‘ షిర్క్‌’ పుట్టు పూర్వోత్తరాలు

Originally posted 2013-03-29 19:27:12.

   Shirk‘సమస్త వ్యవహారాల్లో సిఫారసు చేసే అధికారం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. ఆయన దగ్గరికే మీరంతా తరలి పోవలసి ఉంది”. (దివ్య ఖుర్‌ఆన్‌ 43,44)
దైవం ఈ జగతిని ఏదో ఆషామాషిగా, అల్లాటప్పాగా సృష్టించలేదు. సృష్టిని దాని మానాన వదిలేయనూ లేదు. సృష్టిరాసుల ద్వారా ఖాళీ స్థలాన్ని నింపడమూ ఆయన ఉద్దేశం కాదు. వాస్తవంగా దేవుడు మానవణ్ణి ఓ గొప్ప లక్ష్యం కోసం, ఓ అత్యున్నత కార్యం కోసం పుట్టించాడు. ఈ కార్యసాధనకు తోడుగా, భూమ్యా కాశాలను, సృష్టి సామ్రాజ్యంలోని ప్రచండ శక్తులన్నింటినీ మనిషి అధీనంలో పెట్టాడు. వీటన్నింటినీ కేవలం ఓ ‘అప్పగింత’గా ప్రసాదించాడు. తాను అనుగ్రహించిన ఈ అనన్య వరాలను వాక్కు  రీత్యాగానీ, నమ్మకం రీత్యాగానీ, ఆచరణ రీత్యాగానీ మానవుడు తన మార్గంలోనే వినియోగించాలని అభిలషించాడు దేవుడు.
  ఆదిలో ప్రజలందరూ ఆత్మ స్వభావానికి, ప్రకృతి ధర్మానికి కట్టుబడి జీవించేవారు. రుజు మార్గాన నడిచేవారు. సర్వలోక ఉపాధి ప్రదాత అయిన, ఆదీ – అంతమూ లేని అద్వితీయుడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే జన స్రవంతిలో విగ్రహారాధన, బహు దాస్యభావన అన్న మహమ్మారి  రోగం సంక్రమించిందో – అప్పుడు అల్లాహ్‌ తన సందేశహరుల్ని పంపి వారిని బహుదైవారాధన నుండి నివారించ మని చెప్పాడు.
  ఆది మానవుడు హజ్రత్‌ ఆదం (అ) గారి మరణానంతరం ఆయనగారి సంతానం 1000 సంవత్సరాల వరకు తమ తండ్రి చూపిన దైవ విధేయతా మార్గానే నడిచింది. ఆపై వారిలో క్రమేణా మార్పు రాసాగింది. దైవాదేశాల పట్ల అశ్రద్ధ, అవిధేయత, వ్యతిరేకత పొడసూపింది. వారు నిజ మార్గాన్ని మరచి మార్గవిహీనులయ్యారు. వారి ఈ అవిధేయతకు గల కారణం ఆ సమాజపు పుణ్యాత్ముల పట్ల వారికి గల వల్లమాలిన అభిమానమే. అప్పటి సంఘ సంస్కర్తల పట్ల వారికున్న మితిమీరిన గౌరవమే. కాదనలేని ఈ నిజాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ”వారు అల్లాహ్‌ాను (నిజ ఆరాధ్యుడ్ని) వదలి తమ ధర్మవేత్తలు, సాధువులను దేవుళ్ళుగా, ప్రభువులుగా చేసుకున్నారు… ఆయన (అల్లాహ్‌)  తప్ప మరెవరూ ఆరాధనకు, దాస్యానికి అర్హులు కారు. వారు కల్పించుకున్న బహుదైవారాధనా భావాలకు, (దైవం గురించి వారు పలికే వింత విచిత్ర) పలుకులకు ఆయన ఎంతో అతీతుడు, పవిత్రుడు”.  (దివ్య ఖుర్‌ఆన్-9:31)
  మరో చోట మరింత వివరంగా పేర్కొనబడింది: (మిథ్యా దైవాలనే పట్టుకు వ్రేలాడుతూ) వారు పరస్పరం ”మీరు మీ పూజ్య దైవాలను ఎన్నటికీ విడనాడకండి. ‘వద్ద్‌’నిగానీ, ‘సువా’నిగానీ వదులుకోకూడదు. ‘యగూస్‌’ని ‘యవూఖ్‌’ని ‘నసర్‌’ని కూడా వదులుకోరాదు” అని చెప్పుకున్నారు.  (దివ్యఖుర్‌ఆన్‌ -71: 23)
  పై ఆయతులో పేర్కొనబడిన ఈ ఐదుగురు వ్యక్తులు గొప్ప పుణ్యాత్ములు. వారు సయితం మంచిని బోధించి చెడుని నివారించినవారే. అయితే వారంతా దురదృష్టవశాత్తు ఒకే నెలలో మరణించారు. అప్పటి ప్రజలు ధర్మం ఎక్కడ అంతరిస్తుందోనని ఆందోళన చెందారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ తమ సమావేశాల్లో ఒక్కో వ్యక్తి రూపాన్ని గీసుకొని పెట్టుకున్నారు. ఆ పుణ్యాత్ముల మంచి మాటలు, ఆదర్శాలు వారి చిత్రాలను చూసుకొని నెమరువేసుకోవాలన్న సదుద్దేశ్యంతోనే వారు అలా చేశారు. ఎప్పుడూ వారిని దైవంగా భావించలేదు. వారిలో దైవత్వం ఉందని కూడా వాదించలేదు. కొంత కాలం గడిచింది…ఒక తరం గతించింది. అప్పుడు వచ్చిన న్యూ జనరేషన్‌  తమ పూర్వీకులకన్నా ఎక్కువగా ఆ ఐదుగురిని గౌరవించడం, అభిమానించడం మొదలెట్టారు.  ఆ తర్వాత ఓ సుదీర్ఘ కాలం గడిచింది…  ధర్మవేత్తలు, పండితులు, విద్యావంతులందరూ దాదాపు మృతి చెందారు. ధరిత్రిపై జ్ఞానసంపన్నులు మిగులలేదు. నలువైపులా అజ్ఞానం, అంధకారం రాజ్యమేలసాగింది. సరిగ్గా అప్పుడే షైతాన్‌ ఆయుధాలన్నింటిని సమీకరించుకుని రంగ ప్రవేశం చేశాడు.
