కష్టాల కడగండ్లు కరగాలంటే..

కష్టాల కడగండ్లు కరగాలంటే..

تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ 1 الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ

యావత్తు విశ్వసార్వభౌమత్వం కలిగివున్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు. మీలో ఎవరు మంచి పనులు చేస్తారో (మరెవరు చెడ్డపనులు చేస్తారో) పరీక్షించడానికి ఆయన జీవన్మరణాలు సృష్టించాడు. ఆయన మహా శక్తిమంతుడు, గొప్ప క్షమాశీలి. (ముల్క్ : 1-2)
 జీవితం ఎల్లప్పుడూ మనమీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలవుతాము. పోరాడాలనుకుంటే ముందు మనపై మనం గెలవాలి, మనలోనే ఉన్న మన శత్రువుపై గెలవాలి. మనపై మనం గెలవడం అంటే? మనం ఎదుర్కొనే ప్రతి సవాలు, మనం సాధించలేమని, మనం చేతకానివారమని, మనం బలహీనులమని మనల్ని  హేళన చేసినప్పుడు దానికి మనమీచ్చే సమాధానం – మన ధైర్యం, మనలో ఉన్న విశ్వాసమే.
విశ్వాసంలో ఒక వినూత్నమైన అనుభవం అనుదిన అయిదు పూటల ప్రార్ధనలలో మన జీవితం పై మనమే పోరాడడం. విశ్వాస జీవితంలో ప్రార్ధనా పోరాటానికి అల్లాహ్ కృప  తోడైతే ఈ అంతరంగ యుద్దంలో అంతిమ విజయం మనదే. “మనం విశ్వకర్త అయినా అల్లాహు ను  విశ్వసించాము అయితే మనలో… మనకు  మాత్రమే తెలిసిన రహస్యమైనవి కొన్ని లోపాలు, పాపాలు  మిగిలి ఉన్నాయి. వాటిని మనం  ఎలా జయించగలము” అనే ఆలోచనలు ఉన్నప్పుడే ఈ అంతరంగ యుద్ధం మొదలవుతుంది, అల్లాహ్ చిత్తమయితే మనకు  ఆత్మశుద్ధి లభిస్తుంది.  ఏదైనా సాధించాలనే సంకల్పం మనలో బలంగా ఉంటేనే మన చుట్టూ ఉండే  ప్రతికూల పరిస్తితులు కూడా   అనుకూలంగా మారుతాయి, అనుకూలంగా  అల్లాహ్  మారుస్తాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ (153)

విశ్వాసులారా! సహనం వహించి, ప్రార్థనచేస్తూ (మా)సహాయం అర్థిస్తూ ఉండండి. దేవుడు సహనం వహించేవారికే తోడుగా ఉంటాడు.(అల్  బఖరః – 153)
మరో చోట ఇలా అంటున్నాడు:

وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنْفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ * الَّذِينَ إِذَا أَصَابَتْهُمْ مُصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ * أُولَئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِنْ رَبِّهِمْ وَرَحْمَةٌ وَأُولَئِكَ هُمُ الْمُهْتَدُونَ ) البقرة/ 155 – 157


భయం, ఆకలి, ధనప్రాణ, పంటల నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పని సరిగా పరీక్షిస్తాము. అలాంటి స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు “మేము దేవుని ఆస్తులం. దేవుని వైపుకే పోవలసినవాళ్ళం”అని పలికేవారికి వారిప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (అల్-బఖరహ్   155-157)
అల్లాహ్ చేస్తున్న వాగ్దానాన్ని కూడా కాస్త గమనించండి:

وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُم مِّن بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا ۚ وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ (55) وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ (56)


