దేవుడు మానవాళి కోసం వారి జీవన సంవిధానం ఎలా ఉండాలో తెలుపుతూ, వారి కోసం రూపొందించిన నీతి, రీతి, నియమావళి పేరే ‘ఇస్లామ్’. ఇస్లామ్ అంటే శాంతి, సమర్పణ, విధేయత అనే అర్థాలు ఉన్నాయి. ధార్మిక పరిభాషలో ఇస్లాం అంటే మనిషి తనను తాను దైవానికి సమర్పించుకొని బేషరతుగా ఆయన విధేయతలను, ఆయన దాస్యాన్ని స్వీకరించడం. అంతేకాదు ఆ మనిషి దేవుని సంపూర్ణ విధేయతను తన జీవిత పరమార్థంగా చేసుకోవాలి. ఇదే అసలు ధర్మం యొక్క వాస్తవికత.
ఈ విషయం పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది… ‘‘మీ ఆరాధ్యుడు ఒక్క దేవుడు మాత్రమే. కనుక మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహిస్తూ, ఆయనకు మాత్రమే విధేయులై ఉండండి’’ (హజ్ 34) నిసా అధ్యాయంలో ఇలా ఉంది… ‘‘తమను తాము పూర్తిగా దైవానికి సమర్పించుకొని, దైవానికి విధేయులైన వారికంటే శ్రేష్ఠులు మరెవరు కాగలరు?’’ (నిసా-125) మరొకచోట ఇలా ఉంది… ‘‘ఎవరైతే దైవ విధేయతా మార్గాన్ని (ఇస్లాం) కాదని, మరే ఇతర జీవనమార్గాన్ని అనుసరించినా, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నిష్ఫలుడవుతాడు. తీవ్రంగా నష్టపోతాడు’’ (ఆలి ఇమ్రాన్.85) అంటే, మనిషి పూర్తిగా తనను తాను దైవానికి అర్పించుకొని, సంపూర్ణ విధేయుడుగా మారి ఆయన చూపిన జీవన విధానాన్ని అనుసరించడం, సర్వకాల సర్వావస్థలలో ఆయన ఆజ్ఞలు, ఆదేశాల వెలుగులో మను గడ సాధించడమే ఇస్లాం అంటే.
దైవం తన ప్రవక్తల ద్వారా అనాదిగా అందిస్తూ వచ్చిన ఈ ధర్మానికి, దాని బోధనలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా కొంతమంది అనుకుంటున్నట్లు, ఈ ధర్మం ముహమ్మద్ ప్రవక్త ద్వారానే ప్రారంభం కాలేదు. సమస్త మానవజాతికి తల్లిదండ్రులైన ఆదం, హవ్వా (అ) లను దైవం ఏనాడు సృష్టించాడో, ఆ నాటినుండే సమస్త మానవుల జీవన సంవిధానంగా దైవం ఈ ధర్మాన్ని నిర్ణయించేశాడు. అయితే చివరి దైవప్రవక్త ముహమ్మద్ ద్వారా దీన్ని పరిపూర్ణం గావించాడు. దైవం ముహమ్మద్ ప్రవక్తతో ప్రవక్తల పరంపరకు ముగింపు పలికి ఇలా ప్రకటించాడు… ‘‘నేను ఈ రోజు మీ కోసం మీ ధర్మాన్ని సమగ్రత జీవన వ్యవస్థగా పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను.
మీ శ్రేయస్సు కోసం ఇస్లామ్‌ను మీ జీవనధర్మంగా ఆమోదించాను’’ (మాయిదా.3). కనుక ఆది ధర్మం, అంత్య ధర్మం ఒక్కటే. సమస్త మానవాళికీ దైవం ఒక్కడే అయినప్పుడు, సమస్త మానవుల మూలం కూడా ఒక్కటే అయినప్పుడు, వారి ఇహపర సాఫల్యం కోసం ఆయన చూపే మార్గం జీవనధర్మంగా కూడా ఒక్కటే కావాలి కదా! అలా కాకుండా మానవుల్లోనే కొందరికి ఒక ధర్మం, మరికొందరికి మరొక ధర్మం ఉండడమనేది బుద్ధికి అందని విషయం. అందుకని ప్రతిఒక్కరూ తమ మూలాల గురించి ఆలోచించాలి. అందరినీ సృష్టించినవాడు, పోషించేవాడు, పాలించేవాడు ఒక్కడేనని, ఆ పరాత్పరుడే మానవాళి మనుగడ కోసం ఈ విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించి వారికోసం ఓ జీవనవ్యవస్థను ఏర్పరిచాడు. ఆ జీవనధర్మాన్ని అనుసరించడంలోనే మానవాళి సంక్షేమం, సాఫల్యం ఆధారపడి ఉన్నాయి.