షేఖ్ అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
దివ్యఖుర్‌ఆన్ సర్వలోకాల ప్రభువు తరఫున సమస్త మానవులకు మార్గదర్శకంగా అవతరించిన గ్రంథం.
(ఈ గ్రంథం) ”సమస్త లోకాల ప్రభువు తరఫున అవతరింపజేయబడిన గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు”.(దివ్య ఖుర్‌ఆన్-32:2)
”ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన,వివేకవంతుడయిన అల్లాహ్‌ా తర ఫున జరిగింది”. (39:1)
దివ్య ఖుర్‌ఆన్ అవతరణ రమజాను మాసంలో జరిగింది. ”రమజాను నెల, ఖుర్‌ఆన్ అవతరించిన నెల.అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరు పరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి”. (2: 185)
”నిస్సందేహంగా మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్ ను) ఘనమయిన రాత్రి యందు అవతరింపజేశాము. ఘనమయిన రాత్రి గురించి నవ్వేమనుకు న్నావు. ఘనమయిన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా మేలయినది. ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుండి భువికి) దిగి వస్తారు. ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది. తెల్లవారే వరకూ (అది ఉంటుంది)”. (97: 1-5)
దివ్యఖుర్‌ఆన్ రమజాన్ మాసంలో ఘనమయిన రేయి లైలతుల్ ఖద్ర్ లో ‘లౌహె మహ్ఫూజ్’ నుండి భూఆకాశంపై అవతరింపజేయబ డింది. అక్కడ ‘బైతుల్ ఇజ్జత్’ కీర్తి నిలయంలో భద్రపరచబడింది. అక్కడి నుంచి పరిస్థితులకనుగుణంగా క్రమక్రంగా అవతరిమచి 23 సంవత్సరాల వ్యవధిలో పూర్తయింది. (ఇబ్నె కసీర్)
దివ్యఖుర్‌ఆన్ హృదయాలకు ఔషధం:
”ప్రజలరా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది. నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (10: 57)
దైవ ధిక్కారం, సత్య తిరస్కారం, కాపట్యం, పదార్థ పూజ వల్ల మానవ హృదయాలకు పట్టిన వ్యాధులు – అసూయ, ఓర్వలేనితనం, స్వార్థం, అవకాశవాదం, ధనవ్యామోహం, అధికార వాంఛ, అహంకారం, దోపిడి మనస్తత్వం, అదుపు లేని లైంగిక కోర్కెలు, ఆవేశం, ప్రతీకార భావం మొదలయినవి ఎన్నో మానసిక రుగ్మతల నుంచి స్వస్థత నొసగే అమృతధార దివ్యఖుర్‌ఆన్. ఈ గ్రంతాన్ని విశ్వసించి, దీని బోధనల వెలుగులో జీవితం గడిపేవారు ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దివ్యఖుర్‌ఆన్ వంటి గ్రంథం వేరొకటి లేదు:
”(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నులు కలిసి ఈ ఖుర్‌ఆన్ వంటి గ్రంథాన్ని తేదలచినా – వారు ఒండొకరికి తోడ్పాటు అందజేసుకున్నా ఇటువంటి దానిని తీసుకు రావటం వారి వల్ల కాని పని”. (17: 88)
నేటికీ ఖుర్‌ఆన్ అవతరించి 1444 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకూ అల్లాహ్‌ా చేెసిన ఈ ఛాలెంజీని ఎవరు ఛేదించ లేకపోయారు. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. నేటికీ అటువంటీ అరకొర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
ఖుర్‌ఆన్ గ్రంథం – ఇందులో సృష్టికర్త పరిచయమూ ఉంది. సృష్టి వాస్తవికతా ఉంది. మానవ నిర్మాణం గురించి అద్భుత సమాచారమూ ఉంది. మనిషి పుట్టుక లక్ష్యమూ ఉంది. ఆ లక్ష్య సిద్ధికి మార్గాలూ ఉన్నాయి. గతించిన జాతుల ప్రస్తావనా ఉంది. రాబోయే తరాల వారిపై ఏం జరగబోతుందో కూడా ఇందులో ఉంది. మానవ హక్కుల ప్రస్తా వనా ఉంది. ఉత్తమ సమాజానికి దోహదపడే సువర్ణ సూక్తులూ ఉన్నాయి. స్వర్గనరకాల ప్రస్తావనా ఉంది. కుటుంబ, సమాజ, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన మౌలిక విషయాలూ ఉన్నాయి. ఈ మహత్తర గ్రంథం శైలి ఎంతో మనోహరమయినది. పద్య, గద్య సుగుణాలన్నీ ఇందులో ప్రోది చేయబడి ఉన్నాయి. దీన్ని ఎంతగా పఠించినప్పటికీ విసుగు అన్పించదు. దీని పారాయణం వినూత్నాను భూతికి లోను చేస్తుంది. దీని బోధనల్లో సహజత్వం ఉట్టి పడుతుంది. అది చూపే మార్గం సరళమయినది, ఎంతో సవ్యమయినది, సత్యబద్ధ మయినదీను. ”నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్ అన్నింటికంటే సవ్యమయిన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప ప్రతిఫలం ఉందన్న శుభవార్తను అది వినిపిస్తుంది”. (17: 9)