Originally posted 2013-04-06 07:25:46.
1) ఈ స్థలంలోనే అల్లాహ్ ఆరాధనకై ప్రజలందరికోసం మొట్ట మొదటి దైవ గృహం నిర్మించబడింది. ప్రవక్త ఇబ్రాహీం (అ) ఇస్మాయీల్ (అ) లు తమ భుజాలపై ఈ ఇంటి రాళ్ళని మోసారు.
2) ఈ స్థలంలోనే దుష్టుడు అబ్రహ, అతని సైన్యం నాశనం చెయ్యబడింది.
3) ఈ స్థలంలోనే చరిత్రలో అతి పెద్ద సంఘటన జరిగింది. ప్రవక్త (స)పై వహీ ద్వారా దైవధర్మం పరిపూర్ణం చెయ్యబడింది.
4) ఈ స్థలం నుంచే ప్రవక్త (స)వారిని గగన యాత్రకి తీసుకెళ్ళడం జరిగింది. ఆకాశ వాసులు-భూవాసులతో, దూతలు-మానవులతో కలిసారు.
5) ఈ స్థలంలోనే జమ్‌జమ్ జలం పెల్లుబికింది. శతాబ్దాల తరబడి ప్రపంచమంతటికీ సరఫరా అవుతోంది.
6) ఈ స్థలంలోనే సత్యప్రియుడు, సత్యసంధుడు, సద్గుణ సంపన్నుడు, శుభకరుడు, సర్వలోక కారుణ్యమూర్తి అయిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) జన్మించారు.
7) ఈ స్థలంలోనే విశ్వాసులకు అతిపెద్ద విజయం లభించింది. చిల్లర దైవాలుగా పూజింపబడే శిలలను పగలగొట్టడం జరిగింది. అసత్యంపై సత్యం విజయ కేతనాన్ని ఎగుర వేసింది. హజ్రత్ బిలాల్ (ర) లాంటి నల్లని నిగ్రో కాబా గృహంపైకెక్కి అజాన్ ఇచ్చారు.
మక్కా మర్యాద: ఈ నగరం శాంతి నిలయం, మార్గదర్శక కేంద్రం. ఇందులో ప్రవే శించక ముందు స్నానం చెయ్యటం ప్రవక్త (స) సదాచారం. ఈ నగరంలో మంచి కార్యాల ప్రతిఫలం చాలా ఎక్కువ. అలాగే పాపాల శిక్ష కూడా చాలా కఠినమైనదే. కనుక ఇక్కడ ఉన్నన్ని రోజులు పుణ్యకార్యాలే చెయ్యాలి. పాపాలకి ఒడిగట్ట కూడదు. ఈ నగరాన్ని హరమ్ అని కూడా అంటారు. కనుక హరమ్ సరిహద్దుల్లో ఇహ్రాం ధరించిన వారైనా, ధరించని వారైనా వేటాడటం నిషిద్ధం. ఒకవేళ వేటాడి జిబహ్ చేసినా అది హలాల్ అవ్వదు. హరమ్ పరిసరాల్లో గల చెట్లను, గడ్డిని అనవసరంగా పెరక కూడదు. క్రింద పడి ఉన్న వస్తువుని మంచి ఉద్దేశ్యంతో తప్ప ముట్టుకోకూడదు.
కాబా పరదా
కాబాపై పరదా వేసిన మొట్టమొదటి వ్యక్తి హజ్రత్ ఇస్మాయీల్ (అ). పూర్వం ముహర్రం 10వ తేదీన పరదా మార్చేవారు. మళ్ళీ ఖుర్భానీ చేసేరోజు మార్చనా రంభించారు. మళ్ళి జుల్‌ఖఅదలో మార్చేవారు. ప్రస్తుతం అరఫా రోజున మారుస్తు న్నారు. పూర్వం పరదా కాబా అర్ధ భాగానికే ఉండేది.
మొదట తెల్లని సిల్కు పరదాని కప్పిన వారు మామూన్ రషీద్. పసుపు సిల్కు పరదాని కప్పినవాడు ముహమ్మద్ బిన్ సబక్తకీన్. పచ్చని సిల్కు పరదాని కప్పినవాడు నాసిరుల్ అబ్బాసి. తరువాత నల్లని పరదా కప్పడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే రంగు పరదాను తొడిగిస్తున్నారు.
ఇస్లాం సంపూర్ణమైన తరువాత ఈ పరదా ఈజిప్టులో తయారయ్యేది. ఇప్పుడు నల్ల రంగు పూసిన స్వచ్ఛమైన పట్టుతో తయారు చేయబడుతోంది. ఈ పరదాపై బంగారు తీగలతో ఖుర్‌ఆన్ ఆయతులు లిఖించ బడ్డాయి. ఈ పరదా ఎత్తు 14 మీటర్లు చుట్టు కొలత 47 మీటర్లు. 3 మీటర్ల క్రింద 95 సె.మి వెడల్పు గల పట్టిపై ఖుర్‌ఆన్ ఆయ తులు లిఖించ బడ్డాయి. కాబా తలుపులపై ఉన్న పరదా ఎత్తు 71/2 మీటర్లు. వెడల్పు 4 మీటర్లు దానిపై ఖుర్‌ఆన్ ఆయతులు బంగారు తీగలతో లిఖించబడ్డాయి. ఈ పరదా తయారు చెయ్యటానికి అయ్యే ఖర్చు 170 లక్షల సవూది రియాళ్ళు. అంటే భారత కరెన్సీలో సుమారు 22 కోట్లన్నమాట. ఈ పరదా తయారిలో సంవత్సరంపాటు 240 మంది కార్మికులు పని చేస్తారు. ఈ పరదా కోసం ప్రత్యేకంగా కిస్వతుల్ కాబా పేరుతో ఓ కంపెనీ మక్కాలోనే ఉంది. ఈ పరదా కొరకు ఉపయోగించే పట్టు 670 కిలోలు. ఈ పరదాలో ఉపయోగించే వెండి – బంగారు 120 కిలోలు.
