మానవ మహోపకారి ముహమ్మద్‌ (స)

(టిఐపి వారి ‘మానవ మహోపకారి ముహమ్మద్‌ (స)’ పుస్తకం ఆధారంగా)
నేపథ్యం
ఆ సమాజం చీకటి సమాజం. అంతటా గాఢాంధకారం. బహు దూర తీరాలలో అక్కడక్కడ మిణుకుమిణుకుమనే జ్ఞాన కాంతి కానవచ్చినా అధికాంశం అంధకార మయం. జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢనమ్మకాల దొంతరలు. సామాజిక అవగాహనకు సూత్రం: ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధికారం” అన్నది. సమాజం తరగతుల్లో విభాజితం: పాలకులు, స్వాములు, నాయకులు, కర్షకులు, దాసులు, బానిసలు,నౌకరులు, అధమాతిఅధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష  సమాజంలో ప్రధాన పాత్రధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడ కడపటి స్థానం.
ఆ చీకటి ఎడారిలో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపు తున్నాయి. ఆ పుష్పరాజమే ముహమ్మద్‌ (స)! ఆయన ఒక సందేశహరుడు, దైవ సందేశహరుడు, దైవ ప్రవక్త. తాను అందజేసే సందేశం తన సందేశమన్నా, నవ సందేశమన్నా, ఆనాటికి ఆధునిక సిద్ధాంత మన్నా, ఆ వాతావరణంలో ఆయనకు ఎదురుగా నిల్చొని కాదని చెప్పగల వారెవరూ లేరు. కాని ఆయన అలా చెప్ప లేదు. ఇది అత్యంత ప్రాచీనమయిన సందేశమని, మానవాళి ఎంత పురాతన మయినదో ఈ సందేశమూ అంతే పురాతన చరిత్రగలదని ప్రకటించిన నిస్వార్థ యోధుడాయన. తన మాట, ఆ వాతావరణానికి ఎంతో వ్యతిరేకమయిన మాటే అయినప్పటికీ, ఎంతో సౌమ్యంగా, సమంజసంగా, సౌజన్యంగా, శాంతి పూర్వకంగా అందజేశారు.
ఏ మాయాగారడి వ్యవహారంగాగాని, ఏదో కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతంగాగాని ఆయన దాన్ని ప్రతిపాదించలేదు. దైవం   పంపగా  వచ్చిన   సందేశహరులందరూ, ప్రవక్తలందరూ అందజేసిన సందేశమే, మీ, మా, మన పూర్వీకులందరూ అను సరించిన సందేశమే ఇది అని చాటిన సహృదయుడు. అయినా ఆయన్ని జనం వ్యతిరేకించారు, ఏవేవో స్వార్థ ప్రయోజ నాలు ఆ సందేశం వెనుక ఉన్నట్లు దుష్ప్ర చారం చేశారు. ఎన్నెన్నో దుష్ట సంకల్పాలు ఆయనకు అంటగట్టారు. ఏ మాత్రం నీతి పట్ల నమ్ముకున్న వ్యక్తి అయినా,
 ఏ కొంత సౌజన్యశీలత ఉన్న సుహృదయుడయినా, ఏ కాస్త సామంజ్యసత, హేతుబద్ధత గల బుద్ధిమంతుడయినా ఆనాడు ఆ వ్యతిరేక తకు, ఈ సందేశానికీ ఏమయినా సంబంధముందా అని ఆశ్చర్యపోగలడు. ఆ పిలుపుకు, ఆ ప్రజల వైఖరికీ మధ్య గల తేడాను ఇట్టే గ్రహించగలడు కూడా!       ఆ మహనీయుడు, ముహమ్మద్‌ (స) అందజేసిన సందేశానికి ఆ దేశ ప్రజలు అలా తీవ్రంగా స్పందించి వ్యతిరేకించ డానికి కారణమేమిటీ అని నేడు మనమూ ఆశ్చర్యపోతాము. దాన్ని ఆకళింపు చేసు కోవడానికి ఆ సందేశమేమిటో, నాటి పరిస్థితులేమిటో, కాస్త తెలుసుకునే ప్రయత్నం చేస్తే అంతా స్పష్టమవుతుంది.
