అస్క్ ఇస్లాం పీడియా
జుల్ హిజ్జా నెలలో మక్కా ప్రయాణం చేయడాన్ని హజ్ అంటారు. ఈ యాత్ర కేవలం అల్లాహ్ కొరకే చేయబడుతుంది. ఇస్లాం అంటేనే మన మనోవాంఛలను అల్లాహ్ కు సమర్పించడం. ముస్లింలు తమ కర్మల ద్వారా ఈ హజ్ చాటుతారు. హజ్ చేసేటప్పుడు ఒక ముస్లిం శారీరకంగా మరియు మానసికంగా తనను తాను పూర్తిగా అల్లాహ్ కు సమర్పిస్తాడు.
హజ్ లో ముస్లిం అల్లాహ్ ఆజ్ఞలను పూర్తిగా శిరసావహిస్తాడు. హజ్ తౌహీద్ (ఏకదైవారాధన)ను చాటుతుంది. హజ్ ద్వారా ముస్లింల ఐకమత్యం వెలువడుతుంది. హజ్ చేసిన వారి పాపాలు తుడిచివేయబడుతాయి.
హజ్ ఇస్లాం మూలస్థంభాలలో ఒకటి
హజ్ చరిత్ర
జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయడం తప్పనిసరి
హజ్ విధి కావడానికి గల షరతులు
గణాంకాలు
ఏ ఆరాధన అయిననూ ఆమోదయోగ్యం కావడానికి గల షరతులు
హజ్ ప్రయోజనాలు
హజ్ గురించి
ఖుర్ఆన్ లో
హజ్ సున్నత్ ప్రకారం
ఆధారాలు
పారిభాషికంగా
హజ్ అంటే, ‘తయారవడం, ఒక ప్రదేశానికి ప్రయాణం చేయడం, ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శించడం.”
ఇస్లామీయ చట్ట ప్రకారం
హజ్ అనేది అరబీ పదం. దీని అర్ధం బైతుల్లాహ్ (అల్లాహ్ గృహం – కాబాకు మరో పేరు)ను ఆరాధన కోసం సందర్శించడం. ఇది సంవత్సరానికి ఒకసారి ముస్లింలు కాబాకు చేసే యాత్ర. దీన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (బోధించిన) ప్రకారం చెయ్యాలి.
హజ్ ప్రాముఖ్యత
హజ్ ముస్లింల ధార్మిక ఆరాధన. కాబాకు హజ్ (తీర్థయాత్ర) కోసం వెళ్ళడం ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఒకటి. హజ్ ఇస్లాంలో కొత్తగా చేరినది కాదు, ఇది కాబా స్థాపించబడినప్పటి నుండి ఉంది. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను.” (ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:96). కాబా మొట్ట మొదటగా ఆదం (అలైహిస్సలాం), భూమిపై మొదటి మనిషి ద్వారా నిర్మించబడింది అని చెప్పే హదీసు (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వచనం)ను ఖుర్ఆన్ లోని ఈ ఆయతు ధృవపరుస్తుంది. హజ్ లో అనేక ఆచరణలు చేయాల్సి ఉంటుంది. అవి, ఇహ్రామ్ (ప్రత్యెక దుస్తులు) ధరించడం, కాబా ప్రదక్షిణ (తవాఫ్) చేయడం, సయీ (సఫా, మర్వా పర్వతాల మధ్య నడవడం), జమరాత్ (షైతాన్ ను సూచించే స్థూపాలు)పై రాళ్లు కొట్టడం మొదలైనవి. హజ్ లోని ముఖ్య ఆచరణ మక్కా నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న అరఫా మైదానంలో ఆగడం కూడా ఒకటి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన అంతిమ హజ్ లో చివరి ప్రసంగం (ఖుత్బా) ఇక్కడే ఇచ్చారు. హజ్ ఆచరించటంలో ముజ్దలిఫాలో రాత్రి గడపడం, ఖుర్బాని ఇవ్వడం, జం జం నీరు త్రాగడం మరియు మినా కార్యాలు కూడా ఉన్నాయి.
