Originally posted 2013-04-24 14:54:42.
2.5 పరిశుభ్రత రకాలు:
పరిశుభ్రత రకాలు
ఘనపాటి అశుద్ధత నుండి శుద్ధిపొందటం తేలికపాటి అశుద్ధత నుండి శుద్ధి పొందటం
ముట్టుకునేది,ముట్టుకోనిది అశుద్ధ రకాలు మల విసర్జన
ఐనియ్య నజాసత్ ముగల్లజా మూత్ర విసర్జన
హుక్మియ్య నజాసత్ ముతవస్సితా
నజాసత్ ముఖప్ఫఫహ్
పరిశుభ్రత రెండు రకాలు:
(అ) ఘనపాటి అశుద్ధత నుండి శుద్ధి పొందడం
(ఆ) తేలికపాటి అశుద్ధత నుండి శుద్ధి పొందడం
2.5.1 పెద్దదయిన అశుద్ధత నుండి శుద్ధి పొందడం:
నజస్ అంటే భాషాపరంగా మురికి,మాలిన్యం ప్రతి విధమయినటువంటి అశుద్ధత.
షరీయతు పరంగా నమాజు నెరవేరడానికి అడ్డు తగిలే అశుద్ధత, రక్తం, మూత్రం వంటివి.
నజాసతె ఐనియ్యా: కంటికి కనబడే సహజంగా మనిషి అసహ్యించుకునే అపరిశుద్ధత. రంగు,వాసన వంటి స్పష్టమైన గుణం కలిగి ఉండేది. ఉదాహరణకు మలం, మూత్రం, రక్తం.
నజాసతె హుక్మియ్యా: మన కంటికి కనబడకుండా కేవలం షరీయతు ద్వారా మాత్రమే అపరిశుభ్రమ యినదని తెలిసే అశుద్ధత. తనలోని వాసన, రంగును కోల్పోయి ఎండబారి కనబడకుండా ఉండే ప్రతి అశుద్ధత. ఉదాహరణకు: బట్టలకు మూత్రం అంటుకుంది కాని ఎండిపోవడం వల్ల దాని తాలూకు ఆనవాళ్ళు కనబడకపోవడం.
అశుద్ధత రకాలు వాటి నుండి శుద్ధి పొందే విధానం:
1. నజాసతె ముగల్లజా: కుక్క, పంది సంబంధించిన అశుద్ధత. ఇవి అశుద్ధం అవడానికి ఆధారం ఏమిటంటే ఇతర అశుద్ధాల వలే వీటిని ఒకసారి నీటితో శుభ్రపర్చడం సరిపోదు.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ఒక వేళ మీ పాత్రల్ని కుక్క ఎంగిలి చేస్తే వాటిని ఏడుసార్లు కడగాలి. మొదటసారి మట్టితో కడగాలి. ఇలా చేస్తే అవి శుభ్రమవుతాయి.” (ముస్లిం 279)
శుద్ధి పొందే విధానం:
మురికి పడ్డ ప్రదేశాన్ని ఏడుసార్లు, వాటిలో ఒకసారి మట్టితో కడగటం ద్వారా శుద్ధతను పొందగలం. అశుద్ధత ఐనియ్యాకు సంబంధించినదయినా, హుక్మియాకు సంబంధించినదయినా అది శరీరం, బట్టలు, స్థలం మీద ఉన్నా సరే. ఇదే ఆదేశం వర్తిస్తుంది. కుక్క, పందిని తీసుకోవడంలో గల ఆంతర్యం ఏమిటంటే ఈ రెండూ పరమ అశుద్ధమయినవి గనక.
2. నజాసతె ముఖఫ్ఫఫా: రెండేండ్లు నిండని కేవలం పాలు మాత్రమే త్రాగే పసికందు మూత్రం. అది తేలికపాటిది అనడానికి ఆధారం దాని మీద నీటి తుంపరలు చల్లడం. క్రింది హదీసులో చూడండి:
”ఉమ్మెఖైస్ బిన్తె మిహ్సన్(ర) పాలు తప్ప ఇతర ఆహారం తీసుకోని తన పసికందుని తీసుకుని దైవప్రవక్త(స)వారి సన్నిధికి వచ్చారు. ఆ బాలుడు ఆయన(స) దుస్తులపై మూత్రం పోసేశాడు, అప్పుడు ఆయన(స) నీరు తెప్పించి చల్లారు కాని ఆ బట్టను కడగలేదు. (బుఖారి 2021, ముస్లిం 287)
శుద్ధిపొందే విధానం: అశుద్ధమయిన ప్రదేశంపై నీటి తుంపరలను చల్లడం ద్వారా శుద్ధి పొందవచ్చు.
