రచన – ముహమ్మద్ సలీం జామయి
మొక్కుబడి నిర్వచనం: మానవుడు ఒక ప్రత్యేక సందర్భంలో తనపై విధిగా లేని ఒక కార్యాన్ని తనపై విధిగా చేసుకోవటాన్ని మొక్కుబడి అంటారు. ఉదాహరణకు: కొంత మంది పేదవారికి బట్టలు పంచుతానని, కొందరి దాహార్తి తీర్చే ఏర్పాటు చేస్తానని, కొందరికి అన్నదానం చేస్తానని దైవానికి మొక్కుకోవడం వలన ఆ వ్యక్తిపై విధిగాలేని ఒక కార్యం మొక్కుబబడి చేసుకున్నాక విధిగా మారిపోతుంది.
మొక్కుబడి ఒక ఆరాధన: అల్లాహ్ మానవునికి నిర్దేశించిన ఆరాధనలు – నమాజు, రోజా, జకాత్, హజ్జ్, దుఆ మొదలయిన వాటిలాగే మొక్కుబడి కూడా ఒక ఆరాధన. మొక్కుబడి ప్రస్తావన అటు దివ్య ఖుర్‌ఆన్‌లోనూ, ఇటు దైవప్రవక్త (స) వారి హదీసుల్లో నూ వచ్చింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు”. (అల్ బఖర: 270) సజ్జనుల లక్షణం మొక్కుబడి తీర్చడం: మొక్కుబడి చేెసుకున్నాక తప్పక చెల్లించడం సజ్జనుల లక్షణమని ఖుర్‌ఆన్‌లోని దహ్ర్ అధ్యాయంలో పేర్కొనబడింది: ”వారు తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు. కీడు నలువైపులా విస్తరించే రోజు గురించి భయపడుతుంటారు”. (76;7) మొక్కుబడి చేసుకున్న ఈసా (ఏసు) అమ్మ మరియు అమ్మమ్మ: ప్రవక్త ఈసా (అ) వారి అమ్మమ్మ గర్భం దాల్చినప్పుడు ఇలా మొక్కుకుంది: ”ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి – ఇమ్రాను భార్య ఈ విధంగా వేడుకున్నది: ఓ నా ప్రభూ! నా గర్భంలో ఉన్నదానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరఫున దీనిని స్వీకరించు”. (ఆల్ ఇమ్రాన్: 35)
ప్రవక్త ఈసా (అ) గారి తల్లి మర్యమ్ (అ) సయితం గర్భిణిగా ఉన్నప్పుడు అల్లాహ్ ఆవిడకు ఏ పురుష సంపర్కం లేకుండానే ప్రపంచానికి ఒక సూచనగా పుట్టించబోతున్న ఆ బిడ్డ ప్రత్యేకతను గ్రహించని జనులు అర్థరహితంగా ప్రశ్నలు వేస్తే ఏమి సమాధానం ఇవ్వగలనని హజ్రత్ మర్యమ్ (అ) కంగారు పడుతుంటే, అల్లాహ్ ఆమెను, ఉపవాసం మొక్కుబడి చేసుకున్నాను ఎవ్వరితోనూ మాట్లా డనని సమాధానమివ్వమన్నాడు: ”ఏ మనిషైనా నీకు తారసపడితే నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడనను” అని చెప్పు. (దివ్యఖుర్‌ఆన్ 26)