మీ పూర్వీకులను అల్లాహ్  ఏవిధంగా లోకంలో ఖలీఫా (దైవప్రతినిధి)గా చేశాడో అదేవిధంగా మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని కూడా ఖలీఫాగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అదీగాక వారికోసం తాను ఆమోదించిన ధర్మాన్ని వారు ఆచరించేందుకు పటిష్ఠమైన పునాదులపై నెలకొల్పుతానని, వారి (ప్రస్తుత) భయానక స్థితిని శాంతియుతంగా మారుస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. అయితే వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు మరెవరినీ సాటి కల్పించకూడదు. ఆ (వాగ్దానం) తర్వాత ఎవరు తిరస్కారవైఖరి అవలంబిస్తారో వారే దుర్జనులు. (55) విశ్వాసులారా! ప్రార్థనావ్యవస్థ నెలకొల్పండి. పేదల ఆర్థికహక్కు (జకాత్‌) నెర వేర్చండి. దైవప్రవక్త పట్ల విధేయత కలిగిఉండండి. అప్పుడే మీరు కటాక్షించబడతారని ఆశించగలరు. (నూర్: 55-56)

కష్టాలను కరిగించే కరదీపికలు

1) దుఆ

దుఃఖాన్ని దూరం చేసే  గొప్ప ప్రార్థనలలో ఒకటి  ప్రవక్త యూనుస్ (అ)  వారి  ప్రార్థన.

”లా ఇలాహ ఇల్లా అంత సుబ్‌హానక ఇన్నీ కుంతు మిన జ్జ్వాలిమీన్‌”

 చివరికతను (చేప కడుపులో చిక్కుకొని) గాఢాంధకారంలో “నీవుతప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. నీవు పరిశుద్ధుడవు. నేను నిజంగా దుర్మార్గుణ్ణయ్యాను” అని మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతడ్ని బాధ, పరితాపాల నుండి విముక్తి కల్గించాం. ఇలాగే మేము విశ్వాసుల్ని రక్షిస్తాం. (అన్ బియా: 87-88)

2) ధర్మ పాలన: మనం ధర్మ శాస్త్రానికి కట్టుబడి జీవిస్తే అల్లాహ్ మనల్ని రక్షిస్తాడు.

3) అల్లాహ్ స్మరణ: కలిమి స్థితిలో మనం అల్లాహ్ను గుర్తిస్తే, కష్ట  సమయంలో అల్లాహ్ మనల్ని గుర్తిస్తాడు.

4) మనం మారితే మన స్థితి మారుతుంది: అల్లాహ్ ఆదేశాలకనుగుణంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనకే సమస్య వచ్చినా అల్లాహ్ మన ముందుండి ఆదుకుంటాడు.

5)  దైవ భీతి:

అల్లహ్ ను , అంతిమదినాన్ని విశ్వసించినవారికి ఈమాటల ద్వారా ఉపదేశం చేయ బడుతోంది. అల్లాహ్ కు భయపడుతుండేవాడికి అల్లాహ్ కష్టాలనుంచి బయటపడే దారి చూపుతాడు. (ఒకవేళ ఏవైనా  ఇబ్బందులుంటే) అతనికి అల్లాహ్  అతని ఊహ సైతం పోని దిశ నుండి ఉపాధినిస్తాడు. (తలాఖ్: 2-3)

6) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యెడల నమ్మకం:

అల్లాహ్ ను  నమ్ముకునేవాడికి అల్లాహే  చాలు. అల్లాహ్  తన పని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ప్రతిదానికీ ఓలెక్క నిర్ణయించిపెట్టాడు. (తలాఖ్: 3)

పండితుల మాట బంగారు మూట:

నలుగురు నాలుగు విధాలు అనడం ఒక ఆనవాయితీ. అయితే ఆనలుగురు నాలుగు వేర్వేరు సమస్యలతో సమతమవుతూ కూడా ఈ విషయాలను వారు  ఎలా విస్మరిస్తున్నారో  మాకు అంతుబట్టడం లేదు అన్నారు పండితులు. ఎవరా నలుగురు? ఏమిటి వారి సమస్యలు? వారు మరచిన ఆ విషయాలు ఏవి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

 1) అనారోగ్యంతో, అస్వస్థతతో బాధ పడే వ్యక్తి  సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ  మాటలను  నిర్లక్ష్యం  చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది:

