ఐ పి సి తెలుగు విభాగం
వాజిబ్ విధానం:
1.శరీరాన్ని కడిగేటప్పుడు సంకల్పం చేసుకోవడం
2. వెంట్రుక మందం చోటుకూడా పొడిలేకుండా మొత్తం శరీరం మీద నీరు పోసుకోవడం.
జాబిర్ (ర) కథనం: దైవప్రవక్త (స) ఎలా స్నానం చేసేవారని అడగటం జరిగింది. అందుకు ఆయన ‘దైవప్రవక్త మూడు దోసిళ్ళు నీళ్ళు తీసుకుని తలపై పోసుకునేవారు. తర్వాత పూర్తి శరీరంపై పోసుకునేవారు” అన్నారు. (బుఖారి 253)
ఉమ్మె సలమా (ర) కథనం: నేను ‘దైవప్రవక్తా! నేను మందమయిన ఎంట్రుకలు గలదాన్ని. జనాబత్ గుసుల్ కోసం వాటిని పూర్తిగా విప్పాల్నా? అని ప్రశ్నించాను. అందుకాయన (స) అవసరం లేదు, నీవు నీతలపై మూడు చెంబుల నీళ్ళు పోసుకుంటే చాలు, నీవు పరిశుద్ధత పొందుతావు.” అని సమాధానమిచ్చారు. (ముస్లిం 330)
సున్నత్ విధానం:
1.కుడిచేత్తో నీళ్ళు తీసుకొని మొదట రెండు చేతులు మణికట్ల దాకా కడుక్కోవాలి. తర్వాత ఎడమ చేత్తో మర్మాంగాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత శరీరంపైగల అశుద్ధతను దూరం చేసుకోవాలి. తర్వాత శుభ్రపరిచే పరికరంతో బాగా తోమాలి.
మైమూన (ర) కథనం: నేను ప్రవక్త(స)వారి కోసం స్నానానికని నీళ్ళు పెట్టాను, అప్పుడు ఆయన (స) తన చేతులను రెండుసార్లు లేదా మూడు సార్లు కడుక్కున్నారు. ఆ తర్వాత ఎడమ చేత్తో మర్మాంగాన్ని కడిగి తన చేతులకు మట్టిపై రుద్దారు.
(బుఖారి 254,ముస్లిం 317)
2. పూర్తి వుజూ చేయాలి. కాళ్ళను మాత్రం స్నానం చివర్లో కడుక్కున్నా పరవాలేదు.
3. నీటితో తలను బాగా తోమాలి. ఆ తర్వాత మూడు సార్లు తల కడుక్కోవాలి.
4.ముందు కుడి పార్శ్యాన్ని, తరువాత ఎడమ పార్శ్యాన్ని కుడుక్కోవాలి.
ఆయిషా (ర) కథనం: దైవప్రవక్త (స) జనాబత్ గుసుల్ చేసేటప్పుడు ముందు తన రెండు చేతులను కడుక్కునేవారు. తర్వాత నమాజుకోసం వుజూ చేసినట్టు చేసేవారు. ఆనక తన వ్రేళ్ళలను నీళ్ళలో ముంచి వెంట్రుకల అడుగుభాగాన పోనిచ్చిరుద్దే వారు. ఆ తర్వాత తలపై మూడు సార్లు నీళ్ళు పోసుకునేవారు. అటు పిమ్మట పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకునేవారు. (బుఖారి 245)
ఆయిషా (ర) గారి కథనం: ”దైవప్రవక్త (స)వారు చెప్పులు తొడగటంలో, నడవటంలో,శుద్ధిపొందటంలో సమస్త కార్యాల్లో కుడి వైపు నుండి ప్రారంభించడాన్ని ఇష్టపడేవారు.” ( బుఖారి 166, ముస్లిం 268)
5.పూర్తి శరీరాన్ని తోమాలి. కడగడంలో ఒక అవయం తర్వాత మరో అవయం క్రమాన్ని పాటించాలి.
6. శరీరంలో తడవని నీరు చేరని భాగాలు చెవులు నాభి గోర్లక్రింది భాగాలను నీళ్ళు తీసుకుని తడపాలి.
7. గుసుల్ క్రియలను మూడేసి సార్లు చేయటం.
గుసుల్లోని మక్రూహాత్‌లు:
1. నీరుని దుబారా చేయడం.
ఓ వ్యక్తి జాబిర్ (ర)గారిని స్నానం గురించి ప్రశ్నించారు. అప్పుడు జాబిర్ (ర)గారు ఒక ‘సా’ (నాలుగు సేర్ల నీళ్ళు) నీరు నీకు సరిపోతుంది’ అన్నారు. దానికావ్యక్తి నాకు ఒక ‘సా’ సరిపోదు అన్నాడు. అది విన్న ఆయన ”నీకంటే ప్రతి విషయంలో అగ్ర గణ్యుడు, నీకంటే ఎక్కువ శిరోజాలు కలిగిన మహానీయునికి ఒక ‘సా’ నీరే సరిపోయేది (నీకు సరిపోదా?) అని అన్నారు. (బుఖారి 249, ముస్లిం 327)
2. నిలిచి ఉన్న నీళ్ళలో స్నానం చేయటం:
అబూహురైరా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: మీలో జునుబీ అయినవారు నిలిచి ఉన్న నీళ్ళలో స్నానం చేయకూడదు. అది విన్న వారు ఓ అబూహురైరా! మరి మేమేంచేయాలి? అనిఅన్నారు. అందుకాయన అందులోనుండి నీరు తోడి స్నానం చేయాలి’ అన్నారు. (ముస్లిం 283 )
పరీక్ష 8
సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(ఎ) వుజూ (బి) నీటిని దుబారా చేయటం (సి) నిలిచి ఉన్న నీళ్ళలో స్నానం చేయటం (డి) మర్మాంగాన్ని కడగటం
1. ………………………………మరియు ……………………..గుసుల్‌లోని సున్నతులు.
2. ……………………………..మరియు……………………….గుసుల్‌లోని మక్రూహాత్‌లు
సరైన సమాధానం ఎన్నుకోండి:
3. గుసుల్ అర్కానుల్లో సంకల్పం ఒకటి
(అ) అవును
(ఆ) కాదు
4.సున్నత్ విధానం ఏమిటంటే ముందు ఎడమ పార్శ్యం కడిగి తర్వాత కుడి పార్శ్యం కడగాలి
(అ) అవును
(ఆ) కాదు
5. గుసుల్ ఫర్జ్‌లలో చెవులు,నాభి,గోర్ల క్రింది భాగం కడగటం కూడా ఉంది.
(అ) అవును
(ఆ) కాదు.