మానవ మహోపకారి ముహమ్మద్ (స)

manava mahopakari_Page_3

పరిచయం

ఆ సమాజం చీకటి సమాజం. అంతటా గాఢాంధకారం. బహు దూర తీరాలలో అక్కడక్కడ మిణుకుమిణుకుమనే జ్ఞాన కాంతి కానవచ్చినా అధికాంశం అంధకారమయం. జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢనమ్మకాల దొంతరలు. సామాజిక అవగాహనకు సూత్రం: ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధికారం” అన్నది. సమాజం తరగతుల్లో విభాజితం: పాలకులు, స్వాములు, నాయకులు, కర్షకులు, దాసులు, బానిసలు, నౌకరులు, అధమాతి అధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష సమాజంలో ప్రధాన పాత్రధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడ కడపటి స్థానం. ఆ చీకటి ఎడారిలో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపుతు న్నాయి. ఆ పుష్పరాజమే ముహమ్మద్‌! (సల్లల్లాహు అలైహి వసల్లం)

పుడమిపై పాదం మోపినవారందరిలోకెల్లా పురుషోత్తములు దైవ ప్రవక్తలు. దైవప్రవక్తల్లోకెల్లా అగ్రజులు ఆయన. ఆయన సత్య ధార్మన్ని సంపూర్ణంగా అందించారు. ఒక సత్సమాజాన్ని స్థాపించారు. ఒక జాతిని పునర్నిర్మించారు. ఒక పరిపూర్ణ నైతిక నియమావళిని రూపొందించారు. అసంఖ్యాకమయిన సాంఘిక, రాజకీయ సంస్కరణలకు నాంది వేశారు. తన బోధనలను ఆచరించడానికి, వాటిని సమస్త మానవాళికి అందజేయడానికి ఒక శక్తివంతమయిన క్రియాశీల సమా జాన్ని స్థాపించారు. మానవ ఆలోచన ఆచరణా పరిధులన్నిం టినీ భావి కాలాన్నంతటికీ వర్తించేలా తీర్చిదిద్దారు.   ఆ మహాత్ముడే ముహమ్మద్‌! (సల్లల్లాహు అలైహి వసల్లం)

ముహమ్మద్‌!(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవర్తన

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) – ఆయన రుణగ్రస్తుల రుణభారాన్ని తొలగించేవారు. అభాగ్యుల్ని ఆదుకునేవారు. అనాథల్ని అక్కున చేర్చుకునేవారు. అతిథుల్ని గౌరవించేవారు. ఆపదల్లో ఉన్న వ్యక్తులకు ఆపద్బాంధవునిలా తోడ్పడేవారు. సత్యాన్ని బలపర్చే వారు. అసత్యాన్ని, అధర్మాన్ని, అనైతికతను అసహ్యించుకునే వారు.

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) – లేనిపోని ఆడంబరాలకు పోయే వారు కాదు. మట్టి నేలపైనా, చాపపైనా, కంకర్రాళ్ల్లపైన – సందర్భాన్ని బట్టి ఎలా వీలు పడితే అలా కూర్చునేవారు. సహచ రులతో సభలో ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చునేవారు, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకునేవారు కాదు.

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) – బానిసలతో, నిరుపేదలతో, అనా థలతో, బడుగు బలహీనులతో కలిసి కూర్చోవటానికి, వారితో కలిసి భోంజేయడానికి కొంచమయినా బెరుకు చూపేవారు కాదు.

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) – పిల్లల్ని ప్రేమించేవారు. ఆప్యాయ తతో వారి తల నిమిరేవారు. కూర్చోని మరి వారిని పలుక రించేవారు. వారికి తానే ముందు సలామ్‌ చెప్పేవారు. తొలి పంట ఫలాలను ముందుగా పిల్లలకు అందజేసే వారు.

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) – తన ఇంటివారితో ఉత్తమంగా వ్యవహరించేవారు. చినిగిన దుస్తుల్ని తానే కుట్టుకునే వారు. ఇంటి పనులు, వంట పనుల్లో సహకరించేవారు. ఆయన తన చేత్తో పని మనుషులనుగానీ, భార్యనుగాని కొట్టింది లేదు.

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) – పశుపక్ష్యాదులపై ఎంతో దయ చూపేవారు. తరతరాలుగా నోరులేని ఆ జీవాలపై జరిగే అన్యా యాన్ని ఎండ గట్టేవారు. ఆదిమధ్యాంతరహితుడయిన అల్లాహ్‌ మాటల్లో చెప్పాలంటే:
”(ఓ ముహమ్మద్‌!) నిశ్చయంగా నీవు మహోన్నత శీల శిఖర అగ్ర భాగాన్ని అధిరోహించి ఉన్నావు”.(నూన్‌: 4)
”నిశ్చయంగా మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా చేసి పంపాము” (అన్బియా: 107)

