సర్వ స్తోత్రాలు అల్లాహ్‌కే. ఆయన తన శాంతినీ, అనుగ్రహాలను తన ప్రవక్తపై, ప్రవక్త ఇంటివారలపై, విశ్వాసులందరిపై కురిపించాలని మా ప్రార్థన.
ఇబ్నుల్ ఖయ్యిమ్ (ర) ఓ గొప్ప ఇస్లామీయ విద్వాంసులు. ఆయన ఓ సందర్భంగా అంటారు: ”రమజాన్ నెలలో దైవప్రవక్త (స) వారి ఆదర్శం మనకు పరిపూర్ణ మార్గదర్శకం. రమజాన్ మాసం తారసిల్లినప్పుడు ప్రజలు పలు రకాల ఆరాధనల్లో నిమగ్నమవటమూ ఆ ఆదర్శంలో అంతర్భాగమే. దైవ దూత జిబ్రయీల్ (అ) దైవ ప్రవక్త (స)కు దివ్య ఖుర్ఆన్ పాఠాలు బోధిస్తూ ఉండినది ఈ నెలలోనే. జిబ్రయీల్ను కలిసినప్పుడు ఆయన ప్రభంజనం కంటే అధికంగా ఔదార్యాన్ని ప్రదర్శించేవారని హదీసుల ద్వారా తెలుస్తుంది. సహజంగానే ఆయన చాలా ఉదార స్వభావులు. అయితే రమజాన్ నెల రాగానే ఆయన ఉదారత్వం ఇంకా ఊపందుకునేది. రమజాన్ నెల మొత్తం ఆయన దానధర్మాల్లో, సత్కార్యాలు చేయటం లో, దివ్య ఖుర్ఆన్ పారాయణంలో, దైవా రాధనలో, ధ్యానంలో, ప్రశాంతంగా అల్లాహ్‌ా స్మరణలో గడిపేవారు.
రమజాన్ మాసపు ఆరాధన కోసం ఆయన ఇతర నెలల్లోకంటే ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. రాత్రిళ్ళు ఎక్కువ సేపు ఆరాధనకే ప్రత్యేకించుకునే వారు. ఒక్కోసారి రాత్రంగా అల్లాహ్‌ా ఆరాధనలోనే గడిచి పోయేది. అయితే తన అనుయాయులను మాత్రం ఆయన అంత విపరీతంగా ఆరాధన చేయవద్దని వారించేవారు. ”మరి మీరు రాత్రంతా అదే పనిగా ఆరాధన చేస్తూ పోవటం లేదా దైవప్రవక్తా!” అని ఆరాధనాప్రియులైన సహచరులు సందేహం వెలిబుచ్చితే, ”నా శరీరం మీ శరీరాల వంటిది కాదు. నేను నా ప్రభువు సన్నిధిలో ఉంటాను. ఆయనే నాకు భోజనం తినిపిస్తాడు, త్రాపిస్తాడు” అని ఆప్యాయంగా వారికి బోధించేవారు. (ఈ హదీసు బుఖారీ, ముస్లిం గ్రంథంలో ఉంది)
దైవ ప్రవక్త (స) ఎడతెగకుండా ఉపవాసాలు పాటిస్తున్నప్పుడు అనూహ్యమైన రీతిలో అల్లాహ్‌ా ఆయనకు విజ్ఞానం, వివేకం, దివ్య సందేశ శక్తులు ప్రసాదిస్తూ ఉండే వాడన్నమాట. ఆ శక్తిని ప్రాపంచిక పరమైన భోజన సామగ్రి లాంటిదని ఊహించు కోనక్కర లేదు. అదే నిజమైతే దాన్ని అసలు ఉపవాసంగా భావించటానికి వీలు ఎక్కడ ఉంటుంది?