3.నజాసతె ముతవస్సిత: మధ్యే రకపు అశుద్ధత. కుక్క,పంది ఏమి తినని, బాలుడి అశుద్ధతను మినహా మిగతావన్నీ దీని క్రిందికి వస్తాయి.
అ) మద్యం, ద్రవ రూపంలోగల ప్రతి మత్తు పదార్థం.
”ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసంవాడే బాణాలు- ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్ చేష్టలు, కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు.” (మాయిదా: 90)
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్(ర)కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు ”మత్తునిచ్చే ప్రతిదీ మద్యమే. ప్రతి విధమయినటువంటి మద్యం నిషిద్ధమే. ( ముస్లిం 2003)
ఆ) శవం: షరీయతు పద్ధతిని అనుసరించి మినహా మరణించిన ప్రతి జీవి ఈ కోవలోకి వస్తుంది. అలాగే బ్రతికున్న జంతువు శరీరం నుండి కోయబడిన భాగం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇవి నిషిద్ధం. అదేలాగు విగ్రహాల ముందు బలివ్వబడిన పశువులు, అల్లాహేతర పేరుతో జిబహ్‌ా చేయబడిన పశువులు సయితం శవం క్రిందికే వస్తాయి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ”మృత పశువు రక్తం పంది మాంసం, అల్లాహ్ పేరు గాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది మీ కొరకు నిషేధించబడ్డాయి.” (అల్ మాయిదా 3)
వీటి నుండి మనిషి, చేప, మిడతలు మినహాయించబడ్డాయి.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్(ర) కథనం: ”ముస్లిం సజీవంగా ఉన్నప్పుడు గాని, మరణించిన మీదటగాని అశుద్ధం కాడు”. (బుఖారి కితాబుల్ జనాయిజ్)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: మీ కోసం రెండు శవాలు, రెండు రక్తాలు ధర్మసమ్మతం చేయబడ్డాయి. రెండు శవాలు చేప, మిడతలు. రెండు రక్తాలు గుండెకాయ, కాలేయం”. (ఇబ్నెమాజా 3314)
ఇ) ద్రవ రూపంలో ఉన్న రక్తం మరియు చీము.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”ఓ ప్రవక్తా! వారికి చెప్పు (వహీద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం….” (అన్‌ఆమ్: 145)
ఈ) మనిషి మరియు నిషిద్ధ జతువుల మలమూత్రాలు:
అనస్ (ర) కథనం: ఒక పల్లెవాసి మస్జిద్‌లో మూత్రం విసర్జించాడు. సహాబా అతన్ని దండించడానికి లేవగా వారినుద్దేశించి ఆయన(స) ఇలా అన్నారు:”అతన్ని మూత్రం పోసుకోనివ్వండి. తర్వాత దానిమీద ఒక బింద నీళ్ళు కుమ్మరించండి”. (బుఖారి 5679)
ఎ) బ్రతికున్న జంతువు యొక్క ఏదైనా అవయవం విరిగినదయితే లేదా కోయబడినదైతే అవి అశుద్ధం.
”దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు:”బ్రతికుండగా పశువుల నుండి కోయబడినది ముర్దార్ అనబడుతుంది.” (హాకిమ్)
అయితే వాటి గోళ్ళు, కొమ్ములు, వెంట్రుకలు లాంటి రక్తం ప్రవహించని భాగాలు మాత్రం పరిశుభ్రమయినదే.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ” ఇంకా వాటి ఉన్నితోనూ,రోమాలతోనూ,వెంట్రుకలతోనూ ఆయన (అల్లాహ్) ఎన్నో సామానులకు కొంత కాలం వరకూ ఉపయోగపడే వస్తువులను తయారు చేశాడు.” (నహ్ల్ 80)
ఏ) నిషిద్ధ జంతువుల పాలు. గాడిదలాంటివి వాటి మాంసంలాగే వాటి పాలు కూడా నిషిద్ధమే.
