రమజాను మాసం: మన సజ్జన పూర్వీకులు

 

ఉపవాసం - అది దైవభీతిపరుల (ముత్తఖీన్‌ల)కు ముకుత్రాడు. అది సత్య యోధులకు కవచం. అది ధర్మ పరాయణులకు, అల్లాహ్‌ ప్రియతమ దాసులకు ఉద్యాన వనం. దాసుడు చేసే సకల సత్కర్మల్లో  కేవలం అది మాత్రమే అల్లాహ్‌కు  సొంతమయినది.

ఉపవాసం – అది దైవభీతిపరుల (ముత్తఖీన్‌ల)కు ముకుత్రాడు. అది సత్య యోధులకు కవచం. అది ధర్మ పరాయణులకు, అల్లాహ్‌ ప్రియతమ దాసులకు ఉద్యాన వనం. దాసుడు చేసే సకల సత్కర్మల్లో కేవలం అది మాత్రమే అల్లాహ్‌కు సొంతమయినది.

రమజాను మాసం, ఇందులో ఖుర్‌ఆన్‌ అవతరింపజేయబడింది. అది మానవాళికి అసాంతం మార్గదర్శకం. అతి స్పష్టమయిన ఉపదేశాలు అందులో ఉన్నాయి. అవి రుజమార్గాన్ని చూపుతాయి. సత్యాసత్యాల వ్యత్యాసాన్ని విడమరచి ముందుంచుతాయి. కనుక ఈ నెలనుగన్న వ్యక్తి తప్పనిసరిగా ఈ నెల సాంతం ఉపవాస వ్రతాలు పాటించాలి”. (అల్‌ బఖరహ్‌: 186)

రమజాను మాసం. అది వినయ విధేయతల మాసం. దానాధర్మాల మాసం. తరావీహ్‌ాల మాసం. ఖుర్‌ఆన్‌ పారాయణాల మాసం. ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవాల్సిన మాసం. ఖుర్‌ఆన్‌ స్వర్ఘకార ధ్వనుల్ని సమస్త మానవాళికి చేరవేసి వారి బంగారు భవిష్య త్తుకు  బాట వేయవలసిన మాసం.

అది సహనం, నిగ్రహం చూపవలసిన మాసం. అవసరారులను ఆదుకోవాల్సిన మాసం. అగత్యపరులను, అభాగ్య జీవులను ఆదుకోవాల్సిన మాసం. అనాథలను అక్కున చేర్చుకోవాల్సిన మాసం. వితంతువుల బాగోగులు చూడాల్సిన మాసం. అది శుభాల శ్రావణం. అధి ప్రకాశ తోరణం. అది కారుణ్యవారుణి. అది అనుగ్రహ వర్షిణి. అది వరాల వాహిని. అది విశాంత ప్రశాంతతలో ప్రభాత గీతిక. అది విశ్వాస జన సమా జానికి చైతన్య దీపిక.