మొక్కుబడి నియమాలు: మొక్కుబడి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ (స) వారు కొన్ని నిబంధనలు, నియమాలను తెలియజేశారు. అవేమంటే…. 1) మొక్కుబడి తప్పక నెరవేర్చాలి: మొక్కుబడి చేసుకున్నవారు తప్పనిసరిగా తమ మొక్కుబడిని చెల్లించాలి: ”ఆ తర్వాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి. తమ మొక్కుబడులను చెల్లిం చాలి”. (హజ్జ్:29) 2) మరణించిన వారి మొక్కుబడిని వారి వారసులు చెల్లించాలి: మొక్కుబడి చేసుకున్న వారు మొక్కుబడి తీర్చకుండానే మరణిస్తే వారి వారసులకు ఆ విషయం తెలిసి ఉంటే వారు ఆమొక్కుబడిని తీర్చాలి. ప్రవక్త ముహమ్మద్ (స) వారి జీవిత కాలం లో జుహైనా తెగకు చెందిన ఒక మహిళ ఆయన (స) వద్దకు వచ్చి – ‘ఓ ప్రవక్తా (స)! నా తల్లి హజ్జ్ చేస్తానని అల్లాహ్‌తో మొక్కుబడి చేసు కొని మొక్కుబడి తీర్చక ముందే మరణించింది. ఆమెకు బదులుగా నేను ఆ మొక్కుబడి తీరిస్తే చెల్లుతుందా?’ అని అడిగింది. దానికి ప్రవక్త (స) ”నువ్వు తప్పనిసరిగా ఆమె మొక్కుబడిని చెల్లించా”లని నొక్కివక్కాణించారు. (బుఖారీ)
3) ధర్మం సమ్మతించిన విషయాల పరిధిలోనే మొక్కుబడి చేసుకోవాలి: దైవ ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”దైవాజ్ఞ విదేయత కొరకు మొక్కుబడి చేసుకున్న వ్యక్తి ఆ మొక్కుబడిని చెల్లిం చాలి”.(ముత్తఫఖున్ అలైహి) ఉదాహరణకు- నమాజు, ఉపవాసం, ఉమ్రా, ధాన ధర్మాలు మొదలయినవి. 4) అధర్మ కార్యాల్లో మొక్కుబడి చేసుకోకూడదు: అల్లాహ్‌ా నిషేధించిన కార్యాలపై మొక్కుబడి చేసుకోరాదని ప్రవక్త (స) సెలవిచ్చారు. ”దైవ అవిధేయతా విషయమై మొక్కుబడి చేసుకున్న వ్యక్తి ఆ మొక్కుబడి చెల్లిందకూడదు”.(ముత్తఫఖున్ అలైహి) ఉదాహరణకు: నేను పది మందికి సారాతాపిస్తాననో,ఖవ్వాలీ పెట్టిస్తాననో,సమాధిపై చాదర్ కప్పుతాననో మొక్కుబడి చేెసుకోవ డం. పై కార్యాలన్నీ హరామ్. కాబట్టి ఇలాంటి మొక్కుబడులు చేసుకోరాదు. ఒకవేళ తెలియని కారణంగా చేసుకొని ఉన్నా వాటిని చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లించకూడదు.
5) తన ఆధీనంలో లేని విషయాలపై మొక్కుబడి చేయరాదు: మనషి తన శక్తిసామర్థ్యాలకు మించిన విషయాలపై మొక్కుబడి చేసుకోరాదు.’