ఆగామి యుగాలకాయన ఆదర్శప్రాయుడు

ఏ ఘోరం చేశాడు బిలాల్‌? ఏ నేరానికి పాల్పడ్డాడు బిలాల్‌ మండుటెండల్లో మాడే నల్ల సూరీడు విషమ హింస ఎందుకు ధీరోత్తమునికి మిథ్యాదైవాల్ని తిరస్కరించినందుకా అహద్‌, అహద్‌ అని జపించినందుకా అదే నేరమైతే, సత్యం ఏమైనట్టు?

ఏ ఘోరం చేశాడు బిలాల్‌?
ఏ నేరానికి పాల్పడ్డాడు బిలాల్‌
మండుటెండల్లో మాడే నల్ల సూరీడు
విషమ హింస ఎందుకు ధీరోత్తమునికి
మిథ్యాదైవాల్ని తిరస్కరించినందుకా
అహద్‌, అహద్‌ అని జపించినందుకా
అదే నేరమైతే, సత్యం ఏమైనట్టు?

జాడ్యం నిండిన మౌఢ్య పాలనలో –
నిజం కరువైన నీలి సమాజంలో
ఒకే ఒక్కడు అయిన వ్యక్తి ఒక
మహా శక్తయి, మానవ నిర్మాతయి
సౌజన్య ప్రదాతయి, సాత్విక దూతయి
సాగర సహనంతో సత్య శంఖాన్ని
పూరించిన ఉదంత మేనాటికీ
స్ఫూర్తినిస్తూనే ఉంటుంది లోకానికి

సత్యాన్ని బోధించిన నూహ్‌ా
నియంతల్ని నిలదీసిన ఇబ్రాహీమ్‌
దళిత జనాల పక్షం వహించిన మూసా
సహనానికి తానే ప్రతీకగా నిలిచిన అయ్యూబ్‌
సమాజ శ్రేయస్సు కోసం శిరస్సు అర్పించిన యహ్యా
ధర్మోన్నతికై ప్రాణాలర్పించిన జకరియ్యా
సమానతను బోధించిన ఈసా
క్షమా గుణం తానై నిలిచిన ముహమ్మద్‌
సహన సంపద శాంతి ప్రేమలకు శాశ్వత వారసులు

ఏ ఘోరం చేశాడు బిలాల్‌?
ఏ నేరానికి పాల్పడ్డాడు బిలాల్‌
మండుటెండల్లో మాడే నల్ల సూరీడు
విషమ హింస ఎందుకు ధీరోత్తమునికి
మిథ్యాదైవాల్ని తిరస్కరించినందుకా
అహద్‌, అహద్‌ అని జపించినందుకా
అదే నేరమైతే, సత్యం ఏమైనట్టు?
ఆ మనీషి సహనం పరీక్షకే పరాకాష్ఠ
అధికారం అడగలేదు ఖబ్బాబ్‌
అపకారం చేయలేదు ఉస్మాన్‌
అన్యాయం తలపెట్టలేదు అమ్మార్‌
అధర్మానికి పాల్పడలేదు యాసిర్‌
అసత్యానికి వత్తాసు పలుకలేదు సుమయ్యా
దమన నీతికి దాసోహమనలేదు ముస్‌ఆబ్‌
స్వామి ద్రోహానికి ఒడిగట్టలేదు ఉమ్మె సలమా

ఎందుకు వారు శిక్ష భరించారు తమ
మూపున ఎందుకు నాటారు మేకులు తనవున
అజ్ఞాన ముసుగు విప్పినందుకా?
మిథ్యా వాదుల్ని నిలదీసినందుకా?
నిజ దైవం అల్లాయేనని నిగ్గు తేల్చినందుకా?
వీడని మిస్టరీ హిస్టరీని ఛేదించినందుకా?
ఏమి తెలుసీ ముష్కరులకు, ముష్రికులకా
మహా ప్రవక్త మహోపదేశం? చిందే
రక్తం, అయ్యే గాయం చేసే ఆర్తనాదం –
”అల్లాహుమ్మహ్‌ాది ఖౌమీ ఫయిన్నహుమ్‌ లా
యాలమూన్‌” -ప్రభూ! నా జాతి జనులకు
సన్మార్గ భాగ్యం ప్రసాదించు. వారు నన్ను,
నిన్నూ గ్రహించలేని వట్టి అమాయకులు స్వామీ!!

ఆర్ద్రంగా ఉంటూనే రుద్రంగా
ధీరంగా ఉంటూనే దుర్గంగా
సంకల్ప వజ్రం ధరియించి
కారుణ్య వర్షం కురిపించి
అభిగమించు సమ చిత్తుడు
ఆగామి యుగాల కాయన
ఆదర్శప్రాయుడు.

Related Post