హజ్ లో రకాలు
హజ్ లో రెండు రకాలు ఉన్నాయి:
ఉమ్రా (చిన్న హజ్) మనిషి ఎప్పుడైనా చేయవచ్చు, హజ్ దినాలు కాకుండా.
హజ్ యాత్ర ప్రత్యేక సమయంలోనే చేయాలి. ఇది జుల్ హిజ్జా (ఇస్లామీయ కాలెండర్ లో ఆఖరి మాసం) మాసం లోనే చేయాలి.
హజ్ గురించి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఆదేశించాడు: “హజ్ మాసాలు నిర్థారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్‌ను తన కొరకు విధించుకున్న వ్యక్తి – హజ్ దినాలలో – కామక్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు. (హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు) ప్రయాణ సామగ్రి (ఖర్చు)ని వెంటతీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి (అని బాగా గుర్తుంచుకోండి). కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ ఉండండి.” (ఖుర్ఆన్ సూరా బఖర 2:197)
హజ్ ఇస్లాం మూలస్థంభాలలో ఒకటి
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం హజ్ ఇస్లామీయ మూలస్తంభాలలో ఒకటి అని అన్నారు: ఇబ్న్ ఉమర్ (రజి) ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఇస్లాం ఐదు మూలస్తంభాలపై ఆధారపడి ఉంది: లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా – అల్లాహ్ తప్ప ఆరాధ్యనికి అర్హులు ఎవ్వరు లేరు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త అని మనస్ఫూర్తిగా విశ్వసించడం, రోజు ఐదు పూటల నమాజు పాటించడం, జకాత్ (విధి దానం) చెల్లించడం, హజ్ చేయడం మరియు రమజాన్ ఉపవాసాలు పాటించడం.” (సహీహ్ బుఖారీ vol 1:7 & సహీహ్ ముస్లిం vol 1:1)
హజ్ చరిత్ర
హజ్ కొరకు మొదటి పిలుపు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇచ్చారు. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “హజ్ (యాత్ర)కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు, బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు.” (ఖుర్ఆన్ సూరా హజ్ 22:27). ఈ ఆయాతు గురించి ప్రస్తావిస్తూ ఇబ్న్ కసీర్ ఇలా అన్నారు: మేము నీ చేత నిర్మింపజేసిన గృహం వైపు మానవులందరినీ పిలుపునివ్వు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నారు: ఓ అల్లాహ్! నా పిలుపు ప్రజలందరికీ ఎలా చేరుతుంది? అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: నువ్వు పిలుపిలుపునివ్వు. దాన్ని అందరికీ చేర్చడం మా బాధ్యత. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం తన మఖాంపై (నిలబడిన చోటు) లేదా బండరాయిపై లేదా అల్ సఫా పర్వతంపై లేదా అబుల్ ఖుబైస్ (కాబా వద్ద ఓ పర్వతం) పర్వతంపై నిలబడి ఇలా అన్నారు: ఓ ప్రజలారా! మీ ప్రభువు ఒక గృహాన్ని నిర్మించాడు. అక్కడి యాత్ర కోసం బయలుదేరండి. ఇబ్రాహీం అలైహిస్సలాం పిలుపు భూమిపై అందరికీ వినపడాలని పర్వతాలు తమను క్రిందకు వంచుకున్నాయి. తమ తల్లుల గర్భాల్లో ఉన్న చిన్నారులు కూడా దీన్ని విన్నారు. రాళ్లు, చెట్లు, పట్టణాలు అన్ని విన్నాయి. అల్లాహ్ తలచిన ప్రతి ఒక్కరు అంతిమదినం వరకు హజ్ చేస్తూ ఉంటారు: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ద్వారా ఇది తెలుస్తుంది. దీన్ని ముజాహిద్, ఇక్రిమా, సయీద్, ఇబ్న్ జుబైర్ మొదలైనవారు ఉల్లేఖించారు.
ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో అల్లాహ్ హజ్ ఆచారాలను వివరంగా వివరించాడు. కాబాను (అల్లాహ్ గృహం) మక్కాలో నిర్మించే బాధ్యతను కూడా అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం కు అప్పగించాడు. అల్లాహ్ కాబాను మరియు దాని నిర్మాణాన్ని ఇలా వివరించాడు: “మేము ఇబ్రాహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్థారించి నపుడు పెట్టిన షరతు ఇది: నాకు భాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి.” (ఖుర్ఆన్ సూరా హజ్ 22:26)
కాబా నిర్మించాక ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు వచ్చి హజ్ చేసేవారు. ఆయన మరణాంతరం ఆయన కొడుకు ఇస్మాయీల్ అలైహిస్సలాం దీన్ని కొనసాగించారు. కాని కొన్ని ఏళ్లకు హజ్ యొక్క పద్ధతి మరియు దాని లక్ష్యం మారిపోయింది. అరేబియాలో మూర్తి పూజ ప్రాబల్యం చెందడం చేత, కాబాలో కూడా విగ్రహాలను పెట్టి దాని పవిత్రతను మంటగలిపారు. కాబా గోడలపై పద్యాలూ మరియు చిత్రలేఖనాలూ గీయబడ్డాయి. అందులో ఈసా అలైహిస్సలాం మరియు ఆయన తల్లి మర్యం అలైహిస్సలాం చిత్రాలు కూడా ఉండేవి. కాబా లోపల 360 కంటే ఎక్కువ విగ్రహాలు ఉంచబడ్డాయి. తల్బియా “లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్”ను కూడా మార్చివేశారు. కాబా గోడలపై జంతువుల రక్తాన్ని పూసేవారు మరియు దాని ఇరువైపుల జంతువుల చర్మాన్ని వ్రేలాడదీశేవారు. ఇలా ప్రజలు తమ తాత అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం బోధనలను పూర్తిగా విస్మరించారు.
ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి దాదాపు రెండున్నర వేల సంవత్సరాలు ఉండింది. కాని, ఆ తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆ స్వీకరించబడింది. దీని గురించి ఖుర్ఆన్ లో అనబడింది: “మా ప్రభూ! నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్నినేర్పించే, విజ్ఞతా వివేచనలను విడమరచి చెప్పే, వారిని పరిశుద్ధపరచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజెయ్యి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు.” (ఖుర్ఆన్ సూరా బఖర 2:129)
ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేసిన ఆ పట్టణం (మక్కా)లోనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జన్మించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఏకదైవారాధన (తౌహీద్) సందేశాన్ని ఇరవై మూడు సంవత్సరాలు వ్యాపింపజేశారు. ఇదే సందేశాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇతర ప్రవక్తలు తీసుకువచ్చారు. దీని ద్వారా అల్లాహ్ చట్టాన్ని భూమిపై స్థాపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబా చుట్టు వివస్త్రంగా ప్రదక్షిణ (తవాఫ్) చేయడాన్ని నిరోధించారు. పగానులు ఇలా చేసేవారు. దీన్ని అల్లాహ్ ఖుర్ఆన్ లో ఖండించాడు.
హజ్ లో చేసే అచారాలన్నీ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుటుంబం అల్లాహ్ కు అంకితం చేసిన తమ జీవితానికి ప్రతీకగా చేస్తారు. ఈ ఆరాధన, ఆచారం (హజ్) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సొంతంగా కనిపెట్టిన కొత్త విషయం ఏ మాత్రం కాదు అని దీని వల్ల రుజువవుతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇందులో వచ్చిన కొత్త పోకడలను, తప్పుడు ఆచారాలను తుడిచి, దీన్ని విధి గావించారు మరియు దీని ద్వారా మానవుల్లో దైవభీతి పెరిగేలా చేశారు. కావున ఇది ఇస్లామీయ మూలస్థంభాలలో ఒకటి. అందుచేత శారీరకంగా మరియు ఆర్ధికంగా స్థోమత ఉన్న ప్రతి ముస్లిం దీన్ని తప్పనిసరిగా చేయాలి. ఈ తీర్థయాత్ర వల్ల మనిషి వేరితర ఆరాధనలన్ని నెరవేర్చగలుగుతాడు. ఉదాహరణకు, నమాజ్, సహనం, భక్తీ, జకాత్, దానధర్మాలు, వేడుకోలు మొదలైనవి. శారీరక తీర్థయాత్రతో పాటు, మనిషిలో మానసిక శక్తి కూడా పెరుగుతుంది. మనిషి ఈ ప్రపంచాన్ని వీడి, అల్లాహ్ ముందు అతని దాసునిగా హాజరయ్యే రోజు గుర్తుకు తెస్తుంది. ఆ (ప్రళయదినాన) రోజు మనిషి ‘నేను నీ ముందు ఉన్నాను నా ప్రభూ’ అని అంటాడు.