వీటి నుండి శుద్ధి పొందే మార్గం:
ఈ అశుద్ధత దాని మీద నుంచి నీరు ప్రవహించి దాని ప్రభావం తొలిగిపోతే రంగు,రుచి,వాసన నశిస్తే – ఆ అశుద్ధత ఐనియా అయినా, హుక్మియా అయినా పరిశుభ్రమయిపోతుంది. అది శరీరం మీదున్నా, బట్ట, స్థలం మీదున్నా సరే. కొన్ని వేళల్లో రంగు తొలగకపోయినా ఫరవాలేదు. ఉదాహరణకు రక్తం.
చచ్చిన జంతువుల తోలు శుభ్రపర్చడం:
కుక్క మరియు పంది చర్మాల్ని మినహాయించి ఇతర చచ్చిన జంతువుల చర్మాల్ని దిబాగ్ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా శుద్ధ పర్చవచ్చు. దిబాగ్ అంటే చర్మంపై గల తడి పదార్థాన్ని కొన్ని పదార్థాలను కలిపి నీటిలో ఉడకబెట్టడం ద్వారా దూరం చేయడం. తర్వాత మళ్ళీ ఆ చర్మాన్ని మంచినీటితో కడగాలి.
”దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”చర్మం దిబాగ్ చేయబడిన మీదట పరిశుద్ధం అవుతుంది”. (ముస్లిం 366)
మినహాయించబడిన కొన్ని అశుద్ధాలు:
(అ) బట్టకు శరీరానికి తేలికపాటి మూత్రం అంటిన ప్రదేశం మీద నీటి తుంపర్లు చల్లుకోవడం.
(ఆ) లేలికపాటి రక్తం మరియు చీము ఈగల లద్దె.
(ఇ) గాయాల చీము, రక్తం అది ఎక్కువ శాతంలో ఉన్నా, అయితే అవి అదే మనిషి గాయానికి చెందినవై ఉండాలి.
అందులో అతని ప్రమేయం ఉండకూడదు.
(ఈ) పాలు పితికే సమయంలో పాలలో పడే తేలిక పాటి పేడ.
(ఉ) చేపల లద్దె, పక్షుల రెట్ట. ముఖ్యంగా అవి ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో. ఉదాహరణకు మక్కా మదీనాల్లో.
(ఊ) తక్కువ శాతంలో బట్టలకు అంటే రక్తం.
(ఎ) మాంసానికి అంటుకుని ఉండే రక్తం.
(ఏ) వాంతి ద్వారా అశుద్ధమయిన బాలుడి నోరు. అమ్మ దగ్గర పాలు త్రాగేటప్పుడు.
(ఐ) రక్తం లేని చచ్చిన పురుగులు, ఈగ, తేనెటీగ, చీమ, అవి తమంత తాముగా ద్రవ పదార్థంలో పడితే. అవి పడటం వల్ల దాని స్థితి మారకూడదు.
అబూహురైరా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు:”మీలోని ఎవరి పాత్రలోనయినా ఈగ పడిపోతే దాని పూర్తిగా ముంచి తీసిపారేయండి. నిశ్చయంగా దాని ఒక రెక్కలో స్వస్థత ఉంటే, మరో రెక్కలో రోగం ఉంటుంది.” (బుఖారి 5445)
2.5.2 ఇస్తిన్జా
మలమూత్ర విసర్జన తరువాత శుద్ధి పొందడానికి తీసుకునే చర్యలనే ‘ఇస్తిన్జా’ అంటారు. ఇది ప్రతి ముస్లింపై తప్పనిసరి.
ఇస్తింజా చేసే పద్ధతి:
సాధారణమైన నీటితో ఇస్తింజా చేసుకోవచ్చు. అలాగే జడ పదార్థాల ద్వారా కూడా అశుద్ధతను దూరం చేసుకోవచ్చు. ఉదాహరణకు రాళ్ళు, మట్టి పెడ్డలు, పేపరు తేమను పీల్చే వస్తువులు. శుద్ధి పొందడానికి మొదట రాళ్ళు లేదా మట్టి పెడ్డలు ఉపయోగించాలి. తర్వాత నీటితో ఇస్తింజా చేయడం సాంప్రదాయక విధానం. ఎందుకంటే మట్టి పెడ్డలు అసలు అశుద్ధతను దూరం చేస్తే నీరు దాని తాలూకు ఆనవాళ్ళను దూరం చేస్తుంది.