ప్రవక్త (స) నిత్యం తన ప్రభువు ఆరాధన పట్ల సంతుష్టులై ఉండేవారు. ఆయన హృదయ ద్వారాలు అంతిమ లక్ష్యం నిమిత్తం బార్లా తెరుచుకొని ఉండేవి. ప్రభువు ధ్యానంలో ఆయన మనస్సు పరిపూర్ణ విశ్రాంతిని, సంతృప్తిని పొంద గలిగేది. ప్రభువు సామీప్యం మూలంగా ఆయన మానసిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్నప్పుడు, ఇక ఆయన అన్నపానీయాలు మరచిపోయేవారు. వాస్తవంగా ఆధ్యాత్మిక శక్తి మనిషిలో అంతర్గతమైన ఆత్మ బలం మీద ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి భోజనపానీయాలతో నిమిత్తమయినది కాదు. ఆ శక్తితో ప్రభువు జ్ఞానాన్ని చేరుకున్న మనిషికి ప్రపంచంలోని ఏ వస్తువూ హాని కలిగించజాలదు.
అల్ల్లాహ్‌ను ధ్యానించే, ఆయన్ను ఆరాధించేవారందరిలోకెల్లా ముహమ్మద్ (స) అత్యుత్తములు. దైవారాధన, దైవధ్యానం, దివ్య ఖుర్ఆన్ పారాయణం విస్తృతంగా జరిగే శుభప్రదమైన మాసం రమజాన్. అందుకే దైవ ప్రవక్త (స) ఈ మాసంలో రాత్రులు అల్లాహ్‌ాను ప్రార్థిస్తూ, అల్లాహ్‌ా పట్ల అత్యంత అణకువను కనబరుస్తూ గడిపే వారు. ఆయన సహాయాన్ని, తోడ్పాటును, విజయాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించమని కడు దీనంగా వేడుకునేవారు. నమాజులో దివ్యఖుర్‌ఆన్‌లోని సుదీర్ఘమైన అధ్యాయాలను పారాయణం చేస్తూ గంటల తరబడి అలానే నిలుచుని ఉండేవారు. ఎంతోసేపు రుకూ స్థితిలో వంగి ఉండేవారు. అల్లాహ్‌ా సమక్షంలో మోకరిల్లి (సజ్దా చేసి), అదే స్థితిలో చాలా సేపు ఉండేవారు. ఆయనలో అల్లాహ్‌ా ఆరాధన పట్ల కాంక్ష బలంగా ఉండేది. రాత్రి పూట ఆరాధనలో ఎంత ఎక్కువ సేపు నిలబడితే ఆయనకు అంత ఎక్కువ ఆత్మ బలం, ఆధ్యాత్మిక శక్తి ఒనగూరుతూ ఉండేది. సర్వశక్తిమాన్యుడైన అల్లాహ్‌ా ఆయన్ను సంబోధిస్తూ దివ్య ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా అన్నాడు: ”ఓ వస్త్రం కప్పుకున్నవాడా! కొద్ది సేపు మినహా రాత్రంతా (నమాజులో) నిలబడు”. (ఖుర్ఆన్ – 73: 1)
మరో చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు: ”రాత్రి పూట కొంత భాగం తహజ్జుద్ (నమాజు)లో ఖుర్ఆన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను ”ముఖామె మహ్ామూద్” కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు”. (ఖుర్ఆన్ – 17: 79)
ఉపవాస దినాలలోనూ దైవప్రవక్త (స) ఇస్లాం ధర్మ వ్యాప్తి కోసం కృషి చేస్తుండే వారు. ఉపవాసం ఉంటూనే అల్లాహ్‌ా ధర్మోన్నతి కోసం పోరాడుతూ (జిహాద్ చేస్తూ) ఉండేవారు. ఉపవాస రోజుల్లోనే తన సహచరులకు శిక్షణా తరగతులు నిర్వహించే వారు. ధర్మబోధనలు చేస్తుండేవారు. ఏదైనా లక్ష్యాన్ని గురి పెట్టుకుని దాన్ని సాధించాలనే ఉద్దేశ్యం లేకుండా దైవప్రవక్త (స) రమజాన్ మాసపు ఉపవాసాలు మొదలు పెట్టక పోవడం ఆయన ఆచరణల్లో ఒకటి. రమజాన్‌లో ప్రతి రోజూ ఉషోదయానికి ముందే సహరీ ఆహారం తీసుకోవాలని ఆయన తన అనుచరులను ప్రోత్సహిస్తూ ఉండేవారు. సత్యమని ధృవీకరించబడిన ఒక హదీసు ప్రకారం ఆయన తన సహచరులకు ఇలా ప్రబోధించారు: ”ఉషోదయానికి ముందే భోజనం (సహరీ) ఆరగించండి. నిశ్చయంగా ఆ వేళలో (మీ కొరకు) శుభం ఉంది”.
