మహిళా జగతిలో సయ్యిదా ఆయిషా (ర.అ) అంతస్తు / Syeda Ayesha’s (RA) status in the women’s world
సిద్దే కుబ్రా, ఉమ్ముల్ మోమినీన్ సయ్యిదా ఆయిషా (ర.అ) పవిత్ర జీవితంలోని ఒక్కొక్క అక్షరాన్ని మీరు చదివారు. ఆమె ఆదర్శ జీవితంలోని ఒక్కొక్క సంఘటన మీ కళ్ల ముందు కదలాడింది. ప్రపంచంలో ప్రసిద్ది చెందిన వందలాది మంది మహిళల స్థితిగతుల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. కాని ఎప్పుడయినా మీరు వారి ఘనకార్యాలపై తులనాత్మక అధ్యయనం చేశారా?
ప్రపంచంలో ప్రసిద్ది చెందిన ముస్లిమేతర మహిళామణుల జాబితాలో చోటు సంపాదించుకున్న వారిలో చాలామంది ఎలాంటివారంటే, వారు తమ స్థాయికన్నా కొంచెం ఉన్నతమైన ఒక ఘనకార్యం చేసి ఉంటారు. అదే వారి కీర్తికి కలికితురాయి అయిపోయింది. ఒక స్త్రీ ఉద్వేగంగా ఒక సభలో ప్రసంగించింది. ఒకానొక ఉపాయంతో శత్రువుల కుట్రను భగ్నం చేసింది. ఈ తక్షణ కారణాలు ఆమెను చరితార్డు రాలిగా చేశాయి. కాస్త ఆలోచించండి! ఏదైనా ఒక వ్యవస్థలో సుదీర్ఘకాలం నిలిచి, ఎల్లకాలం ఉపయోగపడే సేవల్ని అందించిన వారితో వీళ్లను పోల్చటం సరైనదేనా? ఒక అందాల రాశి కళ్లు చెదిరే సౌందర్యంతో రాకుమారుణ్ణి మంత్ర ముగ్ధుణ్ణి చేసి, తరువాత పట్టపురాణిగా అంతఃపురంలో ప్రవేశించి కీలక అధికారాలను చేజిక్కిం చుకున్న సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి. కాని అలాంటి వారు తృటిలో వెలిగి, కీర్తి శిఖరాల అంబరాలు చుంబించినప్పటికీ వైఫల్యమే వారి అంతిమ పరిణామం అయిందని చరిత్ర చాటి చెబుతోంది. ఈజిప్టు, ఈరాన్, రోము చరిత్రల విశేషాలు మీ ముందు ఉన్నాయి. వాటిని ఒక విజయవంతమైన, పవిత్రమైన, సౌశీల్యవంతమైన జీవితంతో పోల్చటం న్యాయమేనా?
సరే, ఈ సర్వసాధారణమైన స్థానాలను వేరుపరచి ధార్మిక, నైతిక కోణాలను ముందుకు తీసుకువచ్చినప్పుడు సుబోధకమయ్యేదేమంటే, మహిళా అంతరిక్షంలోని ఒక్క నక్షత్రం కూడా ఆకాశపుటంచున ఉదయించే అర్హత కలిగిలేదు. మన దేశంలోని అమాయికలైన సతీమణులెందరో ముందుకు వచ్చి, ఈ విషయంలో తమ యోగ్యతను చాటుకోవచ్చు.
కాని మీరు వారిని అడగండి – ‘అమ్మా శీలవతులారా! మీ నైజంలోని పవిత్రత, పాతివ్రత్యానికి సంబంధించిన తిరుగులేని ఆధారాలను మినహాయిస్తే మరేదయినా యోగ్యతాపత్రం మీ వద్ద ఉన్నదా? అని. ఒక్క సిద్దీఖి అక్బర్ పుత్రిక తప్ప ప్రపంచంలోని ఏ మహిళ ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ధార్మిక, రాజకీయ, సామాజిక రంగాలలోని కీలకమైన విధులు నెరవేర్చాలో చెప్పండి. ఆమె తన జీవితపు విజయ వంతమైన కార్యకలాపాల ద్వారా, దైవదాస్యపు ఆదర్శాల ద్వారా, నైతికపు క్రియాత్మక ఆదర్శాల ద్వారా, ఆధ్యాత్మికమైన పవిత్ర బోధనల ద్వారా, దీన్, షరీఅత్, శాసనాంగ పరమ రహస్యాలను విశదీకరించటం ద్వారా సుమారు పదికోట్ల’ మంది మహిళల కొరకు సమగ్ర జీవితపు సంపూర్ణ ఆదర్శాలను వదలి పెట్టారు. ఆమె బ్రహ్మాండమైన మహిళా జనవాహినికి ధార్మికంగా, సామూహికంగా, వైజ్ఞానికంగా మహోపకారాలు చేశారు.