మలుపు
ఆయన అందజేసిన సందేశమిదే:
ఈ నిఖిల సృష్టికి ఒక కర్త ఉన్నాడు. ఆయనే దీనికి స్వామి, ఆయనే దీనంతటికీ ప్రభువు. ఆయనే దీనికి పాలకుడు. అందు వల్ల ఆయన ముందరే తల వంచాలి, ఆయనకే మోకరిల్లాలి, ఆయన్నే ఆరాధిం చాలి, ఆయన్నే పూజించాలి, ఆయన ఆజ్ఞలనే శిరసావహించాలి, ఆయన ఆదేశాల ప్రకారమే జీవించాలి.
ఈ సందేశానికే ఆ మూఢ ప్రజలు ఉలిక్కి పడ్డారు. తమ పూర్వీకులు పూజిస్తూ వచ్చిన నక్షత్రాలను, నదీనదాలను, వృక్షాలను, పర్వతాలను, దేవతలను, విగ్రహాలను తిరస్కరించాలా? వంశాను గతంగా వస్తున్న పూజారులు, పురోహి తుల మాటలను త్రోసిపుచ్చాలా? మా నమ్మకాలకు, మా ఆచారాలకు మేము ఎటువంటి సామంజస్యతను చూపలేక పోవచ్చు. అంత మాత్రాన మా ప్రాచీన విశ్వాసాలను వదులుకోవాలా?? మా వంశం, మా కుటుంబంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలను కాదని, మా సమాజంలో అనాదిగా పాటించబడే నియమాలను తిరస్కరించి, మా మనస్సు కోరే అనేకానేక ఆకాంక్షలను వదలిపెట్టి ఈయనగారు చెప్పే, దైవాదేశాలని తెలిపే అంశాలు హేతుబద్ధమైన విషయాలే కావచ్చు, వాటినే సత్యాలని విశ్వసిం చాలా?
ఒక జాతి శతాబ్దుల తరబడి తీవ్రమయిన అజ్ఞానం, మూఢత్వం, పతనావస్థ, దురవస్థలకు, వెనుకబాటుకు లోనయి ఉంది. అవిద్య, అనాగరికత, అవ్యవస్థ, అసభ్యతలకు ఆలవాలమయి అలరారు తోంది. అటువంటి అనిర్వచనీయమయిన స్థితిలో అకస్మాత్తుగా సృష్టికర్త, విశ్వపాలనా ధీశుడు, నిఖిల జగతి ప్రభువు కటాక్ష     వీక్షణం ఆ జాతిపై పడుతుంది. ఆయన కారుణ్యం కదలుతుంది. ఆ ఎడారి నేల పైన చల్లని జల్లులు కురుస్తాయి. వారిలో ఒక ఉత్తమ నాయకుడు ఆవిర్భవిస్తాడు. విశ్వప్రభువు, స్వామి ఆ జాతిని సముద్ధ రించి, చీకటి కుహరాల నుంచి వెలికి తీసి, వెలుగు శిఖరాలపైకి ఎక్కించడానికి స్వయంగా తన వచనాలను, స్వయంగా తన సందేశాన్ని, స్వయంగా తాను ఆమో దించిన మార్గాన్ని ఆ నాయకుడికి అంద జేస్తాడు. తద్వారా ఆ జాతి ఏమరుపాటు నుండి మేల్కొనాలని, మూఢ నమ్మకాల చక్రవ్యూహం నుండి బయట పడాలని, సత్యాన్ని గ్రహించి జీవితపు రాచబాటను అనుసరించాలని ఉద్దేశిస్తాడు.
