియు నేను స్వర్గంలో ఈ రెండు వ్రేళ్ళ మాదిరిగా ప్రక్కప్రక్కనే కలిసి ఉంటాము.
(అదిగో ఆ స్త్రీ మూర్తిని చూడండి!) ఆమెకు తినడానికి ఆయిషా(ర) మూడు ఖర్జూరాలు ఇచ్చింది. ఆమె వాటిలో రెండు ఖర్జూర పండ్లను తన ఇద్దరు కూతుళ్ళకు చెరో ఒకటి ఇచ్చి మిగిలిన ఒక ఖర్జూర పండును తను తినబో యింది. (ఆ ఇద్దరు పిల్లలు బాగా ఆకలి మీద ఉన్నారు కాబోలు!) అది కూడా ఇచ్చేయమని అడిగారు. వెంటనే ఆమె ఆ ఖర్జూరాన్ని రెండు ముక్కలుగా చేసి కూతుళ్ళిద్దరికీ చెరో ముక్క పంచి పెట్టింది. అది చూసి ఆయిషా (ర) ఎంతో సంతోషిస్తూ నాతో చెప్పింది. ఆ మాతృ మూర్తి చేసిన పనికి మెచ్చుకొని అల్లాహ్‌ా ఆమె కోసం స్వర్గం తప్పనిసరి చేశాడు. అలాగే ఆమెకు నరకాగ్ని నుండి విముక్తి నొసగాడు. అవును, ఇద్దరు కూతుళ్ళను యుక్త వయస్సు వచ్చే వరకూ పోషించిన వారు ప్రళయ దినాన వస్తారు. అప్పుడు నేను మరియు వారు ఈ రెండు వ్రేళ్ళ మాదిరిగా ఉంటాం.
మరి కొన్ని విషయాలు మీకు చెప్ప దలిచాను – వ్యాధిగ్రస్తులను పరా మర్శించండి. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టండి. మీరు మీ సోదర ముస్లింను పరామర్శించడానికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకూ స్వర్గంలో స్వర్గపు తాజా పండ్లు ఏరడంతో సమానమని నేనంటున్నాను. మీరు ఉదయం పూట వెళ్ళి రోగిని పరామర్శిస్తే 70 వేల మంది దైవ దూతలు సాయంత్రం వరకూ మీ శ్రేయస్సు కోసం అల్లాహ్‌ాను ప్రార్థిస్తూ ఉంటారు. అదే సాయంత్రం వేళ పరామర్శిస్తే ఉదయం వరకూ 70 వేల మంది దైవ దూతలు మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు. ఇంకా మీ కోసం స్వర్గపు తాజా ఫలాలు ఏరి ఉంచబడతాయి. (కాబట్టి) శుభవార్తలు తెలియ జేసేవారిగా ఉండండి. సౌలభ్యాన్ని కలుగ జేయండి. లజ్జా బిడియాలు విశ్వాసులకు ఆభరణం. అవి పూర్తి ప్రయోజన దాయకం. విశ్వాసి తన ఉత్తమ నడవడిక మూలంగా ఒక నిత్య ఉపవాసి స్థాయికి, రాత్రంతా మేల్కొని ఆరాధన చేసే భక్తుని స్థాయికి చేరుకుంటాడన్న విషయం మరువకండి. అలాగే ఉత్తమ నడవడికను కలిగి ఉన్న వ్యక్తికి స్వర్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఒక గృహాన్ని ఇప్పించేందుకు నేను పూచీ వహిస్తున్నాను.