దేవుడు ఒక్కడే

1557185 (1)

మానవులంతా… ఏ కులం, ఏ మతం, ఏ ధర్మం, ఏ ప్రాంతం, ఏ వర్గం వారైనప్పటికీ, ఏభాష మాట్లాడేవారైనప్పటికీ దాదాపు అందరూ ఒకే దైవాన్ని విశ్వసిస్తారు. సకల చరాచర సృష్టికర్త ఒక్కడేనని నమ్ముతారు. సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడు ఏకైక దైవమే అని అంగీకరిస్తారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం విఫలం అవుతున్నారు. సృష్టికర్తను వదిలి సృష్టితాల వెంటపడుతున్నారు. దీనికి కారణం మానవులు దేవుడు బోధించిన మంచిమాటల పట్ల శ్రద్ధ వహించకపోవడమే. సృష్టికర్త గుణవిశేషాలను నిర్వచించే ఆధారాలు, సూచనలు… చివరి దైవగ్ర ంథమైన ఖురాన్‌లో అనేకం ఉన్నాయి.

‘‘అల్లాహ్, ఆయన ఒక్కడు. ఏకైక దేవుడు. ఆ దేవుడు ఎవరి అవసరమూ లేని నిరపేక్షాపరుడు. ఆయనకు ఎలాంటి సంతానం లేదు. ఆయన కూడా ఎవరి సంతానంగా లేడు. ఆయనకు సమానమైన వారెవరూ లేరు. ఆయన సాటిలేని మహామేటి’’ (112 – 1,4).

‘‘దైవం ఎవరినీ తన సంతానంగా చేసుకోలేదు. ఆయనతోపాటు మరేదేవుడూ లేడు (ఒకరికి మించి). ఇతర దేవుళ్లు కూడా ఉన్నట్లయితే, ప్రతిదేవుడూ తన సృష్టిని తీసుకొని వేరైపోతాడు’’ (23 – 91).

‘‘ఆయన యావత్తు భూమ్యాకాశాలను సృష్టించిన అద్భుతశక్తి సంపన్నుడు. ఆయనకు అసలు భార్యే లేనప్పుడు కొడుకులు ఎలా కలుగుతారు’’(6 – 101) ఇలాంటి నిర్వచనాలే వేదాల్లో కూడా ఉన్నాయి… ‘‘ఏకోబ్రహ్మద్వితీయనాస్తి’’ (దేవుడు ఒక్కడే. ఇద్దరు లేరు), శ్వేతాశ్వతకోపనిషనిత్తులో ఇలా ఉంది… ‘‘నతస్య కార్యం కరణశ్చా, నత తత్సమశ్చాన్యాధికశ్చ దృశ్యతే (ఆ పరమేశ్వరునికి శరీరం కాని, చ క్షురింద్రియాలు గాని లేవు. ఆయనతో సమానుడు గాని, అధికుడు గాని ఎవ్వరూ లేరు), న కారణం కరణాధిపాధిపో న చాస్య కశ్చిజ్ఞనితానచాధిపః (అతడే సర్వకారణభూతుడు, ఇంద్రియాధిష్టాన దేవతలకు, సూర్యాది దేవతలకు ప్రభువు.

అతని జనకుడు గాని, అతని కంటే అధికుడు గాని ఎవ్వరూ లేరు) ‘‘ఎవ్వరు నన్ను పుట్టుక లేనివానిగా, అనాదిరూపునిగా, సమస్త లోకాలకు నియామకునిగా తెలిసికొనుచున్నారో, వారు మనుష్యులలో అజ్ఞానము లేనివారై, సకల పాపాల నుండి లెస్సత విడువబడుచున్నారు (గీతాశాస్త్రం 10 – 3) నాశనరహితమైనదీ, సర్వోత్తమమైనదీ, ప్రకృతికి పరమై విలసిల్లునదీ అయిన నా స్వరూపము తెలియని అవివేకులు, అవ్యక్తరూపుడినైన నన్ను పాంచభౌతికదేహం పొందినవానిగా భావిస్తున్నారు (గీత7- 24).

‘‘అసలు ఆరాధ్యుడు అల్లాహ్‌యే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన నిత్యసజీవుడు. ఎన్నటికీ నిద్రించనివాడు. కనీసం కునుకుపాట్లు కూడా పడనివాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనదే’’ (పవిత్ర ఖురాన్ 2- 225).

ఈ విధంగా ఖురాన్, వేదాలు, అలాగే బైబిల్‌లో కూడా దేవుని ఏకత్వానికి సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయి. మనం వాటిని అధ్యయనం చేసి, ఆచరించగలిగితే ప్రాపంచిక జీవితంతో పాటు, శాశ్వతమైన పరలోక జీవితంలో కూడా సాఫల్యం పొందవచ్చు.

 

Related Post