హజ్ అంటే…
హజ్: ఇంటిని వదలడం, బంధుమిత్రులకు దూరమవడం, కృపాకరుడి దరికి చేరడం, మృత్యువును గుర్తు చేసుకోవడం, అనుగ్రహాలు వర్షంలా కురిసే శుభప్రదమైన ఇంటి వైపునకు పయనించడం.
హజ్: అక్కడికి షైతాన్ కూడా వస్తాడు. అతని సైన్యమూ ఉంటుంది. హద్దులు మీరే వారూ ఉంటారు. ప్రజలందరూ కలుస్తారు. ప్రతిజ్ఞ మళ్ళీ ధృవ పరచడం జరుగుతుంది ప్రతిజ్ఞకు సాక్ష్యమూ తీసుకోబడుతుంది.
ఇహ్రాం: అలంకరణను వదలటం, కఫన్ మాదిరి వస్త్రాన్ని ధరించడం, మృత్యువుకై సదా సిద్ధమవటం, బీదవారిలా కనిపించటం, ఏక దైవారాధనా భావాన్ని మరింత పటిష్టం చెయ్యటం, గుడ్డలే కాక మనసుని అన్ని మాలిన్యాల నుండి కాపాడుకోవటం,
సత్య సందేశాన్ని అందజేస్తామని సంకల్పించుకోవటం, కష్టాల్ని బాధల్ని కలసికట్టుగా ఎదుర్కోవటం, సత్కార్యాల్లో ఒండొకరికి చేయూత నివ్వటం.
తల్‌బియా: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్క్, లా షరీక లక. ఇది అల్లాహ్‌ా ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే నినాదం. ఇది మంచిని పెంచే సూత్రం. చెడును నివారించే మహాస్త్రం. విన్నాము, విధేయులమయ్యాము, హాజరయ్యాము అన్న మాటకి నిర్వచనం.
తవాఫ్ : తవాఫ్ చేస్తూ జీవితం కూడా ఇలాగే ఆగని పయనం అని గుర్తించటం, అను గ్రహాలు ప్రసాదించమని కోరటం, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము, అలసి పోయాము, మమ్మల్ని క్షమించు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవాన్ని కోరడం.
సయీ: ఆజ్ఞాపాలన, అమ్మ (హాజిరా) అడుగుజాడల్లో నడవటం, అల్లాహ్ ప్రసన్నతకై పరుగిడటం. సయీ అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. సత్పలితాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యాన్ని పదింతలు చేస్తుంది. పాపాలని కడిగివేస్తుంది. స్వర్గపు హోదాలను పెంచుతుంది.
అరఫాలో విడిది: హష్ర్ మైదానాన్ని తలపించే సువిశాలమైన భూమి. స్పష్టంగా నీలాకాశం. అల్లాహ్ నామ స్మరణలో లీనమైన మనసు… రేపటి బహుమానం కోసం ఉబలాటం. కాలం చుట్టివేయబడింది. సమయం ఇమిడి పోయింది. చరిత్ర పునరావృ తమయింది. దాగినది బహిర్గతమయింది. ప్రపంచం నోరు మూసుకుంది. సప్తలోకాలు తదేకంగా ఈ దృశ్యాన్ని తిలకిస్తున్నాయి. సత్యం వచ్చేసింది. అసత్యం నిష్క్రమించింది. అజ్ఞానం తొక్కివేయబడింది. అపమార్గాలు మూసి వేయబడ్డాయి.
రమీ: అసత్యాన్ని విసిరివేయటం! అసత్యాన్ని తరిమి కొట్టడం! పాశవిక ప్రవృత్తిని వదలివేస్తానని ప్రతిన బూనటం! ఏమీ లేక పోయినా ఈ చిన్న చిన్న కంకర రాళ్ళతో దుష్ట శక్తులపై పోరాడుతానని ప్రతిజ్ఞచెయ్యటం! స్వార్థపరుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, దాగి ఉన్న దొంగలనీ అంతం చేసే వరకూ నిద్రపోనని వాగ్దానం చెయ్యటం!
హల్ఖ్: పాపాలని వదలి వేస్తున్నానని తప్పులతో నిండిన శరీరాన్ని శుద్ధ పరచుకుం టాననీ, ఎలాగైతే తల వెంట్రుకల్ని తీసేసానో అలాగే తన జీవితంలో ఉన్న లోపాల్ని దూరం చేసుకుంటాననీ, అవసరమైతే తలనే పణంగా పెట్టగలనని సంకేతం ఇవ్వటం.
నహ్ర్: త్యాగధనుడు హజ్రత్ ఇబ్రాహీం (అ)కు అనుసరణగా, చెడు మనస్తత్వానికి వ్యతి రేకంగా, తండ్రి ఆజ్ఞాపాలనకు గుర్తుగా, కొడుకు ఇస్మాయీల్ (అ) వినయానికి ప్రతీకగా ఇచ్చే ఖుర్బానీ.