  అయ్యల్లారా! అక్కల్లారా! మహాత్ముల ఈ విగ్రహాలు ఇలానే సరదా కోసం చేయబడ్డాయి అనుకొంటున్నారా? వలదు, వలదు. ఇలా భావించడం తగదు. వాస్తవానికి ఈ పుణ్యపురుషుల అండ దండలు లేనిదే మీరు ఏమీ చేయలేరు. వారి సిఫారసు లేనిదే మీ ఆరాధనలు స్వీకరించబడవు. మీ మొరలు ఆలకించబడవు’ అని కల్లిబొల్లి మాటలతో మంత్రించాడు. షైతాన్‌ విసిరిన విష బాణం బాగానే పని చేసింది. తను అల్లిన భావజాలం బాగానే ఆకర్షించింది. చివరికి ప్రజలు కూడా ఇలా చెప్పనారంభించారు:   ”ఆయన్ను (అల్లాహ్‌ను) వదలి ఇతరులను సంరక్షకులుగా, సహాయకులుగా చేసుకున్నవారు (దేవుడు ఒక్కడేనని మాకు తెలుసు) అయితే ఈ మహాత్ములు (విగ్రహాలు, దైవ దూతలు, ప్రవక్తలు, పుణ్యాత్ములు) మమ్మల్ని అల్లాహ్‌ సన్నిధికి చేర్చు తారని, ఆయనకు దగ్గర చేస్తారని మాత్రమే మేము వీరిని ఆరాధిస్తున్నాము”  (దివ్యఖుర్‌ఆన్-39:3) అని అంటారు.
  ”(అలా) వారు అల్లాహ్‌ను వదలి తమకు ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించని మిథ్యా దైవాలను పూజిస్తూ అవి తమను గురించి అల్లాహ్‌ా దగ్గర సిఫారసు చేస్తాయని అంటారు. ఏమిటి, మీరు భూమ్యాకాశాల్లో అల్లాహ్‌ ఎరుగని విషయం గురించి ఆయనకు కొత్తగా తెలుపుతున్నారా? అని అడుగు వారిని”.  (దివ్యఖుర్‌ఆన్-10:18)
  ఇంకా ఇలా అను: ”ఆ నిజ స్వామిని వదలి మీరు ఇతరుల్ని సిఫారసు కర్తలుగా చేసుకున్నారా?” వారిని అడుగు: ”ఎలాంటి అధికారం లేకపోయినా వారు సిఫారసు చేయగలరా?” (ఇంకా) ఇలా స్పష్టపర్చు: ”సమస్త వ్యవహారాల్లో సిఫారసు చేసే అధికారం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. ఆయన దగ్గరికే మీరంతా తరలి పోవలసి ఉంది”. (దివ్య ఖుర్‌ఆన్‌ 39: 43,44)
  ఆ విధంగా వారు మార్గభ్రష్టులైపోయిన తర్వాత అల్లాహ్‌ వారి వద్దకు నూహ్‌ ప్రవక్తను పంపాడు. ఆయన తన జాతి ప్రజల దగ్గరకు వెళ్ళి ”నా జాతి ప్రజలారా! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చినవాణ్ణి. దైవప్రవక్తను. కనుక (నా మాట విని) అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు భయపడండి. నాకు విధేయత చూపండి” (దివ్యఖుర్‌ఆన్-71: 2,3)అని కోరారు.
  ఈ విధంగా నూహ్‌ ప్రవక్త దాదాపు 950 ఏండ్లపాటు ప్రజలకు హితబోధ చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. బహుకొద్దిమంది మాత్రమే ఆయన్ను విశ్వసించారు. చివరికి వారు చేసుకున్న పాపాల కారణంగా వారిని జలప్రళయం ద్వారా సర్వనాశనం చేయడం జరిగింది. విశ్వాసులను ఓడలో రక్షించడం జరిగింది. అల్లాహ్‌ మిగిలిన ఆ గుప్పెడు మంది విశ్వాసుల్ని ఆశీర్వదించాడు. వారి సంపదలో, సంతానంలో గొప్ప శుభాల్ని అనుగ్రహించాడు. వారి సంతానం అభివృద్ధి చెంది నేల నలుదిక్కులా విస్తరించింది. వారు వివిధ వర్గాలుగా, తెగలుగా ఏర్పడ్డారు. అలా చాలా కాలంవరకు వారు ఇస్లాం ధర్మంపైనే బ్రతికారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ బహు దైవారాధన అనే విష వైరస్‌ వ్యాపించింది.

 

Related Post