మహాశయుల్లారా! శుభాల సరోవరం, సత్కారాల సమాహారం, వరాల వసంతం, కరుణా సాగరం  అయిన రమజాను మాస రాకకు సాక్ష్యంగా ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. ఏ ఒక్క ద్వారం మూసి వేయబడదు. నరక ద్వారాలు మూసి వేయ బడతాయి, ఏ ఒక్క ద్వారం తెరువబడదు. దుష్టులయిన షైతానులను బంధించడం జరుగుతుమది. ప్రతి రోజు ఇద్దరు దైవ దూతల పిలుపు తో ముస్లిం భక్త జనంలో భక్తీప్రపతులు పొంగి పొర్లుతాయి. దైవ దూతల ఆ పిలుపు ఏమిటో తెలుసా? ‘యా బాగియల్‌ ఖైరి అఖ్బిల్‌’ – ఓ మేలు కోరేవాడా! ముందుకు సాగు, విజృభించు!! ఇంత కాలం చూపిన అలక్ష్యం చాలు. నిద్రావస్థ నుండి మేలుకో. నింగినున్నవాడు నీకు అనుగ్రహిం చిన రమజాను నెలవంక దర్శనం పూర్తయింది. పుణ్యకాలం ప్రారంభమయింది. మేలుకో! సత్కార్యాల సామగ్రిని కూడబెట్టుకో! దైవభీతి మూటను తోడు తీసుకో! నువ్వో బాటసారివి. ఇహలోకం కేవలం విశ్రాంతి స్థలం. నీవు ఇంకా ముందుకు సాగాల్సి ఉంది. ఇక్కడే అడిపోతే గమ్యం చేరుకో లేవు. గమ్యం మధ్యలో వచ్చే మజిలీలను గమ్యం అని భ్రమిస్తే నష్ట పోయేది నువ్వే. కష్ట పడేదీ నువ్వే. ”ఏమిటి? అల్లాహ్‌ా స్మరణతో విశ్వాసుల హృదయాలు కంపించే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” అని ఖుర్‌ఆన్‌ మనల్ని జాగుఉక పరుస్తోంది చూడు! ఇది పోటీల మాసం. ఉపవా సాల్లో పోటీ, తరావీహ్‌ాలలో పోటీ, ఖుర్‌ఆన్‌ పారాయణంలో పోటీ, దానాధర్మాలలో పోటీ. లైలతుల్‌ ఖద్ర్‌ అన్వేషణలో పోటీ. ఈ పోటీ సంవత్స రపు 12 నెలలు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగుతూనే ఉండాలి. అల్లాహ్‌ా ప్రసన్నత మనకు ప్రాప్తమయ్యేంత వరకూ. స్వర్గ ప్రవేశం మనకు దక్కేంత వరకూ.

మరో దూత ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ‘యా బాగియష్‌ షర్రి అఖ్సిర్‌’ – ఓ చెడును కోరుకునేవాడా! అగిపో!  నువ్విన్నాళ్ళు అల్లాహ్‌ా నామ విస్మరణకు లోనయి గడిపేసిన అన్య మాసాల్లాంటి మాసం కాదు ఇది. ఇది రమజాను మాసం. ఈ మాసంలో అల్లాహ్‌ా కారుణ్య కడలి నీ వద్దకు కదిలొచ్చింది. ఇప్పటి వరకు నీవు చేసిన నిర్వాకాలు చాలు. ఆగిపో! అల్లాహ్‌ా కారుణ్యం వైపు, భూమ్యాకాశాలంతటి విశాలమైన స్వర్గ వనాల వైపు సాగిపో! చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందు. క్షమాభిక్షను వేడుకో!  ప్రతి రాత్రి చివరి ఝామున – ”ఉదయం తప్పు చేసిన ఉన్నారా? పశ్చాత్తా పం చెందండి. నేను మీ పాపాలను మన్నిస్తాను. రాత్రి తప్పు చేసిన వారు ఉన్నారా? తౌబా చేసుకోండి నేను వారి పాపాలను మన్నించడమే కాక వాటిని పుణ్యాలుగా మార్చి వేస్తాను” అని యేడాది మొత్తం నిన్ను ఎంతో ప్రేమతో పిలుపునిచ్చిన నీ ప్రభువు ఈ మాసంలో మరింత అధిక కరుణ తో, అధిక క్షమాభిక్షతో నిన్ను తౌబా చేసుకోమని పిలుపునిస్తున్డాడు. ”తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న ఓ నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్య యెడల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ సకల పాపాలను మన్నిస్తాడు. నిశ్చయంగా ఆయన అమిత క్షమాశీలి, అపార దయాకరుడు”. (జుమర్:53)

గుర్తుంచుకో! ఈ మాసాన్ని పొంది కూడా పాప మన్నింపు చేయించుకోకుండా, ప్రభువు ప్రసన్నత పొందని వ్యక్తిపై దైవదూతల నాయకుడయిన జిబ్రీల్‌ అభిశాపాన్ని కురిపించగా ప్రవక్త నాయకులయిన ముహమ్మద్‌ (స) తథాస్తు! అన్నారు. అతనికి మించిన దౌర్భాగ్యుడు మరొకడు లేడన్నారు. ‘ఫ మన్‌ హరుమ ఖైరహా ఫఖద్‌ హరుమ’ – ఈ మాసపు మేలుకు నోచుకోని వ్యక్తి నిజంగా దురదృష్టవంతుడు.

