దేశాభిమానం

Independence-Day-Wallpaper-2012

 

ప్రేమ మనిషి నైపుణ్యాన్ని మెరుగులు దిద్ది, అతని ప్రతిభాపాటవాలను ప్రగతి పథంలో పయనింపజేసి, అతనిలో సృజనాత్మక శక్తిని పెంపొందించి, నిర్మాణాత్మక వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవకు సంబంధించినదే దేశాభిమానం. ఏ నేలలోనైతే తను జీవం పోసుకున్నాడో, ఏ నేలలోనైతే తను సభ్యతాసంస్కారాలు నేర్చుకున్నాడో, ఏ నేలలోనైతే తన ఆప్తులు, కన్నవారున్నారో ఆ నేల కోసం తన, ధన,  మానాలను సయితం త్యాగం చెయ్యడానికి సిద్ధమవుతాడు మనిషి. అలా సిద్ధమయినవాడే దేశాభిమాని. ఆ విషయంలో అగ్రభాగాన ఉంటాడు ముస్లిం.

కరుణ, సత్యాలే ఆయుధాలుగా మానవ జాతిని మోక్ష మార్గాన నడిపిన మహా ప్రవక్త (స), మానవ జాతి దాస్య విముక్తికై రాజీ లేని పోరు సలిపిన మహా ప్రవక్త (స), స్వార్థచింతన లేకుండా మానవాళి ఇహపరాల సాఫల్యాల కోసం అహరహం శ్రమించిన మహా ప్రవక్త (స), జాతి, కులం, భాష, ప్రాంతం అంటూ ఎవరికి వారుగా ఉన్న మానవ జాతిని ‘మీరంతా ఆదంతో, అదం మట్టితో’ – మీరంతా పరస్పరం దైవదాసులుగా, అన్నదమ్ములుగా మసలుకోండి, మీ కోసం దేన్నయితే ఇష్ట పడతారో మీ సోదరుల కోసం సయితం వాటినే ఇష్టపడండి. మిమ్మల్ని మీ తాతముత్తాతల్ని పుట్టించిన ఒకే ఒక్క సృష్టికర్త అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధిం చండి’ అని అందరిని ఏకతాటి మీదకు తీసుకు వచ్చిన మహా ప్రవక్త (స), సంకల్ప శుద్ధి, ఆత్మ పవిత్రత, నిర్మల మనస్తత్వం, నిస్వార్థ సేవ స్వర్గ లక్ష్య సిద్ధికి చేరువ చేస్తాయని ఎరుకపరచిన మహా ప్రవక్త (స), రవి అస్తమించని సామ్రాజ్యాలుగా విర్రవీగిన రోమ్‌, పర్షియన్లను సత్యతా కరావాలంతో మట్టి కరిపించి హృద యాల విజేతగా నీరాజనాలు అందుకున్న మహా ప్రవక్త (స), మూఢాచారాల, మింగుడు పడని సిద్ధాంతాల కాడిని మానవ భుజాల మీద నుండి తొలగించి ప్రవక్తలందరికి నాయకుడుగా, సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా ప్రభుచే ప్రశంస పత్రాన్ని పొందిన మహా ప్రవక్త  ముహమ్మద్‌ (స) సయితం తన జన్మ భూమిని ప్రేమించారు. తను పుట్టిన గడ్డ  పట్ల తనకున్న అభిమానాన్ని ఆయన అనేక సందర్భాల్లో వ్యక్త పర్చారు కూడా.

దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత – ‘నేను కూడా యువకుడినై, ప్రజలు మిమ్మల్ని మీ జన్మ భూమి నుండి బహిష్కరించే కాలం వరకూ బ్రతికుంటే ఎంత బాగుండేది’ అని వరఖా బిన్‌ నౌఫల్‌ సానుభూతిని కనబరచినప్పుడు, దైవ ప్రవక్త (స) ఆశ్చర్యపోతూ – ”ఏమిటి నా జాతి ప్రజలు నన్ను నా స్వస్థలం నుండి వెలివేస్తారా?” అని అడిగారు.   తర్వాత దైవాజ్ఞ  మేరకు మక్కాను వదలి వెళ్ళ వలసిన సమయం వచ్చినప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) కాబా వైపు ఆఖరి సారి చూస్తూ, ”ఓ మక్కా! నువ్వు నాకు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన భూభాగానివి. నా జాతి ప్రజలు నన్ను వెలివేయకుండా ఉండి ఉంటే నేను నిన్ను వదలి వేరే భూభాగంలో నివాసం ఏర్పరచుకునేవాడను కాను” అన్నారు.   (తిర్మిజీ) ఈ సంఘటన తర్వాత అభయమిస్తూ అల్లాహ్  ఈ వచనాలను అవతరింపజేశాడు: ”(ఓ ప్రవక్తా!) నీపై ఖుర్‌ఆన్‌ను అవతరింప జేసినవాడు నిన్ను తిరిగి పూర్వ స్థలానికి చేర్చనున్నాడు”.   (ఖసస్‌: 85)

 

నిజం – మనిషికి తన ప్రాణమన్నా, తన దేశం అన్నా వల్ల మాలిన అభిమానం. ప్రాణం పోవడాన్ని, దేశం నుండి వేరవడాన్ని ఏ వ్యక్తి సులభంగా ఇష్ట పడడు. మనిషి ఈ స్వభావాన్నే అల్లాహ్‌ా ఇలా తెలియ జేస్తున్నాడు: ‘ఒకవేళ మేము ”మిమ్మల్ని మీరు చంపుకోండి లేదా మీ ఇళ్ల నుంచి వెళ్లిపోండి” అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహుకొద్ది మంది మాత్రమే దాన్ని పాటించేవారు’. (అన్నిసా: 66)

ఇబ్రాహీమ్‌ బిన్‌ అద్హమ్‌ (ర) ఇలా అభిప్రాయపడ్డారు: ”నేను అనేకుల్ని మానసికంగా చికిత్స చేశాను. అప్పుడు వారిలో దేశాభిమానం అనేది చాలా బలంగా ఉందన్న విషయాన్ని నేను గ్రహించాను”.   ముహమ్మద్‌ గజాలీ ఇదే విషయమై ఇలా అన్నారు: ”మనుషులు తమ స్వస్థలం పట్ల అందలి వస్తువుల పట్ల, అభిమానం కలిగి ఉంటారు. చివరికి అది నిర్జన అరణ్య ప్రాంతమైనా సరే. దేశాభిమానం మానవ హృద యాల్లో వేళ్లూనుకొని ఉంటుంది. ఆ కారణంగానే మనిషి తన దేశంలో నివాసం ఉండటానికి ఇష్ష పడతాడు. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల దేశం వదలి వెళ్ళ వలసివచ్చినా తిరిగి వచ్చేంత వరకు హృదయం స్వదేశ దర్శనానికై పరితపిస్తూనే ఉంటుంది. ఈ కారణంగానే తన దేశం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడి తే సహించడు మానసం గల మనిషి. ఒకవేళ దాన్ని కబళించాలని ఎవరైనా చూస్తే భరించడు అత్మాభిమానం గల మనీషి. పై పేర్కొనబడిన అభిమానం వల్లనే కువైటీ ప్రజలు తమ దేశ స్వాతంత్రదినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మన దేశ ప్రజలూ ఎందరో ప్రతి ఏడాది కువైట్‌లోని మన దేశ దౌత్య కార్యాల యం నిర్వహించే స్వాతంత్య్ర, గణతంత్ర సంబరాల్లో పాల్గొనడం శుభ సూచకమే. కానీ, వారి సంఖ్య బహు స్వల్పం. భారతీయులు – వారు ఏ మతస్థులైనా ఈ విషయమై నిశితంగా ఆలోచించాలి. ఇకపోతే -,