అయ్యూబ్‌ గాధ కూడా గుర్తుకుతెచ్చుకో. అతను (వ్యాధిగ్రస్త స్థితిలో ఉండి) “ప్రభూ!) నేను జబ్బు పడ్డాను. నీవు అందరికంటే గొప్ప దయామయుడవు” అని ఎలుగెత్తి మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతని బాధ దూరం చేశాం. అతనికి మేము అతని భార్యాపిల్లలనే కాదు, మా ప్రత్యేక అనుగ్రహంతో ఇంకా అనేక భాగ్యాలు కూడా ప్రసాదించాం. దైవభక్తులకు ఇదొక (మంచి) గుణపాఠం. (అన్ బియా: 83-84)

2) భరించరాని దుఃఖంతో శోక సముద్రంలో నిండా మునిగిన వ్యక్తి అల్లాహ్ ఈ  మాటలను  ఎలా నిర్లక్ష్యం  చేశాడు అని  ఆశ్చర్యమేస్తుంది.

మత్స్యబాధితుడి సంగతి జ్ఞాపకంతెచ్చుకో. అతను కోపం వచ్చి వెళ్ళిపోయాడు. మేము తనను నిలదీయబోమని భావించాడు. చివరికతను (చేప కడుపులో చిక్కుకొని) గాఢాంధకారంలో “నీవుతప్ప మరోఆరాధ్యుడు లేడు. నీవు పరిశుద్ధుడవు. నేను నిజంగా దుర్మార్గుణ్ణయ్యాను” అని మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతడ్ని బాధ, పరితాపాల నుండి విముక్తి కల్గించాం. ఇలాగే మేము విశ్వాసుల్ని రక్షిస్తాం. (అన్ బియా: 87-88)

3) సంతాన లేమితో నిరాశ నిస్ప్రుహకు లోనై  దండగా అన్నంతగా మానసిక ఒత్తిడికి లోనైన వ్యక్తి అల్లాహ్ ఈ  మాటలను  ఎలా నిర్లక్ష్యం  చేశాడు? అని  ఆశ్చర్యమేస్తుంది.

జకరియ్యా వృత్తాంతం కూడా జ్ఞాపకం తెచ్చుకో. అతను తన ప్రభువు సన్నిధిలో “ప్రభూ! నన్ను (సంతానం లేకుండా) ఒంటరివాడ్ని చేయకు. నీవే అందరికంటే మంచి వారసుడివి” అని ప్రార్థించాడు. మేమతని ప్రార్థన ఆలకించి అతనికి యహ్యాను అనుగ్రహించాం. అతని కోసం అతని భార్యను (గర్భధారణకై) తీర్చిదిద్దాము. వీరంతా అమితోత్సాహంతో సత్కార్యాలు చేస్తుండేవారు. మమ్మల్ని ఎంతో ఆశతో, భయభక్తులతో ప్రార్థించేవారు. మాముందు ఎంతో అణుకువతో ఉండేవారు. (అన్ బియా: 89-90)

4) ఏ వ్యక్తికీ వ్యతిరేకంగానైతే  ప్రజలు కుట్రలు పన్నుతున్నారో  ఆ వ్యక్తి  అల్లాహ్ ఈ  మాటను  ఎలా నిర్లక్ష్యం  చేసి ఉంటాడు? అని  ఆశ్చర్యమేస్తుంది. 

నేను మాత్రం నా వ్యవహారాన్ని దేవునికి అప్పగిస్తున్నాను. ఆయనే తన దాసులకు సంరక్షకుడు.” చివరికి అల్లాహ్  వారు పన్నిన కుట్రలు, కుయుక్తులన్నిటిని వమ్ముచేసి ఆ విశ్వాసిని కాపాడాడు. ఫిరౌన్‌ అనుయాయులే ఘోరవిపత్తులో చిక్కుకొని సర్వనాశన మయ్యారు.  (మోమిన్: 44-45)

5) భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే వ్యక్తి   ఎలా అల్లాహ్ ఈ  మాటను   నిర్లక్ష్యం  చేసి ఉంటాడు? అని  ఆశ్చర్యమేస్తుంది. 