అవును, మహాశయుల్లారా! శుభప్రదమయిన ఈ మాసంలో ఊపిరి పీల్చే వ్యవధి దొరికిన వారు, ఆరోగ్య స్తితిలో ఈ మాసాన్ని చేరుకున్నవారు నిజంగా గొప్ప అదృష్టవంతులు. వచ్చే యేడాది మనకు ఈ సువర్ణావకాసం లభిస్తుందో లేదో అని చింతించడంకన్నా, అంది వచ్చివ ఈ సువర్ణా వకాశాన్ని సద్వినియోగ పర్చుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రత్నించాలి.  మహాశయుల్లారా! ‘తఖబలల్లాహు మిన్నా వ మిన్‌కుమ్‌’ ఇది రమజాను మాసంలో సర్వత్రా వినిపించే శుభాకాంక్ష! దీనర్థం – అల్లాహ్‌ా మీ నుండి మా నుండి సత్కర్మలను స్వీకరించుగాక!  ఇది స్వయంగా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి అమృత పలుకు. ఈ  పలుకును పలికేందుకు మనం కనబర్చే శ్రద్ధ ఈ పలుకుని నిజంగా మన పాలిట అమృతం గా మలచుకునేందుకు కనబరుస్తున్నామా అన్నది ఎవరికి వారుగా వేసుకోవాల్సి ప్రశ్న. చేసుకోవాల్సిన ఆత్మ సమీక్ష. మనం ఏ స్థాయి పుణ్యాలు చేసినా, ఎన్ని సత్కార్యాలకు శ్రీకారం చుట్టినా అవి ప్రభువు సన్నిధిలో స్వీకారయోగ్యంగా పరిగణించబడనంత వరకూ ఫలప్రదం కాజాలవు. మనం చేసే ప్రతి పని, అనే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, చేసే వ్యవహారం, వ్యాపారం, వివాహం, విహారం, విరహం ఏదయినా సరే ఖుర్‌ఆన్‌ మరియు హథీసుకి అనుగుణంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడనాలి – ‘తఖబ్బలల్లాహు మిన్నా ఖీ మిన్‌కుమ్‌!’

ఇక సజ్జనులయిన మన పూర్వీకులు ఈ మాసాన్ని ఎలా గడిపేవారో కూడా తెలుసుకుందాం! సజ్జనులయిన మన పూర్వీకులు రమజాను రాక కోసం 6 నెలలు ముందు నుండే ఎదురు చూసేవారు. రమజాను నెలవంకను చూడగానే వారి సంతోషానికి హద్దు ఉండేది కాదు. అవును రమ జాను మాసం మనందరి పాలిట మహదానుగ్రహం. ఒక వ్యక్తికి వంద కోట్లు ఫలానా రోజు దొరుకుతాయి అని ఖచ్చితమయిన సమాచారం అందితే ఆ వ్యక్తి ఆ దినం కోసం కళ్ళలో కొవ్వొత్తులు వెలిగించుకొని ఎలాగయితే ఎదురు చూస్తాడో  అంతకాన్న ఎక్కువ ఆసక్తితో ఒ నిజమయిన విశ్వాసి రమజాను కోసం ఎదురు చూస్తాడు. చూడాలి కూడా.

