తమస్సు తొలిగింది

తమస్సు తొలిగింది  – (ఇది మనసు మనుషుల సంభాషణమనస్సనేది రెండు రకాలు1)తమస్సునఫ్సే అమ్మారా 2) ఉషస్సునఫ్సే లవ్వామామనసు ఒకటే అయినా రూపాలు రెండుఒకటి చీకట్లను నింపితే మరొకటి వెలుగుల్ని వ్యాపింపజేస్తుందితమస్సు అధీనంలో ఉన్నప్పుడు  మనిషి ఎలా ఉంటాడోఉషస్సు వెలుగులో ఎలా జీవిస్తాడో తెలియజేసేందుకు వ్రాసినదే   వ్యాసం. )

 

మనిషి: ఎక్కడిదీ వికటాట్టహాసం? కన్ను పొడుచుకున్నా కనిపించని ఈ కారు చీకటిలో ఎవరిదీ అట్టహాసం? ఎవరో ఇటే వస్తున్నారు. ఏయ్! ఎవరు నువ్వు?

 తమస్సు: నేనా? నేనెవరో నీకు తెలియదా? నరుడా! పామరుడా! (వెకిలి నవ్వు….)

 మనిషి: ఏమిటా నవ్వు? నీ వెకిలి నవ్వులలో హడలిపోయి వచ్చిన దారి తిరిగి పోయే పిరికిని కాను. నా  సత్యాన్వేషణ సాగక తప్పదు. నా లక్ష్యాన్ని నేను సాధించక తప్పదు. నాకడ్డం నిలవకు. నన్ను వెళ్ళనీ. ఉషస్సు కాంతుల్లో ఊయలలూగని. ఊఁ..

 తమస్సు: ఎక్కడికి నీవు వెళ్ళేది?

 మనిషి: అదంతా నీకనవసరం.

 తమస్సు: నాకూ? అనవసరమా? (వెకిలినవ్వు) మూర్ఖుడా! నాకన వసరమ యింది ఈ జగాన ఉందా? ప్రతి మనిషిలో రక్తం కన్నా వేగంగా ప్రవహించే నాకే ఎదురు చెబుతావా?  హాబిల్ ఎలా పరాజయం పాలయ్యాడో, నూహ్ కుమారుడు జల ప్రళయానికి ఎలా ఆహుతి అయ్యాడో, నమూద్ ఎలా ప్రాణాలు వదిలాడో, ఫిర్ఔన్ కు ఎలాంటి దుర్గతి పట్టిందో, ఖారూన్ ఏ విధంగా భూమిలో  కూరుకుపోయాడో, అబూ లహబ్, అబూ జహల్ ఎలా తుడిచి పెట్టుకుపోయారో, నేడు ఎవరు నియంతలై వ్యవహరిస్తున్నారో, సారాయిలో ఉన్న కిక్కేమిటో, జూదంలో ఉన్న ట్రిక్కేమిటో, పాపభూయిష్ట లుక్కేమిటో, షిర్క్ చిక్కేమిటో చెప్పమంటావా? రహస్య చిట్టామొత్తం విప్పమంటావా?

వివేచనా పరులు ‘ఈ లోకం పరలోక పంట పొలం’ అంటారు. ఈ లోకం, లోకంలోని సమస్తం ఏదో ఒకనాడు నశించక తప్పదు. దీనికతీతంగా శాశ్వతమయిన మరో లోకం ఉంది.  అదే పరలోకం అదే స్వర్గం. అదే పరమాత్మ దర్శనంతో పునీతమయ్యే జగం. అదే అసలయిన  వెలుతురు.

 మనిషి: చాలు చాలు, డాంబికాలకేం తక్కువ లేదు. అంతా తెలిసినట్టు మిడిసి పడుతున్నావే. ఇంతటి దానవై నా దారికెందుకు అడ్డంగా వస్తున్నావు? నన్నెందుకు సత్యాన్వేషణ మార్గం నుండి తప్పించ  జూస్తున్నావు?

 తమస్సు: నీ లక్ష్యం కాంతి అదో వట్టి భ్రాంతి. చీకటే శాశ్వితం, కాంతి తాత్కాలికం. నా మాట విను. ఇదే జీవితం ఇది తప్ప వేరే జీవితం లేదు. ఉంటుందని నువ్వనుకోవడం శుద్ద వేస్టు. నీలి కన్నుల చినదానల్ని చూసి నీ కళ్ళు మిలమిల మెరుస్తుండగా, నీ మనస్సు ఊహాజగత్తులో నింగికి నీలాల నిచ్చెనలు వేస్తుండగా, నీ దేహం కోరికల గుర్రాలను కళ్ళెం లేకుండా తోలుతుండగా చూడాలని, చూసి ఆనందించాలని ఉంది. నా కోరికను తీర్చవూ ప్లీజ్!

