Originally posted 2013-08-19 21:39:04.
ఖురాన్ కథా మాలిక
”వారు గుహలో 309 సంవత్సరాలు (నిదురపోతూ) ఉన్నారు”. (ఖుర్‌ఆన్ – 18: 25)
ఇఫ్‌సస్ నగరంలో పండుగ రోజు అది. ఆ రోజున ప్రజలు తమ విగ్రహాలకు పూజలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. కాని ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఒక యువకుడు దూరం గా ఉండిపోయాడు. ఎందుకంటే, అతని మనసులో ఈ కార్యక్రమం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. అతను ఒక చెట్టు నీడన కూర్చుని నగరంలో జరుగు తున్న కార్యక్రమం గురించి ఆలోచించ సాగాడు. కొంతసేపటి తర్వాత అతని మిత్రుడొకడు వచ్చి కలిశాడు. కొంత సేపటికి మరొకరు. అలా మొత్తం ఏడుగురు మిత్రులు అక్కడ కలిశారు. వారందరి ఆలోచనా విధానం ఒక్కటే. విగ్రహారాధన పట్ల, విగ్రహారాధకుల పట్ల వారి మనస్సుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అల్లాహ్‌ా వారికి సత్యాన్ని గ్రహించే వివేకం ప్రసాదించాడు. వారు తాము నమ్మిన ధార్మిక విశ్వాసాన్ని తమ హృదయాల్లోనే దాచుకోవాలని నిర్ణ యించుకున్నారు. ఎందుకంటే రాజు కూడా విగ్రహారాధకుడే కాబట్టి తమ విశ్వాసం గురించి చెబితే రాజు వేధింపు లకు గురిచేస్తాడని భయపడ్డారు.
రహస్య సమాలోచన
వారంతా మళ్ళీ ఒక రాత్రి సమావేశ మయ్యారు. అందులో ఒకరు గుసగుసగా మిగిలిన వారితో మాట్లాడుతూ – ”రాజుగారికి మన గురించి తెలిసి పోయిందట. మనం మతం మార్చు కున్నామని తెలిసి రాజు కోపంతో మండి పడుతున్నాడట. కనుక మనం విగ్రహా రాధనలో పాల్గొనకపోతే శిక్షిస్తానని బెదిరించినట్లు కూడా తెలిసింది. రేపు మనల్ని తన దర్బారుకు పిలిపిస్తాడు. దర్బారులో మనపై విచారణ జరిపిస్తాడు. ఇప్పుడు మనమేం చేయాలో ఆలోచిం చండి” అన్నాడు. మరొక యువకుడు జవాబిస్తూ, ”నాకు కూడా ఈ విషయం
తెలిసింది. కాని ఇదంతా ఒక పుకారు మాత్రమే అనుకుంటున్నాను. ఏదిఏమైనా మనం మన విశ్వాసం విషయంలో దృఢంగా ఉండాలి. మళ్ళి విగ్రహా రాధనకు మరలిపోవడం మన వల్ల కాని పని. ఈ సృష్టి మొత్తానికి మహా సృష్టికర్త ఒకడున్నాడని చెప్పడానికి చాలా నిదర్శ నాలున్నాయి” అన్నాడు.
రాజుగారి దర్బారులో
మరుసటి రోజు ఆ ఏడుగురిని రాజుగారు దర్బారుకు పిలిపించాడు. వారిని ప్రశ్నించడానికే రాజు పిలిపిస్తు న్నాడని, రాజుకు కొత్త మతం అంటే గిట్టదని వారికి బాగా తెలుసు. అయినా వారు భయపడలేదు. తమ ప్రభువు భూమ్యాకాశాలకు ప్రభువని, ఆ సృష్టికర్త ను తప్ప మరెవ్వరినీ దేవునిగా అంగీ కరించలేమని నిర్భయంగా చెప్పారు. అల్లాహ్‌ాను తిరస్కరిస్తే మహా పాపం చేసినట్లు అవుతుందని కూడా వివరించారు.
ఈ మాటలు విని రాజుగారికి చాలా కోపం వచ్చింది. వారికి మరణ శిక్ష విధిస్తాడన్నాడు. కాని వారు కులీన కుటుంబాలకు చెందినవారయినందువల్ల వారికి ఒక రోజు గడువు ఇచ్చాడు. ఈలోగా తమ కొత్త మతాన్ని వదులుకో నట్లయితే వారికి చావు తప్పదని హెచ్చరించాడు. వారు అల్లాహ్‌ా పట్ల విశ్వాసంతో మరింత బలాన్ని పొంది ఇలా జవాబిచ్చారు: ”రాజా! ఈ మతాన్ని మేము ఎవరి ప్రొద్బలం వల్లనూ స్వీకరిం చలేదు. మా హృదయాలలో ఉన్న సహజ సిద్ధమైన భావనల ప్రేరణ వల్ల మాకు లభించిన వరం ఇది. అల్లాహ్‌ా మా హృదయాలను ప్రకాశవంతం చేశాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే మాకు ప్రభువు. ఆయనే భూమ్యాకాశాలకు ప్రభువు. మేము ఆయన్ను తప్ప మరెవ్వరినీ దేవునిగా ఆరాధించలేము. రాజా…మా పట్ల నీవు ఎలా వ్యవహరిం చాలనుకున్నా నీ ఇష్టం… ఇప్పుడే నీ ఇష్టమొచ్చినట్లు చేయడం మంచిది” అన్నారు. రాజు జవాబిస్తూ, ”నేను నా నిర్ణయాన్ని ప్రకటించేశాను. కాబట్టి ఒక రోజు ఆలోచించుకునే గడువు ఉంది. రేపు నేను నా తుది తీర్పు వినిపిస్తాను” అన్నాడు.