ఎందుకంటే వరాలు కుండపోతగా కురిసే మాసం రమజాను గనక. మనిషి ఎంత కూడబెట్టుకున్నా ఏదోక నాడు అన్నింటి భూమి మీదే వదిలేసి కాటికి పయనమవ్వాల్సిందే, కాటి మట్టిలో కలిసిపోవాల్సిందే. అక్కడ మనిషి కూడబెట్టుకున్న వెండిబంగారాలుగానీ, వజ్రవైఢూర్యాలుగానీ, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఎత్తయిన భవనాలుగానీ, ఎంతో ప్రేమతో పెంచుకున్న దట్టమయిన తోటలుగానీ, పచ్చనయిన పొలాలుగానీ ఏవీ పనికి రావు, కేవలం సత్కర్మల సామగ్రి తప్ప. అలాంటి సామగ్రిని పుష్కలంగా మనకందించే మహిమాన్విత మాసం రమజాన్‌. అంతే కాదు ఈ మాసం ”ఫీహి లైలతున్‌” అందులో ఓ రాత్రి ఉంది. ఉంటే ఏమిటి? అన్నీ నెనలలో, అన్నీ వారాల్లో, అన్నీ రోజుల్లో ఉండే రాత్రేగా అంటున్నారా!? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ రాత్రికి సమానమయిన రాత్రి మరొకటి లేదు. అదే లైలతుల్‌ ఖద్ర్‌. ‘లైలతుల్‌ ఖద్రి ఖైరుమ్‌ మిన్‌ అల్ఫి షహ్ర్‌’ – అది వేయి మాసాలకన్నా ఘనతరమయిన రేయి. మాసాలంటే సామాన్య మాసాలనుకుందుదు, పొరబాటు; 84 సంవత్సరాలు నిర్విఘ్నంగా, నిరంత రాయంగా, నిరాటంకంగా ఆరాధనల్లో, అల్లాహ్‌ా నామస్మరణలో గడిపితే ఎంత పుణ్యం వస్తుందో దానికన్నా అధిక పుణ్యం ఈ ఒక్క రాత్రిని పొందితే లభిస్తుంది. ఈ రాత్రి పొందటం అంటే ఆషా మాషిగా, అల్లాటప్పగా పొందటం కాదు, భక్తిప్రపత్తులతో ఈ రాత్రని రమజాను చివరి భాగంలో తీవ్రంగా అన్వేషించాలి. ప్రవక్త (స) వారి గురించి మనకు అందే సమాచారం ప్రకారం చివరి థకం రాగానే ‘అహ్యా లైలహు, వ ఐఖజ అహ్లహు వ షద్ద మిఅజర్‌’ రాత్రిళ్ళు జాగారం చేసేవారు. తమ ఇంటిల్లిపాదిని మేల్కొలిపేవారు. నడుం బిగించేవారు. కంకణం కట్టుకునేవారు”.   (ముత్ఫఖున్‌ అలైహి)

ఈ కారణంగానే సజ్జనులయిన మన పూర్వీకులు రమజాను మాసం వెళ్ళిపోగానే దాని విరహంలో 6 నెలల వరకూ దుఃఖించేవారు. వచ్చే ఏడాది ఎక్కడ రమజాను మాసాన్ని పొందకుండానే ఈ లోకాన్ని వీడాల్సి వస్తుందేమోనని కంపించిపోయేవారు. నేటి మనలోని కొందరి పరిస్థితి ఎలా ఉందంటే, రమజాను వస్తుందంటే, అమ్మో! రమజాను వస్తొందిరా నాయనా! ముప్పూటలా మెక్కడానికి కుదరదు బాబోయ్‌!! అంటూ నిట్టూర్పు వదులుతున్నారు. రమజాను వెళ్లగానే హమ్మయ్యా! అరటూ ఉపశమనం చెందుతున్నారు. వీరి ప్రవర్తన చూస్తుంటే ఎలా ఉందంటే, రమజాను రాకతో అల్లాహ్‌ా షయాతీనల్‌ జిన్న్‌ని బంధించడానికి బదులు షయాతీనల్‌ ఇన్స్‌ అయిన వీరిని బంధించాడా? రమజాను వెళ్ళగానే ముక్తి పొందినట్లు ఫీలవుతున్నారనిపించక మానదు. వీరి దృష్టిలో రమజాను మాసం కూడా ఇతర మాసాల్లాంటి ఒక సాధారణ మాసమే. ప్రకృతి మొత్తం రమజాను రాకతో పులకించి పోతుంటే, మొత్తం సృష్టిలో అనేక మార్పులు చోటు చేసుకుంటుంటే, దివి వాసులే భువికి దిగి వస్తుంటే వీరి దరిద్రం వీరిని వదలడం లేదు. వీరిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోవడం లేదు.  వీరి హృదయాలు పాషాణాలకన్నా ఎక్కువగా బండ బారి పోయాయి. పాణాలు కూడా కొన్ని సందర్భాలలో అల్లాహ్‌ా భీతితో, దొర్లడం, ముక్కలవడం, చీలి వాటి నుండి స్వచ్ఛమయిన నీరు ప్రవహించడం మనం చూస్తాము. ‘వ ఇన్న మినల్‌ హిజారతి లమా యహ్‌బితు మిన్‌ ఖష్‌యతిల్లాహి’.