ఇస్తింజా చేసేటప్పుడు కొన్ని నియమాలు:
– రాళ్ళుగానీ, మట్టి పెడ్డలుగాని మూడుకి మించకూడదు.
– ఒకవేళ శుద్ధత పూర్తిగా లభించకపోతే పెంచవచ్చు కూడా. బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు అయిదు,ఏడు వగైరా.
అనస్ బిన్ మాలిక్(ర)కథనం: దైవప్రవక్త(స) హమామ్‌కి వెళ్ళేవారు, నేను నాలాంటి మరో బాలుడు నీటిని తీసుకెళ్ళేవారము ఆయన నీటితో ఇస్తింజా చేసుకునేవారు”. (బుఖారి 149, ముస్లిం 271)
ఆయిషా(ర)గారి కథనం: దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు:”మీలో ఎవరయిన మల విసర్జన కోసం వెళితే తనతో పాటు మూడు రాళ్ళు తీసుకెళ్ళాలి. అవి నీటికి సరిసమానమవుతాయి.” ( అబూదావూద్ 40)
అబూహురైరా(ర)కథనం: ఈ ఆయతు ఖుబా వాసులకోసం అవతరించింది. ”బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడేవారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు” (అత్‌తౌబా 108) వారు ఇస్తింజాలో మట్టి పెడ్డలను ఉపయోగించడంతో పాటు నీరు కుడా ఉపయోగించేవారు. అన్నారు. (అబూదావూద్ 44, తిర్మిజి 3099, ఇబ్నుమాజ 357)
ఇస్తింజాలో వాడకూడనివి:
నజాసతే ఐనియాకు చెందిన ఏ వస్తువుతోనూ ఇస్తింజా చేయకూడదు. ఎందుకంటే అవి అశుద్ధతను మరింత అధికం చేసే అవకాశం ఉంది. అలాగే ఆహారంగా మనిషి తీసుకునే పదార్థాల నుండి ఇస్తింజా పొందడం హరామ్. ఉదాహరణకు రొట్టి, బన్ వగైరా. అలాగే జిన్నుల ఆహారమయిన పేడ మరియు ఎముకలతో ఇస్తింజా పొందకూడదు. అలాగే గౌరవప్రదమయిన ఏ వస్తువుతోనూ ఇస్తింజా పొందకూడదు. ఉదాహరణకు జంతువుతో ముడిపడిన ఉన్న ఏ అవయం-గుండెకాయ, కాలు, మొదలయినవి. ఇక మనిషి దేహభాగాలు మరింత గౌరవప్రదమయినవి. ఒకవేళ తినబడే పశువుల నుండి వేరు చేయబడిన వెంట్రుకలు, పరిశుభ్రపరచబడిన చర్మం వాడినట్లయితే చెల్లుతుంది.
బ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్(ర) కథనం: దైవప్రవక్త(స) కాలకృత్యాలకు వెళుతూ నన్ను మూడు రాళ్ళు తీసుకురావలసిందిగా ఆదేశించారు. నేను రెండురాళ్ళు మాత్రమే పొందాను. మూడో రాయిని బదులు నేను ఎండిపోయిన పెడను తీసుకెళ్ళాను. ప్రవక్త(స) రెండు రాళ్ళు మాత్రమే తీసుకొని పేడను పారవేశారు. మరియు ‘ఇది రక్స్’ అని అన్నారు. ( బుఖారి 155)
ఇస్తింజా ఆదాబులు (మర్యాదలు)
1.కాలకృత్యాలు తీర్చుకునే స్థలానికి సంబంధించిన సమాచారం.
ప్రజలు నడిచే దారిలో, కూర్చునే ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయరాదు. అలాగే కన్నాల్లో,బిలముల్లో, గట్టి నేలపై, గోడల మీద మూత్ర విసర్జన చేయకూడదు. ఎందుకంటే కన్నాల్లో పాము,తేలు వంటి ప్రమాదకరమైన పురుగులు పుట్రా ఉండవచ్చు. అవి వెలుపలికి వచ్చి హాని తలపెట్టవచ్చు. (గట్టి నేలపై మూత్ర విసర్జన చేయడం ద్వారా దాని తాలూకు తుంపర్లు పడే ప్రమాదముంటుంది) అదే విధంగా పండ్లున్న చెట్టు క్రిందగానీ, నిల్వ ఉన్న నీళ్ళల్లోగానీ మూత్ర విసర్జన చేయకూడదు.