 మనిషి: ఓయీ! మాటల మాయతో మభ్యపెట్టే మాయావి. ఎవరు నీవు? నువ్వు నాతో మాట్లాడటం ఏమిటీ. నన్నిరికించి, ఉడి కించి నా లక్ష్యం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం ఏమిటీ?

తమస్సు: బలే…బలే… నేనెవరో నీకు తెలీదా..? నేను నీ మనస్సుని

మనిషి: నువ్వు తమస్సులా అన్పిస్తున్నావు.

 తమస్సు: (కొంటెగా కళ్ళెగరేస్తూ) ఏం ఎలా ఉంది నా పేరు? భలే గుర్తుపట్టావే…

మనిషి: నా ప్రాణాలు తోడేట్టుంది. నన్ను నరక కూపంలో నెట్టేట్టుంది.

తమస్సు: పోనీ నేనెలా ఉన్నాను?

మనిషి: నన్ను నమిలి మింగేట్టున్నావు. నీకు పుణ్యముంటుంది నాదారి నన్ను పోనీ.

తమస్సు: వెర్రివాడా! నిన్ను నువ్వు వివేకి ననుకుంటున్నావు. నల్లదాననయిన నన్ను చూసి బెదిరి పోతున్నావు. భయపడుతున్నావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అంతలో(ఈ తతంగమంతా  చూస్తున్న ఉషస్సు రంగ ప్రవేశం చేస్తుంది)

మనిషి: ఎంత విచిత్రం? కళ్ళకు మిరిమిట్లు గొలిపే కమనీయ మూర్తి. ఎంత శాంతం నీ వదనం! తేనె  వెన్నెలలు కలిపి పోత బోసిన అపూర్వమూర్తి.

ఉషస్సు: అయ్యో మానవుడా! అప్పుడే కవిత్వంలో పడ్డావా? నీ లక్ష్యం మరచిపోయావా?

మనిషి: కవిత్వం అబద్దమా?

ఉషస్సు: ఔను చాలా వరకు. పోయట్రి ఇజ్ హాఫ్ లై’ అన్నారు. అలాగే ‘అషుఅరావు యత్తబివుహుముల్ గావూన్’ కవులు, దారి తప్పినవారే వారి వెనుక నడుస్తారు. అంటుంది ఖుర్ఆన్. ‘నవ్వులా అవి; కావు నవపారిజాతాలు’ అంటే నిజమని సామాన్యుడు నమ్ముతాడా?

మనిషి: సత్యం ఆలోచనామృత కలశం కవిత్వం. అది చరిత్ర చెబుతుంది. అందంగా. నీ సుందర సుమనోహర కాంతి వదనాన్ని చూసి, ఒక్క క్షణం అలా విభ్రాంతుణ్ణయ్యాను. తమస్సుతోనే జీవితం గడిపిన నాకు నీ వెలుగు వదన దర్శనం మహాభాగ్యం.

ఉషస్సు: సరే…సరే…వెలుతురంటున్నావే వెలుగు నీ మనసులో లేదూ?

 మనిషి: నా హృదయం ఏనాడో బొగ్గయిపోయింది. దాన్ని మాణిక్యంగా మార్చే సత్యశక్తి కోసం గాలిస్తు న్నాను. ఈ నాటికి నీవు కనిపించావు. నాకు సహాయ పడవా ప్లీజ్!

ఉషస్సు: ఇదిగో వెలుతురు….చూడు…చూడు. తారల కన్నుల్లో, మెరుపుల మెయి విరుపుల్లో వెలుతురు. కొండల్లో పూవనాల్లో వెలుతురు సెలయేటి గలగల్లో వెల్తురు. సిరిమల్లెల నవ్వుల్లో వెలుతురు.

 మనిషి: నేను కోరింది. ఈ కాంతి కాదు. హృదయ కాంతి. కొద్దిసేపటికి కనుమనుగయ్యే తారల్లో, తళుక్కుమని మెరిసి మాయమయ్యే  మెరుపుల్లో, మరుక్షణంలో వాడిపోయే పూలల్లోనా వెలుతురు. మట్టి దీపమైనా, మణి దీపమైనా మనస్సులోని తమస్సులు తొలగవు.

 ఉషస్సు: అవును తృప్తి కోసం, అలంకార నిమిత్తం మాత్రమే తప్ప ఈ దీపాలు హృదయాంధకారాన్ని తుడిచివేయలేవు. పైగా మనిషి వెలిగించే దీపాల కాంతి మనిషి చుట్టే ఉంటుంది. అది కూడా అసలయిన కాంతి కాదు. అసలు కాంతి మనసులో ఉండాలి. నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. (ఉషస్సు కంఠం మంద్ర గంభీ రంగా వినిపిస్తున్నది). మానవులూ, పశుపక్షాదులూ పుట్టక ముందు, చెట్టూ చేమలూ మొలవక ముందు, అల్లాహ్  ఈ సృష్టిలో ని ప్రతి వస్తువునూ నీటితో పుట్టించాడు.

