జుమా నమాజ్ చేయటం విధి. దాని గురించి దేవుడు ఇలా ఆదేశిస్తున్నాడు: ”విశ్వసించిన ప్రజలారా! శుక్రవారం నాడు నమాజ్ కోసం పిలిచినప్పుడు, అల్లాహ్‌ా సంస్మరణ వైపు పరుగెత్తండి; క్రయవియ్రాలను వదలి పెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది”. (అల్ జుమా: 9)
దైవవ్రక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”పుట్టుక రీత్యా మనం గత సమాజాల వారందరికంటే చివర్లో ఉన్నా, స్వర్గానికి ముందుగా మనమే వెళ్తాం. శక్రవారం (నాడు చేసే ఆరాధన) అందరిపైనా విధిగా చేయబడింది. కాని యూదులు, క్రైస్తవులు దాంతో విభేదించారు. యూదులు తమ ఆరాధన కోసం (తామే స్వయంగా) శనివారాన్ని నిర్ణయించుకున్నారు. క్రైస్తవులు ఆదివారాన్ని ఎంచుకున్నారు. అయితే ముస్లింల కొరకు దేవుడు శుక్రవారం రోజును నిర్ణయించాడు”. (బుఖారీ, ముస్లిం)
జుమా నమాజు నుంచి మినహాయించబడినవారు
దైవవ్రక్త (స) ఇలా ప్రబోధించారు: ”జుమా నమాజును సామూహికంగా చేయడం ముస్లింలందిపై విధిగా చేయబడింది. అయితే బానిసలకు, స్త్రీలకు, పిల్లలకు, వ్యాధిగ్రస్తులకు, ప్రయాణికులకు ఇందులో మినహాయింపు ఉంది”. (అబూ దావూద్)
జుమా ఘనత, ప్ర్రాముఖ్యత
1) వారాలన్నింటికీ నాయకుడు లాంటిది శుక్రవారము (జుమా రోజు).
2) దేవుడు హజ్రత్ ఆదం (తి)ను పుట్టించింది జుమా రోజునే.(ముస్లిం)
3) ఆ రోజే దేవుడు ఆదం (అ)ను భూమి మీదకు దింపాడు. (ముస్లిం)
4) ఈదుల్ ఫితర్ (రమజాన్), ఈదుల్ అజ్హా (త్యాగోత్సవం) దినాలకన్నా జుమా రోజు శ్రేష్ఠమైనది. (ముస్నదె అహ్మద్)
5) జుమా రోజున ఒక ఘడియ వస్తుంది. ఆ సమయంలో దుఆ చేస్తే తప్పకుండా ఆమోదించబడుతుంది. దేవుని నుండి మంచిని ఆశించేవారికి అది తప్పకుండా లభిస్తుంది. బహుశా ఆ ఘడియ అస్ర్ నమాజ్ తర్వాత రావచ్చు. (అహ్మద్)
6) దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”ఎవరైనా జుమా రోజు గుసుల్ చేసి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వెళ్ళి అక్కడ తను చేయగలిగినన్ని నమాజులు చేసి, ఆ తర్వాత ఉపన్యాసం ముగిసే వరకు నిశ్శబ్ధంగా ఉండి, శ్రద్ధగా ఉపన్యాసం విని ఇమామ్‌తోపాటు ఫర్జ్ నమాజ్ చేస్తే గత శుక్రవారం నుండి ఆ శుక్రవారం వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి. అంతే కాదు, అదనంగా మరో మూడ్రోజుల పాపాలు కూడా క్షమించబడతాయి. (ముస్లిం)
7) దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”సూర్యుడు ఉదయించే రోజులన్నింటిలోకెల్లా జుమా రోజు అత్యంత శ్రేష్ఠమైనది. ఆదం (అ) పుట్టింది ఆ రోజే. ఆ రోజే ఆయన స్వర్గంలోకి ప్రవేశించారు. తిరిగి అదే రోజు ఆయన స్వర్గం నుండి భూమి మీదకు వచ్చారు. ప్రళయం కూడా అదే రోజు వస్తుంది”. (ముస్లిం)
8) హజ్రత్ అబూ హురైరా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”జుమా రోజు దైవదూతలు మస్జిద్ ద్వారం వద్ద నిలబడి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వచ్చేవారి పేర్లు వరుసగా నమోదు చేస్తూ ఉంటారు. మస్జిద్‌కు తొలి వేళప్పుడు వచ్చినవారికి ఒక ఒంటె ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. తరువాత వచ్చినవారికి పొట్టేలును ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. చివర్లో వచ్చేవారికి కోడి, ఆ తర్వాత వచ్చేవారికి గ్రుడ్డు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఇమామ్ ఖుత్బా ఇవ్వడానికి బయలుదేరగానే దైవదూతలు రిజిష్టర్ మూసేసి ఖుత్బా వినడానికి కూర్చుంటారు”. (బుఖారీ, ముస్లిం)
దైవప్రవక్త (స) ఆగ్రహం
దైవప్రవక్త (స) జుమా నమాజు చేయనివారిపై మండిపడుతూ, ”ప్రజలకు నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి జుమా నమాజుకు రాని వారిని పట్టుకుని వారి ఇళ్ళ సమేతంగా వారిని దహనం చేయాలని అనిపిస్తోంది” అని అన్నారు. (ముస్లిం)
వరుసగా జుమా నమాజులు ఎగవేసేవాడి పర్యవసానం
ఆయన ఇంకా ఇలా అన్నారు: ”తగిన కారణం లేకుండా సోమరితనంతో వరుసగా మూడు జుమా (నమాజు)లు ఎగ్గొట్టినవారి హృదయాలను (సన్మార్గ భాగ్యం లభించకుండా) దేవుడు సీలు చేసేస్తాడు”. (అబూ దావూద్)
వేరొక హదీసులో ఇలా ఉంది: ”ప్రజలు జుమా నమాజును వదిలేయటాన్ని మానుకోవాలి లేదా దేవుడు వారి హృదయాలకు ముద్రవేస్తాడు. తత్ఫలితంగా వారు (శాశ్వతంగా) ఏమరుపాటుకు లోనయ్యే ప్రమాదముంది”. (ముస్లిం)