పండితులు మొదలు పామరుల వరకూ, ధనికులు మొదలు కటిక నిరుపేదల వరకూ, పాలకులు మొదలు ప్రజల వరకూ అందరికీ సులువుగా అర్ధమయ్యే అందమైన జీవనశైలి,.వినూత్న వ్యవస్థ,.నిత్యా నూతన శాస్త్రం, శ్రేయస్కరం మార్గం ఇస్లాం. అన్నిటికీ మించి అ నుండి మొదలు అం – అహా వరకూ, ఆవిర్భావం, మొదలు అంతం వరకూ తెరచిన పుస్తక అనంత యానం ఇస్లాం ధర్మం. మనిషిని మహా మనీషిగా మలిచే మహాద్భుత దార్శనిక సూత్రం ఇస్లాం ధర్మం. ఆది మానవులు మరియు ప్రవక్త ఆదమ్ (అ) మొదలు అంతిమ డైవా ప్రవక్త ముహమ్మద్ (స) వరకు కాలపరిమితులకు కట్టుబడకుండా, నిరంతర ప్రవాహంలా, విశ్వం విశ్మయం చెందేలా వీస్తూ విశ్వ జగత్తుని విజయ బాటన నడిపించే వినిర్మల మలయ మారుతం ఇస్లాం ధర్మం. ఒక్క మాటలో విశ్వ జనులందరి కోసం విశ్వకర్త అయిన ఆలాహ్ సమ్మతించి ఆమోదించిన జీవన సంవిధానమే ఇస్లాం.
నేనీ రోజు మీకోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవనధర్మంగా ఆమోదించాను. (మాయిదహ్: 03)
ఆయన ఉక్తి , వాక్య శక్తి ఎంతటిది అంటే,
వారికిలా చెప్పు: “నా ప్రభువు మాటలను వర్ణించడానికి సముద్రంలోని నీరంతా సిరాగా మార్చిరాసినా, ఆ సిరా మొత్తం అయిపోతుందిగాని, నాప్రభువు మాటలు పూర్తి కావు. అంతేకాదు, ఇంకా అంతటి సిరా తెచ్చినా అదీ సరిపోదు.” (బనీ ఇశ్రాయీల్: 109)
ప్రపంచంలోని చెట్లన్నిటిని కలాలు గాను, యావత్తు సముద్ర జలాలతో పాటు అదనంగా మరో ఏడు సముద్రాల నీటిని సిరాగాను మార్చి(రాసి)నా దేవునికి సంబంధిం చిన విషయాలు పూర్తికావు. దేవుడు అపార శక్తిమంతుడు, అసాధారణ వివేకవంతుడు. (లక్మాన్: 27)
స్థిర సనాతనం ఇస్లాం ధర్మం
సనాతనం అంటే స్థిరమైనది, శాశ్వత మైనది అని అర్థం. ఈ అర్థంలో చూస్తే ఇస్లాం మాత్రమే విశ్వ ధర్మం. ఇస్లాం రెండు అవిభాజ్యఅంశాలతో ఆదమ్ (అ) మొదలు అంతిమ దైవ ప్రవక్త (స) వరకూ, అంతిమ దైవ ప్రవక్త (స) మొదలు నేటి వరకూ అందరిచే నీరాజనాలందుకుంటూ అలరారుతూనే, అందరిని అలరిస్తూనే ఉంది. నేటి నుండి మొదలు ప్రళయం వరకూ అలరారుతూనే ఉంటుంది. మారనిది, మార్చ సాధ్యం కానిది. అది నిజం – మారని ఇజం. అదే లా ఇలాహ ఇల్లల్లాహ్.