 మనిషి: జంతువు దశలో నుంచే మనిషి వచ్చాడంటారు కదా?

 ఉషస్సు: వట్టి ఊహాజనిత ఆలోచన మాత్రమే తప్ప ఇందులో ఇసుమంతటి నిజం లేదు. ఈ సృష్టిలో సమస్తం అల్లాహ్  6 రోజుల్లో సృష్టించాడు.

మనిషి: సృష్టికి సంబంధించిన సమాచారం చాలానే ఉన్నట్టనిపి స్తోంది.

 ఉషస్సు: ఈ వెలుతురు అసలయిన వెలుతురు కాదన్నావు, నిజమే. ఆ అఖండజ్యోతిని కనుక్కోవాలంటే సృష్టి నిర్మాణం గురించి యోచించడం ఒక్కటే మార్గం. ఈ ప్రపంచం ఒక మిథ్య అనంటారు చాలా మంది. దీనికి భిన్నంగా విద్యావంతులు, వివేచనా పరులు ‘ఈ లోకం పరలోక పంట పొలం’ అంటారు. ఈ లోకం, లోకంలోని సమస్తం ఏదో ఒకనాడు నశించక తప్పదు. దీనికతీతంగా శాశ్వతమయిన మరో లోకం ఉంది.  అదే పరలోకం అదే స్వర్గం. అదే పరమాత్మ దర్శనంతో పునీతమయ్యే జగం. అదే అసలయిన  వెలుతురు. మనకు కనపడే ఈ బయటి వెలుతురు కొంత కాలానికి ఆరిపోతుంది. కానీ ఆ అఖండ జ్యోతి అక్షరంగా, అద్వితీయంగా నిలుస్తుంది. అసలైన వెలుతురంటే మనిషి ఆ అఖండ జ్యోతీశ్వరుణ్ణి చేరుకోవడమే.

 మనిషి: తెలిసింది. వెలుతురెక్కడుందో నాకర్థమయ్యింది. ఇన్నాళ్ళు నిద్రపోతున్న వివేకం కనులు  విప్పింది. నా చిరకాల అన్వేషణకు లక్ష్యం దొరికింది. ఓహో! ఎంత తీయని అనుభూతి! నా హృదయ వాటికలో వెలుతురు మొగ్గలు కిలకిలా నవ్వుతున్నాయి. నా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు-సర్వేంద్రియాలు పరిమళిస్తు న్నాయి, పరవశిస్తున్నాయి. ఆత్మకు మాత్రమే దృశ్యమ్మగు అక్షర వాహిని అది. (తన్మయత్వంలో) ఓహోహో! ఎంత దివ్యంగా ఉందీ సన్నివేశం!! నిత్యం ఇలాంటి మనో స్థితే ఉంటే ఎంత బాగుండు!! ఇన్నాళ్ళూ నేను మాయ జగత్తులోనే జీవించాను. ఇప్పుడు నా మనసుకు చుట్టుకున్న మాయావలయం పటాపంచలయింది. ఈ సత్యా కాంతుల తళతళలు, నాలో ఏదేదో దురాలోచనలను రేకెత్తించిన తమస్సులను కడిగి వేస్తున్నాయి. ఇందుకేనేమో ‘మనిషి సత్కర్మల్ని బట్టి వారికి జ్యోతులివ్వబడతాయి’ అని మహాప్రవక్త (స) వారు అన్నది అంటూ సర్వలోక సృష్టికర్తను మొరపెట్టుకోనారంభిస్తాడు మనిషి:

 దేవా! నా హృదయం జ్యోతిర్మయం అవ్వాలి. నా నయనం కాంతులీనాలి. నా శ్రవణం వెలుగులు నిండాలి. నా చుట్టూ ప్రక్కల వెలుగు దివ్వెలు వెలగాలి. నా వదనం ప్రకాశమానం అవ్వాలి. నా నరాల్లో నవ నాడుల్లో, నా కండరాల్లో, రక్తంలో, రోమంలో, చర్మంలో ఆంతర్యంలో – అంతటా కాంతి కమలాలు విరియాలి. నా జీవితం వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేయాలి. నా నలువైపుల కాంతి కిరణాలు విరజిమ్మాలి. నా మేధ కాంతితోనూ, నా మది శాంతితోనూ ఉప్పొంగాలి. నేను నిన్ను చేరాలి. నీ దివ్వ దర్శనంతో నా జన్మ ధన్యమవ్వాలి. ఆమీన్!

Related Post