 వారు ద్విగుణీకృత విశ్వాసంతో “మాకు అల్లాహే  చాలు, ఆయన గొప్ప కార్యసాధకుడు” అని సమాధానమిచ్చారు. చివరికి వారు అల్లాహ్ అనుగ్రహంతో, బహుమానాలతో తిరిగి వచ్చారు. వారికి ఎలాంటి నష్టం జరగలేదు. వారు అల్లాహ్  అభీష్టం ప్రకారం నడుచు కున్నారు. దేవుడు (ఇలాంటివారికే) అపారంగా అనుగ్రహించేవాడు. (ఆల్ ఇమ్రాన్: 172-174)

అభిమాన మిత్రులారా! మనం ఎన్ని అనుగ్రహాలలో ఉన్నామో ఒక్క సారీ నెమరు వేసుకొండి, అప్పటికీ  అర్థం కాకపొతే ఒకేఒక్క సారి పాలస్తీనా ప్రజల్ని జ్నప్తికి తెచ్చుకోండి.

ఏళ్ల తరబడి నరకం అనుభవిస్తున్నారు.

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం తలెత్తినా, దేశాలమధ్య ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నా అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారు. ముఖ్యంగా లోకం పోకడ తెలియని చిన్నారులు పెద్ద సంఖ్యలో సమిధలుగా మారుతున్నారు. దాదాపు రెండు వారాలుగా గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో ఇప్పటికే రెండు వేల మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. గాజాలో పసిపిల్లల దారుణ దీనావస్థకు సంబంధించిన దృశ్యాలను చూసి ప్రపంచం మొత్తం కంటతడి పెడుతోంది. బాంబుదాడిలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో భయాందోళనలతో వణికిపోతున్న మూడేళ్ల బాలుణ్ని అక్కడి వైద్యుడు కాస్త దగ్గరకు తీసుకుని సర్దిచెప్పాడు.. ఆ మాత్రం ఆసరాకే ఆ పిల్లవాడు భోరున ఏడ్చేశాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయం భారంగా మారింది. ఆ ఆస్పత్రిలో ఇలాంటి చిన్నారులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.

తీవ్ర కల్లోలం

కాస్త కసిరితేనే బెదిరిపోయే చిన్నారి హృదయాలు… చిన్న ఎదురుదెబ్బను సైతం తట్టుకోలేని లేత శరీరాలు… భీకర బాంబు దాడుల్లో, మృత్యువులా మీదకొచ్చే యుద్ధ ట్యాంకర్ల ధాటికి కుప్పకూలిపోతున్న శిథిలాల కింద ఛిద్రమవుతున్నాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల మధ్య గాజాలో తీవ్ర గాయాలపాలై మృత్యువు ఉన్న తల్లి కడుపులోని బిడ్డను శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యులను ప్రపంచమంతా ఎంతగానో ప్రశంసించింది ఆ శిశువు ఊపిరిపోసుకుంది సరే… కానీ, ఆ బిడ్డ నిర్భయంగా స్వేచ్ఛావాయువులు పీల్చేదెన్నడు? ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం ఈ రక్తసిక్త దాడులను, ప్రతీకార చర్యలను ఇప్పటికే ఖండిస్తున్నాయి. కైలాస్ సత్యార్థి సహా 29 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు ఒక్కటై ‘అందరూ మనపిల్లలే… వారిని కాపాడుకోవాలి’ అంటూ నినదించడం ప్రస్తుత దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఏ దేశానికి చెందిన చిన్నారులైనా, ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో జన్మించినా- కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వారందరికీ భద్రమైన బాల్యం అందించాల్సిన బాధ్యత కేవలం తల్లిదండ్రులది మాత్రమే కాదు- సమాజానిది కూడా! ప్రపంచానిది కూడా, ప్రపంచంలో మానవత్వం ఉన్న ప్రతి పౌరునిది కూడా.

