2.7 మేజోళ్ళపై మసహ్
పాదాలను చీలమండలం వరకు కప్పివేసే తోలుతో చేయబడిన మేజోళ్ళ వంటి చెప్పుల్ని ఖుఫ్, ఖుఫ్ఫైన్ అనంటారు. మేజోళ్ళ మసహ్‌ా స్త్రీ పరుషులిరువురి కోసం అనుమతించబడినది. శీతాకాలంలోనయినా, వేసవిలోనయినా, ప్రయాణావస్థలో నయినా, సాధారణ సమయంలోనయినా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యానికి గురయి ఉన్నా అన్ని అవస్థల్లోనూ మసహ్ చేసుకునే అనుమతి ఉంది. మసహ్ అంటే వుజూలో కాళ్ళు కడగడానికి బదులు తడి వేళ్ళతో తాకడం అన్నమాట.
అమర్ బిన్ ఉమయ్య జమరీ(ర) కథనం: ఆయన దైవప్రవక్త(స)వారిని మేజోళ్ళపై మసహ్ చేస్తుండగా చూశారు.(బుఖారి)
2.7.1 మేజోళ్ళపై మసహ్ షరతులు
1.వాటిని పూర్తి వుజూ చేసిన తర్వాత తొడగాలి.
ముగైరా బిన్ షోబా (ర) కథనం: ఓసారి ప్రయాణంలో నేను ప్రవక్త (స) వారితో ఉన్నాను. నేను ఆయన కాళ్ళనుండి మేజోళ్ళు తీసేద్దామని క్రిందికి వంగాను. ఆయన(స) నన్ను వారిస్తూ ”ఉండనివ్వు నేను కాళ్ళు కడుక్కునే మేజోళ్ళు తొడుక్కున్నాను” అని చెప్పి మేజోళ్ళ మీద మసహ్ చేశారు. (బుఖారి 203, మస్లిం 274)
2.వుజూలో విధిగా కడగవలసిన మొత్తం భాగాన్ని అవి కప్పి వేసేదిగా ఉండాలి. అలాలేని పక్షంలో వాటిని మేజోళ్ళు అనరు.
3.మేజోళ్ళపై నీరు పోసినా వాటి లోపలికి నీరు దిగకుండా, కాళ్ళు తడవకుండా ఉండాలి.
4.అవి చాలా మందంగా ఉండాలి. సాధారణ వ్యక్తి కోసం ఒక పగలు ఒక రాత్రి. ప్రయాణికుని కోసం మూడు దినాలు మూడు రాత్రులు మేజోళ్ళపై మసహ్‌ా చేసుకునే అనుమతి ఉంది.
5. మేజోళ్ళు పరిశుభ్రంగా ఉండాలి.శుద్ధిచేయబడిన మృతజంతువు చర్మంతో చేయబడి ఉన్నా పరవాలేదు.
2.7.2 మసహ్ కాల పరిమితి:
– మేజోళ్ళపై మసహ్ చేసుకునే అనుమతి స్థానికుడికి ఒక పగలు ఒక రాత్రి. ప్రయాణికునికి మూడు పగళ్ళు మూడు రాత్రులు.
– ఒకవ్యక్తి స్థానికంగా ఉంటూ మసహ్ చేసుకొని తర్వాత ప్రయాణానికి బయలుదేరి ఉన్నట్లయితే అతను ఒక పగలు ఒక రాత్రి మసహ్ చేయాలి.
– ఒకతను ప్రయాణావస్థలో మసహ్ చేసి ఎక్కడయినా ఒకచోటు కొద్ది రోజులు ఆగిపోతే స్థానిక ఆదేశాలే వర్తిస్తాయి. ఎందుకంటే మసహ్ ఒక రాయితి మాత్రమే.
– ఈ గడువు మేజోళ్ళు ధరించినప్పటినుండి గాక వుజూ భంగమయినప్పటి నుండి మాత్రమే లెక్క క్రిందికి వస్తుంది.
2.7.3 మేజోళ్ళపై మసహ్ చేసే పద్ధతి
: ఫర్జ్: మేజోళ్ళపై కొంత భాగంపై తడి వ్రేళ్ళతో స్పర్శిస్తే చాలు. మేజోళ్ళ క్రింది భాగంపై మసహ్‌ా అనుమతిలేదు.
