అర్కానుస్సలాహ్‌

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: '' ఓ విశ్వాసులారా రుకూ సజ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి తద్వారా మీరు సఫలీకృతులవుతారు.'' (హజ్‌-77)

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” ఓ విశ్వాసులారా రుకూ సజ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి తద్వారా మీరు సఫలీకృతులవుతారు.” (హజ్‌-77)

ఐ పి సి తెలుగు విభాగం

అర్కానుస్సలాహ్‌ (నమాజు యొక్క మూలాధారాలు)

ప్రతి విషయంలోని రుక్న్‌ అనేది పునాది లాంటిది. మరి నమాజులో రుకూ, సజ్దా మొదలైనవి నమాజు మూలాధారాలు అనబడతాయి.మరి నమాజులోని ఈ అర్కాన్లు సంపూర్ణంగా, సరైన భంగిమలతో, సరైన క్రమపద్ధతిలో, జిబ్రయీల్‌ (అ) నుండి దైవప్రవక్త ముహమ్మద్‌(స)ను నేర్పిన విధానం ప్రకారం లేక పోయినప్పుడు ఆ నమాజు నమాజు కాజాలదు. నమాజులో 13 అర్కాన్లు ఉన్నాయి. వాటన్నింటిని వేరువేరుగా ఇక్కడ క్లుప్తంగా వివరిస్తున్నాము:

సంకల్పం:

‘ ప్రతి కార్యపు ప్రారంభంలో మనసులో కలగాల్సిన భావనను సంకల్పం అంటారు, అంటే సంకల్పం చేసుకునే చోటు మనస్సు. కనుక మనసులో సంకల్పించుకోవడం అవసరం. నమాజు చదువుటకు నిలిచినపుడు తక్బీరె తహ్‌ారీమ పలికే టప్పుడు ఏ నమాజు, ఎన్ని రకాతులు అనేది హృదయంలో సంకల్పించుకోవాలి. అంతేగాని దానిని నోటితో పలకాల్సిన అవసరం లేదు.దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి”. (బుఖారి 1, ముస్లిం 1907)

ఫర్జ్‌ నమాజులలో శక్తి గలవాడు నిటారుగా నిలవడం.

ఇమ్రాబ్‌ బిన్‌ హుసైన్‌(ర) ఈ విధంగా తెలియజేశారు: నాకు మొలల వ్యాధి ఉండేది, నేను దైవప్రవక్త(స) వద్దకు వెళ్ళి నమాజ్‌ (ఎలా చదవాలనే)విషయం గురించి ప్రశ్నించాను, దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”నమాజ్‌ను నిలబడి చేయండి. ఒకవేళ నిలబడి చేయలేకపోతే కూర్చుని చేయండి. ఒకవేళ కూర్చుని చేసే శక్తి కూడా లేకపోతే ప్రక్క ఆధారంగా పరుండి చేయండి.” (బుఖారి 1066)
మనిషి చక్కగా,నిటారుగా నిలబడి ఉంటే ఖియామ్‌ అనబడుతుంది. ఎలాంటి కారణం లేకుండా మోకాళ్ళను ముట్టుకునేలా మనిషి వంగితే అతని నమాజు భంగమైపోతుంది. ఎందుకనగా అతను నమాజులోని ఒక రుకున్‌(భాగం) అకారణంగా చేయలేదు. ఒకవేళ ప్రారంభంలో నిలబడి, తరువాత మనిషికి ఏదో ఒక కారణంగా నిలబడటం కష్టమైనప్పుడు అతను మిగతా నమాజు మొత్తం కూర్చోని చేయవచ్చును. ఇక్కడ ఫర్జ్‌ నమాజులలో మాత్రమే నిలబడటాన్ని తప్పనిసరి చేసారు. కావున మితగా నమాజులన్నింటికి ఈ షరతు వర్తించదు.అనగా మిగతా నమాజులలో నిలబడి నమాజ్‌ చేసే శక్తి ఉన్నా కూడా కూర్చొని చేస్తే అభ్యంతరం లేదు నమాజు అయిపోతుంది. కాకపొతే నిలబడి చదువుటకు వీలున్నవారు నిలబడి చదవటం ఉత్తమం.

