ఓ విశ్వాసులారా! అల్లాహ్ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షై’తాను అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు! (బఖరః – 208)
మనలో ఉన్న చెడు భావాలు, కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది. మనిషి దుఃఖానికి ఇవి మొదటి కారణాలు. మనిషికి నిజమైన శత్రువులు వారిలో ఉండే అరిషడ్వర్గాలు. ఇవి సామాన్యులను పతనం దిశగా పయనింపజేస్తాయి. మద్యములను అధములుగా మారుస్తాయి.
ఇవి ఇలాంటి ఇతర అవలక్షణాలు మనిషి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి. వాటిని తొలగించుకొంటే, చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. అందరూ కలిసి ఆలోచిస్తే, కలిసి పనిచేస్తే అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమౌతుంది. కలసి ఉంటె కలదు సుఖం అన్నారు. మనం ఉన్న సమాజానికి మేలుచేసే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. అలా కలిసి సాధించిన విజయమే చంద్రయాన్ – 3. కోట్లాదిమంది భారతీయులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఒక అపురూపమైన, మహోన్నతమైన ఘట్టం అంతరిక్షంలో ఆవిష్కృతమైంది. ఇలాంటి మరిన్ని ఘానా విజయాలు మన దేశానికి సొంతం అవ్వాలని మనఃపూర్వకముగా ప్రార్థిద్దాం!
కాలం పరిణామశీలం
మన జీవితంలో అత్యంత ప్రధానమైన భాగం కాలం, ఇది మూడోది. ఇది ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది. మనం దాన్ని వేగవంతం చేయలేము, మెల్లగా నడిపించలేము మనం మన శక్తిని నిలువచేసుకోవచ్చు, వృథా చేయవచ్చు, పెంచుకోవచ్చు, చాలా పెద్దదిగా చేసుకోవచ్చు, అత్యల్పంగా కూడా చేసుకోవచ్చు. కాని కాలం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. కాలాన్ని అనంతం… అమూల్యం… అనూహ్యం… బలీయం…’ వంటి అనేక ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించారు మన పెద్దలు. కాల మహిమను గ్రహించమని, గౌరవించమని బోధించారు మన గురువులు. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది.
‘నేను దైవోపహతుణ్ని, దురదృష్టవంతుణ్ని, లోకంలో ఇందరుండగా నా నొసటన మాత్రమే కష్టాలు రాసిపెట్టాడు’ అని పదేపదే దైవాన్ని నిందిస్తూ మానసికంగా కుంగిపోతున్నవారికి
(విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వాసులైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. (సత్యాసత్యాల సమరంలో) మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆ మాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షించడానికి, కొందరిని సత్యానికి సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈ విధంగా చేశాడు. అల్లాహ్ దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజ మైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (ఆల్ ఇమ్రాన్: 139-140) అన్న వచనాలు గొప్ప ఔషధాలు.
పరీక్షకు మారు పేరు జీవితం
భయం, ఆకలి, ధనప్రాణ, పంటల నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పని సరిగా పరీక్షిస్తాము. అలాంటి స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు “మేము అల్లాహ్ కు చెందినవారలం. ఆయన వైపుకే పోవలసినవాళ్ళం”అని పలికేవారికి వారిప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (155-157)
అంటే జల ప్రవాహంలో ఎంతటివారికైనా తిప్పలు తప్పవు… ఎలాంటి ప్రవాహాలైనా నడివేసవిలో ఇసుక దిబ్బలు బయటపడి వెక్కిరించక మానవు. తిరిగి వర్షాలు రాగానే దిబ్బలు మాయమైనట్లు కాలం కలిసిరాగానే మానవ జీవన ప్రవాహాలు సాఫీగా సాగిపోతాయి.
‘కాలం కలిసిరాకుంటే తాడే పామై కాటేస్తుంది’ అని చెప్పిన మన పెద్దలే ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డలు పుడతారు’ అని కూడా ధైర్యం చెప్పారు. ముఖ్యంగా కష్టాలు చుట్టుముట్టి నప్పుడు ‘కెరటం నా ఆదర్శం… విరిగి పడినందుకు కాదు, పడినా లేచినందుకు!’ అన్న కవివాక్కును తప్పక గుర్తుచేసుకొంటూ ఉంటే- మనం ఒకనాటికి తప్పక విజేతలం అయి తీరుతాం. ‘అదను ఎరిగి సేద్యం… పదును ఎరిగి పైరు’ అని సామెతను అమలు పరిస్తే విజయం మన సొంతం.