ముస్లిం మహిళా చరిత్రలో ఒక్క ప్రవక్త సతీమణులు, పవిత్ర స్త్రీ మూర్తులు (రజిఅల్లాహు అహున్న) తప్ప సయ్యిదా ఆయిషా(ర.అ)జీవితాన్ని మరెవరితోనయినా పోల్చతరమా? ఇస్లాంలో సయ్యిదా ఖదీజతుల్ కుబ్రా, సయ్యిదా ఫాతిమా జహ్రా, సయ్యిదా ఆయిషా సిద్దీఖా (రజిఅల్లాహు అహున్న) మాత్రమే మహిళలందరిలోకీ శ్రేష్ఠులు అన్న విషయంలో ఇస్లామీయ విద్వాంసుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అత్యధికమంది విద్వాంసులు మొదట సయ్యిదా ఫాతిమా పేరును, తరువాత సయ్యిదా ఖదీజా పేరును, ఆ తరువాత సయ్యిదా ఆయిషా (రజిఅల్లాహు అహున్న) పేరును ప్రస్తావించారు. అయితే ఈ క్రమబద్దీకరణకు షరీఅత్ పరంగా గానీ, హదీసులపరంగా గానీ ఎలాంటి మూలాధారాలు లేవు. కాకపోతే విద్వాంసులు తమ అంచనా (ఖియాస్), పర్యాలోచన (ఇత్తెహాద్), అధ్యయనం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు.
ఈ ముగ్గురు మహిళామణుల వేర్వేరు శ్రేష్ఠతలు, మహిమోన్నతలు హదీసులలో పేర్కొనబడ్డాయి. అందుచేతనే పండితులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడుతారు. ఒక్క అల్లామా ఇబ్నె హజ్ (రహ్మ) మాత్రం విద్వాంసులందరి దృక్పథానికి వ్యతిరేకంగా – బాహాటంగా – ఇలా ప్రకటించారు : “దైవప్రవక్త (స) తరువాత సయ్యిదా ఆయిషా (ర.అ) ప్రవక్త కుటుంబీకులలోనే కాదు, సమస్త మహిళా జగతిలోనే కాదు, ప్రవక్త సహచరమాన్యులలో కూడా అందరికన్నా గొప్పవారు.” తాను చేసిన ఈ ప్రకటనకు సాక్ష్యాధారాలుగా ఆయన ఎన్నో విషయాలను సమర్పించారు.