తెలుసుకో, అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. క్షమాపణ కోరుకో నీ పొరపాట్లకు, విశ్వసించిన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడా. అల్లాహ్ మీ కార్యకలాపాలు, మీ నివాసస్థలాలు అన్నీ తెలుసు. (ముహమ్మద్: 19)
మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేశాము. వారి ద్వారా “దేవుడ్ని ఆరాధించండి. దుష్టశక్తిని ఆరాధించకండి” అని అందరికీ బోధపర్చాము. తరువాత వారిలో కొందరికి దేవుడు సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించాడు. మరికొందరిపై అజ్ఞానపు కారుచీకట్లు ముసురుకున్నాయి. సత్యతిరస్కారులు ఎలాంటి దుష్పర్యవసానం చవిచూశారో కాస్త ప్రపంచంలో తిరిగి చూడండి. (అన్-నహల్: 36)
పైన ప్రస్తావించిన అఖీదహ్ ఇస్లాంలో ప్రథమ భాగం. రెండవ భాగం షరీఅహ్
నిత్య నూతనం ఇస్లాం ధర్మ శాస్త్రం
రెండవ అంశం: ధర్మ శాస్త్రం
మేము మీలో ప్రతి సముదాయానికి ఓ ప్రత్యేక ధర్మశాస్త్రాన్ని, ఓ ప్రత్యేక ఆచరణ విధానాన్ని నిర్ణయించాం (మాయిదహ్: 48) ఇస్లాం ధర్మాన్ని మరో విధంగా నిర్వచించాలంటే, దర్మం, రాజ్యం. ఇస్లాం ధర్మాన్ని మంచిగా అవగాహన చేసుకోవాలంటే ఇది అవసరం. అలా కాకుండా దాన్ని కేవలం ఒక మత ధర్మంగా, సంఘంతో పని లేని ఓ మతాచారంగా భావిస్తే చాలా విషయాలు బోధ పడవు కూడా. ఇక ఇసాళం ధర్మం మానవలికిస్తున్న సందేశం ఏమిటి? అంటే,
జీతం ఇచ్చే వారి కోసమే పని చెయ్యాలి.. జీవితం ఇచ్చిన వాడినే ఆరాధించాలి
భూమ్యాకాశాల్ని ఎవరు సృష్టించారు?
మీకోసం ఆకాశం నుండి వర్షం కురిపించి, తద్వారా మీకు సాధ్యంకాని మనోహరమైన తోటలను పండిస్తున్నదెవరు?
భూమిని నివాసయోగ్యంగా చేసిందెవరు?
అందులో నదుల్ని పారజేసి, (కొండల) మేకుల్ని పాతిందెవరు?
రెండు జలనిధుల మధ్య అడ్డంకిని పెట్టిందెవరు?
కష్టాలలో ఉన్నవాడు మొరపెట్టుకుంటున్నప్పుడు అతని మొర ఆలకించేదెవరు?
చివరికి అతని కష్టాలు కడతేర్చుతున్నదెవరు? భూలోకంలో మిమ్మల్ని ప్రతినిధిగా చేసిం దెవరు?
నేలమీద, సముద్రం మీద కటికచీకటిలో (సైతం) మీకు దారి చూపిస్తున్నదెవరు?
ఎవరు తన కారుణ్యానికి (వర్షానికి) ముందుగా శుభవార్త తెచ్చే (చల్లటి) గాలులను పంపిస్తున్నది?
ప్రాణులను తొలిసారిగా సృజిస్తున్నది, తర్వాత వాటిని పునరుత్పత్తి చేస్తున్నదెవరు?
భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధి ప్రసాదిస్తున్నదెవరు?
ఎవరి ఆజ్ఞను శిరసా వహించి సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకు కలుగుతుంటాయి. వీటికి సమాధానం ఒక్కటే- మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్. ఆయనే ప్రకృతి శక్తులనన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకొని కట్టడి చేస్తాడని, ఆయనే నియామకుడని. ఆయన ఇలా నాటున్నాడు:మేము భూమ్యాకాశాల్ని, వాటిమధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాం. అయినా మేము అలసిపోలేదు.. (ముహమ్మద్: 38)
ఇన్ని మనకు అనుగ్రహించిన ఆయన మన నుండి కోరుతున్నదేమిటి?