ఇది ఒండొకరికి శుభాకాంక్షలు తెలియజేససుకోవాల్సిన మాసం. స్వయంగా ప్రవక్త (స) తన అనుయాయులకు శుభాకాంక్షలు తెలియజేసే వారు. ”అతాకుమ్‌ రమజాన్‌, షహ్రుమ్‌ ముబారక్‌…’ రమజాను మాసం మీ చెంతకు చేరింది. శుభవంతమయిన మాసం.

ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హన్బల్‌ (ర) రమజాను మాసం ప్రారంభమవగానే అధిక శాతం సమయం మస్జిద్‌లోనే గడిపేవారు. ఏదో అవసరార్థం కొద్ది ఇంటికెళ్ళి వచ్చేవారు అంతే. తస్బీహ్‌, తహ్లీల్‌, తక్బీర్‌, తహ్మీద్‌ చేసుకుంటూ, ఇస్తిగ్ఫార్‌ చేసుకుంటూ, ఖుర్‌ఆన్‌ చదువుకుంటూ ఉండేవారు. ఒకవేళ వుజూ భంగమయితే వెళ్ళి వుజూ చేసుకొని మళ్ళి వచ్చి మస్జిద్‌లోనే గడిపేవారు. ప్రజల్ని ఉద్దేశించి – ఇది పాప ప్రక్షాళనా మాసం. దీనికివ్వాల్సిన గౌరవాన్ని దీనికి ఇవ్వండి. అన్య నెలలో పాపాలకు పాల్పడి ఈ మాసంలో మీకు ప్రాప్తించిన పవిత్రతను పాడు చేసుకోకండి!! అని అంటూ ఉండేవారు.

”ఒక వ్యక్తి దేహంలో రక్తమాంసాల పాత్ర ఎలాంటిదో ఒక విశ్వాసి జీవితంలో నమాజ్‌ ఉపవాసం పాత్ర అలాంటిదే” అన్నారు సాబిత్‌ అల్‌ బన్నానీ (ర.అ). ఖతాదా బిన్‌ దఅమా (ర.అ) ప్రతి ఏడు రోజులకోసారి ఖుర్‌ఆన్‌ పూర్తి చేసేవారు. కానీ రమజాను మాసంలో మాత్రం ప్రతి మూడు రోజులకోసారి ఖుర్‌ఆన్‌ పూర్తి చేసేవారు. కొందరు సజ్జనులయితే ఒక రాత్రిలోనే ఒకట్రెండు సార్లు ఖుర్‌ఆన్‌ పూర్తి చేసేవారు. అది వారి వ్యక్తిగత ఆరాధగా ఉండేది. నేడు మనలోని కొందరి పరిస్థితి ఎలా ఉందంటే, ఏడాదికోసారయినా ఖుర్‌ఆన్‌ చదివే భాగ్యం లభించినా లభించక పోయినా ఈ మాసంలో మాత్రం కొంరు ఔత్సాహికులు ‘షబీనా’ పేరు ఓ చోటు చేరి ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని ఒకే రాత్రిలో చదివే నూతన పోకడకు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని ఆట క్రింద జమ కట్టే వీరి ఈ ప్రయత్నం చూసి షైతాన్‌ కూడా లోలోన మురిసి పోతున్నాడు. అలాగే ముస్లిం దేశాలలో టీవీ ఛానల్స్‌ చేసే హంగామా అంతా ఇంతా కాదు. వీరు రమజాను రాత్రులు మేల్కొవడానికి చేసే ప్రత్యేకమయిన కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, ఏమిటి? ముస్లింలు ఒక మాసపు రాత్రుల్లోని కొంతలో కొంత మేల్కోవడానికి ఇన్ని సీరీయల్స్‌, ఇన్నీ కార్యక్రమాలు అవసమా? అన్నంత. మరి ఈ మాసంలో జాగార విషయంలో ఇన్ని విషమయ విష యాలు చోటు చేసుకుంటూ ఉంటే, ఇక యేడాది మొత్తం వీరు జాగృత అవస్థ ఉండటం సాధ్యమా? రమజాను మాసం వీరిని జాగృత పర్చడానికి వచ్చిందా, లేక జోకొట్టి నిద్ర పుచ్చడానికి వచ్చిందా? అటు చూస్తే, ప్రతి రాత్రి దైవదూతల నాయకులు జిబ్రీల్‌ (అ) స్వయంగా దివి నుండి భువికి దిగొచ్చి దైవప్రవక్త (స) వారితో కలిసి ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తుంటే, మనం ఈ నాడు ఛానల్స్‌ ముందు కూర్చొని అల్లాహ్‌ాతో ఏకాంత సంభాషణా సువర్ణ సమయాన్ని  యదేచ్ఛగా వృధా పరుస్తున్నాము. అయినా మనకేమి బాధ లేదు!!

