ధరిత్రిపైన దయ – కరుణ – ప్రేమ – మమతల మల్లెలు చల్లేందుకు వచ్చిన మహనీయులు ముహమ్మద్ (స). మానవ హృదయాల్ని ప్రక్షాళనం చేసి వాటిలో ఒక నూతన శక్తిని నింపి మానవత్వపు మందారాలు పూయించడానికి ప్రభవించిన మహోపకారి మహా ప్రవక్త ముహమ్మద్ (స).
మానవ సమాజంలో ఐకమత్యం- అన్యోన్నత- అనురాగం- సదవగాహన- సుహృద్భావం వెల్లివిరియాలన్నదే ఆయన తపన. న్యాయం- ధర్మం- వివేకం- విజ్ఞానం ప్రజల్లో నెలకొనాలి అన్నదే ఆయన ఆశయం. ఎవరి కర్మలకు వారిని బాధ్యుల్ని చేసి, ఎవరి అంతరాత్మను వారికి గురువుగా చేసి చూపడానికి ప్రభవింపజేయబడిన అత్యుత్తమ సుగుణ సంపన్నులు ముహమ్మద్ (స). అంతేకాని మానవుల్ని విడదీసి, మానవత్వాన్ని మారణ హోమానికి ఆహుతి చేయడానికి కాదు ఆయన వచ్చింది. అంతటి ఘనుల్ని- మక్కా వాసులు ఎందుకు వెలివేసినట్టు? సత్యం అంటే ఎందుకంత అసహ్యం? అవిశ్వాస అంధకారాల్లో పడి మ్రగ్గడమే వారి అభిమతమా?? అసలేం జరిగింది? రండీ! తెలుసుకునేందుకు అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) వారి గత స్మృతుల్ని నెమరు వేసుకుందాం!! న్యాయం ఎటుందో నిర్ణయిద్దాం!!!
ఆదికాలం నుండి మానవులను ఉద్ధరించ డానికి అనేకమంది ప్రవక్తలు, మహాత్ములు వచ్చారు. ఎంత మంది మహాత్ములు ఎంత బోధించినా ప్రజల్లో మాత్రం మార్పు వచ్చినట్లు వచ్చి మళ్ళీ మాయమైంది. పనివాడు యజమానికి- యజమాని పైఅధికారికి- పైఅధికారి మంత్రికి- మంత్రి చక్రవర్తికి- చక్రవర్తి మతాచార్యునికి – మతాధిపతి విగ్రహానికి బానిసై బ్రతుకుతూ వస్తున్నారు. దానికే అలవాటు పడ్డారు. ఆ అలవాటునే ఆరాధనగా భ్రమించారు.
కాలమేదైనా, ప్రాంతమేదైనా, భాష ఏదైనా, ‘విగ్రహారాధన’ అనే విష వృక్షాన్ని ఈ భూమిపై ప్రతిష్టింపజేయించింది షైతానే. ప్రజలచే ప్రజలకు హారతి పట్టే, పూజించే ఆచారాన్ని ప్రవేశ పెట్టింది మొదట షైతాన్. మనిషికి నాటి నుండి నేటి వరకు బద్ధ శత్రువు షైతాన్.
పై కారణాల వల్లనే అప్పటి సమాజంలో అన్యాయం రాజ్యమేలేది. దౌర్జన్యం, దుర్మార్గం తాండవమాడేది. అధర్మం, అసత్యం అపనింద, అపకీర్తి, అవినీతి, ద్రోహం, మోసం, కాపట్యం, విశ్వాస ఘాతకం, ఎగతాళి, తిరస్కారం, మాయ, వంచన, వ్యభిచారం, మద్యసేవనం, అంతర్విభేదం, సతీ సహగమనం- అప్పటి ప్రజల సహజ లక్షణాలుగా చెలామణి అవుతుండేవి. ఇలా బానిసత్వం అనేది ఏదో ఒక రూపంలో వారి మధ్య మసలుతూ ఉండేది. అజ్ఞానం వల్ల అది గొప్పగా- గర్వంగా అంగలు వేస్తూ నంగనాచిలా నడుస్తుండేది. మూర్ఖత్వం- అహంకారం- అవివేకం వల్ల ఎప్పుడూ ఎవరూ పలకరించే దిక్కులేక మానవత్వం మూగదై ఓ మూల తల దాచుకుంది. అలా వారిలో రాక్షసత్వం పెచ్చరిల్లి ‘మంచి’ని బోధించేవారెందరినో మంటల్లో మాడ్చి మసి చేసింది. అలా ఎందరో సత్య మూర్తులు సత్యానికై ప్రాణాలర్పించు కున్నారు. అప్పుడు…. అంతటి…. ఆ …. అంధకారంలో తళుక్కున మెరిసిందొక ఆశా కిరణం! అది మానవ జాతికే మహోదయం!!
