షేఖ్ అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
అల్లాహ్‌యే గగన భువనాలను సృజించాడు. సూర్యచంద్రనక్షత్రాలను సృజించాడు. ఆయనే పగలును ప్రకాశమానమయినదిగా చేశాడు; మనం ఉపాధి కోసం శ్రమించడానికి. ఆయనే రేయిని సృష్టించాడు; మనం విశ్రమించి నెమ్మది పొందడానికి.ఆయన మహాశక్తిమం తుడూ, శుభప్రదుడూనూ. ఆయన ఔన్నత్యాని కి హద్దే లేదు. ఆయనలోని శుభాలూ శ్రేయాలకూ పరిమితిలేదు.
అల్లాహ్ కేవలం సృష్టికర్త మాత్రమే కాదు. ఆదేశాలిచ్చే అధికారి కూడానూ. ఆయన ఈ సృష్టిని సృజించి దానితో ఎలాంటి సంబంధం లేకుండా (అల్లాహ్ క్షమించుగాక!) ఎక్కడో మూలన కూర్చోలేదు. అధికారం చెలాయించ మని ఈ సృష్టిని ఇతరులకు అప్పజెప్పనూ లేదు. తన అధికార పీఠాన్ని అలంకరించాడు.
విశ్వ వ్యవస్థ నిర్వహణ అంతా స్వయంగా అల్లాహ్ హస్తగతమయి ఉంది. ఆయనే నిఖిల జగతిలోని సర్వస్వాన్ని పరిపాలిస్తున్నాడు.ప్రతి వస్తువూ ఆయన ఆదేశానికి లోబడి ఉంది. అణువణువూ ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉంది. సృష్టిరాశిలోని ప్రతిప్రాణి భవితవ్యమూ ఆయన ఆదేశంతోనే ముడిపడి ఉంది.
జనుల ‘ఆపద్బాంధవుడు’ (ముష్కిల్ కుషా) అల్లాహ్‌యే. వాస్తవానికి ప్రతి మనిషి స్వయం గా నిస్సహాయుడే. ఒకరి ఆపదలను తొలగిం చే శక్తి అతనికి లేదు. ‘ఐశ్వర్యప్రదాత’ (గంజ్ బఖ్ష్) అల్లాహ్‌యే. నిజానికి ప్రతి మనిషి స్వయంగా అగత్యపరుడే. తన వద్ద ఏ నిధు లూ లేవు దానం చెయ్యడానికి. అతని అధీ నంలో ఏ వస్తువూ లేదు ‘దాత’ అనడానికి.
‘పేదల పెన్నిధి’ (గరీబ్ నవాజ్) అల్లాహ్‌యే. యదార్థానికి మానవుడు స్వయంగా దీనుడు. అల్లాహ్ కరుణాకటాక్షాలపైనే ఆధారపడి తన జీవన మనుగడను సాగిస్తున్నాడు. లేనివారికి, పేదవారికి అనుగ్రహించడానికి ఏ అధికార మూ కలిగి లేడు.
‘పీడితుల మొరలాకించేవాడు’ (గౌసె ఆజమ్) అల్లాహ్‌యే. వాస్తవానికి మనిషి స్వయంగా బలహీనుడు. తనకు వచ్చిన కష్టాలను తానే దూరం చేసుకోలేడు. ఒకరి మొరను ఆలకించే శక్తి అతనికి ఎలా ఉంటుంది. అందుకే విశ్వ ప్రభువు అల్లాహ్ సెలవిస్తున్నాడు:”మీ ప్రభువు ను మొరపెట్టుకోండి. రోదిస్తూనూ, మౌనం గానూ. నిశ్చయంగా ఆయన హద్దుల్ని అతి క్రమించేవారిని ఏ మాత్రం ఇష్టపడడు”. (అల్ ఆరాఫ్:55)
”అల్లాహ్ మాత్రమే ఉత్తమమయిన పేర్లకు అర్హుడు. ఆయన్ను ఉత్తమమయిన పేర్లతోనే పిలవండి. ఆయనకు పేర్లు పెట్టే విషయంలో సక్రమ మార్గానికి విముఖలయ్యే వారిని వదలి వేయండి. తాము చేస్తూ ఉన్న దానికంతటికీ వారు ప్రతిఫలాన్ని అనుభవించి తీరుతారు”. (దివ్యఖుర్ఆన్-7:180)
”మీరు అల్లాహ్‌ను కాదని తమకు నష్టాన్ని చేకూర్చలేని లాభాన్ని అందజేయలేని వాటిని పూజిస్తున్నారు. పైగా వీరు అల్లాహ్ సన్నిధిలో మాకు సిఫారసు చేసేవారు అని అంటారు. ప్రవక్తా! వారికి చెప్పు ఆకాశాల్లోనూ, భూమి లోనూ అల్లాహ్ ఎరుగనటువంటి సమాచారా న్ని మీరు ఆయనకు అందజేస్తున్నారా? ఆయన పరిశుద్ధుడు. వీరు చేసే బహుదైవో పాసనా క్రియలకు అతీతుడు, ఉన్నతుడు”. (యూనుస్:180)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు) అని విశ్వసించే ముస్లిం – అష్హదు (నేను సాక్ష్యమిస్తున్నాను) అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు) వహ్దహూ(ఆయన ఒకే ఒక్కడు) లా షరీక లహూ (ఆయన దైవత్వంలో, సృష్టి నిర్వహణలో ఎవరూ భాగస్వాములు లేరు) లహుల్ ముల్క్ (పాలనాధికారం ఆయనదే) వలహుల్ హమ్ద్ (సమస్త ప్రశంసలు ఆయనకే సొంతం) యుహ్యీ (జీవితాన్ని అనుగ్రహిం చేవాడు ఆయనే) వ యుమీతు (మరణాన్నిచ్చే వాడు ఆయనే) బియదిహిల్ ఖైరు (శుభాలన్నీ, మేళ్ళన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి) వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ (ఆయన ప్రతి వస్తువుపై పూర్తి అధికారం కలిగి ఉన్నాడు) అంటూ పసితనం నుంచే సాక్ష్యమిచ్చే ముస్లిం; నమాజుల్లో ‘ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్’ (ఓ అల్లాహ్ ఎల్ల వేళలా నిన్నే మేము ఆరాధిస్తాము అన్ని పరిస్థితుల్లోనూ నీ శరణే వేడుకుంటాము) అంటూ దైవసన్నిధిలో ప్రతిజ్ఞ చేసే ముస్లిం; సృష్టికర్త విశ్వప్రభువును కాదని ఆయన దాసుల్ని సృష్టితాలను పేదల పెన్నిధిగా, ఆపద్బాంధవుడిగా, ఐశ్వర్యప్రదాత గా మొరలాలకించేవాడిగా నమ్మి, వారిని అర్థించడమూ వారికి మొర పెట్టుకోవడమూ దైవద్రోహం, నమ్మక ద్రోహం కాదా?
”ఏమిటీ, విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వీరికి మునుపు గ్రంథం వొసగబడినవారి మాదిరిగా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘ కాలం గడచిపోయే సరికి వారి హృదయాలు కఠినమయి పోయాయి. వారిలో చాలా మంది అవిధేయులు”. (అల్ హదీద్: 16)