ఉమ్రా ఘనత – హజ్‌ ఆదేశాలు

Originally posted 2013-04-05 20:43:40.

.6065872051_3de3b85af8_z

 ఉమ్రా ఘనత

 మహా ప్రవక్త (స) ఇలా అన్నారు: ‘ఒక ఉమ్రా చేసిన తరువాత మరో ఉమ్రా చేస్తే వాటి మధ్య జరిగే పాపాలు క్షమించబడతాయి’. (బుఖారీ, ముస్లిం)
 ‘రమజాన్‌లో ఉమ్రాకు లభించే పుణ్యం హజ్‌ పుణ్యంతో సమానం’. (బుఖారీ,ముస్లిం)
పరమార్థం: హజ్‌ జీవితంలో ఒక్కసారి విధి. అందులో డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ చెయ్యలేరు. కాని ఉమ్రా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చెయ్యవచ్చు. కనుక పవిత్ర కాబా గృహ దర్శన భాగ్యం హజ్‌ చెయ్య లేని వారికై అందుబాటులో ఉండాలని ఉమ్రాను ఆధారంగా చెయ్యడం జరిగింది.
సమయం: హజ్‌ కొన్ని ప్రత్యేకమైన నెలల్లోనే చెయ్యాలి. కాని ఉమ్రా మాత్రం సంవ త్సరంలో 12 నెలలూ ఎప్పుడైనా చెయ్యవచ్చు.
గమనిక: కొందరు ఉమ్రా చేస్తే హజ్‌ విధి అవుతుందని అనుకుంటారు. ఇది నిజం కాదు. స్థోమత గలవారే హజ్‌ చెయ్యాలి.
అర్కానుల్‌ ఉమ్రా: 1) ఇహ్రాం (దీక్ష)      2) తవాఫ్‌  (ప్రదక్షిణ)    3) సయీ.
వాజిబాత్‌:   1) మీఖాత్‌ నుండి ఇహ్రామ్‌ (దీక్ష) బూనటం.    2) శిరోముండనం లేదా జుత్తు కత్తిరించటం.