వినిర్మల హృదయం విజయానికి నాంది
మనసు మాలిన్యరహతంగా ఉంచుకొంటేనే, ఇహపరాలకు మార్గం సుగమం అవుతుంది. నిర్మల మైన మనసులో నిశ్చయ జ్ఞానం కలిగి, దివ్యజ్యోతి వెలుగుతుంది .మానవ జీవిత గమ్యం ఆ దివ్యజ్యోతి సంద ర్శనమే. చిత్తశుద్ధి లేకపోతే, శివుని అనుగ్రహం కలుగ దు. అజ్ఞానపు పొరలు తొలగితే జ్ఞాన ప్రకాశం కలిగి దివ్యానుభూతి లభిస్తుంది. ఇదే చిరంతనమైనది, శాశ్వ తమైనది. దీనికి మించిందిలేదు. ఈ విషయాన్ని గుర్తిం చి మనం రుజుమార్గంలో ప్రయాణించి మానవ జన్మ సార్ధకతను రుజువు చేసుకోవాలి. కఠిన మనస్కుల తోనూ కలివిడిగా ఉంటే, మనలోని మృదుత్వానికి పరి పూర్ణత సిద్ధిస్తుంది. మంటల మాటున మంచు ఉంటుం దని, కఠిన శిలల్లోనూ నీరు ఉంటుందని తెలుసుకోవ టమే వివేకం.
ధర్మో రక్షతి రక్షిత:.
విశ్వాసులారా! మీరు దేవునికి సహాయంచేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ కాళ్ళను (యుద్ధం నుండి వెనుకంజవేయకుండా) స్థిరంగా ఉంచుతాడు. (ముహమ్మద్ : 07)
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. మరి ధర్మం అంటే ఏమిటి? ధర్మం కేవలం సూక్తి ముక్తావళి కాదు. ప్రవచన ప్రభోదాలు అంతకన్నా కాదు. ఆచరించేది, పాటించేది. మానవాళి ఏం ఆచరించాలి?
“మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలుచేయి. భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు!” (ఖసస్: 77)
సమాజంలో హింస, దౌర్జన్యం, దుర్మార్గం లేకుండా చేయాలి. నీవెలా సుఖశాంతులతో వర్థిల్లుతున్నావో అలానే ఎదుటివారు కూడా ఉండాలని ఆలోచించడం, వ్యవహరించడం, ఆచరించడం, పాటించడం, ఏమైనా కావచ్చు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులూ నీలాగే హాయిగా జీవించేలా నడుచుకోవడం, బాధితులకు సహకరించడం, ఆ సహకారంలో ఆనందం, తృప్తి పొందడం, ధర్మాచరణలో భాగమే అని చెప్పాడు.
సత్కార్యాల్లో, దైవభక్తికి సంబం ధించిన పనుల్లో పరస్పరం సహకరించుకోండి. అంతేగాని, పాపకార్యాల్లో, హింసాదౌర్జన్యాల్లో మాత్రం ఎవరితోనూ సహకరించకూడదు. అల్లాహ్ కు భయపడండి. ఆయన (నేరస్థుల్ని) చాలా కఠినంగా శిక్షిస్తాడని తెలుసుకోండి. (మాయిదహ్: 02)
జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి.
సంపూర్ణ జీవితం అంటే వయస్సుకు సంబంధించిన విషయం కాదు కానీ, సంపూర్ణ జీవితం అంటే మనం బ్రతికినందుకు ఒక అర్థం ఉండడమే. అంటే దేవుడు మనికిచ్చిన అవకాశాల్ని సమయానుకూలంగా శక్యమైనంత వరకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉపయోగించుకోవటం. అనునిత్యం మనం సానుకూలంగా ఆలోచించాలి. ప్రవర్తనలో సరియైన మార్పులు తెచ్చుకోవాలి. పిరికితనం పనికిరాదు. ధైర్యంగా ఉండాలి. భయందోళనలు దగ్గరకు రానీయకూడదు. భయంతో చాలా సమస్యలు వస్తాయి. ప్రతినిత్యం జాగరూకతతో ఉండాలి. జీవితం అపూర్వమైన కానుక. దానిని సద్వినియోగం చేసుకుని ఆనందమైన జీవితం గడపాలి.