పూర్తి జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయడం విధి
స్థోమత ఉన్న ప్రతి ముస్లింపై హజ్ విధి చేయబడింది. అనేక ప్రముఖ ఇస్లామీయ విద్వాంసుల ప్రకారం హజ్ హిజ్రీ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళడం) తొమ్మిదో సంవత్సరంలో విధి చేయబడింది. అంటే, ప్రతినిధి బృందాల (అల్ వుఫూద్) సంవత్సరం. ఆ సమయంలోనే ఖుర్ఆన్ లోని ఈ ఆయతు అవతరించింది: “అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు.” (ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:97). ఈ ఆయత్ ద్వారా హజ్ విధి చేయబడిందని తెలుస్తుంది.
అనేక హదీసుల ద్వారా ఇది ఇస్లామీయ మూలస్తంభాలలో ఒకటి అని తెలుస్తుంది. దీన్ని ప్రతి ముస్లిం అంగీకరిస్తాడు. ఇస్లామీయ విద్వాంసుల ఏకాభిప్రాయం ఏమిటంటే, ఇది వయోజనుడైన ముస్లింపై జీవితంలో ఒకసారి చేయడం విధిగా నిర్ణయించబడింది.
అబూ హురైరా (రజి) ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒక ప్రసంగం (ఖుత్బా)లో ఇలా అన్నారు: ఓ ప్రజలారా, అల్లాహ్ మీపై హజ్ విధిగా చేశాడు, కావున హజ్ చేయండి.” “ఓ దైవప్రవక్తా! ప్రతి సంవత్సరం చేయాలా?” అని ఒకతను అడిగాడు. ఆ మనిషి ఇలా మూడు సార్లు అడిగేవరకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు, “ఒకవేళ నేను ‘ఔను’ అంటే, మీపై అది (ప్రతి సంవత్సరం ఒకసారి) విధి అయిపోయేది. మీరు దాన్ని నెరవేర్చలేకపోయేవారు.” ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నేను చెప్పినంత దాన్ని తీసుకోండి. మీకంటే ముందు వచ్చిన వారు నాశనమవడానికి కారణం, వారు ఎక్కువగా ప్రశ్నలు అడిగేవారు మరియు ప్రవక్తలతో వాదించేవారు. నేను ఆదేశించిన దాన్ని, మీరు చేయగలిగే అంత చేయండి. నేను నిషేధించిన దానికి దూరంగా ఉండండి.” (సహీహ్ ముస్లిం 1337)
ఇబ్న్ అబ్బాస్ (రజి) ఈ ఆయత్ పై ఇలా అన్నారు, “హజ్ ప్రాముఖ్యాన్ని విశ్వసించనివాడు, అవిశ్వాసి అయిపోతాడు. అల్లాహ్ అందరి అవసరాలు తీర్చేవాడు.” అల్ హాఫిజ్ అబూ బక్ర్ అల్ ఇస్మాయిలి ప్రకారం ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి) ఇలా అన్నారు, “ఎవరి వద్దనైతే హజ్ చేసే స్థోమత ఉండి కూడా, హజ్ చేయరో, వారు యూదులై మరణించినా లేదా క్రైస్తావులై మరణించినా ఎలాంటి తేడా ఉండదు.”
హజ్ విధికావడానికి గల షరతులు
స్వతంత్రుడై, యుక్త వయసు కలిగినవాడై మరియు స్థోమత గల ప్రతి ముస్లింపై జీవితంలో ఒకసారి హజ్ విధిగా నిర్ణయించబడినది.