దైవప్రవక్త(స) ఈ విధంగా తెలియజేశారు: ”నిలబడి నమాజు చేయడం ఉత్తమం, కూర్చొని చదివే వ్యక్తికి నిలబడి చదివే వ్యక్తిలోని సగం పుణ్యం లభిస్తుంది. పరుండి చదివే వ్యక్తికి కూర్చొని చదివే వ్యక్తికి లభించే పుణ్యంలో సగం పుణ్యం లభిస్తుంది”. ( బుఖారి 1065)

తక్బీరతుల్‌ ఇహ్రామ్‌ (తక్బీరె తహ్రీమ)

దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు:” వుజూ నమాజుకు బీగంచెవి, మరియు తక్బీర్‌తో నమాజులో ఇతర కార్యాలు నిషిద్ధమవు తాయి. మరియు సలాంతో ఇతర కార్యాలు ధర్మసమ్మతమవుతాయి”. (తిర్మిజి 3, అబూదావూద్‌61)
తక్బీరె తహ్రీమలో ‘అల్లాహు అక్బర్‌’ అనే పదం తప్పనిసరిగా పలకాలి. అలాగే అల్లాహ్‌ా సిఫాత్‌లను కలిపి పలకటంలో అభ్యంతరం లేదు. ఉదాహరణకు: ‘అల్లాహు అల్‌అక్బర్‌’ ‘అల్లాహుల్‌ జలీలు అక్బర్‌’. కాని అల్లాహ్‌ా యొక్క సిఫాత్‌ కాకుండా ఉదాహరణకు ”అల్లాహువల్‌ అక్బర్‌” అనటం, లేదా పదాలను మార్చి”అక్బరుల్లాహ్‌ా” అని అనటం సమ్మతం కాదు. ఎందుకనగా మనకు దైవప్రవక్త(స) ఆదేశాలను అనుసరించాలని ఆజ్ఞాపించబడినది.మరియు దైవప్రవక్త(స) తక్బీరె తహ్రీమ లో ”అల్లాహు అక్బర్‌” అనే పదాన్నే పఠించారు.

తక్బీరె తహ్రీమ షరతులు:

(అ) నిలబడి పలకాలి. నిలబడుతున్నప్పుడు, పూర్తిగా నిలబడక ముందే మధ్యలోనే పలికితే చెల్లదు.
(ఆ) ముఖం ఖిబ్లా వైపు ఉండాలి.
(ఇ) అరబీ భాషలోనే పలకాలి. అరబీలో పలకటం సాధ్యం కాని వ్యక్తి మరియు వెంటనే ఆ పలుకులు నేర్చుకొనుటకు సాధ్యపడని వ్యక్తి కొద్ది రోజుల వరకు తాత్కాలికంగా అనువాదాన్ని పలుకవచ్చును కానీ వీలైనంత తొందరగా నేర్చుకొనటం తప్పనిసరి.
(ఈ) చెవిటివాడు కాకపోతే పూర్తి పదం అతను వినేటట్లుగా పలకాలి.
(ఉ) సంకల్పానికి ఇది జతై ఉండాలి.

సూరతుల్‌ ఫాతిహా చదవటం:

ఎలాంటి నమాజు అయినా సరే ప్రతి రకాతుకి ఇది రుక్న్‌ (మూలం).

దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఎవరయితే నమాజులో ”ఫాతిహతుల్‌ కితాబ్‌” (సూరతుల్‌ ఫాతిహా) పఠించలేదో అతని నమాజు నెరవేరదు.” (బుఖారి 723)
”బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం” సూర ఫాతిహాలోని ఒక ఆయతు. ”బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం” పఠించకుండా సూర ఫాతిహా పఠిస్తే నెరవేరదు. దైవప్రవక్త(స) ”బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం”ను ఒక ఆయతుగా లెక్కించారని ఉమ్మెసలమా (ర) తెలియ జేశారు. ( ఇబ్ను ఖుజైమహ్‌ ఈ హదీసు ప్రామాణికమైనదని తెలిపారు)

సూరతుల్‌ ఫాతిహా చదువటకై షరతులు:

(అ) చదివేవాడు వినగలిగేవాడైతే అతనికి వినబడేటట్లుగా చదవాలి.
(ఆ) సూర ఏ క్రమంలో అవతరించబడిందో ఆ ప్రకారమే వాక్యాలన్నీ క్రమంగా, సరైన ఉచ్చారణతో చదవాలి.
(ఇ) సూర అరబీలోనే చదవాలి. అనువాదం చదివితే నెరవేరదు.ఎందుకంటే అనువాదం ఖుర్‌ఆన్‌ కాదు. నమాజ్‌ చదివే వ్యక్తి ఏదో కారణంగా సూర ఫాతిహా చదవటం సాధ్యం కానప్పుడు అతనికి కంఠస్తం ఉన్న ఇతర ఏడు ఆయతులు చదవవచ్చు. ఒకవేళ ఖుర్‌ఆన్‌లోని కొంచమైనా కంఠస్తం లేనప్పుడు సూర చదివేటంత సేపు జిక్ర్‌ చేసి రుకూ చేయవలెను.
(ఈ) సూరతుల్‌ ఫాతిహా ఖియామ్‌లో (నిలబడి) చదవాలి. సూర పూర్తిగా చదవక ముందే రుకూలో వెళ్తే అతని పారాయణం భంగమవును. అతను మళ్ళీ పూర్తి చేసుకోవాలి.

రుకూ:
షరీఅత్‌ పరిభాషలో రుకూ అనగా వంగుట. రుకూ చేసేటప్పుడు రెండు అరచేతులు పైకి భుజాల వరకు ఎత్తి, పిదప రెండుకాళ్ళు ముదుకులపై రెండు అరచేతులను పెట్టి నడుమును వంచవలెను.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” ఓ విశ్వాసులారా రుకూ సజ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి తద్వారా మీరు సఫలీకృతులవుతారు.” (హజ్‌-77)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”తరువాత రుకూ చేయి నీవు రుకూ స్థితిలో ప్రశాంతత పొందే వరకు”(బుఖారి 724,ముస్లిం 397)

రుకూ షరతులు:
(అ) పైన తెలుపబడిన విధంగా వంగాలి. అంటే అరచేయి మోకాళ్ళ వరకు చేరాలి. ఆ వంగటం రుకూ ఉద్దేశంతో తప్ప మరేమీ ఉద్దేశం ఉండకూడదు. ఉదాహరణకు ఏదో భయం వలన వంగి తరువాత అలాగే రుకూలో సాగిపోదామనుకుంటే అతని రుకూ చెల్లదు. అతను పైకి నిలబడి తరువాత రుకూ సంకల్పంతో మళ్ళీ వంగాలి.
అబూ హుమైద్‌ అస్సాదీ (ర) దైవప్రవక్త(స) నమాజు విధానాన్ని తెలుపుతూ: ”…..ఆయన(స) రుకూ చేసినప్పుడు తమ రెండు చేతులతో మోకాళ్ళను పట్టుకున్నారు. తరువాత వీపును చక్కగా ఉంచారు….” అని తెలిపారు. (బుఖారి 794)
(ఆ) ”తమానీనహ్‌” (ప్రశాంతత) అంటే కనీసం రుకూలో చదవాల్సిన తస్బీహ్‌ా చదివినంత వరకు వంగి ఉండటం.

అబూ సయీద్‌ అల్‌ ఖుద్రీ(ర) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా తెలియజేశారు: ”దొంగలలో అందరికంటె చెడ్డవాడు నమాజులో దొంగతనము చేసేవాడు” నమాజులో దొంగతనము అంటే ఏమిటి అని అనుచరులు ప్రశ్నించగా దైవప్రవక్త(స) ఇలా సమాధానమిచ్చారు:” రుకూను, మరియు సజ్దాలను పూర్తిగా సరిగా చేయనివాడు.” (అహ్మద్‌)
రుకూ చేసే సరైన విధానం ఏమిటంటే రుకూ చేసేవాడు తన మెడ మరియు వీపును సరిసమానంగా పైకి క్రిందికి లేకుండా ఉంచి వంగాలి. రెండు పిక్కలను ధృడంగా నిలబెట్టాలి, రెండు చేతులతో రెండు మోకాళ్ళను పట్టుకోవాలి మరియు మూడు సార్లు ”సుబ్‌హాన రబ్బియల్‌ అజీం” అని పలికినంత వరకు అదే భంగిమలో ఉండాలి.