మహాశయుల్లారా! మరో విషయం – నేడు బాగా ఆకలి మీదున్న శునకాల్లా మిథ్యా శక్తులన్ని ఏకమయి మూకుమ్ముడిగా ముస్లింలందరిని ముట్టడించి, మట్టు పెట్టాలని చూస్తున్నాయి. దీనికి అరబ్బు దేశాలూ అతీతం కాదు, అరబ్బేతర దేశాలూ అతీతం కాదు. భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లా దేశ్‌, బర్మా దేశాలూ అతీతం కాదు. అన్నీ చోట్ల నిప్పు కుంపటిని రాజేసి ముస్లిం జన ఉనికి నామ రూపాల్లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ ఇన్‌దల్లాహీ మక్‌రుహుమ్‌. వ ఇన్‌ కాన మక్రుహుమ్‌ లితజూల మిన్హుల్‌ జిబాల్‌’ వారి కుట్ర అల్లాహ్‌కు బాగా తెలుసు. వారి కుట్ర కొండలను తమ చోటు నుండి కదిలింపగలేగేంత శక్తి గలదేమి కాదు”. (ఇబ్రాహీమ్‌: 46)   ఇంత జరిగినా మరెంత జరిగినా మనం కలత చెందాల్సిన అవసరం లేదు. ‘వ మకరూ వ మకరల్లాహు వల్లాహు ఖైరుల్‌ మాకిరీన్‌’ – వారు కుట్ర పన్నారు. అల్లాహ్‌ా యుక్తి ప్రణాళిక చేశాడు. యుక్తి ప్రణాళిక చేయడంలో ఆయనకు ఆయనే సాటి.  మనం మనం నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ను రాజీ పర్చుకుంటే చాలు. అన్నీ ఆయనే చూసుకుంటాడు.

ఎవరి జయాపయాలు దేన్తో ముడి పడి ఉన్నాయో తెలీదుగానీ, ముస్లింలందరి జయా పజయాలు కేవలం, కేవలం ఖుర్‌ఆన్‌ మరియు హదీసుకి లోబడి జీవించడంలోనే దాగున్నాయి. ఇక్కడోమాట చెప్పుకోవాలి. హజ్రత్‌ ఉమర్‌ (ర) అన్నారు: ‘అఅజ్జనల్లాహు బిల్‌ ఇస్లామ్‌’…. మేము అపకీర్తి పాలయి ఉండే వారము. అల్లాహ్‌ా మాకు ఇస్లాం శ్వారా కీర్తిప్రతిష్టల్ని ప్రసాదించాడు. ఒక వేళ మీరే గనక ఇస్లాంను వదలి అన్య మార్గాల్ని అనుసరించి కీర్తికండూతి కోసం కక్కుర్తి పడినట్లయితే మీరు అపకీర్తి అడుసులో కూరకు పోయేలా చేయడానికి అల్లాహ్‌ాకు సమయమేమీ పట్టదు”.