తన ఆధీనంలో లేని విషయాలపై మానవుడు మొక్కుబడి చేయరాదు’ అని ప్రవక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం) 6) అర్థరహితమయిన విషయాలపై మొక్కుబడి చేయరాదు: అనవసరమయిన, అర్థరహితమయిన విషయాలపై మొక్కుబడి చేయరాదని ప్రవక్త (స) వారి జీవితంలో జరిగిన ఓ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఓ సారి ప్రవక్త (స) మస్జిద్‌లో ప్రసంగిస్తుండగా అబూ ఇస్రాయీల్ అనే పేరు గల సహాబీ మస్జిద్ వెలుపల ఎండలో నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రవక్త (స) ఎందుకు ఆ వ్యక్తి బయటనే నిలబడి ఉన్నాడు? అని ప్రశ్నించారు. అతను ‘ఎండలోనే ఉంటాను; నీడలోకి వెళ్ళను, నిలబడే ఉంటాను; కూర్చోను, మౌనంగానే ఉంటాను; ఎవరి తోనూ మాట్లాడను, పస్తులతోనే ఉంటాను; ఏమి తినను’ అని మొక్కుబడి చేసుకున్నాడని ఇతర సహాబాలు తెలిపారు. అది విన్న ప్రవక్త (స) (అతని ఆ చర్యకు గర్హిస్తూ) ‘అతన్ని వెంటనే నీడలోకి వచ్చి, కూర్చోని, మాట్లాడమని చెప్పండి. ఆఁ ఉపవా సాన్ని అతను పూర్తి చేయాలి’ అన్నారు. (బుఖారీ)
7) మొక్కుబడి కేవలం అల్లాహ్ తో మాత్రమే చేసుకోవాలి: మొక్కుబడి ఒక ఆరాధన అని మనం ఇదివరకే తెలుసుకు న్నాము. ఆరాధన పెద్దదయినా, చిన్నదయినా అది కేవలం అల్లాహ్‌ా కొరకు మాత్రమే చేయాలని అల్లాహ్ తాకీదు చేశాడు. ”మీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు మీరు ఆయనను తప్ప మరొకరిని ఆరాధించకూడాదు”. (ఇస్రా: 23) ”అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి”. (నిసా: 736) పై ఆయతుల దృష్ట్యా మనం మన ఉపాసనారీతులన్నింటిని అవి – ధనపరమైనవైనా, వాక్కుపరమయినవైనా, కర్మపరమయినవైనా అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించాలి. ఇతరుల పేర మొక్కుబడి చేసుకోవడం అనేది ముమ్మాటికి బహుదైవారాధనే అవుతుంది. షిర్క్ – బహుదైవారాధనను అల్లాహ్ ఎన్నటికి మన్నించడు. అయితే ఈ వాస్తవాన్ని గ్రహించని అనేక మంది ముస్లిం సోదరులు జెండా మాన్ల వద్ద, పీర్ల ప్రతిమల వద్ద, దర్గా ల (సమాధుల) వద్ద, పుట్టల వద్ద, పాముల వద్ద మొక్కుబడు చేసుకుంటున్నారు. అంతే కాకుండా వందల మైళ్ళు ప్రయాణం చేసి మరీ తలనీలాలు సమర్పించుకొని చేసుకున్న మొక్కుబడులు తిర్చేసుకున్నామని మురిసిపోతున్నారు. వాస్తవానికి వారు అల్లాహ్‌ాకు ఇతరలను భాగస్వాములుగా చేసి మహా పాతకానికి, ఘోర పాపనికి ఒడిగడుతున్నారు. వారి తక్షణ చర్య ఏమిటంటే, వెంటనే వారు చేసిన నిర్వాకంపై కన్నీరుమున్నీరవుతూ కరుణా మయుని సన్నిధిలో తౌబా చేసుకోవాలి. జీవితంలో ఇకమీదట అటువంటి పాతకానికి పాల్పడమని లెంపలేసుకొని మరీ ప్రతీన బూనాలి.