హుజైఫా(ర) ఈ విధంగా తెలియజేశారు:”నేను ఒక రాత్రి దైవప్రవక్త(స)తో పాటు నమాజు చేసాను…… తరువాత ఆయన(స) రుకూ చేసి ”సుబ్‌హాన రబ్బియల్‌ అజీం” అని పలికారు, ఆ తరువాత సజ్దా చేసి ”సుబ్‌హాన రబ్బియల్‌ ఆలా” అని పలికారు.” (ముస్లిం 772)

రుకూ తరువాత నిటారుగా నిలబడటం. (ఖౌమా)
ఈ నిలబడటం రుకూను సజ్దా నుండి వేరుపరుస్తుంది:
”ఆయిషా(ర) దైవప్రవక్త(స) నమాజు విధానాన్ని వివరిస్తూ అన్నారు: రుకూ స్థితి నుండి తల పైకెత్తిన తరువాత అప్పటికప్పుడే సజ్దాలోకి వెళ్ళకుండా నిటారుగా నిలబడే వారు.” (ముస్లిం 498)
ఒక వ్యక్తి అశ్రద్ధగా నమాజు చేశాడు, దైవప్రవక్త(స) అతన్ని నమాజు విధానం నేర్పుతూ ఇలా అన్నారు: ”… తరువాత రుకూ నుండి తల పైకెత్తి ప్రశాంతంగా నిలబడు.” (బుఖారి 724, ముస్లిం 397)

నిటారుగా నిలబడుటకై షరతులు:
(అ) రుకూ తరువాత ఆరాధనా ఉద్దేశంతో తప్ప ఇతర ఏ ఉద్దేశంతోనయినా నిటారుగా నిలబడరాదు.
(ఆ) అల్లాహ్‌ పవిత్రను పొగిడేటంత సమయం వరకు ప్రశాంతంగా నిలబడాలి.
(ఇ) ఎక్కువ సేపు అర్థరహితంగా నిలబడరాదు. సూరఫాతిహా చదివితే ఎంతసేపు అవుతుందో అంతకంటే ఎక్కువగా నిలబడరాదు. ఎందుకంటే ఈ రుక్న్‌ (రుకూ తరువాత నిలబడటం)కి సమయం తక్కువ.

ప్రతి రకాతులో రెండుసార్లు సజ్దా చేయటం:
షరీఅత్‌ పరిభాషలో ”సజ్దా” అంటే నమాజీ సజ్దా చేసే స్థలంపై నుదుటిని ఆనించటం.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”…..రుకూ సజ్దాలు చేస్తూ ఉండండి…” (హజ్‌ 77)
అశ్రద్ధగా నమాజు చదివిన వ్యక్తికి దైవప్రవక్త(స) ఉపదేశిస్తూ ఇలా అన్నారు: ”… తరువాత సజ్దా చేయండి. సజ్దా చాలా నింపాదిగా చేయండి. సజ్దాలోనుంచి తలపైకెత్తి హాయిగా కూర్చోండి. ఆ తరువాత రెండవ సజ్దా చేయండి. ఈ సజ్దా కూడా నింపాదిగా చేయండి….” ( బుఖారి724, ముస్లిం 397)

సజ్దా షరతులు:

(అ) నుదురు భూమిని తగులుతున్నప్పుడు బహిర్గతంగా ఉండాలి.
(ఆ) ఏడు అవయవాలపై సజ్దా చేయవలెను.
దైవప్రవక్త(స) ప్రవచించారు:” నాకు ఏడు ఎముకల (అవయవాల) ఆధారంగా ‘సజ్దా’ చేయమని ఆదేశించబడింది- తన చేతుల సైగతో తెలిపారు-నుదురు మరియు ముక్కు, రెండు చేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాలు.” (బుఖారి779,ముస్లిం 490)
కాకపోతే ఈ అవయవాలలో నుదురు తప్ప మరే అవయవాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.
(అ) వీలైనంతవరకు పాదములను నిలబెట్టాలి. ఇలా చేయటం దైవప్రవక్త(స) విధానాన్ని అనుసరించటం అవుతుంది.
(ఆ) కదులుతూ ఉండే బట్టలపై సజ్దా చేయరాదు.
(ఇ) సజ్దా సమయంలో ఆరాధనా ఉద్దేశంతో తప్ప మరే ఇతర కారణంతో- ఉదాహరణకు భయం మొదలైన కారణాలతో
సజ్దా చేయరాదు.
(ఈ) సజ్దా చేసే స్థలంపై నుదురును ఆనిస్తూ తలభారాన్ని నుదుటిపై పడేలా చేయాలి.
(ఉ) సజ్దా స్థితిలో కనీసం ఒక్కసారైనా దైవనామస్మరణ చేసేటంత సమయం వరకు ప్రశాంతంగా ఉండాలి.