ముసలిదై-చీడపట్టి-శక్తిహీనమై-సారహీనమై- భ్రష్టమై- దుష్టమైన నాటి (అ)నాగరికత విష వృక్షాన్ని కూల్చివేయడం కోసం బలీయంగా – భయంకరంగా భూగర్భంలో విస్తరించిన దాని వేళ్ళను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేయడానికి, అత్యాశ, అన్యాయం, అపరాధం, ధనపిపాస అనే దాని పుష్పాలను కాళ్ళతో నలిపి వేయడం కోసం, దుఃఖం, శోకం, భయం, దైన్యం, దుర్దశ, దౌర్భాగ్యం, బానిసత్వం అనే దాని ఫలాలను కోసి విసిరే యడం కోసం నూతనోత్సాహంతో, ఉత్తేజంతో, ఉప్పెనలా స్వేచ్ఛగా – సాహసో పేతంగా దేహం దాల్చడానికి ఓ పవిత్రాత్మ సిద్ధమవుతోంది…! ఆ శుభ తరుణం రానే వచ్చింది…!!
రాత్రి చీకటి నుంచి పగటి కాంతిలోకి అకస్మాత్తుగా ఆవిర్భవించిన తెల్ల గులాబి పువ్వువలే లేలేత బుగ్గల సుతి మెత్తని చిన్నారి చేతులతో, తేజోవంతమైన ముఖ సౌందర్యంతో జన్మించారు బాల ముహమ్మద్ (స). ‘పువ్వు పుట్టగానే పరిమళించినట్లు’ ఉంది ఆయన జననం. ఆ క్షణం – అంధ కారాన్ని తేజస్సుగా, దుఃఖాన్ని సంతోషంగా, నిరాశను ఆశగా ఆనందంగా మార్చివేసింది. మానవ జాతి జీవితాల్ని తేజోవంతం చేయడానికి దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్య జ్యోతి బాల ముహమ్మద్ (స). ఆయన నగ్న పాద స్పర్శతో పుడమి పులకించింది. గాలి ఆయన ముంగురులతో ఆడుకోవ టానికి ఆరాట పడుతోంది.
ఆకాశం నిర్మేఘంగా, నిర్మలంగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. సముద్రం నిశ్చలంగా, నిరాడంబరంగా ఉంది. ‘నువ్వు అద్భుతానంద సుందర జగత్తును దర్శిస్తావు. ప్రకృతి సౌందర్యాన్ని, అంతిమ సత్యాన్ని, సంపూర్ణ ధర్మాన్ని, దివ్యజ్ఞానాన్ని అనేక రేఖల్లో – రూపాల్లో, అక్షరాల్లో తిలకిస్తావు. అవి పాఠకునికి, పరిశీలకునికి, పండితునికి, పామరునికి, అన్వేషకునికి ఎంతో ఆనందానుభూతిని కలిగిస్తాయి’ అని మౌనంగానే దీవిస్తున్నాయి. అవును- అందమైన అతి విలువైన ఆణి ముత్యాల్ని- ఆదర్శాల్ని- ఆశయాల్ని- అభి ప్రాయాల్ని సమస్త మానవాళికి అందజేసి, వారి హృదయాల్ని ఉత్తేజపరచమని, ఉత్తమంగా మలచమని దివినున్న ఆ పరమాత్మ భువికి ఈ చిట్టి ఆత్మను పంపాడు.
దయ – కరుణ – ప్రేమ – సౌభ్రాతృత్వాలు నీలో మూర్త్తీభవించి ఉన్నాయి. కనుక నీవు అన్ని కాలాలకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలవారికి అభిమాన పాత్రుడవవుతావు. ఇది దైవం ముందుగా మాకు తెలియజేసిన నీ భవిష్యవాణి నాయనా!
బాబూ! నువ్వొక మహోన్నత పర్వత శిఖరానివి. అందు నుండి స్వచ్ఛమైన జల సంపద గల ఎన్నో సెలయేర్లు, జలపాతాలు నేల నలుదిక్కులకూ ప్రవహించి- మహా నదులై ఎందరెందరివో సత్యార్తిని తీరుస్తాయి. అనంత జీవనవాహినిని ప్రసరింపజేస్తాయి.
చుట్టూ ఆకాశాన్ని అంటే పర్వతాలు, గుంపుగా ఎగురుతూ పలుకరించుకునే గువ్వలు, ఏటవాలు లోయలు, సాగర సౌందర్యం, అందున దాగిన నిధులు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు, ఊగిపోతున్న వృక్షాలు, నేలతో సరసాలాడుతున్న సూర్యచంద్ర నక్షత్రాలు. నింగి, నింగిలోని గ్రహాలు, గమనాలు, పాలపుంతలు- అన్నీ ఆ శిశువును నిండు హృదయంతో, నిర్మల మనస్సుతో ఆశీర్వదిస్తున్నాయి.