1. ఇస్లాం
ఇస్లాంను పాటించేవాడై (ముస్లిం) ఉండాలి. ఇబ్న్ అల్ హాజిబ్ మరియు ముఖ్తసర్ లేఖకుల ప్రకారం: హజ్ కోసం ముస్లిం అయి ఉండడం తప్పనిసరి. హజ్ విధి కాక పోవడానికి ఒక అడ్డంకి అవిశ్వాసం.
2. సామర్ధ్యం
శారీరకంగా దృఢoగా ఉండి, అల్లాహ్ గృహాన్ని సందర్శించే ఆర్ధిక స్థోమత కలిగి ఉండాలి.
3. స్వతంత్రం
మూడో షరతు స్వతంతృడై ఉండాలి. బానిసపై హజ్ విధి కాదు.
4. యుక్త వయసు
నాలుగోది యుక్త వయసు. యుక్త వయసు హజ్ కు పరిమితం కాదు.
5. మానసికంగా ఎదిగిన వాడై ఉండాలి
మనిషి మానసికంగా ఎదిగి ఉండాలి. మానసికంగా ఎదగని మనిషిపై హజ్ విధి కాదు.
6. స్త్రీల కోసం
స్త్రీలకు మహ్రం (మగతోడు) అవసరం – భర్త, తోబుట్టువు, తండ్రి, కొడుకు, తండ్రి అన్నదమ్ములు, తల్లి అన్నదమ్ములు. ఇబ్న్ ఉసైమిన్ ప్రకారం, మహరం లేకుండా స్త్రీ హజ్ చేస్తే, హజ్ చెల్లుబాటు అవుతుంది, కాని అలా చేసినందుకు పాపం చేసినట్లు అవుతుంది.
7. ఇతరుల కోసం హజ్ చేస్తే
ఒక ముస్లిం ఇతరుల (మరణించినవారి) కోసం హజ్ చేసే ముందు, తనపై విధి అయిన హజ్ చేసి ఉండాలి. బ్రతికిఉన్నవారి కోసం హజ్ చేస్తే, ఆ మనిషి (ఎవరి తరఫున హజ్ చేయబోతున్నాడో) ఆరోగ్యుడై ఉండకూడదు.
గణాంకాలు
సౌదీ అరేబియా ప్రభుత్వం తరఫున వెలువడే గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు మూడు మిలియన్ ముస్లింలు, 70 దేశాల నుంచి హజ్ చేయడానికి కాబా సందర్శిస్తారు.
ఏ ఆరాధన అయినా ఆమోదం పొందడానికి కావలసిన షరతులు
ఏ ఆరాధన అయినా ఆమోదం పొందడానికి క్రింద ఇవ్వబడిన షరతులు నిజమై ఉండాలి:
కేవలం అల్లాహ్ కొరకై, పరలోకపు సాఫల్యం కొరకై ఉండాలి. ఇతరులను చూపించడానికి లేదా ప్రపంచపు లాభం కోసం అయి ఉండకూడదు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆచరణ (మాటల్లో, చేతల్లో) ప్రకారం ఉండాలి. ఇలా చేయాలంటే, సున్నత్ జ్ఞానం ఉండాలి.
హజ్ ప్రయోజనం
ఇది అల్లాహ్ ఆదేశాలను శిరసావహించడం అవుతుంది. దీని వల్ల ఉమ్మత్ (ముస్లింల)లో ఐక్యత పెరుగుతుంది. అల్లాహ్ ఆదేశాలను పాటించడం వల్ల మనిషిలో దైవభీతి పెరుగుతుంది. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ఇది (తెలుసుకున్నారు కదా! ఇది కూడా తెలుసుకోండి!). ; అల్లాహ్ చిహ్నాలను ఎవరయినా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తిభావన వల్లనే సుమా!” (ఖుర్ఆన్ సూరా హజ్ 22:32)
హజ్ లోని మొదటి మెట్టు- ఇహ్రామ్ ధరించినప్పటి నుండి తౌహీద్ (ఏకేశ్వరోపాసన) అన్ని విధాలా వ్యక్తమవుతుంది. దీని ద్వారా అల్లాహ్ కేవలం ఒక్కడే అని చాటబడుతుంది. అల్లాహ్ కు అతని ఉనికిలో, లక్షణాల్లో, కార్యాల్లో ఎవరూ భాగస్వాములు లేరు.