 హజ్‌ ఆదేశాలు

 అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ‘ఈ గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్‌ను విధిగా చెయ్యాలి’. (ఆలి ఇమ్రాన్:97)
 మహాప్రవక్త (స) ఇలా పలికారు: ‘ఓ ప్రజలారా! హజ్‌ మీపై విధిగావించ బడింది. కనుక హజ్‌ను నెరవేర్చండి’. (ముస్లిం)
1) స్థోమత: హజ్‌ చేయదలిచేవారు ఆరోగ్యవంతులై, ప్రయాణం చెయ్యగలిగే వారై ఉండాలి. వారి దగ్గర ఉన్న ధనం ప్రయాణపు ఖుర్చులకు తమపై ఆధారపడిన    వారి ఖర్చులకు సరిపోయేటట్టు వుండాలి.  గమనిక: కొందరు మదీనా వెళ్ళే ఖర్చులనీ, అక్కడ షాపింగ్‌ ఖర్చులని సయితం లెక్కి స్తారు. ఇది సరైనది కాదు. మక్కా వరకూ వెళ్ళి వచ్చేంత సొమ్ము ఉంటే చాలు.
2) హజ్‌ చేసే స్థోమత ఉన్న వారు షరీఅత్‌ పరమైన తగు కారణం లేకుండా ఆలస్యం చెయ్యకూడదు. (అహ్మద్)
3) పూర్తి జీవితంలో హజ్‌ ఒక్కసారే విధి అన్న విషయంలో ధర్మపండితులందరూ ఏకీ భవించారు. ఒకటికి మించి ఎన్ని హజ్జులు చేసినా అవి నఫిల్‌ గానే పరిగణించ బడ తాయి.
ఒక అపోహ: కొందరి వ్యాపారాలు అన్యాయం అక్రమాలపై ఆధారపడి ఉంటాయి. వీరు తమ దగ్గర పనిచేసే కార్మికుల హక్కుల్ని స్వాహా చేస్తుంటారు. లేక వారి శ్రమకి తగ్గ ప్రతిఫలం ఇవ్వరు. వారు తమ పాపాలకు పరిహారంగా అక్రమ పద్ధతుల్లో కూడ బెట్టిన (బ్లాక్‌ మనీని) సంపదను సక్రమమైనదిగా (వైట్‌ మనీగా) చేసుకోవడానికి ఎక్కువ హజ్‌లు చేస్తూ ఉంటారు. ఇలా చెయ్యడం వల్ల తమ పాపాలు క్షమించబడతా యనీ, హరామ్‌ సంపద హలాల్‌ అవుతుందని షైతాన్‌ వీరిని భ్రమకు గురిచేశాడు. ఇది మనసు చేసే మాయ తప్ప మరేమీ కాదు. ఇలా చేసే హజ్‌ అల్లాహ్‌ాకు అవసరం లేదు.
అర్కానుల్‌ హజ్‌
1) ఇహ్రామ్‌ (దీక్ష బూనటం).    2) అరఫా మైదానంలో విడిది చెయ్యటం.
3) తవాఫుల్‌ ఇఫాజ చెయ్యటం. 4) సఫా-మర్వాల మధ్య సయీ చెయ్యటం.
గమనిక: హజ్‌కు సంబంధించిన ఈ మూలాంశాల్లో ఏ ఒక్కటి తప్పినా హజ్‌ నెర వేరదు. మళ్ళీ పాటించాల్సిందే.
వాజిబాత్‌- హజ్‌లో తప్పని సరిగా చేయవలసినవి
1) మీఖాత్‌ నుండి ఇహ్రామ్‌ (దీక్ష బూనటం) 2) ముజ్‌దలిఫా మైదానంలో రాత్రి గడపటం.  3) జుల్‌ హిజ్జ 11, 12, తేది రాత్రుల్లో మినా మైదానంలో గడపటం.
4) అరఫాలో సూర్యాస్తమయానికి ముందు వరకు వేచి ఉండటం.
5) జమరాత్‌లపై కంకర రాళ్ళు రువ్వటం (రమీ చేయటం)
6) శిరో ముండనం లేదా జుత్తు కత్తిరించటం.
7) తవాఫే విదా (ఆఖరి ప్రదక్షిణ ) చేయటం.
గమనిక: వీటిలో ఏ ఒక్కటైనా పాటించని ఎడల పరిహారంగా మక్కా పట్టణంలోనే ఓ జంతువును ఖుర్బాని ఇచ్చి దానిని పేదవారిలో పంచి పెట్టాలి. ఆ మాంసాన్ని తను మాత్రం భుజించకూడదు.
హజ్‌ రకాలు మూడు
1) హజ్జె తమత్తు  2) హజ్జె ఖిరాన్‌ 3) హజ్జె ఇఫ్రాద్‌.
1) తమత్తు: అనగా హజ్‌ నెలల్లో మీఖాత్‌ నుండి ఉమ్రా కోసం ఇహ్రామ్‌ బూనటం. ఉమ్రా పూర్తి చేసిన పిదప ఇహ్రాంను విరమించడం. తరువాత మళ్ళీ జుల్‌హిజ్జా 8వ తేదీన మక్కా నుండే హజ్‌ కోసం ఇహ్రాం బూనటం.
సంకల్పం: ”అల్లాహుమ్మ లబ్బైక్‌ బిల్‌ ఉమ్రతి ముతమత్తిఅన్‌ ఇలల్‌ హజ్జ్‌”. హాజీ ఉమ్రా-హజ్‌ల మధ్య కాలంలో ఇహ్రామ్‌ వస్త్రాన్ని తీసేసి లాభం పొందుతాడు. కనుక ఈ విధానాన్ని హజ్జె తమత్తు అంటారు. ఇలా చేసే వ్యక్తిని ముతమత్తె అంటారు.
2) ఖిరాన్‌: అంటే హజ్‌ ఉమ్రాల కోసం మీఖాత్‌ నుండి ఒకే సారి ఇహ్రాం బూనటం. ఉమ్రా పూర్తి అయిన తరువాత హజ్‌ పూర్తి చేసే వరకు ఇహ్రామ్‌ని కొనసాగించడం.
సంకల్పం: ”లబ్బైక్‌ అల్లాహుమ్మ ఉత్రన్‌ వ హజ్జన్‌”. హాజీ ఉమ్రా హజ్‌ని కలిపి పూర్తి చేస్తాడు. కనుక ఈ విధానాన్ని హజ్జె ఖిరాన్‌ అంటారు. ఇలా చేసే వ్యక్తిని ముఖ్‌రిన్‌ అంటారు.
3) ఇఫ్రాద్‌: మీఖాత్‌ నుండి కేవలం హజ్జ్‌ ఇహ్రాం బూనటం. హజ్జ్‌ నెరవేర్చే వరకు ఆ ఇహ్రామ్‌లోనే ఉండటం. హాజీ కేవలం హజ్జ్‌ మాత్రమే చేస్తాడు. కనుక ఈ విధానాన్ని ఇఫ్రాద్‌ అని, ఇలా చేసే వ్యక్తిని ముఫ్‌రిద్‌ అని అంటారు. ముఫ్రిద్‌పై ఖుర్బానీ లేదు.
సంకల్పం: ”లబ్బైక్‌ అల్లాహుమ్మ హజ్జన్‌”.
గమనిక: ఇహ్రాం బూనిన పిదప తల్బియా పలుకుల్ని అరబీ భాషలో ఉచ్చరించాలి.

 

Related Post