తప్పించుకోవడం
రాజదర్బారు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తమ పథకాన్ని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నారు. వారిలో ఒకడు మిగిలిన వారితో, ”మనం మన విశ్వాసం పట్ల ఎంత దృఢంగా ఉన్నామో రాజుకు తెలుసు కాబట్టి తప్పక మన మీద చర్య తీసుకుంటాడు. ఒకవేళ రాజు చర్య తీసుకోకపోతే ప్రజలు రాజును బలహీనుడిగా భావించి పరిహసిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు, పట్టణాన్ని వదలి కొండ గుహల్లో ఎక్కడైనా తల దాచుకుందాం. అక్కడ మనం స్వేచ్ఛగా మన విశ్వాసం ప్రకారం జీవించవచ్చు. ఎవరి జోక్యం ఉండదు” అన్నాడు.
తమకు లభించిన ఆహార పదార్థాలు తీసుకుని ఆ ఏడుగురు యువకులు కొండలకు వెళ్ళిపోయారు. అక్కడ వారందరికీ సరిపోయే వైశాల్యం ఉన్న ఒక గుహ కనబడింది. ఆ గుహలో వాళ్ళు దాక్కున్నారు. వారిని అనుసరిస్తూ ఒక కుక్క కూడా అక్కడి వరకు వచ్చింది. ఆ కుక్క గుహ ముఖ ద్వారం వద్ద కూర్చుంది. వాళ్ళు తమ వద్ద ఉన్న ఆహార పదార్థాలు తిని, సమీపంలోని వాగు నీరు త్రాగి విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటికే వాళ్ళంతా గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆ ఏడుగురు పట్టణం వదలి వెళ్ళిన విషయాన్ని అందరూ చెప్పుకోసాగారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియ లేదు. వారి తల్లిదండ్రులు వారిని వెదక డానికి చాలా మందిని పంపించారు. రాజు కూడా దేశం యావత్తు వారి కోసం వెదికించాడు. కాని వారి జాడ దొరక లేదు. వారు ఈ విధంగా మాయం అయి పోయిన సంఘటన తర్వాత చాలా కాలం వరకు జనం కథలుగా చెప్పుకున్నారు. అనేక తరాల వరకు ఈ కథ వ్యాపిం చింది.
దీర్ఘ నిద్ర
రోజులు, నెలలు గడిచాయి. తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళు అలాగే గాఢ నిద్రలో ఉండిపోయారు. సూర్యకిరణాలు ఆ గుహలోనికి రాలేదు. కటిక చీకటిలో ఉండటం వల్ల వారి గురించి బాటసారులకు కూడా తెలుసుకునే అవకాశం చిక్కలేదు. వారి చుట్టూ ఉన్న దుర్మార్గపు ప్రపంచం నుంచి అల్లాహ్‌ా వారికి ఆశ్రయం కల్పించాడు. ఆ విధంగా వారు 309 సంవత్సరాల కాలం నిద్రలో గడిపారు. (దివ్య ఖుర్‌ఆన్ ప్రకారం మూడు వందలకు పైబడి తొమ్మిది సంవత్సరాలు. దీన్ని బట్టి 300 సంవత్సరాలు సూర్యమాన సంవత్స రాలని, పైన ఉన్న తొమ్మిది సంవత్స రాలు చంద్రమాన సంవత్సరాల లెక్కలోని వని గ్రహించవచ్చు.)
ఆ తర్వాత అల్లాహ్‌ా వారిని మళ్ళీ నిద్ర నుంచి లేపాడు. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆ ఏడుగురు తాము చాలా సేపు నిద్రపోయామని అనుకున్నారు. అందులో ఒకడు జవాబిస్తూ బహుశా ఒక రోజంతా నిద్రపోయి ఉంటామన్నాడు. మరొకడు జవాబిస్తూ, సూర్యాస్తమయం ఇంకా కాలేదు కాబట్టి రోజులో కొంత భాగం మాత్రమే నిద్రపోయి ఉంటామన్నాడు. ఇంకొకడు మాట్లాడుతూ, ”ఈ ఊహలు కట్టిపెట్టండి. నిజం అల్లాహ్‌ాకు మాత్రమే తెలుసు. ముందు నాకు ఆకలి చాలా వేస్తోంది. మనలో ఎవరినైనా పట్టణానికి పంపించి ఆహారం తెప్పిద్దాం. మన జేబుల్లో ఎవరి వద్ద ఎంత సొమ్ము ఉందో పోగుచేయండి. పట్టణానికి వెళ్ళేవారెవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆచూకి ఎవరికీ తెలియకూడదు” అన్నాడు. వాళ్ళంతా తమ వద్ద ఉన్న సొమ్మును ఒకరికి ఇచ్చారు. అతడిని పట్టణానికి పంపించారు.