హజ్ విశ్వాసులు మరియు అవిశ్వాసులను వేరుపరుస్తుంది. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ఓ విశ్వాసులారా! ముష్రిక్కులు అశుద్ధులు .కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిదె హరామ్ దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్య్ర భయం ఉంటే అల్లాహ్ గనక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు.” (ఖుర్ఆన్ సూరా తౌబా 9:28)
హజ్ అంతిమదినాన్ని గుర్తుకు తెస్తుంది. అరఫా మైదానంలో అందరూ, ఎలాంటి భేద భావం లేకుండా ఒక చోట గుమిగూడుతారు. ఇక్కడ అందరూ ఒక్కటే- ఎవరికీ ఎవరిపై ఆధిక్యత ఉండదు.
హజ్ ద్వారా ఐకమత్యం నిరూపితమవుతుంది. హాజీలందరూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు, ఒకే రకమైన ఆరాధనలు చేస్తారు, అందరి ఖిబ్లా (దిశ) ఒక్కటే, అందరూ ఒకే చోటును సందర్శిస్తారు. ఇక్కడ ఎలాంటి భేద భావం కనపడదు. రాజు, బానిస – ధనికుడు, పేదవాడు – అందరూ సమానం. అందరి హక్కులు మరియు బాధ్యతలు సమానం.
హజ్ చేసిన ప్రతి ఒక్కరి పాపాలు తుడుచుకుపోతాయి. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే హజ్ చేసి, ఎలాంటి చెడు మాట్లాడకుండా, ఎలాంటి పాపానికి ఒడిగట్టకుండా ఉంటారో, వారు తమ తల్లి కడుపు నుండి అప్పుడే పుట్టిన వారిలా అవుతారు.”
హజ్ లో ముస్లింల మధ్య సమానత్వం మరియు ఐకమత్యం రూధీఅవుతుంది. వివిధ దేశాలకు, సంస్కృతులకు, సమాజాలకు, ఆర్ధిక కట్టుబాట్లకు చెందిన ముస్లింలు – ఒకే రకమైన దుస్తులు – రెండు కుట్టబడని దుస్తులు ధరిస్తారు. అందరు ఒకే ఆచారాన్ని పాటిస్తారు. ధనిక పేద, ఎరుపు తెలుపు వ్యత్యాసం లేకుండా అందరూ అల్లాహ్ ముందు వినయంగా నిలబడుతారు.
హజ్ వల్ల ముస్లింలు ఒకరినొకరు కలిసే, అర్ధం చేసుకునే, ప్రేమ పెంచుకునే, దగ్గరయ్యే, సంబంధాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. హజ్ సమయంలో తన తోటి ముస్లిం సోదరునితో మంచిగా మెలిగి అల్లాహ్ కారుణ్యాన్ని పొందే సదవకాశం దొరుకుతుంది. పేదలకు మరియు అవసరం ఉన్న వారిని ఆదుకుని అల్లాహ్ వద్ద ఉన్నత ప్రతిఫలం చూరగొనే అవకాశం ఉంది.