సున్నత్: కుడి చేతి వ్రేళ్ళతో కాలి ముందు భాగంపై,ఎడమచేతి వ్రేళ్ళతో కాలి వెనుక భాగాన్ని స్పర్శించాలి. తర్వాత కుడి చేతి వ్రేళ్ళను వెనక్కి, ఎడమచేతి వ్రేళ్ళను ముందుకి తీసుకెళ్ళాలి.
2.7.4 మసహ్‌ను భంగపరిచే విషయాలు:
1.ఒక మేజోడునిగాని, రెంటినిగాని తీసివేసినప్పుడు.
2. మసహ్ గడువు ముగియడం: మేజోళ్ళ మీద మసహ్‌ా గడువు ముగిసింది కాని వుజూ ఉన్న పక్షంలో మేజోళ్ళు తీసి కేవలం కాళ్ళు మాత్రమే కడుక్కోవాలి. వుజూ లేకపోతే పూర్తి వుజూ చేసుకొని తొడుక్కోవాలి.
3.ఒకవేళ గుసుల్ చేయాల్సిన స్థితి ఏర్పడితే వాటిని తీసి కాళ్ళను కడగాలి. అట్టిస్థితిలో కేవలం మసహ్‌ా సరిపోదు. మసహ్ అనుమతి వుజూలో కాళ్ళు కడగదాన్ని బదులుగా లభించినదేగానీ, స్నానంలో కాళ్ళు కడగడానికి బదులుగా కాదు.
సఫ్వాన్ బిన్ అస్సాల్ (ర) కథనం: మేము ప్రయాణావస్థలో ఉన్నప్పుడు మా మేజోళ్ళుపై మసహ్ చేసుకోవాలని, వాటిని మూడు రాత్రులు తీయాల్సిన అవసరం లేదని, ములమూత్ర విసర్జన అయినా తీయాల్సి అవసరం లేదని, అయితే వీర్యస్ఖలనం గానీ, స్వప్న స్ఖలనంగాని సంభవిస్తే తప్ప” అన్నారు ప్రవక్త(స). (తిర్మిజీ 96, నసాయి 1/83)
2.8 బ్యాండేజి మీద మసహ్:
శరీరంలో కొంత భాగం లేదా అధిక భాగం విరిగి ఉన్నా, కాలి ఉన్నా దానికి బ్యాండేజి చుట్టాల్సి ఉంటుంది. అట్టిస్థితిలో కట్టబడిన ఆ బ్యాండేజి తడవకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొన్ని నియమాల్ని పాటించాల్సి ఉంటుంది.
1.సురక్షితంగా ఉన్న భాగాన్ని తప్పక కడగాలి. అరక్షిత భాగంపైనే మసహ్ అనుమతి ఉంటుంది.
2. మసహ్ బ్యాండేజి వరకే చేయాలి.
3. రోగి బ్యాండేజి కట్టబడిన పూర్తి భాగాన్ని కడగడాని బదులు ఆ భాగంపై తాకితే సరిపోతుంది. ఆ తర్వాత తన వుజూను పూర్తి చేసుకోవాలి.
4. విరిగిన అవయవానికి బ్యాండేజి కట్టాల్సిన అవసరం లేకపోయినా సురక్షితంగా ఉన్న భాగాన్ని కడిగి అరక్షితంగా ఉన్న భాగంపై మసహ్ చేయాలి.
