Originally posted 2013-05-17 21:24:33.
”భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే”. (అర్రహ్మాన్: 26,27)
దైవ ప్రవక్త (స), హజ్రత్ అబ్దుల్లాహ్‌ా బిన్ ఉమర్ (ర)ను ఉద్దేశించి ఇలా అన్నారు: ”ఇహలోకంలో నీవు ఒక బాటసారిలా జీవించు. లేదా దారిన నడిచివెళ్ళే సామాన్యుడిలా ఉండు. సాయంత్రం అయితే ఉదయానికై ఎదురు చూడకు. ఆరోగ్యాన్ని అనారోగ్యం కన్నా మేలైనదిగా తలంచు. మరణం కన్నా జీవితం గొప్పదని భావించు”. (బుఖారీ)
అవును – కనులు తెరిస్తే జననం. కనులు మూస్తే మరణం. ఈ రెప్పపాటులోనే ఉంది జీవన పయనం. ఇలలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మరణం మజా చవిచూడ వలసిందే. మనం ఈ అవనికి వచ్చినప్పుడే రిటర్న్ టికెట్‌తో వచ్చాము. అందులో మనం తిరిగి వెళ్ళాల్సిన తేదీ కూడా ఖరారయి ఉంది. ఆ ఘడియ దాపురించినప్పుడు ఒక్క సెకను కూడా ఆలస్యం అవదు. కానీ అదెప్పుడన్నది వీడని మిస్టరీ. మనకు తెలియదు, అంతుబట్టదు. ఈ యదార్థాన్ని ఖుర్‌ఆన్ ఇలా అభివర్ణిస్తుంది.
”తాను రేపు ఏం సంపాదించనున్నదో, తనకు మరణం ఏ భూభాగంలో సంభవించ నున్నదో(ఈ ధరణిలోని) ఏ ప్రాణీ ఎరుగదు”.
ఈ ప్రపంచంలో మనుషులు రెండు రకాలు. 1) నిద్రావస్థలో ఉన్నవారు. 2) మేల్కొని ఉన్నవారు. నిదురపోతున్న వ్యక్తి వెళ్ళాల్సిన రైలు బండి వెళ్ళిపోతుంది. అతను చేయాల్సిన ప్రార్థనా వాయిదా పడుతుంది. అతని సంపదా దోచుకోబడుతుంది. అతను ఎలాంటి సత్కారానికి, సన్మానానికి నోచుకో లేడు. ఎటువంటి వరాలూ అతన్ని వరించవు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను సమస్త సౌభాగ్యాలను కోల్పోయిన పరమ దౌర్భాగ్యుడు. కారణం నిద్ర. అది సగం మరణంతో సమానం గనక. అవును; మఱ పొందువారికి మలయదు కీర్తి.
ఇక నిద్రావస్థలో ఉన్న వ్యక్తి మరణించిన వానితో ఎలా సమానం అంటారా!? చూడండి! మరణించిన వ్యక్తి భౌతిక, బాహ్య అనుగ్రహాలన్నింటికి దూరమైపోతాడు. షడ్రుచులు మేళవించియున్న ఆహార పదార్థాలు వడ్డించబడి ఉన్నాయి; కానీ తను తినలేడు.పొందికైన దుస్తులు అల్మారాలో అందంగా అమర్చబడి ఉన్నాయి; కానీ తను తొడగలేడు. ప్రాణ సఖి అయిన ప్రియ ధర్మచారిణి తనతో పలుకరించేందుకు, తన పిలుపు విని తరించేందుకు పరితపించి పోతూ ఉంది; కానీ తను ఏమీ అనలేడు. ప్రాణాధికంగా పెంచిపోషించిన సంతానం చుట్టూ గుమిగూడి తదేకంగా తననే చూస్తున్నారు; కానీ తను మాత్రం వారిని కనలేడు. కన్నవారి కళ్ళు అశ్రువుల్ని కుమ్మరించి కాయలు కాచి ఉన్నాయి; కానీ తను ఓదార్చలేడు. ఎంతో దర్జాగా బ్రతికిన తన సుందర దేహంపై రెండే రెండు తెల్లటి దుప్పట్లు కప్పబడి ఉన్నాయి. తనను జనాజాలో పెట్టి భుజాలపై మోసుకెళు తున్నారు. జనాజా నమాజు ముగిసింది. సమాధిలో దించి తలా పిడికెడు మన్ను ఎత్తిపోస్తున్నారు దీవెనగానే. తన ఆరడుగుల అందమైన శరీరాన్ని కాటి మట్టిలో కలిపేస్తున్నారు; అయినా తనేం చేయలేడు.