ఆరుగాలం శ్రమించి జాతి ప్రాణాలు నిలిపే ఆహారాన్ని అందించేది రైతులైతే, అన్ని కాలాల్లో ఎన్నో కష్టాల కోర్చి ప్రజల ప్రాణాలు కాపాడేది సరిహద్దు సైనికులు. దేశ రక్షణ కోసం అంకితమై, స్వంత జీవితానికి దూర మై, ప్రాణాన్ని పణంగా పెట్టి, కొండల్లో, కోనల్లో, మండే ఎండల్లో, వణికించే చలి మంటల్లో అహర్నిశలు తమ బాధ్యతను నిర్వహించే త్యాగధనులు వీర సైనికులు. మనం ఈ రోజు హాయిగా గుండె మీద చేయి వేసుకుని ఉండటానికి కారకులు వారు. వారి త్యాగం వెలకట్టలేనిది. అలా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో పథకాలు అమలు పర్చారు. వారందరి లక్ష్యం ఒక్కటే – మానవ జాతి స్వేఛ్చా వాయువుల్లో జీవించాలి. ప్రతి మనిషికి ఆత్మగౌరవంతో బ్రతికే కనీస సౌకర్యం కలుగుజేయాలి.

సిద్ధాంత, సంక్షేమ రహిత రాజకీయాలు, శ్రమ రహిత సంపద, నీతిరాహిత్య వ్యాపారం, నైతికత శూన్య విద్య, హృదయ రహిత ఆనందం, మమత కరువైన (మర) జ్ఞానం, ఆత్మశుద్ధి లేని ఆరాధనలతో నేడు ముప్పూటలా కడుపు నిండా మెక్కే నాయకులకు  ఆ రైతుల గోడు అర్థం కాదు. స్వార్థ ప్రయోజనాల కోసం మారణ హోమాన్ని సృష్టిస్తున్న అల్ప బుద్ధి అలగాజనాలకు, మత ఛాందస వాదులకు ఆ సైనికుల త్యాగం బోధ పడదు. పదవికి కావాల్సింది కులం, వారసత్వం, ఆకర్షణ కాదు. పదవి అంటే ప్రజలకు సేవ చెయ్య డానికి లభించిన సువర్ణావకాశం అని కుయుక్త హృదయులకు అర్థమయయ్యేది ఎప్పుడు? మన జాతి గతి సుగతి అయ్యేదెప్పుడు? మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకోవాల్సింది పోయి, వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకొంటున్న దుర్భిక్ష  స్థితి మనది. దీని తీరుతెన్నులు మారేదెప్పుడు?   మనం తయారు చేెసుకునే బొమ్మకి ఆందమైన ఆకారం కావాలంటే చక్కనైనా నమూనా ఎంచుకోవాలి.  సేవ చేసే నాయకులు కావాలంటే ‘ఖలీఫా అబూ బకర్‌ మరియు ఉమర్‌ (ర)’ల గురించి గాందీ గారు చెప్పి మాటలు గుర్తు తెచ్చుకోవాలి.  అలాంటి నాయకుల్ని మనమే ఎంచుకోవాలి లేదా తయారు చేసుకోవాలి. అప్పుడుగాని అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రతుకులు తెప్పరిల్లవు.

”స్వాంతత్య్రం వచ్చింది…దేశం మనదైంది…అని ఇష్ట వచ్చినట్లు ప్రవర్తించలేము. ఇప్పుడే మనం మరింత క్రమశిక్షణతో, ఆత్మనిగ్రహంతో మసలుకోవాలి. అన్యోన్య సౌహార్దామృతంతో భారతావనిని అగ్రగామి చేయాలి” అన్న ఓ మేధావి మాట మనందరికి స్ఫూర్తి కావాలి.

Related Post