పూర్తి ‘సజ్దా’ విధానం ఏమిటంటే ‘అల్లాహు అక్బర్‌’ అంటూ ‘సజ్దా’ చేయాలి.సజ్దా చేసేటప్పుడు ముందుగా రెండు చేతుల్ని నేల మీద మోపి తర్వాత మోకాళ్ళు క్రింద పెట్టాలి. సజ్దాలో ముక్కును, నదుటిని, అరచేతుల్ని కాళ్ళ వ్రేళ్ళను నేలకు ఆనించాలి. అరచేతులు భుజాలకు లేదా చెవులకు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. మోచేతులు ప్రక్కటెముకలకు తగలకుండా ఎడంగా ఉంచాలి. వీపుని ఏ మాత్రం వంచకుండా తిన్నగా ఉంచాలి. కాలి వ్రేళ్ళను వంచి ఖిబ్లా దిశగా ఉంచాలి. ఇలా సజ్దా చేస్తూ ”సుబ్‌హాన రబ్బియల్‌ ఆలా” అని మూడు సార్లు పఠించాలి.

అబూ హుమైద్‌ అస్సాదీ(ర) దైవప్రవక్త(స) నమాజు విధానాన్ని వివరిస్తూ ఇలా అన్నారు:”…దైవప్రవక్త(స) సజ్దా చేసేటప్పుడు రెండు చేతుల్ని పూర్తిగా విప్పకుండా,పూర్తిగా ముడిచేయకుండా మధ్యలో ఉంచారు. మరియు తమ రెండు కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లావైపునకు వంచారు.” (బుఖారి 794)
స్త్రీలకు పైన తెలుపబడిన నియమాలలోని కొన్ని నియమాలపై మినహాయింపు కలిగించబడినది. స్త్రీలు సజ్దా చేయు సమయంలో తన శరీరాన్ని అణుచుకోవలెను.

ఒకసారి దైవప్రవక్త(స) వెళ్తుండగా ఇద్దరు మహిళలు నమాజు చదువుతుండటాన్ని గమనించారు. తరువాత వారిద్దరికి ఇలా అన్నారు: ”మీరు సజ్దా చేసేటప్పుడు మీ శరీరాన్ని భూమివైపు అణచండి ఎందుకనగా మీరు సజ్దా చేసే విషయంలో మగవారి లాంటివారు కాదు.” (బైహఖీ 223/2)

రెండు సజ్దాల మధ్య కూర్చోవటం. (జల్సా)
ప్రతి రకాతులో ఇలా రెండు సజ్దాల మధ్య కూర్చోవటం తప్పనిసరి.
నమాజులో అశ్రద్ధ వహించిన వ్యక్తిని దైవప్రవక్త(స)ఇలా ప్రవచించారు: ”…సజ్దాలోనుంచి తలపైకెత్తి హాయిగా కూర్చోండి…”
(బుఖారి 724, ముస్లిం 397)
రెండు సజ్దాల మధ్య కూర్చునుటకై షరతులు:
(అ) ఆరాధన ఉద్దేశంతో కూర్చోవాలి, ఇతర కారణాల వల్ల- ఉదాహరణకు భయం మొదలైన కారణాన అలా చేస్తే చెల్లదు.
(ఆ) చాలా సమయం వరకు అనగా తషహ్హుద్‌లో కూర్చోవటంకంటే ఎక్కువగా సమయం కూర్చోకూడదు.
(ఇ) కనీసం దుఆ చదివినంత వరకు ప్రశాంతంగా కూర్చోవాలి.