ఇంచుమించు ఇటువంటిదే మనసు చచ్చిన వ్యక్తి ఉదాహరణ. తన అంతరాత్మ ఘోషను నిర్ధాక్షిణ్యంగా అణచి వేసిన ఈ మనుజ కుమారుడు తనకు ప్రాప్తించాల్సిన ఆత్మా నుగ్రహాలను కోల్పోతున్నాడు. నమాజులు సలుపువారు నమాజులు చేస్తున్నారు. వారి పుణ్యకార్యాలకు బదులు స్వర్గంలో అందమైన భవనాలు నిర్మించ బడుతున్నాయి. కానీ నిద్రావస్థలో ఉన్న ఈ సోంబేరి తన అలసత్వం, కారణంగా స్వర్గ సౌఖ్యాలను జారవిడుచుకుంటున్నాడు. వ్రతాలు ఆచరించేవారు ఉపవాసాలుంటు న్నారు. ఫలితంగా స్వర్గంలో దైవ దర్శనా భాగ్యం లభిస్తుందన్న శుభవార్తతో అమందానంద కందళిత హృదయార విందులై ఆత్మానంద సుందర బృందావనాల్లో విహరిస్తున్నారు. కానీ తిండిబోతులకు సాకులు వెతికేందుకే సమయం సరిపోవడం లేదు. అందుకే దైవప్రవక్త (స) అన్నారు: ”దైవస్మరణ చేసే వ్యక్తి ఉదాహరణ ప్రాణి వంటిదైతే, దైవకీర్తన చేయని వ్యక్త్తి ఉపమానం ప్రాణం పోయిన పీనుగ వంటిది” అని. (బుఖారీ)
క్షణికావేశానికి లోనై, ఏమరుపాటుకి గురై నేరం చేసిన వ్యక్తిని కోర్టు నిర్దోషని తీర్పు ఇచ్చినట్లు మనం ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఒక నిద్రలోలుడు, సోంబేరి, మేల్కొన్న, చురుకైన వ్యక్తికన్నా ముందుకు వెళ్ళినట్లు మనం వినలేదు. అందుకే పెద్దలన్నారు – ”మేల్కొన్న వ్యక్తి చేతికి మణి మాణిక్యాలు అందితే, నిద్రిస్తున్న వ్యక్తి చేతికి మట్టి లభిస్తుంద”ని. ఎందుకంటే, నిద్రావస్థలో ఉన్న వ్యక్తి, మరణించిన వ్యక్తి ఉభయులూ సమానులే. అతనికీ ఏమీ తెలవదు. ఇతనికీ ఏమీ తెలియదు.
ఒక్క నిమిషం ఆలోచించండి! ఖచ్చితంగా ప్రతి ప్రాణికి వచ్చి తీరే ఆ మరణ ఘడియ ఎంత భీతావహంగా, భయంకరంగా ఉంటుందో? అది ఎప్పుడు, ఎక్కడ, ఎటు నుంచి వచ్చి మన ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేస్తుందో ఒక్క మారు ఊహించండి. ఏ క్షణం మన జీవిత నౌక మునిగిపోతుందో, ఏ క్షణాన మన బ్రతుకు తెల్లారుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించండి.
మరణ శయ్య మీద ఓ రోగి అచేతనావస్థలో పడి ఉన్నాడు. చుట్టూ ఆప్తులు, అయినవారు గుమిగూడి ఉన్నారు. ఒకడేమో సూది గుచ్చుతున్నాడు. ఒకడు మాత్రలు మింగమంటున్నాడు. ఒకడేమో తేనె తినిపిస్తున్నాడు. ఒకడు చెంచాతో నీళ్ళు పోస్తున్నాడు. ఎవరు ఎంత చేసినా ఇది నయం కాని రోగం అని తెలుస్తూనే ఉంది,
రోగి ముఖంమీద మరణచ్ఛాయలు వెక్కిరిస్తున్నాయి…చెమటలు విపరీతంగా పడుతున్నాయి…గుండెల్ని పిండేసే బాధేదో ప్రాణం తోడేస్తున్నది…మెలమెల్లగా వెక్కిళ్ళు మొదలయినాయి…చెక్కిళ్ళు నల్లబడుతున్నాయి…పెదాలు పాలిపోతున్నాయి… గొంతు తడారి పోతున్నది… సన్నటి ఒణుకు వెన్నులో ప్రారంభమవుతున్నది… పొడుగాటి శ్వాసలు అధికమయినాయి…నేత్రాలు నింగినే చూస్తున్నాయి…. వాటిలోని తేజస్సు క్ష్షీణించిపోతున్నది…శరీరం మీది రోమాలు నిక్కబొడుచుకున్నాయి…వింత, విచిత్రమైన నిద్ర ఒడిలోకి జారుకుంటున్నట్లనిపిస్తున్నది… అల్లంత దూరం నుండి ఎవరో ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా”చదవమంటున్నారు…మరెవరో యాసీన్ సూరా పఠిస్తున్నట్లుంది… రెండే రెండు వెక్కిళ్లు….ప్రాణం అనే పక్షి పంజరం వదిలి ఎగిరిపోయింది…చేతులు రెండూ వాలిపోయాయి.. ఆ రోగి మ…ర…ణిం…చాడు…!! ”ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్”.
ప్రియ సోదరులారా!
జననం మన చేతుల్లో లేదు. మరణం కూడా మన చేతుల్లో లేదు. ఎలా జన్మించాలో, ఎక్కడ జన్మించాలో మనం నిర్ణయించలేము. ఎక్కడ మరణించాలో కూడా నిర్ధారించలేము. కానీ, ఎలా, ఏ స్థితిలో మరణించాలో- ఇది మాత్రం మన చేతిలోనే ఉంది. విశ్వాస స్థితిలోనా? అవిశ్వాస స్థితిలోనా? ఒక వర్గమేమో స్వర్గానికి, ఒక వర్గమేమో నరకానికి. ఎటు వెళ్ళాలో మీరే నిర్ణయంచుకోండి. ఆ మేరకు స్వేచ్ఛ అందరికీ ఉంది.