సమాజం బాధ్యత : 

ఈ భూమిపై పుట్టిన ప్రతి శిశువుకూ స్వేచ్ఛగా, భద్రంగా ఎదిగే హక్కు, బాల్యాన్ని ఆస్వాదించే అధికారం ఉన్నాయి. ప్రతి బిడ్డకూ పుట్టుకతో సంక్రమించే హక్కులు ఏ కారణాల వల్లా ఎవరూ నిరాకరించకూడనివి. వారికి పన్నెండు పద్నాలుగేళ్లు వచ్చే వరకైనా ఎలాంటి మానసిక, సామాజిక, ఆర్థిక ఒత్తిళ్లకు గురికాకుండా చూసుకోవడం సమాజం బాధ్యత. ఇది పార్టీలకు, రాజకీయాలకు, సరిహద్దు వివాదాలకు అతీతమైన అంశం. వారికి భద్రత కల్పించినప్పుడే ఆధునిక ప్రపంచంగా, నాగరిక సమాజంగా మనల్ని మనం గుర్తుంచుకోగలం. భావితరానికి కనీసం బతికుండే స్వేచ్ఛ ఇవ్వలేనప్పుడు నాగరికులుగా చెప్పుకొనే హక్కు మనకు ఉంటుందా? పసిమొగ్గలు పిట్టల్లా రాలిపోతుంటే… ఆ రాకెట్ల సాంకేతికతను, ఆ వైజ్ఞానిక అభివృద్ధిని చూసి ఎవరు గర్వపడాలి?

 గర్భిణీ స్త్రీల ఆవేదన – ప్రపంచ దేశాలకు నివేదన

‘ మా చుట్టూ బాంబుల మోతలు దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు, ఎటువైపు నుండి బుల్లెట్ల వర్షం కురుస్తుందో తెలియడం లేదు. ఆకాశం నుండి మా ప్రాణాలను హరించే మందుపాతరలు నేలరాలుతున్నాయి. ఇక్కడి వాతావరణం దట్టమైన పొగతో నిండిపోయింది. మా కళ్ల ముందే నా అనుకున్నవాళ్లను పోగొట్టుకున్నాను. ఎటుచూసినా శవాల దిబ్బలే. కుప్పకూలిన భవంతుల మధ్య అయినవాళ్ల మృతదేహాలను వెతుక్కుంటున్న భయానక దృశ్యాలు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అన్న తేడా లేదు. వేలాదిమంది అతి దారుణంగా హతమయ్యారు. ఇంతటి భీకర పరిస్థితిలో నెలలు నిండిన నేను నా బిడ్డకు ఎలా జన్మ ఇవ్వాలి? ఒకవేళ ఆ బిడ్డ ఈ భూమ్మీదకు వస్తే.. తనని ఎలా కాపాడుకోవాలి’ అంటూ గాజా భూభాగంలో గర్భిణీలు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. ఒకరు, ఇద్దరు కాదు; మొత్తం 50 వేల మంది ఇప్పుడు అక్కడ ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. వైద్యులు, వైద్య సదుపాయాలు మృగ్యమైన వేళ, దీనంగా రోదిస్తున్న ఆ మహిళలను ఆదుకునేవారు ఎవరు ? గర్భిణీ స్త్రీల ఆర్తనాదాలు అరణ్య రోదనలు మారుతున్న వేళ…


     ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ బాంబుల దాడికి మృతి చెందిన పాలస్తీనీయన్లు 8000 మంది కాగా, వారిలో 2/3 వంతు మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. రెండు మూఢ సార్లు వెదికెక్కి ఆ పీడిత ప్రజల గురించి మాట్లాడితేనే, నాలుగైదు పేజీల వ్యాసం వారి గురించి రాస్తేనే  విసుగు చెందే ప్రబుద్ధులు నేడు మన మధ్య చాలా మం దే ఉన్నారు. అయితే అక్కడ వారు 75 ఏళ్లుగా వారు భీకర వాతావరణంలో జీవిస్తున్నా రు..వారి సొంత గడ్డపై భద్రత లేని బతుకులు వెల్లదీస్తున్నారు. . ఇప్పుడు జరుగుతున్న ఈ మారణకాండ వారిని  పూర్తిగా తుదముట్టించేంత వరకు ఆగేలా లేదు. రక్షించేవారు లేక మా ప్రాణాలు గాల్లో తేలుతున్నాయి’ అని అక్కడి తల్లుల రోదిస్తున్నారు.

وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا (75

 దిక్కులేక పోవడం చూసి అణచి వేయబడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలను రక్షించడానికి మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడరు? వారు (బాధలు భరించలేక) “దేవా! దుర్మార్గులు నివసిస్తున్న ఈ నగరం నుండి మమ్మల్ని బయటికి తీసి కాపాడు. మాకు రక్షణ కల్పించి అండగా నిలిచేవారి నెవరినైనా నీ వైపు నుండి మా దగ్గరికి పంపు” అని మొరపెట్టుకుం టున్నారే! అలాంటి పీడిత ప్రజల రక్షణ కోసం ఎందుకు పోరాడరు మీరు? (అన్నిసా: 74-75)  

అభిమాన మిత్రులారా!
 గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క…. ఆకలి తీర్చుకోవడానికి ఇంత ఆహారం లభించక వారు అల్లాడిపోతున్నారు. బాధితుల ఆర్తనాదాలు అధికమవుతున్న కొద్దీ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఔషధాలూ నిండుకొంటున్నాయి. మాటలకు అందని మానవతా సంక్షోభమిది… మృగాల కంటే హీనంగా అకారణంగా అమాయకుల ఉసురుపోసుకుంటున్న బెంజమిన్ నెతన్యాహు నరహంతక నైచ్యమిది! వారి కోసం మనకు చేతనయినంత సహాయం చేద్దాం! వారి కోసం చేతులెత్తి ప్రార్థిద్దాం!!

జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు… అంటారు పెద్దలు. మానవ జీవితం నిత్యం సంఘర్షణలతో కలిసి ప్రయాణిస్తుంది. సాలెపురుగు గూడు కట్టడంలో ఎంతో నేర్పరితనం ప్రదర్శిస్తుంది. తను అల్లుకునే గూటిలో చిన్న దోషం కూడా రాకూడదు. ఎక్కడ తేడా వచ్చినా ఆ గూడు వదిలేసి, మరో గూడు కట్టుకోవటం మొదలుపెడుతుంది.
 ప్రతి ప్రాణి జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, అపాయాలు ఎదురవ్వటం సర్వసాధారణం. వాటిని ఎదుర్కోవటానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి. పోరాటానికి ధైర్యం అవసరం. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలని మన ప్రవక్తల గాథలు, వీర జవానుల కథలు … మరెన్నో మనకు బోధిస్తున్నాయి.

أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ (214)