ఆఖరి జులూస్‌:
అనగా నమాజులోని చివరి రకాత్‌లో సలాంకి ముందు కూర్చోవటం.
ఆఖరీ జులూస్‌లో తషహ్హుద్‌:

ఇబ్నె మస్‌వూద్‌(ర) ఈ విధంగా తెలియజేసారు:” మేము దైవప్రవక్త(స)తో పాటు నమాజు చదివేటప్పుడు అస్సలాము అలల్లాహ్‌ా-అస్సలాము అలా జిబ్రయీల్‌, అస్సలాము అలా మీకాయీల్‌, అస్సలాము అలా ఫులాన్‌ అని అంటుండేవారము. అప్పుడు దైవప్రవక్త(స) మనవైపు ముఖం చేసి- నిశ్చయంగా అల్లాహ్‌ాయే శాంతి కావున మీలో ప్రతిమనిషి నమాజులో కూర్చున్నప్పుడు అత్తహియ్యాతు లిల్లాహ్‌ా…. చదవాలి అని అన్నారు.”(బుఖారి5806,ముస్లిం402)
క్లుప్తమైన అత్తహియ్యాత్‌ పలుకులు: ”అత్తహియ్యాతు లిల్లాహి,అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, సలామున్‌ అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ వ అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌”.
హదీసు గ్రంథాలలో ‘అత్తహియ్యాత్‌’ పలుకులు చాలా రకాలుగా తెలుపబడ్డాయి, అవన్నీ ప్రామాణికమైనవే. ఇమామ్‌ షాఫయి(రహ్మ) దగ్గర ఉత్తమమైన అత్తహియ్యాత్‌ పలుకులు:

ఇబ్నెఅబ్బాస్‌ (ర) ఈ విధంగా తెలియజేశారు, దైవప్రవక్త(స) మాకు తషహ్హుద్‌ పలుకులు ఖుర్‌ఆన్‌లోని సూరాను నేర్పినట్లు నేర్పించారు, ఆ పలుకులు : అత్తహియ్యాతుల్‌ముబారకాతు, అస్సలవాతుత్తయ్యిబాతు లిల్లాహి, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌.” ( ముస్లిం 403)

తషహ్హుద్‌ చదివేటప్పుడు క్రింద ఇవ్వబడే విషయాలను దృష్టిలో పెట్టుకోవలెను:
1.అతను సక్రమంగా వినగలవాడైతే అతనికే వినబడేలా చదువ వలెను.
2.క్రమంగా పలుకుల్నీ చదువుకుంటూ ముందుకు సాగవలెను. మధ్యలో చాలాసేపు వరకు నిశబ్దంగా ఉండటం, లేదా ఇతర దుఆలు చదవటం వలన నమాజు భంగం అవుతుంది, కనుక అతను మళ్ళీ తషహ్హుద్‌ను క్రమంగా చదవవలెను.
3. తషహ్హుద్‌ కూర్చొని చదువ వలెను. ఏదైనా కారణం వల్ల కూర్చొని చదివే శక్తిలేకపోతే వీలుపడినట్లుగా చదువుకుంటే సరిపోతుందు.
4.అరబీ భాషలోనే పఠించాలి. ఒకవేళ అరబీ భాష సాధ్యపడకపోతే దాని అనువాదాన్ని ఏభాషలోనైనా చదవవచ్చు కానీ వీలైనంత తొందరగా అరబీలోనే ఆ పలుకులు నేర్చుకోవటం వాజిబ్‌.
5.తషహ్హుద్‌ చదివేటప్పుడు మఖారిజ్‌ అనగా ఉచ్చారణ విధానాలను దృష్టిలో పెట్టుకొని చదవవలెను. ఎందుకంటే సరైన ఉచ్చారణ లేకపోవటం వలన లేక అశ్రద్ధ వహించిన వలన పలుకుల అర్థం మారిపోతే అత్తహియ్యాతు చెల్లదు. అతను మళ్ళీ అత్తహియ్యాతు ప్రారంభం నుండి చదవాలి.
6. తషహ్హుద్‌ పలుకులు హదీసులలో తెలుపబడిన క్రమంలోనే చదువవలెను.