ఉషోదయానికి ముందు ఉండే సమయాన్ని శుభప్రదమైనదిగా పేర్కొనటం జరిగింది. ఎందుకో తెలుసా? అది రాత్రిలో చివరి మూడో వంతు సమయం. అల్లాహ్‌ా మొదటి ఆకాశానికి దిగివచ్చే సమయం. ఆయన తన దాసులకు క్షమాభిక్ష పెట్టే సమయం అది. దివ్య ఖుర్ఆన్లో ఒక చోట ఇలా అనబడింది: ”వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణకై (అల్లాహ్‌ాను) వేడుకుంటూ ఉంటారు”. (ఖుర్ఆన్-51: 18)
మరో చోట ఇలా చెప్పబడింది: ”వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. దైవమార్గంలో ఖర్చు చేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు”. (ఖుర్ఆన్- 3:17)
అంతే కాదు, ఉపవాసం ప్రారంభించే ఉద్దేశ్యంతో ఉషోదయానికి ముందు భుజించే ఆహారం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పగటి పూట విశ్వాసికి దానివల్ల ఒంట్లో సత్తువ క్ష్షీణించకుండా ఉంటుంది. దాంతో పగలు దైవారాధన చేసుకోటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
అలాగే స్థిరమైన వాస్తవం మరొకటుంది. దైవప్రవక్త (స) పగలంతా ఉపవాసం పాటించినప్పటికీ సాయంత్రం సూర్యా స్తమయం అయిన వెంటనే ఆయన ఆహారం తీసుకోవటంలో త్వరపడేవారు. ఈ పద్ధతిని పాటించమని ఆయన తన అను యాయులకూ ఆదేశించి ఉన్నారు. ఖాళీగా ఉండే కడుపు ఏదైనా తీపి పదార్థాన్ని తొందరగా గ్రహిస్తుంది. అందుకని సాధారణంగా ఆయన ఉపవాస విరమణ కోసం కొన్ని ఖర్జూర పండ్లు, కాసిన్ని నీళ్ళు ఉపయోగించేవారు. పలు ఉల్లేఖనాలు దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించినట్లు తెలుపు తున్నాయి: ”నిశ్చయంగా ఉపవాసి చేసే ప్రార్థన తిరస్కరించబడదు”.
అందుకని ఉపవాస సమయంలో ఆయన ఇహలోకంలోనూ, పరలోకంలోనూ తనకు శుభం ప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఉండేవారు. సూర్యాస్తమయం అయిన వెంటనే మగ్రిబ్ నమాజు ఆచరించబడుతుంది కదా! ఆ నమాజుకు ముందే ఆయన ఉపవాస దీక్షను విరమించేవారు. సత్యమని ధృవీకరించబడిన ఒక హదీసు ప్రకారం, ”ఈ దిశ నుంచి రాత్రి ప్రవేశించి ఆ దిశ నుండి అది నిష్క్రమిస్తే ఇక ఉపవాసి తన దీక్షను విరమించాలి” అని ఆయన ప్రబోధించారు.