ఆ మాట ప్రముఖుల నోట

”నేడు లక్షలాది మానవుల హృదయాలను నిర్ద్వంద్వంగా వశ పరచుకున్న ఆ ఉత్తమ వ్యక్తి గురించి తెలుసుకోగలిగాను. ఆ కాలపు జీవన పంథాలో ఇస్లాంకు ఓ స్థానాన్ని సాధించి పెట్టింది కత్తి కాదని నాకు గట్టి నమ్మకం కుదిరింది; కేవలం ప్రవక్త (ముహమ్మద్‌) చూపిన నిరాడంబరత, త్యాగ నిరతి, వాగ్దాన పాలన పట్ల శ్రద్ధ, మిత్రులు సహచరుల పట్ల అమితమయిన అంకిత భావం; స్థిర చిత్తం, ఆయనలోని నిర్భీతి, దైవం పట్ల, తన ధ్యేయం పట్లనూ అచంచల విశ్వాసం – సకల అవరోధాలను అధిగమించింది కేవలం ఇవే కాని కత్తి కాదు.”. (మహాత్మ గాంధీ- యంగ్‌ ఇండియా)

”ప్రారంభ కాలపు మూలగ్రంథాలు, ఆయన్ని (ముహమ్మద్‌ను) విశ్వసనీయుడైన వ్యక్తిగా, సత్య సంధుడయిన మనిషిగా పరిచయం చేస్తాయి. అదే విధంగా నిజాయితీపరులు, సత్య సంధులయిన ఇతర వ్యక్తుల గౌరవాన్ని, విశ్వసనీయతను ఆయన చూరగొన్నాడనీ చెబుతున్నాయి”.
(ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వొల్‌. 2)

”తత్వవేత్త, వక్త, ప్రవక్త, శాసనకర్త, సేనాధి నాయకుడు, భావాల (హృదయాల) విజేత, హేతుబద్ధమయిన నమ్మకాల ప్రస్థాపకుడు, విగ్రహాలు లేని భక్తి తత్వాన్ని స్థాపించినవాడు, 20 ప్రాపంచిక సామ్రాజ్యాల స్థాపకుడు, ఓ ఆధ్యాత్మిక సామ్రజ్య వ్యవస్థాపకుడు – ఆయనే ముహమ్మద్‌. మానవ గొప్పతనాన్ని కొలిచే సకల కొలబద్ధల రీత్యా – ఇతనికంటే గొప్పవాడనదగిన మనిషి మరొకడెవడయినా ఉన్నాడా? అని గట్టిగా అడగవచ్చు”.
(లామార్టిన్‌)
”ఏ వ్యక్తుల జీవితాలు, సందేశాల వివరాలు కథలుగా రూపాంతరం చెందాయో, చారిత్ర కంగా చూస్తే వీరిలో ఎవ్వరూ తమ ధ్యేయాన్ని
ముహమ్మద్‌ సాధించిన దానిలో పదో వంతు కూడా సాధించ లేకపోయారు. ఆయన సలిపిన కృషి అంతా కేవలం ఒకే ఒక్క ధ్యేయం కొరకే. మానవులంతా ఒకే దేవుని ఆరాధన ఆధారం గా, నైతికోన్నతినిచ్చే నియమాల ఆధారంగా ఏకం కావాలన్నదే ఆయన ధ్యేయం. ముహమ్మద్‌ అయినా, ఆయన అనుయాయుల యినా ఎప్పుడూ ఆయన దేవుని కుమారుడనిగానీ, దేవుని అవతారమనిగానీ, దైవాంశ సంభూతుడనిగాని ప్రకటించ లేదు. ఆయన్ని నాడయినా, నేడయినా కేవలం దైవం ఎన్నుకున్న సందే శహరుని (మానవుని)గా మాత్రమే భావిస్తారు”.(ప్రొ హర్‌గ్రోంన్జే)

”ఇది ఎంతో వింతయిన విషయం. ఓ రాజ్యానికి అధిపతి గాను, ధర్మపీఠానికి అధినాయకుడిగాను, ఆయన తనలో ఓ సీజరు, ఓ పోపు అని
చెప్పవచ్చు, ఆయన పోపే కాని పోపు లాంటి పటాటోపం లేదు. ఆయన సీజరే కాని సీజర్‌ లాంటి వైభవం లేదు. స్థాయి, సైన్యం లేదు. అంగరక్షకుడు లేడు. రక్షక భట దళమూ లేదు. ఖజానా లేదు. ప్రపంచంలో ఎవరయినా నిజమయిన దైవిక అధికారం తో పరిపాలించారని చెబితే అది ముహమ్మద్‌ (స) మాత్రమే. ఆయనకు అన్ని అధికారాలుండేవి. కాని ఆ అధికారాలకు ఆలం బనలేవీ ఉండేవి కావు. ఆయన అధికారపు డంబాచారాలను ఖాతరు చేయ లేదు. ఆయన వ్యక్తిగత జీవితంలోని నిరాడంబ రత ఆయన ప్రజా జీవతంలోని సాధారణతను ప్రతిబింబిస్తూ ఉండేది”. (రెవరెండ్‌ బాస్వర్ట్‌ స్మిత్‌)