మానవులారా! మిమ్మల్ని, మీ పూర్వీకుల్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధిం చండి. అప్పుడే మీరు రక్షించబడతారని ఆశించగలరు. ఆయనే మీ కోసం నేలను పడకగా, నింగిని కప్పుగా చేశాడు. పైనుండి వర్షం కురిపించేవాడు కూడా ఆయనే. ఆ వర్షం ద్వారా ఆయన రకరకాల పండ్లూ, పంటలు పండించి మీకు ఆహారం సమ కూర్చి పెడ్తున్నాడు. కనుక ఈ యదార్థాలు తెలిసిన తరువాత మీరు ఇతర శక్తుల్ని దేవునికి సాటి కల్పించకండి. (బఖరః – 21-22)
భూమ్యాకాశాల్లో ఉన్నదంతా ఎవరిదని అడుగు. అంతా అల్లాహ్ దేనని చెప్పు. ఆయన (మానవాళిని) కరుణించడం తన కర్తవ్యంగా చేసుకున్నాడు. (కనుకనే ఆయన మనిషి అకృత్యాలకు వెంటనే శిక్షించడం లేదు.) ఆయన మిమ్మల్ని ప్రళయ దినాన తప్పకుండా సమావేశ పరుస్తాడు. కాని ఆత్మవినాశానికి పాల్పడినవారు దాన్ని నమ్మలేకపోతున్నారు. రాత్రి చీకటిలో, పగటి వెల్తురులో మనుగడ సాగిస్తున్న ప్రతి సృష్టిరాసీఅల్లాహ్ దే. ఆయన సమస్తం వినేవాడు, సర్వం ఎరిగినవాడు. (అల్-అన్ఆమ్: 12-13)
ఓ ప్రవక్తా! ఇలా చెప్పు: “అల్లాహ్ భూమ్యాకాశాలకు సృష్టికర్త. ఆయనే అందరికీ ఆహారమిచ్చేవాడు. ఆయన మాత్రం ఎవరినీ ఆహారం అడగడు. అలాంటి మహోన్నతుడైన దేవుడ్ని వదలి నేను మరొకడ్ని సంరక్షకునిగా చేసుకోవాల్నా?” చెప్పు: “నేను అందరికంటే ముందు ఆయనకు విధేయుణ్ణయి పోవాలని నాకు ఆజ్ఞయింది. నేను ఎలాంటి పరిస్థితిలోనూ బహుదైవారాధకుల్లో చేరిపోకూడదని కూడా నాకు తాకీదు చేయబడింది.” (అల్-అన్ఆమ్: 14)
మానవుడా! దయామయుడైన నీ ప్రభువుని గురించి నిన్నేవిషయం మోసంలో పడ వేసింది? ఆయన నిన్ను పుట్టించి, నీ అవయవాలు పొందికగా అమర్చాడు. నిన్ను తగిన విధంగా రూపొందించాడు. తాను తలచిన రీతిలో నిన్ను (అందంగా) మలిచాడు. (అల్-ఇన్_ఫితార్: 6-8)
“ఏవిటీ, నిన్ను మట్టితో అల్పమైన బిందువుతో పుట్టించి పరిపూర్ణ మానవునిగా రూపొందించిన శక్తిస్వరూపుడ్నే తిరస్కరిస్తున్నావా? నా విషయానికి వస్తే, నేను మాత్రం అల్లాహ్ మార్తమే నా నిజ ప్రభువుగా స్వీక రించాను. ఆయన దైవత్వంలో మరెవరికీ భాగస్వామ్యం కల్పించను. (అల్-కహఫ్: 37-38)
మానవులంతా ఒక్కటే
మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీపురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే దేవుని దృష్టిలో ఎక్కువ గౌరవ నీయుడు. దేవుడు సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (హుజురాత్: 13)
మానవాళి మార్గదర్శక గ్రంథం ఖురాన్
మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. ఇది మీ హృదయరుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించేవారికి ఇది మార్గదర్శిని, కారుణ్యప్రదా యిని. ప్రవక్తా! వారికిలా తెలియజెయ్యి: “ఈ మహాభాగ్యాన్ని దేవుడు మీకోసం పంపా డంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపు కోవాలి. ఇది ప్రజలు కూడబెడ్తున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైనది. (యూనుస్: 57-58)
విశ్వ ప్రవక్త ముహమ్మద్ (స)
ప్రవక్తా! ఇలా చెప్పు: ప్రజలారా! “నేను మీఅందరి కోసం వచ్చిన అల్లాహ్ ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపతిచే నియమించబడిన సందేశహరుడ్ని. ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఆయనే జీవన్మరణాలకు మూలకారకుడు. కనుక అలాంటి దేవుడ్ని, ఆయన పంపిన నిరక్షరాస్య ప్రవక్తను విశ్వసించండి. దేవుడ్ని, ఆయన ఆజ్ఞల్ని నమ్ము తున్న ఈ ప్రవక్తను అనుసరించండి. అప్పుడే మీరు సన్మార్గగాములవుతారు.” (ఆరాఫ్: 158)