అబూహురైరా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: శపించబడే రెండు విషయాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.” అన్నారు. అది విన్న సహాబా: ”శపించబడే రెండు” అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. ”ప్రజలు నడిచివెళ్ళే దారిలో లేదా వారు కూర్చునే నీడలో కాలకృత్యాలు తీర్చుకోవడం. అన్నారు. (ముస్లిం 269)
అబ్దుల్లాహ్ బిన్ సర్‌జిస్(ర)కథనం : దైవప్రవక్త(స) కన్నాల్లో బిలముల్లో మూత్రవిసర్జన చేయరాదని వారించారు. (అబుదావూద్ 29)
2.కాలకృత్యాలు సంబంధించిన ఆదాబులు:
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వేళ్ళే వ్యక్తి వెళ్ళేటప్పుడు ఎడమకాలు ముందుంచి వెళ్ళాలి. అలాగే తిరిగి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి రావాలి. తనతో అల్లాహ్ నామం లిఖించబడి ఉన్న ఏ వస్తువునూ తీసుకెళ్ళకూడదు. అలాగే కాలకృత్యాలకు వెళ్ళి, వచ్చేటప్పుడు పఠించవలసిన దుఆలు చదవడం అభిలషణీయం.
అనస్(ర) కథనం: దైవప్రవక్త(స) కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డిలో ప్రవేశించేముందు ”అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్” అని పఠించేవారు. (బుఖారి 142, ముస్లిం 375)
ఆయిషా(ర) కథనం: దైవప్రవక్త(స) మరుగుదొడ్డి నుండి బయటికి వస్తూ ”గుఫ్రానక” అనే వారు. (అబూదావూద్ 30)
3. దిశకు సంబంధించిన ఆదేశం:
కాలకృత్యాలు తీర్చుకునే వ్యక్తి, తన వీపును గాని, ముఖాన్నిగాని ఖిబ్లా వైపు ఉండేలా కూర్చోకూడదు. మైదాన ప్రదేశంలో ఉండి ఎలాంటి అడ్డులాంటిది లేకపోతే ఏదయిన వస్తువును అడ్డుగా పెట్టుకుని ఆ వస్తువుకి 150 సె.మీ. దూరంలో కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఒకవేళ కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం మరుగుదొడ్లు లాంటివి నిర్మించబడి ఉంటే ఖిబ్లా దిశకు కూర్చునే అనుమతి ఉన్నప్పటికీ అయిష్టకరమయినదే.
అబూ అయ్యూబ్ అన్సారీ(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”మీరు కాలకృత్యాలు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఖిబ్లా వైపు ముఖాన్ని గాని, వీపుని గాని చేసి కూర్చోకండి. వేరే దిశగా కూర్చోండి. (బుఖారి 381, ముస్లిం264)
4. కాలకృత్యాలు తీర్చుకునే వ్యక్తికి సంబంధించిన విషయాలు:
– అతను ఎడమకాలి ఆధారంగా కోర్చుని కుడికాలిని కాస్త ఎత్తి ఉంచాలి.