ఆఖరి తషహ్హుద్‌ తరువాత దైవప్రవక్త(స)పై దరూద్‌ పఠించటం:
అనగా పైన తెలుపబడిన తషహ్హుద్‌ పలుకులు పఠించిన తరువాత సలాం పలికే ముందు దరూద్‌ పఠించాలి.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”నిశ్చయంగా అల్లాహ్‌ా, ఆయన దూతలు కూడా దైవప్రవక్త(స)పై కారుణ్యాన్ని పంపిస్తున్నారు, ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి.”(అహ్‌జాబ్‌56)

ఇబ్నె మస్‌వూద్‌(ర) ఉల్లేఖనంలో దైవప్రవక్త(స)పై దరూద్‌ పంపించే విధానం గురించి ప్రశ్న ఏమిటంటే : ఓ దైవప్రవక్తా మేము నమాజు చదువుతున్నప్పుడు మీపై దరూద్‌ ఎలా పఠించాలి? దైవప్రవక్త(స) సమాధానంగా దరూద్‌ పలుకులు నేర్పించారు…. (హాకిం 988)
పై ఉల్లేఖనం ప్రకారం దరూద్‌ పఠించే సందర్భంలో నమాజు ఒకటి. నమాజు చివర్లో కూర్చున్నప్పుడు తషహ్హుద్‌ చదివిన తరువాత దరూద్‌ పఠించటం వాజిబ్‌.

దైవప్రవక్త(స) ఇలా తెలియజేశారు: ”మీలో ఎవరయినాసరే దుఆ చేయసాగినపుడు తొలుత మీ ప్రభువును ప్రశంసించాలి, కొనియాడాలి. తరువాత దైవప్రవక్త(స)పై దరూద్‌ పంపాలి. ఆ తరువాత మీరు కోరుకున్నదల్లా అర్థించవచ్చు.” (తిర్మిజి,3475, అబూదావూద్‌ 1481)
దైవప్రవక్త(స)పై దరూద్‌ పఠించే క్లుప్తమైన పలుకులు: ” అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్‌”.
పూర్తి పలుకులు: ”అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్‌ వ అలా ఆలి ముహమ్మద్‌ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, వ బారిక్‌ అలా ముహమ్మద్‌ వ అలా ఆలి ముహమ్మద్‌ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఫిల్‌ ఆలమీన ఇన్నక హమీదుమ్మజీద్‌.”

దరూద్‌ పఠించుటకై షరతులు:
1. వినే సామర్థ్యంగల వ్యక్తి అయితే అతను మాత్రమే వినేలా చదవాలి.
2.దరూద్‌లో ముహమ్మద్‌, రసూల్‌ లేక నబీ పదాలనే ఉపయోగించాలి. అహ్మద్‌ అనే పదం ఉపయోగిస్తే చెల్లదు.
3.దరూద్‌ అరబీ భాషలోనే పఠించాలి.
4. దరూద్‌ పలుకుల్ని క్రమంగా పఠించాలి. మరియు తషహ్హుద్‌ తరువాతనే దరూద్‌ పఠించాలి. తషహ్హుద్‌కి ముందు దరూద్‌ పఠిస్తే చెల్లదు.

మొదటి సలాం:

సలామ్‌ పలికే విధానమేమిటంటే నమాజ్‌ చదివే వ్యక్తి కుడివైపు ముఖం త్రిప్పి ”అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహ్‌” అని పలకాలి.
అలీ(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ” నమాజ్‌కు తాళం చెవి తహారత్‌, తక్బీర్‌ పలకటం వలన ఇతర కార్యాలు నిషిద్ధం అవుతాయి. మరియు సలాం పలకటంతో ఇతర కార్యాలు హలాల్‌ అవుతాయి.” (అబూదావూద్‌61)
సలాం పలుకుటకు చిన్న పదము: ”అస్సలాము అలైకుమ్‌” ఒక్కసారి.
సలాం పలుకుటకు పూర్తి పదము: ”అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహ్‌” రెండు సార్లు. ఒకసారి కుడివైపు, రెండోసారి ఎడమ వైపు.
సఅద్‌(ర) ఈ విధంగా తెలియజేశారు:” నేను దైవప్రవక్త(స)ని కుడివైపు, ఎడమవైపు సలాం పలుకుతుండగా చూసాను, నాకు ఆయన(స) వారి చంక తెల్లదనం కనిపించేది.” (ముస్లిం 582)

