Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

అర్కానుల్‌ ఈమాన్‌ (ఈమాన్‌ మూలస్థంభాలు)

Learning_Islam

ఈమాన్‌ అంటే: విశ్వాసపు మౌలిక సూత్రాలన్నింటిని నోటితో పలకటం, మనసుతో అంగీకరించడం, అవయవాలతో ఆచరణ ఛాయను ఇవ్వడం.

ఈమాన్‌ పుణ్యకార్యాల వలన ఎక్కువవుతుంది, పాపకార్యాలవలన తగ్గుతుంది.

విశ్వాసంలో డెభ్బైకన్నా ఎక్కువ భాగాలున్నాయి. వాటిలో అన్నిటికంటే ఉత్తమమైనది ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ అయితే, అన్నిటికంటే క్రింది భాగం దారిలో నుంచి హానికరమైన వస్తువులను తొలగించటం. సిగ్గు కూడా విశ్వాసంలో అంతర్భాగమే.

విశ్వాసం యొక్క మూలస్థంభాలు ఆరు. వాటన్నింటిని విశ్వసించనంత వరకు విశ్వాసం పూర్తి కాజాలదు. వాటిలో ఏదైనా ఒకదాన్ని తిరస్కరించినా అవిశ్వాసానికి పాల్పడినట్లు.

అల్లాహ్‌ పట్ల విశ్వాసం.               ఆయన  దూతల పట్ల విశ్వాసం.

ఆయన గ్రంథాల పట్ల విశ్వాసం        ఆయన ప్రవక్తల పట్ల విశ్వాసం.

అంతిమ దినం పట్ల విశ్వాసం.         మంచీ చెడు విధిరాతల పట్ల విశ్వాసం.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ాను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవప్రవక్తలనూ విశ్వసించటం.”    (అల్‌ బఖర:177)

ఇంకా ఇలా సెలవిచ్చాడు: ”నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము.”     (అల్‌ ఖమర్: 49)

ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (ర) ఉల్లేఖనం: దైవదూత జిబ్రయీల్‌ (అ) దైవప్రవక్త (స) ను ఈమాన్‌ గురించి ప్రశ్నించగా ఆయన (స) ”అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను,ఆయన  ప్రవక్తలను, అంతిమ దినాన్ని మరియు మంచి చెడు విధివ్రాతను విశ్వసించటం” అని అన్నారు.

ఈమాన్‌ మూల సూత్రాలు ఒక చూపులో:

1. అల్లాహ్‌ పట్ల విశ్వాసం:

అల్లాహ్‌ పట్ల విశ్వాసం అంటే అల్లాహ్‌ా అర్ష్‌పై ఆసీనుడై ఉన్నాడనీ, ఆయనే మన పాలకుడనీ, అన్ని వస్తువులకు యజమాని,  ఆయన కేవలం ఒక్కడేనని, ఆయన దైవత్యము – ఆరాధన ఆయనకు గల పేర్లు (సిఫాత్‌) గుణాలలో  ఆయనకు భాగస్తుడు లేడనీ, ఆయన ఎవ్వరికీ పుట్టలేదని, ఆయనకు ముందు ఏ ఎవరూ లేరని,  అలాగే ఆయనకు భార్య పిల్లలు లేనేలేరనీ, మనోహరమైన సుగుణాలతో కూడివున్నాడనీ, ఆయన మాత్రమే దాస్యానికి అర్హుడనీ ఆయన తప్ప సృష్టి మొత్తం ఆయన దాసులే అనీ నమ్మటం, విశ్వసించటం.

2. దూతల పట్ల విశ్వాసం:

దైవదూతల సృష్టి అగోచరమైన వాటిలో ఒకటి. అల్లాహ్‌ా వారిని (నూర్‌) వెలుగుతో సృష్టించాడు. వారు గౌరవింపదగిన అల్లాహ్‌ దాసులు. వారు అసాంఖ్యాకం. వారిలో అతి ముఖ్యులు ‘జిబ్రయీల్‌, ఇస్రాఫీల్‌, మీకాయీల్‌, మాలిక్‌. వారు తినరు త్రాగరు. వారికి కొన్ని గుణాలున్నాయి. ఉదాహరణకు: రెక్కలుంటాయి,మానవ రూపం కూడా ధరించగలరు, శక్తిగలవారు, మాట్లాడతారు, వింటారు, చూస్తారు. అల్లాహ్‌ ఆజ్ఞాను సారం ఆయన ఆదేశాలను శిరసావహిస్తూ ఉంటారు. అనునిత్యం మనిషి చేసే కర్మలను అవి మంచివైనా, చెడ్డవైనా గ్రంథస్థం చేస్తుంటారు. వారిలో కొందరు మేఘాల కొరకు,కొందరు స్వర్గం నరకం కొరకు ప్రత్యేకమయితే మరి కొందరు సూర్‌ అనే శంఖాన్ని పూరించడానికి అల్లాహ్‌ ఆజ్ఞ కొరకు నిరీక్షిస్తూ ఉంటారు. అలాగే పుణ్యవంతుడైన అల్లాహ్‌ా దాసున్ని కీడు నుండి కాపాడేందుకు కొందరుంటారు. ఈ విధంగా వారు అనునిత్యం అల్లాహ్‌ నామ సంకీర్తనలో నిమగ్నులై, అల్లాహ్‌ా ఆదేశాలను శిరసావహిస్తూ ఉంటారు.