జాబిర్ (ర) కథనం: ఓసారి మేము ప్రయాణావస్థలో ఉన్నాము. మాలోని ఓ వ్యక్తి తల రాయి వల్ల తీవ్రంగా గాయం అయ్యింది తర్వాత అతనికి స్వప్న స్ఖలనం జరిగింది. అతను తన సహచరులనుద్దేశించి ఈ విషయంలో తయమ్ముమ్ అనుమతి ఏమయినా ఉందా? అని అడిగాడు. అందుకు వారు: నీ వద్ద నీళ్ళున్నాయి గనక నీకా అనుమతి లేదు. అనే సరికి ఆ సదరు వ్యక్తి స్నానం చేశాడు, మరణించాడు. మేము దైవప్రవక్త (స) వారి వద్దకు వచ్చినప్పుడు జరిగిందంతా విన్పించాము. సాంతం విన్న దైవప్రవక్త (స): వారు అతన్ని హత్యచేశారు. అల్లాహ్ వారిని హతమార్చుగాక! అని కోపగించుకోవడంతో పాటు, వారికో విషయం తెలియనప్పుడు అడిగి తెలుసుకోలేకపోయారా? నిశ్చయం అజ్ఞానం విరుగుడు ప్రశ్నించడంలోనే ఉంది. ఆ సదరు వ్యక్తి గాయానికి బ్యాండేజి కట్టుకుని తయమ్ముమ్ చేసుకొని ఉంటే సరిపోయేది. బ్యాండేజి మీద మసహ్ చేసి, పూర్తి శరీరాన్ని కడుక్కొని ఉండి ఉంటే చాలు” అన్నారు. (అబూదావూద్ 336)
మాజూర్ (గత్యంతరం లేని) వ్యక్తులకు మసహ్‌ా కాలపరిమితి లేదు. కారణం ఉన్నంత వరకూ అతను మసహ్ చేసుకోవచ్చు. కారణం తొలిగిపోతే, గాయం నయం అయితే మసహ్ భంగం అయిపోతుంది. కడగటం తప్పనిసరి అవుతుంది.
బ్యాండేజి ఆదేశం హదసె అస్గర్‌లోనూ, అక్బర్‌లోనూ ఒకేలాగుంటుంది. ఒకవేళ మసహ్‌ా భంగమయితే బ్యాండేజి కట్టబడిన ఆ ప్రదేశాన్ని కడిగితే చాలు. పూర్తి శరీరాన్ని కడగాల్సి అవసరం లేదు.
1. అశుద్ధావస్థలో బ్యాండేజీ కట్టి తర్వాత తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు
2. కట్టబడిన బ్యాండేజీ తయమ్ముమ్‌కి సంబంధించిన అవయవాలపై – ముఖం లేదా చేతులపై ఉనప్పుడు
3. అవసరంకన్నా అధిక స్థలంపై బ్యాండేజీ కట్టబడి ఉన్నప్పుడు
పరీక్ష 6
సరైర పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(అ) క్రిందభాగం (ఆ) పైభాగం (ఇ) పైనాక్రిందభాగం
1. మేజోళ్ళపై మసహ్ చేసే వాజిబ్ విధానం మేజోళ్ళ …………………………………. మసహ్ చేయడం.
2. మేజోళ్ళపై మసహ్ చేసే సున్నత్ విధానం మేజోళ్ళ………………………………పై మసహ్ చేయడం.
సరైన సమాధాన్ని ఎన్నుకోండి:
3.ప్రమాదానికి గురయి బ్యాండేజి కట్టుకున్న వ్యక్తి అతని నమాజును పూర్తి చేయాలి.
(ఎ) అశుద్ధావస్థలో బ్యాండేజి కట్టబడినప్పుడు
(బి) బ్యాండేజి కేవలం గాయమైన భాగాన్ని మాత్రమే కప్పినప్పుడు.
(సి) పై రెండింటిలో ఏది కాదు.
4. స్థానికుడు మేజోళ్ళు తొడిగిన రెండు రోజుల వరకు వాటిపై మసహ్ చేయవచ్చు.
(ఎ) అనుమతి ఉంది.
(బి) అనుమతి లేదు.
5. ప్రయాణికునికి మేజోళ్ళపై మసహ్ గడువు:
(ఎ) 24 గంటలు
(బి) మూడు రోజులు
(సి) ఒకరోజు.
6. వుజూ చేసేటప్పుడు బ్యాండేజిపై మసహ్……………………………
(ఎ) అనుమతి ఉంది.
(బి) అనుమతి లేదు.
7. ఒక వ్యక్తి అశుద్ధావస్థలో గాయపడ్డాడు. గాయం మానిన మీద అతనిపై…………………….నమాజు ఖజా ఉంటుంది.
(ఎ) తప్పనిసరిగా
(బి) తప్పనిసరి కాదు.
8. మేజోళ్ళలోని ఒక మేజోడిని వుజూ మధ్య తీసేయడం మసహ్‌ాను భంగపరుస్తుంది.
(ఎ) అవును
(బి) కాదు