ఆసక్తి ఉన్నవారు “అల్ మలర్ వన్నహల్”లో సహాబా మహిమోన్నతలు అన్న శీర్షికన జరిగిన చర్చను అధ్యయనం చేయగలరు. మా మటుకు మేము ఈ వ్యవహారంలో అల్లామా ఇబ్నె తైమియా (రహ్మ), ఆయన శిష్యులు హాఫిజ్ ఇబ్నె ఖయ్యిమ్ (రహ్మ)లు వెలిబుచ్చిన అభిప్రాయంపై గట్టి నమ్మకంతో ఉన్నాము. వారిలా వ్రాశారు : ఒకవేళ వంశపారంపర్యం దృష్ట్యా చూసినపుడు సయ్యిదా ఫాతిమా జహ్రా (ర.అ) అందరికన్నా గొప్పవారు. ఇక ‘గొప్పతనం’ అనేది పరలోక అంతస్తు రీత్యా అయివుంటే, దాని గురించి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. కాని ప్రాపంచికంగా చూసినపుడు, వాస్తవానికి వారిలో ఎవరి గొప్పతనం వారిది. ఒక్కొక్కరు ఒక్కో కోణం నుండి గొప్పవారుగా దర్శనమిస్తారు. విశ్వసించటంలో ముందంజవేసి, కష్టకాలంలో దైవప్రవక్త (స)కు ఆదరువుగా ఉండి, ఓదార్పు నివ్వటంలోనూ, ఆర్థికంగా దైవప్రవక్త (స)కు అండగా నిలబడి మీకు తోడుగా నేనున్నాను అని చెప్పటం దృష్ట్యాను చూసినపుడు సయ్యిదా ఖదీజతుల్ కుట్రా (ర.అ) గొప్పతనం అందరినీ మించినది. కాని విద్యా విషయిక సేవలను, ధార్మిక సేవలను, ప్రవక్త మహనీయుల (స) బోధనల, ఉపదేశాల పరివ్యాప్తిలో పోషించిన పాత్రను చూసినపుడు సయ్యిదా ఆయిషా (ర.అ) సిద్దీఖాకు సాటి రాగల వారెవరూ లేరు (షరహ్ మవాహిబుద్దునియా, జుర్బానీ – 3/ 269).
సయ్యిదా మర్యమ్ (అలైహస్సలామ్) గొప్పతనం గురించి మనకేమన్నా తెలిసిందంటే, అది ఇస్లాం ద్వారానే సుమండి! ఇంజీల్ కథనాలను తరచి చూసినపుడు, అవి ఆ మహాతల్లికి ఏమాత్రం ఔన్నత్యం ప్రసాదించలేదని అర్ధమవుతుంది. ఫిరౌన్ భార్య సయ్యిదా ఆసియా (అలైహస్సలామ్) కూడా ఇస్లాంలో వైశిష్ట్యానికి పాత్రురాలిగా ఖరారయింది. కాని తౌరాత్ గ్రంథం మాత్రం ఆమె గొప్పతనం గురించి ఏమీ అభివ్యక్తం చేయకుండా మౌనం వహించింది. అందువల్ల సైద్ధాంతికంగా మేము ఆ పుణ్య స్త్రీల ఔన్నత్యాన్ని కాదనలేము. కాని సంఘటనల రీత్యా, చారిత్రక వివరాల దృష్ట్యా మౌనమే సమాధానం అవుతుంది. కాబట్టి ‘వహీ’ (దైవవాణి) నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఇచ్చిన తీర్పుకన్నా సత్యమైన తీర్పు మరేదీ కాజాలదు.
((عن أبي موسى الأشعري قال رسول الله في كل من الجال كثير ولم يكمل من النساء إلا مريم بنت عمران و اييه إمرأة فرعون و فضل عائشة على النساء كفضل الثريد على سائر الطعام))
మహనీయ అబూ మూసా అష్ అరీ (రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ప్రవచించారు : “పురుషులలో పరిపూర్ణులైన వారు ఎందరో గడిచారు. కాని స్త్రీలలో ఇమ్రాన్ పుత్రికయగు మర్యమ్, ఫిరౌన్ భార్యయగు ఆసియా కన్నా పరిపూర్ణులెవరూ పుట్టలేదు. ఇక ఆయిషా అంటారా, ‘సరీద్’ * వంటకానికి ఇతర వంటకాలపై ఎలాంటి ప్రాధాన్యత ఉందో మహిళలపై ఆయిషాకూ అలాంటి ప్రాధాన్యత ఉంది.” (సహీహ్ బుఖారీ – హ.నెం. 3769; సహీహ్ ముస్లిం – హ.నెం. 2431).
‘సరీద్’ అనేది అరబీ వంటకం. చారు మాదిరిగా వండిన కూరలో రొట్టె ముక్కలు నానబెట్టి దీనిని తయారు చేస్తారు. దైవప్రవక్త (స) కాలంలో ఈ వంటకం అరబ్బులలో స్వాదిష్టమైన, శ్రేష్ఠమైన, రుచికరమైన భక్ష్యంగా పరిగణించబడేది. ఈ మధ్య కాలంలో అరబ్బు రాజ్యాలలో దీనిని ‘తషీ’గా కూడా వ్యవహరిస్తున్నారు.