3. గ్రంథాల పట్ల విశ్వాసం:

అల్లాహ్‌ తన ప్రవక్తలకు ప్రసాదించిన దివ్య గ్రంథములు నిజమేనని,సత్యమని అల్లాహ్‌ వాక్యాలని విశ్వసించటం. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”ఇలా చెప్పు; ‘అల్లాహ్‌ అవతరింప జేసిన ప్రతి గ్రంథాన్నీ నేను విశ్వసించాను.” ( అష్‌ షూరా:15)

అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాలు అనేకం. వాటిలో కొన్ని ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడినవి:

తౌరాత్‌ గ్రంథం – మూసా (అ) కు ఇవ్వబడినది.

ఇంజీల్‌ గ్రంథం – ఈసా (అ)పై అవతరించినది.

జబూర్‌ గ్రంథం – దావూద్‌ (అ) పై అవతరించినది.

సుహుఫ్‌ – మూసా (అ) ఇబ్రాహీం (అ) కు ఇవ్వబడినది.

ఖుర్‌ఆన్‌ గ్రంథం – జిబ్రయీల్‌ దైవదూత ద్వారా ముహమ్మద్‌ (స)పై అవతరింప బడినది. ఖుర్‌ఆన్‌, పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలను మన్‌సూఖ్‌ చేస్తుంది, కావున మనం అల్లాహ్‌ పంపిన అన్ని గ్రంథాలను విశ్వసిస్తాము కాని మన కోసం వచ్చిన గ్రంథం ఖుర్‌ఆన్‌, మన ఆచరణ ఖుర్‌ఆన్‌ ప్రకారమే.

 4. ప్రవక్తల పట్ల విశ్వాసం:

అల్లాహ్‌ ప్రజలను కేవలం ఆయన్నే ఆరాధించాలనీ, ఏకదైవారాధన వైపునకు ఆహ్వానించాలని మానవులలో కొందరిని ఎన్నుకున్నాడు. వారిని రుసుల్‌ (ప్రవక్తలు) అంటారు. వారందరూ సత్పురుషులు, మానవులే. అల్లాహ్‌కు గల గుణాలు వారిలోలేవు. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ”అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి”.       (అన్‌ నహ్ల్ : 36)

వారిలో నూహ్‌,ఈసా,మూసా,ఇబ్రాహీం మరియు ముహమ్మద్‌ అలైహిముస్సలాంలు ఉన్నారు. వారందరు దైవప్రవక్తలేనని విశ్వసించవలెను. కాని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) సర్వమానవాళికి ప్రళయం వరకూ ఆయనే ప్రవక్త అని విశ్వసించటంతో పాటు ఆయన (స) షరీఅతు పరంగానే ఆచరించవలెను. ముహమ్మద్‌ (స) ఈసా (అ) పంపబడిన దాదాపు 600 సంవత్సరాల తర్వాత పంపబడ్డారు.

5. విధి పట్ల విశ్వాసం:

విధిపట్ల విశ్వాసమంటే అల్లాహ్‌ సృష్టిరాసుల్ని వాటిని సృష్టించక ముందుగానే వాటి విధిని వ్రాశాడు. ప్రతి వస్తువు యొక్క సంపూర్ణమైన, మరియు అత్యంత వివరమైన పరిపూర్ణ జ్ఞానము అల్లాహ్‌ాకు ఉంది. విశ్వాసం (ఈమాన్‌), కుఫ్ర్‌ (తిరస్కారం), అన్ని విధాల ఉపాధి, జీవితం యొక్క తియ్యదనం చేదుదనం, మరణం అన్నీ అల్లాహ్‌ ఆజ్ఞానుసారం జరుగును.

సృష్టిలోని ప్రతి వస్తువు ఏదో ఒక యుక్తి, ఉద్దేశముతో  కూడి ఉంటుంది. అల్లాహ్‌యే  అన్నీ ఎరుగువాడు, అన్ని ఉపాయములు కలవాడు.

అల్లాహ్‌ తఆలా అన్నింటిని ముందుగానే ”లౌహె మహ్‌ాఫూజ్‌” (భద్రమైన పలక)లో వ్రాసి ఉంచినాడని, ఆయన రాయనిది ఏదీ సంభవించదని విశ్వసించాలి.

 6. అంతిమ దినం పట్ల విశ్వాసం:

మరణానంతర జీవితం గురించి, సమాధి శిక్షల గురించి శిక్షాబహుమానాల విషయం గురించి అల్లాహ్‌ తన పుస్తకం ఖుర్‌ఆన్‌లో, దైవప్రవక్త (స) హదీసులలో వివరించిన ప్రకారం గాఢంగా విశ్వసించటం. మరణానంతరం అల్లాహ్‌ా మానవులందరినీ మళ్ళీ బ్రతికిస్తాడనీ, వారి మంచీ చెడులకు ప్రతిఫలం ప్రసాదిస్తాడనీ, అల్లాహ్‌ాకు విధేయత చూపేవారు విశ్వాసులు స్వర్గంలో ప్రవేశిస్తారనీ, అవిశ్వాసులు నరకంలో ప్రవేశిస్తారనీ మరియు ఈ పరలోక జీవితం శాశ్వితమైన జీవితమనీ అక్కడ చావు రాదనీ విశ్వసించవలెను. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు.”         ( అల్‌ బఖర:4)

పరలోక జీవితాన్ని అంతిమ దినం ఎందుకంటారంటే ఇది చివరి రోజు గనుక. ఆ తర్వాత మరొక రోజు లేదు శాశ్వితంగా స్వర్గం లేదా శాశ్వితంగా నరకం.

Related Post