”ముహమ్మద్‌ తెచ్చిన సంస్కరణలు స్త్రీ జాతి స్థానాన్నే సర్వ సామాన్యంగా మార్చి వేశాయన్నది విశ్వవ్యాప్తంగా అంగీకృత విషయం”. (హెచ్‌.ఎ.ఆర్‌. గిబ్బన్‌)

”ఆయన ఆవిర్భవించినప్పుడు అరేబియా నేల ఓ ఎడారి- శూన్యం. ఆ శూన్య ఎడారిలో నుంచి శక్తివంతమయిన ముహమ్మద్‌ ఆత్మ బలం ఓ కొత్త ప్రపంచాన్ని సృజించింది. అది ఓకొ త్త జీవితం, కొత్త సంస్కృతి. ఓ కొత్త నాగరికత, ఓ కొత్త రాజ్యం-మొరాకో నుండి భారత భూభాగం వరకు విస్తరించిన రాజ్యం. అదంతా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా మూడు ఖండాల లో ఆలోచనా విధానాన్ని, జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసింది”. (ప్రొఫెసర్‌ రామకృష్ణారావు)

”గొప్పదయిన లక్ష్యం, స్వల్పమయిన సాధనాలు, ఆశ్చర్యకరమ యిన ఫలితాలు మానవ అసమాన ప్రతిభకు గీటురాళ్లయితే ఆధునిక ప్రపంచపు, ఏ గొప్ప వ్యక్తినయినా ముహమ్మద్‌తో పోల్చడానికి ఎవరు సాహసించగలరు?” (లా మార్టిన్‌)

”ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు, ప్రభావవంతులు అయిన వ్యక్తుల జాబితాలో తలమానికంగా నేను ముహమ్మద్‌ ను ఎన్నుకోవడం కొందరు చదువరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొందరు దాన్ని ప్రశ్నించనూ వచ్చు. కాని మానవ చరిత్ర లో నిత్యమూ ప్రాపంచిక ధార్మిక స్థాయిల్లో అత్యుత్తమంగా విజయం సాధించిన మనిషి ఆయన ఒక్కడే”. (మికాయిల్‌ హెచ్‌.హార్డ్‌)

”నేను పలుసార్లు ఇస్లాంలోని (ఏ ఇతర మతాల్ల్లో, సమాజాల్లో కానరాని) ఈ సమానత్వం, ఏకత్వం మూలంగా ప్రభావితురాలినయ్యాను. ఇది మనిషి
అంతర్ప్రేరణ ద్వారా సోదర భావాన్ని సృజిస్తుంది”. (ఐడియల్స్‌ ఆప్‌ ఇస్లాం)

”ఈయన్ని (ముహమ్మద్‌ని) మానవాళి రక్షకునిగా అభివర్ణిం చవలసి ఉంటుంది. ఆయన లాంటి ఓ వ్యక్తి ఆధునిక ప్రపంచాన్ని నిరంకుశంగా పరిపాలిస్తే అతను దీని సమస్యల్ని పరి ష్కరించడంలో విజయం సాధించి తద్వారా ప్రపంచానికి నేడు అన్నింటి కన్నా అధికంగా కావలసిన శాంతి, స్తుస్థిరతలను, సంతోషాలను పంచి పెట్టగలడని నా దృఢ విశ్వాసం”. (జార్జ్‌ బెర్నాడ్‌షా)

నేడు 1432 ఏళ్లు గడిచినా మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) జీవిత వివరాలు ఆయన బోధలు ఏ మాత్రం హెచ్చుతగ్గుల్లే కుండా ఎలాంటి ప్రక్షిప్తాలు, మార్పుచేర్పులూ లేకుండా నేటికీ సవ్యంగా, సక్రమంగా సజీవంగా ఉన్నాయి. ఆయన జీవిత కాలంలో మానవాళిని ఆలుముకున్న ఎన్నో రుగ్మతల్ని అవి ఎలా మాన్పగలిగాయో నేడు కూడా అలాగే మానవాళిని చుట్టుకున్న అనేక బాధల నివారణకు సజీవ ఆశాకిరణాలుగా భాసిల్లు తాయి.

ఆలోచనాపరులు, మానవత పట్ల బాధాతప్త హృదయులు, మానవ శ్రేయోభిలాషులు, శాంతి కాముకులు ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలి. ఎంతో అద్వితీయంగా, ఎంతో విప్లవాత్మకంగా కనిపించే ఈ వాఖ్యలు నిజం కావా? నిజమే అయితే ఆ మహాత్ముని గురించి తెలుసుకునే సమయం ఆసన్నం కాలేదా? దీని వల్ల మీరు కోల్పోయేది ఏమీ లేదు. పైగా అది మీ జీవితంలో ఓ నవ యుగానికి నాందిగా రూపొందగలదు.

Related Post