చివరిగా మనం పాటించే ఉపవాసం గురించి ఓ రెండు మాటలు చెప్పి, అల్లామా ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) గారి మాటతో నా మాటను పూర్తి చేస్తాను. మనం పాటించే ఉపవాసాన్ని పండితులు 3 విధాలుగా విభజించారు. 1) సౌముల్‌ ఉమూమ్‌ – ఇస్లాం స్థాయి ఉపవాసం-  సామాన్య ఉపవాసం. 2) సౌముల్‌ ఖుసూస్‌ – ఈమాన్‌ స్థాయి ఉపవాసం – విఐపి ప్రత్యేక ఉపవాసం. 3) సౌము ఖుసూసిల్‌ ఖుసూస్‌ –  ఇహ్సాన్‌ స్థాయి ఉపవాసం – విఐపిల్లో విఐపి మరీ మరీ ప్రత్యేక ఉపవాసం.

1) సౌముల్‌ ఉమూమ్‌ – ఇస్లాం స్థాయి ఉపవాసం-  సామాన్య ఉపవాసం. ఈ ఉపవాసంలో కేవలం ఆకలి దాహాలు మాత్రమే ఉంటాయి. దాసుడు కేవ లం అన్నపానీయాలను మాత్రమే త్యజిస్తాడు.

2) సౌముల్‌ ఖుసూస్‌ – ఈమాన్‌ స్థాయి ఉపవాసం – విఐపి ప్రత్యేక ఉపవాసం. ఈ ఉపవాసంలో దాసుడు అన్నపానీయాలతోపాటు అవయవ ఉపవాసాన్ని కూడా పాటిస్తాడు. అంటే అతని నోరు, నేత్రాలు, వీనులు కూడా ఉపవాస మర్యాదల్ని పాటిస్తాయి.

3) సౌము ఖుసూసిల్‌ ఖుసూస్‌ –  ఇహ్సాన్‌ స్థాయి ఉపవాసం – విఐపిల్లో విఐపి మరీ మరీ ప్రత్యేక ఉపవాసం. ఈ ఉపవాసంలో అన్నపానీయాలు, అవయవాల ఉపవాసంతోపాటు మెదడులో, మనసులో సయితం చెడు ఆలోచనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడతాడు.

ప్రవక్త (స) ఇలా అన్నారు:  ఉపదేశించారు: ”మీరు అల్లాహ్‌ పట్ల ఎలా సిగ్గు కలిగి ఉండాలో అలా సిగ్గు కలిగి మసలుకోండి’ అన్నారు. అది విన్న సహచరులు – ‘అల్‌హమ్దు లిల్లాహ్‌ా మేము అల్లాహ్‌ా యెడల సిగ్గు కలిగే వ్యవరిస్తాము’ అన్నారు. అలా కాదు, అల్లాహ్‌ యెడల సిగ్గు కలిగి ఉండటం అంటే, మీ తలను (మేధను), దాంతో ముడిపడి ఉన్న వాటన్నింటిని(చెవులు, నోరు, కళ్ళు) చెడు నుండి కాపాడుకోవాలి. కడుపు దానితో ముడిపడి ఉన్న వాటన్నింటని (మర్మాంగం, కాళ్ళు, కడుపు) అధర్మ విషయాల నుండి కాపాడుకోవాలి”. (తిర్మిజీ) ఇదే నియమం రమజాను మాసంలో, అన్య మాసాల్లో మనం చేసే అన్ని ఆరాధనలకూ వర్తిస్తుంది.

ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) ఇలా అన్నారు: ఉపవాసం – అది దైవభీతిపరుల (ముత్తఖీన్‌ల)కు ముకుత్రాడు. అది సత్య యోధులకు కవచం. అది ధర్మ పరాయణులకు, అల్లాహ్‌ ప్రియతమ దాసులకు ఉద్యాన వనం. దాసుడు చేసే సకల సత్కర్మల్లో  కేవలం అది మాత్రమే అల్లాహ్‌ాకు  సొంతమయినది. దాసుడు తన ఆరాధ్య దైవం కోసం తన కోరికను, ఆహారాన్ని, పానీయాన్నీ, సుఖ నిద్రను పరిత్యజిస్తాడు. కనుకనే అల్లాహ్‌ అన్నాడు: అస్సౌము లీ వ అన అజ్‌జీ బిహీ”.  ఉపవాసం నాది. నేనే దానికి స్వయంగా ప్రతిఫలాన్ని వొసగుతాను”.

Related Post