– ఆకాశం వైపు గాని, మర్మాంగం వైపుగాని, దాన్నుండి వెలువడే మలమూత్రాల వైపుగాని చూడకూడదు. ఎందుకంటే ఒక ముస్లింకి అవి ఎంతమాత్రం శోభించని విషయం గనక. అలాగే మలమూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మాట్లాడటం అయిష్టకరం (మక్రూహ్). మాట్లాడకూడదన్న నియమం ఆధారంగా తినడం, త్రాగడం కూడా మక్రూహ్‌ాగానే భావించబడుతుంది.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్(ర) కథనం: దైవప్రవక్త(స)వారు మూత్రం విసర్జిస్తున్నప్పుడు అటుగా వెళుతున్న ఓ వ్యక్తి
ఆయన(స)కు సలామ్ చేశాడు. అయితే ఆయన(స) అతనికి సమాధానం ఇవ్వలేదు.” (ముస్లిం 370)
అబూ సయీద్(ర) కథనం: దైవప్రవక్త(స)వారు ఇలా చెబుతుండగా నేను నిన్నాను: ”ఇద్దరు వ్యక్తులు కాలకృత్యాలు తీర్చుకు నేందుకు వెళ్ళి మర్మాంగాలను తెరుచుకుని పరస్పరం మాట్లాడుకోవడం అల్లాహ్‌కు కోపాన్ని తెప్పిస్తుంది.”అన్నారు. (అబూదావూద్ 15)
– ఎడమ చేతితో ఇస్తింజా: కాలకృత్యాలు తీర్చుకునే వ్యక్తి నీటితో శుద్ధి పొందెందుకు ఎడమ చేయిని వాడాలి. ఒకవేళ రాళ్ళు, మట్టి పెడ్డలతో శుభ్ర చేయాల్సి వచ్చి మర్మాంగాన్ని పట్టుకోవాల్సి వస్తే, కుడి చేతిలో మట్టి పెడ్డలను పట్టుకొని ఎడమ చేతితో మర్మాంగాన్ని పట్టుకొని శుద్ధి పొందాలి.
అబూ ఖతాదా(ర)కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు:”మీలో మూత్ర విసర్జన చేసే వ్యక్తి తన కుడి చేత్తో మర్మాంగాన్ని ముట్టుకోవడంగాని, ఇస్తింజా చేయడంగాని చేయకూడదు.” (బుఖారి 153, ముస్లిం 267)
2.5.3 అశుద్ధత నుండి శుద్ధి పొందడం:
దేహ అవయవాల ద్వారా ఏర్పడే అశుద్ధత నమాజును భంగపరుస్తుంది. అలాగే ఈ విధమయినటువంటి అశుద్ధత వల్ల వుజూ కూడా భంగం అవుతుంది. వీటి గురించి స్నానం(గుసుల్) తప్పనిసరి చేసే విషయాల గురించి తర్వాత చర్చిస్తాము.
హదస్ రకాలు:
1. హదసె అస్గర్: మనిషి శరీరంలోని ఏ భాగం నుండి అయినా రక్తం,చీము కారడం. మలమూత్రాలు అపానవాయువు వెలువడటం. వీటివల్ల నమాజు నెరవేరదు. ఈ విధంగా ఏర్పడిన అశుద్ధతను వుజూ చేయడం ద్వారా తొలగిపోతుంది. మనిషి నమాజు కోసం సిద్ధమవుతాడు.
2. హదసె అక్బర్: పెద్దదయిన అశుద్ధత. దీని మూలంగా సయితం నమాజు నెరవేరదు. గుసుల్ చేయనిదే ఈ అశుద్ధత దూరం కాదు. పూర్తిగా స్నానం చేసిన మీదటే మనిషి నమాజు చేయగలడు.
పరీక్ష 4
సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(ఎ) మరుగుదొడ్డి (బి) చేప (సి) గుండెకాయ (డి) దారి
1. చచ్చిన ప్రతిది అశుద్ధమే. మనిషి శవం, మిడతలు మరియు…………………తప్ప.
2. మూత్ర విసర్జన నిషేధించబడిన వాటిలో నిలచి ఉన్న నీరు, కన్నాలు, జంతువులు, మరియు…………..
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి:
3. సారాయి, మత్తు పదార్థాలు అశుద్ధమయినవి.
(ఎ) ముగల్లజా
(బి) మధ్య రకం
(సి) ముఖప్ఫఫా
4.వీటిలో ఒకటి ఇస్తింజా ఆదాబుల్లో వస్తుంది.
(ఎ) నిద్రపోవడం
(బి) తినటం
(సి) మాట్లాడకుండా ఉండటం.
5. ఇస్తింజా కోసం ………………………. వినియోగించడం సబబు కాదు.
(ఎ) రాయి
(బి) క్లీనిక్స్
(సి) ఎముక
6. హదసె అస్గర్ ద్వారా నమాజు భంగమవుతుంది. దీన్ని వుజూ ద్వారా తొలగించుకోవచ్చు.
(ఎ) అవును
(బి) కాదు.
7.ఇస్తింజా కోసం రాళ్ళను వాడటం అనుమతించబడినది.
(ఎ) అవును
(బి) కాదు.