మిథ్యా దైవాల వాస్తవికత
మానవులారా! ఒక ఉదాహరణ ఇస్తున్నాం, జాగ్రత్తగా వినండి: మీరు దేవుడ్ని వదలి ప్రార్థిస్తున్న మిధ్యాదైవాలన్నీ కలసి కనీసం ఒక ఈగనైనా సృష్టించదలచుకుంటే, దాన్ని కూడా సృష్టించలేవు. పైపెచ్చు ఆ ఈగ ఆ మిధ్యాదైవాల దగ్గర్నుంచి ఏదైనా వస్తువుని గుంజుకుంటే ఆ వస్తువుని కూడా అవి దాన్నుండి విడిపించుకోలేవు. సహాయం అర్థించే వారు, సహాయం అర్థించబడేవారు ఇద్దరూ బలహీనులే. అసలు శక్తిమంతుడు, గౌరవ నీయుడు దేవుడు మాత్రమే. (అల్-హజ్: 73-74)
పరలోక చింతన
మానవులారా! మీప్రభువు ఆగ్రహం నుండి తప్పించుకోండి. తండ్రి తన కొడుకుకు, కొడుకు తనతండ్రికి ఎలాంటి సహాయం చేయలేని (ప్రళయ)దినం గురించి భయ పడండి. దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు. ఆ మోసగాడు కూడా మిమ్మల్ని దేవుని విషయంలో మోసగించకూడదు. ఆ ఘడియ ఎప్పుడు సంభవిస్తుందో దేవునికి మాత్రమే తెలుసు. ఆయనే వర్షం కురిపిస్తున్నాడు. మాతృగర్భంలో ఏం పెరుగుతున్నదో కూడా ఆయనకే తెలుసు. రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మనిషికీ తెలియదు. అలాగే తనకు ఏ భూభాగంలో మృత్యువు కాటువేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. సమస్త విషయాలు దేవునికి మాత్రమే తెలుసు. ఆయన సర్వజ్ఞాని, సమస్తం ఎరిగినవాడు. (లుక్మాన్: 33,34)
తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి:
”నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు, మీరు కేవలం అయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి, తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి, ఒకవేళ మీవద్ద వారిలో ఒకరుగానీ, ఇద్దరుగానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్’ (ఛీ) అని కూడా అనకండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్ధిస్తూ ఉండండి; ప్రభూ! వారిపై కరుణ జూపు- బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు”. (ఖుర్‌ఆన్-17: 23,24)
భార్య హుక్కులను గుర్తించాలి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”నీవు తిన్నది ఆమెకూ పెట్టాలి. నీవు తొడిగినది ఆమెకూ తొడిగించాలి. ఆమె ముఖంపై కొట్టకూడదు. ఆమెను శాపనార్ధాలతో తిట్టకూడదు. ఆమెతో దూరంగా మెలిగినా అది ఇంటి వరకే పరిమితమై ఉండాలి”. ఒక మోమిన్ (విశ్వాసి), మోమినా (విశ్వాసురాలు) అయిన తన భార్యను అసహ్యించుకోకూడదు. ఆమెలోని ఏదైనా ఒక గుణం తనకు నచ్చకపోయినా ఎన్నో ఇతర గుణాలు తనకు పసందు కావచ్చు.
అనాథల పట్ల ఆదరణ:
”అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకు”. (ఖుర్‌ఆన్-93:9)
మహా ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”ఏ ముస్లింల ఇండ్లలో, ఒక తండ్రి లేని అనాథకు రక్షణ లభించి, ఆ అనాథ ఎడల సవ్యంగా ప్రవర్తించడం జరుగుతుందో అదే ఉత్తమ గృహం. మరి ఏ ఇంట్లో నయితే ఒక అనాథ ఉండి, ఆ అనాథ ఎడల చెడ్డగా ప్రవర్తించడం జరుగుతుందో ఆ ఇల్లు ముస్లిం ఇండ్లలోకెల్లా చెడ్డ ఇల్లు”.