ఆ యువకుడు పట్టణం దగ్గరకు చేరు కున్నప్పుడు, అక్కడి పరిసరాలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అంతా కొత్తగా ఉంది. అతను ఏదీ గుర్తు పట్టలేక పోయాడు. భవనాలు, ప్రజల వస్త్రధారణ, వ్యవహార శైలి అన్నీ మారిపోయాయి. అతను ఒక పలహార శాల చూసి అందులోకి ప్రవేశించాడు. ఆ దుకాణం దారుడు యువకుడి ముఖంలోని తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. యువకుడు రొట్టెలు కావాలని అడిగాడు. కాని ఆ యువకుడు ఇచ్చిన నాణేలు చూసి దుకాణందారుడు ఆశ్చర్యపోయాడు. ఆ విచిత్రమైన నాణేలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చావని ప్రశ్నించాడు. అలాంటి నాణేలు ఇక్కడ వాడకంలో లేవని అన్నాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం ప్రారంభం అయింది. త్వరలోనే జనం గుమిగూడారు. ఆ యువకుడు ఆ ప్రాచీన నాణెలను ఎక్కడి నుంచి సంపాదించాడో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ భావించారు. ఆ యువకుడు ఆ డబ్బు తన సొంతమని వాదించాడు. రాజ భటులు అక్కడికి వచ్చారు. ఆ యువకుడిని న్యాయస్థానానికి తీసుకు పోవడం జరిగింది. అక్కడ ఆ యువకుణ్ణి ప్రశ్నించడం జరిగింది. అతను తన గురించి చెప్పాడు. గుహలో ఉన్న తన ఆరుగురు మిత్రుల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ప్రజలకు ఆ యువకుడెవరో తెలిసింది. మూడు వందల తొమ్మిది సంవత్సరాల క్రితం పట్టణం నుంచి మాయమైన ఏడుగురు యువకుల్లో ఒకడిగా గుర్తించారు. దుర్మార్గపు రాజు మరణించి అనేక వందల సంవత్సరాలయ్యిందని తెలిసి ఆ యువకుడు కూడా ఆశ్చర్యపోయాడు.
కొత్త రాజ్యం
ఈ సంఘటన గురించిన వార్త రాజుగారికి తెలిసింది. ఆయన ఒక సందేశహరుడిని పంపి ఆ యువకుడిని పిలుచుకురమ్మన్నాడు. యువకుడు చెప్పిన విచిత్రమైన కథ విన్న తర్వాత రాజు ఆ యువకునితో కలిసి కొండ గుహ వద్దకు వెళ్ళాడు. యువకుడు తన మిత్రులను రమ్మని పిలిచాడు. ఇప్పుడు భయపడవలసిన పనిలేదని చెప్పాడు. వారు గుహ బయటకు వచ్చారు. ఆ యువకుల ముఖాలపై తేజస్సు చూసి రాజు మ్రాన్పడిపోయాడు. వారిని చాలా అభిమానంగా ఆలింగనం చేసుకున్నాడు. మిగిలిన యువకులు తమ మిత్రుడి ద్వారా జరిగిన కథ తెలుసుకున్నారు.
తన భవనానికి రాజు వారిని రమ్మన్నాడు. కాని వారు ఆ ఆహ్వానాన్ని మర్యాదగా కాదంటూ, తమ బంధువులు, మిత్రులు అందరూ మరణించినందువల్ల ఇక జీవితంలో తమకు కావలసింది ఏమీ మిగల్లేదని అన్నారు. వారు చేతులెత్తి అల్లాహ్‌ాను ప్రార్థిస్తూ తమను కారుణ్యంతో కాపాడమని కోరుకున్నారు. ఆ వెంటనే వారి ఆత్మలు వారి శరీరాలను వదలి వెళ్ళిపోయాయి. అయినా ఆ యువకుల ముఖాలు తేజస్సుతో ప్రకాశిస్తూనే ఉన్నాయి. వారి అంత్యక్రియలకు వేలాది ప్రజలు హాజరయ్యారు. కొండ గుహను వారి సమాధిని రాజు అందంగా కట్టించాడు. (చదవండి దివ్యఖుర్‌ఆన్-18: 9-20)
(సమాధులను అందంగా కట్టించడం అన్నది ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచనం ప్రకారం నిషిద్ధం. ప్రవక్త ముహమ్మద్ (స), ఆయన సహచరులు, షహీదులు (అమరవీరులు) ఎవరి సమాధులు కూడా ఈ విధంగా కట్టించబడలేదు).