మొక్కుబడి వల్ల ప్రయోజనం: మొక్కుబడి చేెసుకోవడం వల్ల ఏదో పెద్ద మహిమే జరిగిపోతుందని భావించడం తరచూ మనం చూస్తూ ఉంటాము. ఇదంతా ఓ అభూత కల్పన, ఒఠ్ఠి భ్రాంతి మాత్రమే. వాస్తవంగా మొక్కుబడి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని మహా ప్రవక్త ముహమ్మద్ (స) తేల్చి చేప్పేశారు: ”నిశ్వయంగా మొక్కుబడి విధివ్రాతను ఎంత మాత్రం మార్చ జాలదు. మొక్కుబడి ద్వారా అల్లాహ్ పిసినారి నుండి కొంత సొమ్మును రాబట్టుతాడు అంతే”. (బుఖారీ) ధార్మిక పండితుల అభిప్రాయం: మొక్కుబడి నిశ్చయంగా ఒక ఆరాధన. కాకపోతే ఇది అయిష్టకరమయినది. ఎందుకంటే షరతుతో కూడిన మొక్కుబడి ద్వారా దాసుడి స్వార్థప్రియత్వం బహిర్గతమవుతుంది. దాసుడు ఒక మంచి కార్యం చేయడానికి అల్లాహ్ తో షరతు పెట్టుకుంటాడు. నా ఫలాన కోరిక తీరితే నేను ఫలానా సత్కార్యం చేస్తాను అని మొక్కుబడి చెసుకోవడంతో అతని స్వార్థం బట్టనయలవుతుంది. అంటే, అతని కోరిక తీరితేనే అతను పుణ్యకార్యం చేస్తాడు; అన్యదా చేయడన్న మాట. ఈ కారణంగానే కొందరు ధర్మవేత్తలు షరతుతో కూడిన మొక్కుబడిని లంచంతో పోల్చారు. అయితే ఎలాంటి షరతు పెట్టకుండా ఒక మంచి కార్యా న్ని తమపై విధిగా చేసుకోవడం మాత్రం అభిలషనీయమన్నారు.
ఇక షరతుతో కూడిన మొక్కుబడి చేసుకునేవారు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎవరయినా మన వద్దకు వచ్చి మీరు నా ఫలాన పని చేసి పెడితే ప్రతిగా నేను మీ ఫలానా కార్యం చేసి పెడతాను’ అనంటే అతన్ని పచ్చ స్వార్థపరుడి క్రింద జమకడతాముగా! మరి మనమే ఆ పని చేస్తున్నామాయే! అదీ ఎవరితో! అనంత కరుణా మయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ాతో – నువ్వు నా ఫలానా పని చేసి పెడితే నేను ప్రతిగా ఫలానా పని చేస్తాను అని అల్లాహ్‌ాతో ఒప్పందానికి దిగడం ఎంత వరకు సమంజసం? ఈ కారణంగానే ఇటువంటి షరతుతో కూడిన మొక్కుబడి ధర్మసమ్మ తమయినప్పటికీ దాన్నో అయిష్టకరమైన కార్యంగానే ఎంచారు ధర్మవేత్తలు. ముఖ్య గమనిక: మొక్కుబడి చేసుకునేవారు అధర్మ విషయాలపై చేసుకోకుండా జాగ్రత్త పడటమే కాకుండా పూర్వం అజ్ఞాన కాలంలోగానీ, ప్రస్తుతంగాని విగ్రహాల, ఔలియాల పేరిట బలిచ్చే ప్రదేశాల్లో తమ పశువులను జిబహ్‌ా చేస్తామని మొక్కుకోకూడదు.
ఒక వ్యక్తి మొక్కుబడి చేసుకొని తీర్చలేకపోతే – అది షరతుతో కూడిన మొక్కుబడి అయినా ఎలాంటి ముందస్తు షరతు లేని మొక్కుబడి అయినా సరే అతను పరిహారం (కఫ్ఫారా) చెల్లించాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఇటువంటి ప్రమాణ భంగానికి మీరు చెల్లించవలసిన) కప్ఫారా ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్య రకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి. లేదా (మీరు మీ ఇంటి వారికి తొడిగించే మధ్య రకపు) బట్టలు వారికివ పెట్టాలి. లేదా ఒక బానిసకో, బానిసరాలికో స్వేచ్ఛనొసగాలి. ఇవేవీ చేయలేని వాడు మూడు రోజులు ఉపవాసం పాటించాలి. మీరు ప్రమాణాలు చేెసినప్పుడు (వాటిని భంగపరచినందుకుగాను ఇచ్చే) పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ విధంగా మీరు కృజ్ఞతా పూర్వకంగా మసలుకునేందుకుగాను అల్లాహ్‌ా మీ కోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు”. (మాయిదా: 89)