అశాశ్వతమైన ఈ లోకంలో దేవుడు కష్టం, సుఖం, అదృష్టం, దురదృష్టం, మిత్రులు శత్రువులు, ఆరోగ్యం, అనారోగ్యం లాంటి సుఖదుఃఖాలెన్నింవిరినో సృష్టించాడు. మనిషి తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తరచూ ఇలాంటి వాటికి గురవుతూనే ఉంటాడు. అయితే దేవుడు వాటితోపాటు వాటి నుండి రక్షణ పొందటానికి ఎన్నో పద్ధతులు, ముందు జాగ్రత్తలు కూడా సూచించాడు. వాటిని ఆచరించి మనిషి తన్ను తాను కష్టాల నుండి రక్షించుకోగలడు. మానవులు రోగాలను నయం చేసుకోవటానికి ప్రార్థనలను, మందులను కూడా దేవుడు పుట్టించాడు. అందుకే దైవప్రవక్త (స) ఒకానొక సందర్భంగా ”దేవుడు ప్రతి వ్యాధికీ చికిత్సను, ఔషధాలను పుట్టించాడు” అని అన్నారు. (బుఖారీ)
దుఆలను అల్ల్లాహ్ మాత్రమే ఆలకిస్తాడు
వాస్తవానికి మానవుల్ని దుఃఖవిచారాలకు, కష్టాలు కడగండ్లకు గురి చేసేవాడూ, తిరిగి వాటి నుండి కాపాడి వారికి సౌఖ్యాన్నీ, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కూడా దేవుడే! సృష్టిలోని ప్రతి వస్తువుపై ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. అయితే ఈ కష్టాలు, కడగండ్లకు గురైనప్పుడు తనను మొరపెట్టుకునే వారిని ఆయన అమితంగా ప్రేమిస్తాడు. ఆ విధంగా మొరపెట్టుకోవటాన్నే ‘దుఆ’ అని అంటారు.
”బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి, అతని బాధను దూరం చేసేవాడు ఎవడు?” (ఖుర్‌ఆన్- 27: 62)
పుట్టుక రీత్యా మనిషి అవసరాలు, అక్కరలు కలవాడు. సహజంగానే అతనికి అవసరాలు ఏర్పడుతుంటాయి. అల్లాహ్‌ా మాత్రమే సర్వ సంపన్నుడు, నిరపేక్షాపరుడు. ఆయన ఇలా అంటున్నాడు:
”మానవులారా! మీరందరూ అల్లాహ్‌ా అవసరం కలవారే. కాని అల్లాహ్ మాత్రం సర్వ సంపన్నుడు, స్వయంగానే స్తుతిపాత్రుడు”. (ఖుర్‌ఆన్ – 35: 15)
అల్ల్లాహ్‌ను తప్ప ఇతరులను ప్రార్థించరాదు
మనిషి సహజంగా అవసరాలు కలవాడు అవడం చేత దుఆ తప్ప అతనికి గత్యంతరం లేదు. దుఆ మనిషికి నిత్యావసరం. మానవులు సాటి మానవుల్ని మొరపెట్టుకోవటం ప్రకృతి విరుద్ధమైన పని. స్వయంగా నిస్సహాయుడైన మానవుడు సాటి మానవుల నిస్సహాయతను దూరం చేయలేడు. అల్లాహ్‌ాను వదలి పెట్టి ఇతర సజీవినిగాని, నిర్జీవినిగాని మొరపెట్టుకోవటం ఎంత తెలివి తక్కువ పనంటే అలా చేసేవాడు నీళ్ళ ముందు నిలబడి ”వచ్చెయ్యి! నా నోట్లోకి వచ్చెయ్యి” అని నీళ్ళను పిలిచే మూర్ఖుడితో సమానం. (13: 14).
విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన అల్లాహ్‌ాను త్రోసిరాజని సజీవ లేక నిర్జీవ సృష్టిరాసుల్ని మొరపెట్టుకునేవారు ఎంత అవివేకులు?! కొందరయితే కదలలేని, మెదలలేని, కనులు విప్పి చూడలేని, పెదవి విప్పి పలకలేని రాళ్ళను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకొని వాటిని తమ కష్టాల గురించి మొర పెట్టుకుంటుంటారు. ఈ వైఖరి మరీ దారుణం!
సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ా కొలువు తీర్చి, ”నన్ను మొరపెట్టుకోండి. నేను మీ మొరలను ఆలకిస్తాను” అని ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఆయన దాసులు ఆయన్ని వదలిపెట్టి ఇతర మిథ్యా దైవాల ముందు చేయి చాపటం ఎంత దిగజారుడుతనం?! ఒక ముస్లిం అలాంటి ఘాతుకానికి ఒడిగడితే అది ఇంకా శోచనీయమైన విషయం!
‘దుఆ’ కూడా ఒక ఆరాధన లాంటిది. ఆరాధనలన్నీ అల్లాహ్‌ాకే చెల్లుతాయి. అల్లాహ్‌ాను వదలి ఇతరుల్ని మొరపెట్టుకోవటం, వారిని సహాయం చేయమని అర్థించటం, వారిని ఆపద మ్రొక్కువారిగా తలపోయటం ”షిర్కె జలీ” (బహిరంగ బహుదైవారాధన) అవుతుంది. దేవుడు దాన్ని ఎన్నటికీ మించడు.
విశ్వాసి చేతిలో ‘దుఆ’ ఆయుధం వంటిది. దాని ముందు పెద్ద పెద్ద ఆయుధాలు కూడా పనికిరాకుండా పోతాయి. హృదయావేదనకు ఉపశమనం, బాధితులకు ఆధారం, భయాందోళనలకు గురయిన వారికి అభయ హస్తం దుఆ!
బాధితుని శాపం సప్తాకాశాలనూ చీల్చుకుని వెళుతుంది
బాధితుని నోటి నుండి వెలువడే దుఆ అంతరిక్షాన్ని, సప్తాకాశాలనూ చీల్చుకుంటూ దైవ సన్నిధికి వెళ్ళి బాధితునికి సహాయం అందేలా చేస్తుంది.
దుఆ ఎన్నడూ త్రోసిపుచ్చబడదు!
దాసుడు చేసే దుఆ ఎట్టి పరిస్థితిలోనూ త్రోసిపుచ్చబడదు. దాసుని దుఆ ఒక్కోసారి వెంటనే దైవ సన్నిధిలో స్వీకృతికి నోచుకుంటుంది. లేదా దాని మూలంగా అతనికి రాబోయే ఆపదలు, గండాలు తప్పి పోతాయి. లేదా ఆ దుఆ అతని పరలోక జీవితం కొరకు నిక్షేపంగా ఉంచబడుతుంది.