విశ్వాసులారా! మీకు పూర్వం విశ్వాసులకు వచ్చిన (కష్టాల)న్నీ మీపై రాకముందే మీకు ఇట్టే స్వర్గప్రవేశం లభిస్తుందని భావిస్తున్నారా? ఆనాటి విశ్వాసులపై ఎన్నో కష్టాలు, కడగండ్లు విరుచుకుపడ్డాయి. వారు తీవ్రఆందోళన చెందారు. చివరికి అప్పటి దైవప్రవక్త, ఆయన సహచరులైన విశ్వాసులు (ఆ కష్టాలకు తట్టుకోలేక) “దైవసహాయం ఎప్పుడు వస్తుంది?” అని అరిచారు. అప్పుడు వారికి “ఇదిగో దైవసహాయం సమీపంలోనే ఉంది” (అని ధైర్యం చెప్పడం జరిగింది). (బఖరః – 214)
మానవ జీవితం కూడా సంఘర్షణలతో నిండి ఉంటుంది. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. విజయం సాధించేవరకు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు.
ఒక చీమ తన కంటే మూడు రెట్లు బరువుని మోయగలదు. అలా మోసేటప్పుడు ఎన్నోసార్లు అది పడిపోతుంటుంది. కానీ, గమ్యం చేరేవరకు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. గాలికి ఎదురీదుతూ, లక్ష్యాన్ని చేరుకుంటుంది.
గిజిగాడు గూడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లోపల రెండు గదులుగా నిర్మిస్తుంది. గూటి నిర్మాణంలో ఏ చిన్న తేడా వచ్చినా, ఆ గూటిని విడిచిపెట్టి, వేరే గూటిని అల్లుతుంది. లోపం లేకుండా వచ్చేవరకు గూడు కట్టడానికి ఎక్కడా ధైర్యం కోల్పోదు. సృష్టిలోని ప్రతి ప్రాణీ తన లక్ష్యం సాధించుకునేవరకు ధైర్యంగా పోరాడుతూనే ఉంటుంది. కానీ, మానవుల విషయంలోనే అధైర్యం కనిపిస్తుంది. ధైర్యాన్ని కోల్పోయిన మరుక్షణం మనిషి అన్ని విషయాల్లోనూ అపజయం చవిచూస్తాడు. ఎందులో గెలవాలన్నా ధైర్యమే అసలైన ఆయుధం.
ఒక్క మాటలో చెప్పాలంటే –

إِنْ يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِثْلُهُ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنْكُمْ شُهَدَاءَ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ( [آل عمران:140]

(విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వా సులైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. (సత్యాసత్యాల సమరంలో) మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆమాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షిం చడానికి, కొందరిని సత్యానికి సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈవిధంగా చేశాడు. అల్లాహ్  దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజమైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (ఆల్ ఇమ్రాన్: 139-141)

పై పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని కొందరు బురద బుద్ధి ప్రబుద్ధులు నెక్స్ట్ మీరే అన్నట్టు ఎగాదిగా చూద్దాం మనం గమనిస్తాము. దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా విశ్వాసులు దుర్మార్గులకు కొమ్ము కాయరు. అదరఋ. బెదరరు. కావాలంటే బార చాచి నిలబడ్తారు.

الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ*  فَانْقَلَبُوا بِنِعْمَةٍ مِنَ اللَّهِ وَفَضْلٍ لَمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّهِ وَاللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ( [آل  عمران: 173 – 174].

“మీపై దాడి చేయడానికి అవిశ్వాసులు పెద్ద ఎత్తున సైన్యాలు సమీకరిస్తున్నారు, వారికి భయపడండి” అని జనం అన్నప్పుడు వారు ద్విగుణీకృత విశ్వాసంతో “మాకు అల్లాహే  చాలు, ఆయన గొప్ప కార్యసాధకుడు” అని సమాధానమిచ్చారు. చివరికి వారు అల్లాహ్ అనుగ్రహంతో, బహుమానాలతో తిరిగి వచ్చారు. వారికి ఎలాంటి నష్టం జరగలేదు. వారు అల్లాహ్  అభీష్టం ప్రకారం నడుచుకున్నారు. అల్లాహ్  (ఇలాంటివారికే) అపారంగా అనుగ్రహించేవాడు. (172-174)

చివరి మాట
నీళ్లకు బదులు నిప్పులు కురిసినా – ప్రమాద అగ్ని  పర్వతాలే పెల్లుబికినా  – శోక సముద్రాలే అలలెత్తినా  – మనం మాత్రం వెన్ను చూపక  ధైర్యంగా ముందుకు సాగాలి.  నరాలు తెగిపడి నెత్తురు  కారినా – నరమేధాలే  నేల నాలుగు చెరగులా కరాళ నృత్యంచేసినా  గాని -ధర్మం  కోసం ప్రాణం పోయినా – అద్ధం జీవితం. -అబద్దమాడకు- యుద్ధం జీవితం ఆధైర్యపడకు.

Related Post