మన భవిష్యత్ మనచేతుల్లోనే ఉంది. స్పష్టతతో, అవగాహనతో ఉంటే జీవితాన్ని ఆనందంగా తీర్చి దిద్దుకోవచ్చు. గతం గరించి చింతవద్దు. స్ఫూర్తిగానైనా, గుణ పాఠంగానైనా తీసుకోవాలి అంతే. భవిష్యత్ గురించి లేని పోనీ భయాలు వద్దు. కావాల్సినదల్లా సరయిన కార్యప్రణాళిక, కార్యాచరణ. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. శారీరకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చేసే ప్రతి పనిలోనూ సంపూర్ణంగా జీవించాలి. గతాన్ని అనుసరించే మన వర్తమానం ఉంటుంది. వర్తమానం మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మనం పాటించే ఏ ధర్మాచరణ అయినా సంపూర్ణంగా పాటించాలి. ఎందుకంటే సగం ఎందులోనూ సంతృపి ఇవ్వదు.
సగం సగం ప్రేమికులతో కూర్చోవద్దు, సగం సగం స్నేహితులతో సావాసం చెయ్యోద్దు.
సగం సగం ప్రతిభావంతులను చదవొద్దు.సగం సగం జీవితం జీవించొద్దు, సగంసగం మరణం చావొద్దు. ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు –
సగం సగం పరిష్కారాన్ని ఆశ్రయించొద్దు, అర్థ సత్యాల వెంట నడవొద్దు.
సగం సగం కలలు కనొద్దు, సగం సగం ఆశతో బతకొద్దు
మౌనంగా ఉంటే… చివరి వరకు మౌనంగా ఉండు. మరి మాట్లాడితే… చివరి వరకు మాట్లాడు .
మాట్లాడాలి కదా అని మౌనంగా ఉండకు, మౌనంగా ఉన్నాను కదా అని మాట్లాడకు.
నీవు సంతృప్తి చెందితే… నీ సంతృప్తిని వ్యక్తం చెయ్యి. సగం సంతృప్తి చెందినట్లు నటించకు.
ఒకవేళ నీవు తిరస్కరిస్తే … నీ తిరస్కరణను వ్యక్తపరచు, ఎందుకంటే సగం తిరస్కరణ మరో సగానికి అంగీకరారం.
నువ్వు జీవించని జీవితం సగం, నువ్వు చెప్పలేని మాట సగం. నువ్వు పూర్తిగా నవ్వలేకపోయిన నవ్వు సగం.
నీకు చేరని ప్రేమ సగం, నీకు తెలియని స్నేహం సగం. నీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను నిన్నే అపరిచితుడిగా మార్చేది సగం.
నీ సన్నిహిత వ్యక్తులను నీకు అనామకులుగా చేస్తుంది సగం. సగం చేరుకోవడం అంటే చేరకపోవడమే..
సగం పని చేయడం అంటే పని చెయ్యకపోవడమే. సగం అంటే నువ్వు ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్టే.
సగం నువ్వు, నువ్వు కానప్పుడు నువ్వు ఎవరో నీకు ఎలా తెలిసేది?
నాలోని సగం ఏమిటో నాకే తెలియనప్పుడు నాకు నేను తెలిసినట్టా తెలియనట్టా?
అంటే నేను ఇష్టపడే వ్యక్తి నాలో మిగిలిన సగం కాదు అనేగా…
నేను ఈ క్షణం ఒక స్థలంలో ఉన్నాను, అదే సమయంలో మరొక ప్రదేశంలో ఉన్నాను..
ఇది సాధ్యమా?
సగం పానీయం మీ దాహాన్ని తీర్చదు.
సగం భోజనం మీ ఆకలిని తీర్చదు. సగం మార్గం మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్లదు,
సగం ఆలోచన మీకు ఫలితాలను ఇవ్వదు. నీ నిస్సహాయ క్షణం సగం, కానీ నువ్వు నిస్సహాయుడవు కాదు.
ఎందుకంటే నువ్వు సగం మనిషివి కావు, నువ్వు పూర్ణ మనిషివి.
నువ్వు జీవితాన్ని పూర్ణంగా జీవించడానికి సృష్టించబడ్డావు,
సగం జీవితాన్ని గడపడానికి కాదు.
మనకిషి నిజ స్వరూపం నీకు కన్పించేది నీకు విన్పించేది మాత్రమే కాదు
నీవు కనలేనిది, నువ్వు వినలేనిది . కూడా.
అందుకే …
నువ్వు ఒకరి గురించి తెలుసుకోవాలంటే కేవలం అతను చెప్పిందే నమ్మకు
అతను చెప్పనివి కూడా చాలానే ఉంటాయని తెలుసుకో…