ఇంతవరకు తెలుపబడిన కార్యాలన్నీ క్రమంగా పాటించాలి.
క్రమంగా పాటించడమంటే సంకల్పం మరియు తక్బీరె తహ్రీమహ్‌తో ప్రారంభించాలి, తరువాత సూరతుల్‌ ఫాతిహ, రుకూ, నిటారుగా నిలబడటం, సజ్దా……… ఇలా ఒకదాని తరువాత ఒకటి క్రమంగా పాటించడం.
ఒకవేళ నమాజ్‌ యొక్క అర్కానులు(మూలాధారాలు) ఉదేశ్యపూర్వకంగా ముందు చేసేది తర్వాత, తర్వాత చేసేది ముందు చేస్తే నమాజ్‌ భంగం అవుతుంది. ఒకవేళ అనుకోకుండా మరచిపోయి జరిగిపోతే ఎక్కడ పొరపాటు జరిగిందో అక్కడ నుంచి మళ్ళీ పూర్తి క్రమంగా చేయవలెను.

పరీక్ష 13

క్రింద ఇవ్వబడిన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(అ) సజ్దా (ఆ) తక్బీరతుల్‌ ఇహ్రాం (ఇ) నుదురు (ఈ) రుకూ (ఉ) తర్‌తీబ్‌ (ఎ) రెండు మోకాళ్ళు (ఏ) రెండుచేతులు
(ఐ) అరబీ భాషలో (ఒ) రెండు పాదాలు (ఓ) ముఖం.
1. ఏడు అవయవాలపైన సజ్దా చేయవలెను అవి: …………..మరియు…………..మరియు……………మరియు………
2.తషహ్హుద్‌ నమాజు యొక్క అర్కానులలో ఒక రుకున్‌, దీనిని ………………లో మరియు………………గా చదవాలి.
సరైన సమాధానం కనుక్కోండి.
3.సూరతుల్‌ ఫాతిహ పఠించడం రాదు:
(అ) అతను సూర ఫాతిహ చదవాల్సిన అవసరం లేదు, వెంటనే రుకూ చేసేయవచ్చు.
(ఆ) అతను కంఠస్తం చేసిన ఏ సూరాలోనైనా ఏడు ఆయతులు చదువవలెను.
(ఇ) అతని వచ్చే ఏ భాషలోనైనా సరే ఆ సూరా యొక్క అనువాదం చదువ వచ్చును.
4.రుకూ చేయుటకు వీపును సమానంగా ఉంచి……………… ఉంచితే సరిపోతుంది.
(అ) రెండు చేతులు మోకాళ్ళపైన
(ఆ) రెండు చేతులు తొడలపైన
(ఇ) రెండు చేతులు పిక్కలపైన.
5.చివరి తషహ్హుద్‌లో దైవప్రవక్త(స)పై దరూద్‌ పంపించుటకు క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ఒకటి సరైనది కాదు.అది
ఏది?
(అ) అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్‌.
(ఆ) అల్లాహుమ్మ సల్లి అలర్రసూల్‌.
(ఇ) అల్లాహుమ్మ సల్లి అలా అహ్మద్‌.
6.ఫర్జ్‌ మరియు నఫిల్‌ నమాజులలో ఖియామ్‌ ఒక రుకున్‌.
(అ) అవును
(ఆ) కాదు.
7. నమాజ్‌ చదివే వ్యక్తి సజ్దా చేయునప్పుడు అతనికి సమీపంలో ఉన్న బట్టపైనే సజ్దా చేయవలెను.
(అ) అవును
(ఆ) కాదు
8. నమాజు యొక్క అర్కానులను క్రమంగా పాటించకపోతే అతని నమాజు చెల్లుతుంది.
(అ) అవును
(ఆ) కాదు.
9. ఒక స్త్రీ నమాజులో సలాం పలుకలేదు ఆమె నమాజు:
(అ) చెల్లుతుంది.
(ఆ) చెల్లదు.
10. ”అక్బరుల్లాహ్‌” అనే పదంతో నమాజ్‌ ప్రారంభిస్తే అతని నమాజు:
(అ) చెల్లుతుంది.
(ఆ) చెల్లదు.
11.ఆయిషా నమాజులో సూరతుల్‌ ఫాతిహ చదువుతున్నప్పుడు ఒక పక్షి ఆమె తలపై ఎగురుతుండటాన్ని గ్రహించి భయంతో రుకూలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత అలాగే రుకూ పూర్తి చేసుకుంది. ఆమె నమాజు:
(అ) సరైనది.
(ఆ) సరైనది కాదు.

Related Post