ప్రవక్త (స) వారి జీవితానికి సంబంధించిన ప్రశ్నలు

img_0296-small

 

ముహమ్మద్ హబీబుర్రహ్మాన్ జామయి

ప్రశ్న: అబూ తాలిబ్‌ దైవప్రవక్త (స)కు ఏ ప్రమాదం రాకూడదని తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?
జ: అందరూ పడుకునే సమయంలో దైవప్రవక్త (స)ను పిలిచి నీవు ఈ ప్రక్కపై పడుకో అని అందరూ వినేటట్లు చెప్పేవారు. ఎవరైనా చంపడానికి పొంచి ఉంటే ఆయన (స) ఎక్కడ నిద్రిస్తున్నారో తెలుస్తుంది. ఆందరూ పడుకోగానే అబూ తాలిబ్‌ దైవప్రవక్త (స) గారి పడక స్థలాన్ని మార్చివేసేవారు.
ప్రశ్న: దైవప్రవక్త (స) తన ప్రచారాన్ని ఎలా కొనసాగించారు?
జ: ఈ దిగ్బంధం ఇలా కొనసాగుతున్నా దైవప్రవక్త (స) హజ్‌, తదితర సందర్భాలలో బయటకు వచ్చి ఇస్లాం ధర్మ ప్రచారంలో నిమగ్నులైపోయేవారు.

ప్రశ్న: ఆ ప్రమాణ పత్రం ఎప్పుడు చించివేయబడింది?
జ: నుబువ్వత్‌ శకం 10, ముహర్రం మాసంలో చించివేయడం జరిగింది. దీనికి అసలు కర్త హిష్షామ్‌ బిన్‌ అమ్ర్‌. అతను రాత్రి చీకటలో ఎవరి కంటాబడకుండా షోబె అబూ తాలిబ్‌ లోయలో ధాన్యాన్ని పంపి బనూ హాషిమ్‌ను ఆదుకునేవాడు. ఓ రోజు జుహైర్‌ బిన్‌ ఉమయ్యను చూసి ఆ ప్రమాణ పత్రాన్ని చింపివేయడం కోసం ఒత్తిడి తేవాలని అయిదుగురు ప్లాన్‌ వేశారు.

ప్రశ్న: ఆ అయిదుగురు ఎవరు?
జ: 1- హిష్షామ్‌ బిన్‌ అమ్ర్‌ 2- జుహైర్‌ బిన్‌ అబీ ఉమయ్య 3- ముత్‌యిబ్‌ బిన్‌ అదీ 4- అబుల్‌ బక్తరీ 5- జమ్‌ఆ బిన్‌ అస్వద్‌.
ప్రశ్న: ఇంతకీ వారు ఏ నిర్ణయం తీసుకున్నార?
జ: వారందరూ అసెంబ్లీలో సమావేశమయి సంఘ బహిష్కరణను వ్యతిరేకించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.

ప్రశ్న: జుహైర్‌ అక్కడుండే ప్రజలతో ఏమన్నాడు?
జ: ఓ ప్రజలారా! మనం ఇక్కడ హాయిగా తింటున్నాం. బట్టలు తొడుక్కుంటున్నాం. కాని అటు బనూ హాషిమ్‌ సర్వనాశనం అయిపోతున్నారు. వారికి ఏదీ అమ్మడం గాని, కొనడం గాని జరగడం లేదు. దైవసాక్షి! బంధుత్వాన్ని త్రెంచేది, దౌర్జన్యాన్ని పురికొలిపేది అయిన ఆ దుష్టప్రమాణ పత్రాన్ని చించివేయనంత వరకు నేనూరుకోను అన్నాడు.
ప్రశ్న: సంఘ బహిష్కరణ అంటే ఏమిటి?
జ: బహుదైవారాధకులు ”ముహస్సిబ్‌” అనే పర్వత లోయలోని ఖైసె బనీ కనానలో సమావేశమయి, బనీ హాషిమ్‌ మరియు బనీ ముత్తలిబ్‌ కుటుంబాలకు వ్యతిరేకంగా ప్రమాణాలు చేశారు. అవేమంటే: దైవప్రవక్త (స)ను తమకు అప్పజెప్పనంతవరకు ఇక నుండి ఆ రెండు కుటుంబాలతో వివాహాది సంబంధాలు పెట్టుకోము. వారితో ఎలాంటి వ్యాపారం సాగించము. వారితో కలిసి ఉండటంగాని, వారి ఇళ్ళకు వెళ్ళడంగాని, వారితో మాట్లాడటంగాని చేయము అని ప్రమాణాలు చేశారు.

