దేవుని అపురూప సృష్టి

  దేవుని అపురూప సృష్టి (తఫ్సీర్ అహ్సనుల్ బయాన్)
”మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు – మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి! ఆయన మీ మధ్య ప్రేమనూ, దయాభావాన్నీ పొందుపరచాడు. నిశ్చయంగా ఆలోచించేవారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి. భూమ్యా కాశాల సృష్టి, మీ బాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి”. (దివ్యఖుర్‌ఆన్‌ – 30: 21,22) 
1) అంటే మీ కోవలో నుంచే ఆడవారిని సృష్టించాడు. వారు మీకు జత కావటానికి! మీరు వారి ద్వారా సుఖప్రాప్తిని పొందటానికి!! అరబీలో జౌజున్‌ అంటే జంట లేక జత అని అర్థం. ఆడది మగవానికి, మగవాడు ఆడదానికి జత (జౌజ్) అన్నమాట! దేవుడు లోకంలో తొలి స్త్రీని – హవ్వాను – సృజించేటప్పుడు ఆది మానవుడైన ఆదం ఎడమ వైపు ప్రక్కటెముక నుంచే ఆమెను సృష్టించాడు. ఆ తరువాత ఆ మానవ జంట ద్వారా అవనిలో మానవ జాతిని వ్యాపింప జేశాడు.
2) స్త్రీపురుషులిద్దరూ – ఒకే జాతికి చెందినవారై ఉండి, వారిద్దరూ జంటగా ఏర్పడటం వల్ల సహజమైన ప్రశాంతత, హాయి వారిద్దరికీ లభిస్తోంది. అలాగాకుండా వారిద్దరిలో ఒకరు మనుజ జాతికి చెందినవారు, మరొకరు జిన్నాతుల కోవకు చెందినవారై ఉంటే ఇరువురూ ఎన్నడూ ప్రశాంతంగా ఉండలేరు. పైగా వారి మధ్య అసహ్యభావం పెంపొంది, దాంపత్య జీవితం దుర్భరమవుతుంది. అందుకే అల్లాహ్‌ా మానవ జంటలను మానవుల్లో నుంచే సృజించి వారికి మహోపకారం చేశాడు.
3) ‘మవద్దతున్‌’ అంటే ప్రేమ అని అర్థం. భర్త భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అలాగే భార్య భర్తను అమితంగా ప్రేమిస్తుంది. ఈ విషయం జగద్విదితమే. ఆలుమగల మధ్య కనిపించే ఈ అపురూపమైన ప్రేమానురాగాలు ప్రపంచంలో మరే ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా కనిపించవు. ఇక ‘దయాభావం’ గురించి చెప్పాలంటే భర్త భార్య కోసం అష్ట కష్టాలు పడి ఆమెను సుఖపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఉన్నంతలోనే ఆమె కొరకు మంచి మంచి సౌలభ్యాలను సమకూరుస్తాడు. అలాగే భార్య తన భర్త కోసం సర్వస్వాన్నీ అర్పిస్తుంది. అతని యోగక్షేమాల కోసం చేయగలిగినంతా చేస్తుంది.    అయితే ఈ దంపతులకు ప్రశాంతత, నిజమైన ప్రేమానురాగాలు లభించేదెప్పుడు? వారు కట్టుకున్న అనురాగ గోపురం పటిష్టంగా ఉండగలిగేదెప్పుడు? అంటే షరీయతు ఆమోదించిన పద్ధతి ప్రకారం – ‘నికాహ్ ‘ ద్వారా – భార్యాభర్తలై నప్పుడే. వీరినే ఇస్లాం దంపతులుగా ఖరారు చేసింది. వారి హక్కులు – బాధ్యతలను నిర్దేశించింది. చట్టవిరుద్ధమైన దంపతులను (అక్రమంగా జత కట్టినవారిని) అది భార్యా భర్తలుగా అంగీకరించదు. పైగా అలాంటి వారిని వ్యభిచారులు గా, దుర్మార్గులుగా ప్రకటిస్తుంది. వారి కోసం శిక్షల్ని ప్రతి పాదిస్తుంది.
4) ప్రపంచంలో ప్రజలు మాట్లాడే భాషలు అసంఖ్యాకం. అది కూడా దైవ సూచనలకు ప్రతిబింబమే. అరబీ, ఆంగ్లం, ఫ్రెంచి, ఉర్దూ, హిందీ, పారసీకం వంటి అంతర్జాతీయ స్థాయి భాషలే గాక ప్రతి దేశంలో వేర్వేరు భాషలున్నాయి. ఒక్క భారత దేశంలోనే ఒక డజనుకు పైగా గుర్తింపు పొందిన భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందని భాషలు ఇంకా అనేకం. మరి ఒకే భాషలో అనేక మాండలికాలు, యాసలు ఉంటాయి. ప్రతి వ్యక్తీ తాను మాట్లాడే యాసను బట్టి ఏ ప్రాంతంవాడో ఇట్టే గుర్తించ బడతాడు. ఆ విధంగా మనిషి మాట్లాడే భాష లేక అతని యాస అతన్ని పరిచయం చేెసేసుకుంటుంది. అలాగే కోట్లాది మంది మానవులు ఒకే తల్లిదండ్రులైన ఆదం – హవ్వాల నుంచి వచ్చినవారైనప్పటికీ వారి రంగులు వేరు, రూపురేఖలు వేరు. ప్రతి ఒక్కరూ ఇతరులకన్నా భిన్నంగా, విలక్షణంగా కనిపిస్తారు. వారిలో కొందరు తెల్లవారు, కొందరు నల్లవారు, కొందరు చామనఛాయ, కొందరు గోధుమ రంగు గలవారున్నారు. అలాగే కొందరు పొట్టివారు, కొందరు పొడుగరులు. ప్రతి దేశం, ప్రతి ఖండం వారు తమ శరీరాకృతిని బట్టి ఇట్టే తెలుసుకోబడతారు. అంతేకాదు, ఒకే తల్లి బిడ్డలైన ఇద్దరు అన్నదమ్ములు కూడా భిన్నంగా కనిపిస్తారు. ఇదంతా ఆ సృష్టికర్త అపురూప సృష్టికి ప్రబల తార్కాణం.

Related Post