”అల్లాహ్ మీద ప్రేమతో పేదలకూ, అనాథలకూ, ఖైదీలకు అన్నం పెట్టేవారు. ఈ ఉత్తమ మానవులు వారితో ఇలా అంటుండేవారు – మేము కేవలం అల్లాహ్ కోసమే మీకు అన్నం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతనుగానీ ఆశించడం లేదు”. (ఖుర్‌ఆన్- 76:8,9)
బానిసలు మీ సోదరులు:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”అల్లాహ్ వారిని మీ ప్రయోజనార్ధం మీకు అప్పగించాడు. అయితే వారిని మీలో ఎవరి ఆధీనంలోనైతే ఉంచాడో వారు తాము ఏది తింటే అదే వారికి పెట్టాలి. తాము ఎలాంటి బట్టలు ధరిస్తారో వారికి అలాంటి బట్టలే ఇవ్వాలి. వారి శక్తికి మించిన పని భారాన్ని వారిపై మోపకూడదు. ఒకవేళ వారి శక్తికి మించిన పని చెప్పినట్లయితే అందులో వారికి తోడ్పడాలి.” ఉత్తములైన వారెవరూ ఎవరి నుండీ ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరరు:
అగత్యపరులపై ధనాన్ని ఖర్చు పెట్టడం ఉత్తమ సత్కార్యం:
”అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువ ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకూ, అనాథల కొరకూ, నిరుపేదల కొరకూ, సహాయం చెయ్యండని అర్ధించేవారి కొరకూ, ఖైదీలను విడుదల చెయ్యడానికి ఖర్చు పెట్టడం అసలు సత్కార్యమంటే”. (ఖుర్‌ఆన్- 2:117)
వితంతువుల, నిరుపేదల కోసం శ్రమించాలి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”వితంతువుల కొరకూ, నిరుపేదల కొరకూ శ్రమించేవాడు, అల్లాహ్ మార్గంలో నిరంతరం కృషి సలిపేవానికి సమానం. రేయంతా అల్లాహ్‌ా సన్నిధిలో నిల్చోని ప్రార్థన చేసినా అలసట ఎరుగని వానితో సమానం. పగటిపూట ఏమీ తినకుండా ఎడతెరపి లేకుండా ఉపవాస వ్రతం పాటించేవానితో సమానం”.
పొరుగువారి హక్కులను గుర్తించాలి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: తాను కడుపు నిండా భుజించి, తన ప్రక్కన ఉండే పొరుగువాడు పస్తులుండటాన్ని సహించే వ్యక్తి విశ్వాసి కాజాలడు.
ఎవడి దుర్నడత వల్లనైతే పొరుగువారికి ఇబ్బంది కలుగుతుందో దైవ సాక్షిగా వాడు విశ్వాసి కాడు.
అబూ జర్! నీవు ఏదైనా కూర వండినప్పుడు అందులో కాస్త నీళ్ళు ఎక్కువగా పొయ్యి. పొరుగువారిని కూడా కనిపెడుతూ (ఇస్తూ) ఉండు”.
ఇతరుల కష్టాలు చూసి ఆనందించకు, కష్టాలను దూరం చెయ్యి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”నీవు నీ సోదరుడిని కష్టాలలో చూసి సంతోషించకు. అల్లాహ్ అతనిపై కనికరించి నిన్ను కష్టాల పాల్జేయవచ్చు. ఇంకా ఆ మహనీయులు ఇలా అన్నారు: ”ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. అతనికి ఎలాంటి అన్యాయమూ చేయడు. అతనిని అసహాయ స్థితిలోనూ వదలి వెయ్యడు. ఎవరైతే తన సోదరుని అవసరాన్ని తీరుస్తాడో, అతని అవసరాన్ని అల్లాహ్ తీరుస్తాడు. ఎవరైతే ఒక ముస్లింపై వచ్చిపడ్డ కష్టాన్ని దూరం చేస్తాడో, అతనికి ప్రళయ దినాన ఎదురయ్యే కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లింలోని లోటుపాట్లను మరుగు పరుస్తాడో అల్లాహ్ ప్రళయ దినాన అతని తప్పిదాలను కప్పి పుచ్చుతాడు”.