ప్రశ్న: ఈ సంఘ బహిష్కరణ ఏ విధంగా అమలులో వచ్చింది?
జ: బహుదైవారాధకులు ఈ బహిష్కరణకు దస్తావేజుగా ఒక పత్రం రాసుకున్నారు. ఆ ప్రమాణ పత్రంలో, దైవప్రవక్త (స)ను చంపేయడానికి వారికి అప్పజెప్పనంతవరకు బనీ హాషిమ్‌ తెగతో ఎలాంటి సంప్రతింపులకు వచ్చినాసరే వినేదే లేదని ప్రమాణం చేస్తూ సంతకాలు పెట్టి, ఆ పత్రాన్ని కాబా గృహ గోడకు వ్రేళ్ళాడదీశారు.

ప్రశ్న: ఆ పత్రాన్ని రాసిందెవరు?
జ: బగీద్‌ బిన్‌ ఆమిర్‌.

ప్రశ్న: ఈ పత్రాన్ని రాసిన కారణాన అతనికి ఏమన్నా జరిగిందా?
జ: అవును. దైవప్రవక్త (స) శపించినందుకు అతని చేయి పని చేయకుండా చచ్చుబడిపోయింది.
ప్రశ్న:అబూ తాలిబ్‌, బనీ హాషిమ్‌ మరియు మనీ ముత్తలిబ్‌ ఎక్కడికి తరలించబడ్డారు?
జ: షోబె అబీ తాలిబ్‌కు.

ప్రశ్న: షోబె అబీ తాలిబ్‌లో ముస్లింలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు?
జ: ఈ బహిష్కరణ కారణంగా ధాన్యం, తినుబండారాల సరఫరా నిలిచిపోయింది. పరిస్థితులు రానురాను మరింత తీవ్రరూపం దాల్చాయి. వారు ఆకులు, తోళ్ళు తినడానికి కూడా వివశులైపోవలసి వచ్చింది.
ప్రశ్న: సౌదా (ర) ముందు భర్త పేరేమిటి? ఆయన ఎప్పుడు పరమ పదించారు?
జ: ఆమె ముందు భర్త పేరు ‘సక్రాన్‌ బిన్‌ అమ్ర్‌’. ఆయన ప్రారంభ కాలంలో ఇస్లాం స్వీకరించిన వ్యక్తి, సౌదా (ర)తోపాటు అబిసీనియాకు వలస వెళ్ళిన వ్యక్తి – అబిసీనియాలోనో లేదా మక్కాకు వచ్చిన తర్వాతనో చనిపోయారు.

ప్రశ్న: సౌదా (ర) ఎప్పుడు ఇస్లాం స్వీకరించారు?
జ: ఆమె ప్రారంభంలోనే ముస్లిమైన మహిళ.

ప్రశ్న: తాయిఫ్‌కు దైవప్రవక్త (స) గారి ప్రయాణం ఎప్పుడు జరిగింది?
జ: దైవ దౌత్య శకం 10, షవ్వాల్‌ మాసంలో (క్రీ,శ.619 మే చివరి రోజులు లేదా జూన్‌ ప్రారంభ దినాలు) దైవప్రవక్త (స) తాయిఫ్‌కు ప్రయాణమై వెళ్ళారు.

ప్రశ్న: దైవప్రవక్త (స) తాయిఫ్‌కు ఎందుకు వెళ్ళారు?
జ: బహుశా తాయిఫ్‌ వారైనా తన పిలుపును ఆలకిస్తారన్న ఆశతో ఆయన (స) అక్కడికి వెళ్ళారు.
ప్రశ్న: ఈ ప్రయాణంలో దైవప్రవక్త (స) వెంట ఎవరున్నారు?
జ: ఆయన (స) వెంట ఆయనచే స్వాతంత్య్రం పొందిన బానిస జైద్‌ బిన్‌ హారిస (ర) ఉన్నారు.

ప్రశ్న: మహా ప్రవక్త (స) తాయిఫ్‌కు ఎలా వెళ్ళారు?
జ: తాయిఫ్‌ మక్కాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. మహా ప్రవక్త (స) అక్కడికి కాలి నడకనే వెళ్ళి వచ్చారు.

ప్రశ్న: తాయిఫ్‌ చేరిన తర్వాత దైవప్రవక్త (స) ఎవరి వద్దకు వెళ్ళారు?
జ: తాయిఫ్‌ చేరిన తర్వాత ‘సఖీఫ్‌’ తెగకు చెందిన ముగ్గురు సర్దారుల వద్దకు వెళ్ళారు. వీరు ముగ్గురూ పరస్పరం అన్నదమ్ములే. వారి పేర్లు 1) అబ్దె యాలైన్‌ 2) మస్‌వూద్‌ 3) హబీబ్‌.

 

 

Related Post