ఖుర్ఆన్ లో హజ్
ముస్లింలపై హజ్ తప్పనిసరి చేయాల్సిన ఆరాధన, అని ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించబడింది:
నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్ ఉమ్రహ్‌లు చేసేవారు వాటిమధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. (ఖుర్ఆన్ సూరా బఖర 2:158)
హజ్, ఉమ్రహ్‌లను అల్లాహ్ కొరకు పూర్తిచేయండి. ఒకవేళ మీరు నిలువరించబడితే, మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే ఖుర్బానీ, ఖుర్బానీ స్థలానికి చేరనంతవరకూ శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లేదా తలలో బాధ ఉన్నవారు (శిరోముండనం చేయించుకుంటే ఫరవాలేదు. కాని వారు) దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తర్వాత (చిక్కులనుంచి, నిలువరింపునుంచి) ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరయినా ఉమ్రహ్ మొదలుకుని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం (తమత్తు) పొందినట్లయితే, వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి. ఖుర్బానీ ఇవ్వలేని వారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసముండాలి. ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలవుతాయి. మస్జిదె హరామ్‌కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. (ప్రజలారా!) అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి. హజ్ మాసాలు నిర్థారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్‌ను తన కొరకు విధించుకున్న వ్యక్తి – హజ్ దినాలలో – కామక్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు. (హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు) ప్రయాణ సామగ్రి(ఖర్చు)ని వెంట తీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి (అని బాగా గుర్తుంచుకోండి). కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ ఉండండి. (హజ్ యాత్ర సందర్భంగా) మీరు గనక మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరఫాత్ నుండి తిరిగివస్తున్నప్పుడు ‘మష్‌అరె హరామ్’ వద్ద దైవనామాన్ని స్మరించండి – ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు. (ఖుర్ఆన్ సూరా బఖర 196,197,198)
అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. (ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:97)
హజ్ (యాత్ర)కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు, బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు. (ఖుర్ఆన్ సూరా హజ్ 22:27)
సున్నత్ లో హజ్
స్థోమతగల ముస్లింపై హజ్ తప్పనిసరి, మరియు దాని ప్రతిఫలం స్వర్గం. అనేక హదీసులలో పేర్కొనబడింది. క్రింద కొన్ని హదీసులు ప్రస్తావించబడ్డాయి:
ఇబ్న్ ఉమర్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. 1) అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరు లేరు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త అని విశ్వసించడం. 2) రోజు ఐదు పూటల నమాజు తప్పనిసరిగా చేయాలి. 3) జకాత్ (విధి దానం) ఇవ్వాలి. 4) హజ్ (కాబా యాత్ర) చేయాలి. 5) రమజాన్ మాసంలో ఉపవాసాలు పాటించాలి.” (సహీహ్ బుఖారీ vol 1:7)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఎలాంటి తప్పనిసరి పరిస్థితులు లేకుండానే, నిరంకుశ రాజు క్రింద లేకుండానే, ఇంట్లోనే ఉండాల్సిన జబ్బు రాకుండానే – హజ్ చేయకుండా మరణించారో – వారు యూదులుగా లేదా క్రైస్తావులుగా చనిపోయినను ఎలాంటి భేదం లేదు.” (తిర్మిజి 2535)
అబూ హురైరా ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అంటుండగా నేను విన్నాను: ‘ఎవరైతే హజ్ చేసి, ఎలాంటి అసభ్యకరమైన (రఫత్) పని లేదా అతిక్రమణ (ఫుసూఖ్) చేయరో, వారి పాపాలు మన్నించబడుతాయి, అంటే తల్లి గర్భంలో నుంచి అప్పుడే పుట్టిన బిడ్డలా అయిపోతారు.” (సహీహ్ బుఖారీ)
ఆయిషా (రజి) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను ఇలా అడిగారు, “జిహాద్ మంచి కార్యం (పుణ్యకార్యం), కావున మేము (స్త్రీలు) జిహాద్ చేయవచ్చా?” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు, “ఉత్తమ జిహాద్ హజ్ ఎ మబ్రూర్!” ఆ తరువాత ఆయిషా (రజి) ఇలా అన్నారు, “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నోటి ద్వారా ఈ మాట విన్నాక నేను హజ్ చేసే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితిలోనూ వదలిపెట్టే దాన్నికాదు.” (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)
అబూ హురైరా (రజి) ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అనగా నేను విన్నాను: ‘ఎవరైతే అల్లాహ్ కోసం హజ్ చేస్తారో, భార్యతో సంభోగం జరపరో, పాపం చేయరో, వివాదం చేయరో (హజ్ రోజుల్లో), వారు అప్పుడే తమ తల్లి కడుపు నుండి పుట్టిన వారిలా తిరిగి వస్తారు.” (సహీహ్ బుఖారీ 1449, సహీహ్ ముస్లిం 1350)
అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మునుపటి ఉమ్రా ఇప్పటి ఉమ్రా వరకు మధ్య గడచిన కాలానికి పాపాల ప్రాయశ్చితం అవుతుంది. అమోద్యం పొందిన హజ్ కు స్వర్గమే ప్రతిఫలం.” (సహీహ్ బుఖారీ 1683, సహీహ్ ముస్లిం 1349)