ఇచ్చిపుచ్చుకోవడాల్లో నిజాయితీని కనబరచాలి:
”కొలపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి. తూచినట్లయితే సరైన తరాజుతో తూచండి. ఇది మంచి పద్ధతి, పర్యవసానాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం”. (ఖుర్‌ఆన్-17:35)
”నా జాతి సోదరులారా! ఖచ్చితంగా న్యాయంగా పూర్తిగా కొలవండి, తూచండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి”. (ఖుర్‌ఆన్-11:85)
మోసం చేసేవారికి వినాశం తప్పదు:
”తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా తీసుకుంటారు. కాని వారికి కొలచిగానీ, తూచిగానీ ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక మహా దినం నాడు వారు బ్రతికించి తీసుకు రాబడనున్నారని వారికి తెలీదా? ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు”. (ఖుర్‌ఆన్-88:1-8)
భూమిపై విర్ర వీగుతూ నడవకండి:
”భూమిపై విర్ర వీగుతూ నడవకండి. మీరు భూమిని చీల్చనూ లేరు, పర్వతాల ఎత్తుకు చేరనూ లేరు”. (ఖుర్‌ఆన్-17:37)
”కరుణామయుని సిసలైన దాసులు ఎవరంటే వారు నేలపై అణకువతో నడిచేవారూ, మూర్ఖులు వారిని పలుకరించినప్పుడు మీకో సలాం అని అనేవారూ, తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడి, నిలబడి రాత్రులు గడిపేవారు. ‘మా ప్రభూ! నరక యాతనల నుండి మమ్మల్ని కాపాడు, దాని శిక్ష ప్రాణాంతకమైనది, అది ఎంతో చెడ్డ నివాసం’ అని దీనంగా వేడుకునేవారు”. (ఖుర్‌ఆన్-25:63)
కల్లోలాన్ని సృష్టించడం క్షమించరాని నేరం:
”ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే- భూమిలో (సాయుధులై, ముఠాగా ఏర్పడి దోపిడికీ, విధ్వంసక చర్యలకూ పాల్పడుతూ) కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికి శిక్ష ఏమిటంటే, వారిని చంపడం లేదా శిలుపైకి ఎక్కించడం లేదా చేతులు, కాళ్ళను అభిముఖ దిశలో ఖండించడం లేదా దేశం నుండి బహిష్కరించటం. ఇది వారికి ఇహలోకంలో జరిగే అగౌరవం, అవమానం. పరలోకంలో వారికి ఇంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది”. (ఖుర్‌ఆన్-5:32,33)
వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి:
”వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి. అది అతి దుష్టకార్యం. బహు చెడ్డ మార్గం”. (ఖుర్‌ఆన్-17:32)
”నిజమైన విశ్వాసులు తమ మర్మాంగాలను పరిరక్షించుకుంటారు”. (ఖుర్‌ఆన్-23:5)
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”పర స్త్రీ మీద నీ చూపు ఆనక పూర్వమే నీవు దృష్టి మరల్చుకో”.
శీలవతులైన స్త్రీలపై అబాంఢం వేయరాదు:
”శీలవతులు, అమాయికలు అయిన స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ, పరలోకంలోనూ శపించబడ్డాడు. వారికి పెద్ద శిక్ష పడుతుంది”. (ఖుర్‌ఆన్-24:23)
సారాయి, జూదం అసహ్యకరమైన షైతాన్ పనులు:
”విశ్వాసులారా! సారాయి, జూదం, దైవేతరాలయాలు, పాచికల ద్వారా జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన షైతాన్ పనులు, వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. షైతాన్ సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధవిద్వేషాలను సృష్టించాలనీ మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి, నమాజు నుండి వారించాలని కోర్తాడు”. (ఖుర్‌ఆన్-5:90)
వడ్డీని తినటం మానండి:
”విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానుకోండి. అల్లాహ్‌కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవిశ్వాసుల కొరకు తయారు చేయబడిన ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి”. (ఖుర్‌ఆన్-3:130,131)
దీని తర్వాత కూడా ఇస్లాం ధర్మం చెడ్డదే అనే వారు ఆధారాలు సిద్ధం చేసుకోవాలి. విన్న సమాచారమే తప్పయితే కరెక్ట్ చేసుకోవాలి.