కాని ఆ జాతి ప్రజలు అవివేకులు; స్వార్థ పరులయిన తెగల, వర్గాల చిల్లర నాయ కులు, దైవం పంపిన ఆ నాయకుని వెంటాడుతారు, ఆయన ఉద్యమం నిష్ఫలం అవ్వాలని శాయశక్తులా ప్రయత్నిస్తుం టారు. ఆయన మార్గంలో ఎనలేని అవ రోధాలు సృష్టిస్తూ ఉంటారు. ఆయన పట్ల దుష్ప్రచారానికి వెరువరు. అనుదినం వారి వైషమ్యం పెరుగుతూనే ఉంటుంది. వారి దౌష్ట్యం అంచెలంచెలుగా ఎక్కువవుతూనే ఉంటుంది.
దుర్మార్గులు ఆ నాయకుని ఆంతమొందిం చాలని కూడా కుట్ర పన్నుతారు. అటు వంటి పరిస్థితిలోనూ ఆ మహనీయుడు అంటాడు:
”మీ ఈ అవివేకం వల్ల మిమ్మల్ని సంస్కరించే కార్యాన్ని నేను వదలు కుంటానని అనుకుంటున్నారా? మీకు అందజేస్తున్న హితోపదేశాన్ని, గుణ పాఠ ప్రబోధనాన్ని అందజేయడం మాను కోవాలా? మీరు శతాబ్దులుగా పడి ఉన్న మీ పతనావస్థలోనే మిమ్మల్ని మ్రగ్గుతూ ఉండేందుకు వదలి పెట్టాలని కోరుకుంటున్నారా? కారుణ్య ప్రభువయిన దేవుని కారుణ్యం కోరేది, దాని ఆవశ్యకత కూడా ఇదే అని మీరు తలుస్తున్నారా? దైవానుగ్రహాన్ని వదలి వేయడం, సత్యం ప్రత్యక్షమయిన తరు వాత, మిథ్యను పట్టుకు వ్రేలాడటం, మిమ్మల్ని ఎటువంటి పరిణామానికి గురి చేస్తుందో ఎప్పుడయినా ఆలోచిం చారా?”
”ఇక మీ వైఖరికి బేజారెత్తిపోయి మేము ఈ హితోపదేశ ప్రబోధాన్ని మీకు అంద జేయడం మానుకోవాలా? కేవలం   మీరు హద్దులు మీరిన జనం అవడం చేతనే ఇటువంటి అంతిమ నిర్ణయం గైకొనాలా?” (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ జుఖ్రుఫ్‌: 5)
ఆయన తన సందేశాన్ని దైవ గ్రంథం రూపంలో అందజేస్తున్నాడు. ఆయన అందజేస్తున్న దివ్యవాణి, దైవగ్రంథం, ఖుర్‌ఆన్‌లోని వచనాలు ఎంతో మనోజ్ఞం గా, మనోహరంగా, కర్ణపేయంగా ఆంత ర్యంలోకి చొచ్చుకుపోయేవి. మనిషిలో సత్యప్రియత లేశమంత ఉన్నా, అజ్ఞానపు అపమార్గాల ఆకర్షణ అతన్ని లోబరచు కోకపోతే, అతను మనోకాంక్షలకు పూర్తిగా లొంగిపోయిన వ్యక్తి కాకపో యినట్లయితే ఆ సందేశం, ముహమ్మద్‌ (స) సందేశంలోని సత్యత అతన్ని ప్రభావితం చేయక మానదు.
నిజ ధర్మం
తన సందేశాన్ని ఆయన అతి స్పష్టంగా విశదీకరించాడు. పరమ ప్రభువు అల్లాహ్‌ా ఒక్కడే ఈ విశ్వాన్నం తటికీ, మానవునికీ సృష్టికర్త, స్వామి, నిజప్రభువు కాబట్టి ఆయనే మానవుని సర్వాధికారి. మానవుని ధర్మాన్ని, శాసనాన్ని, విశ్వా సాలను, ఆచరణా నియమాలను ప్రతిపాదించడం ఆయనకే చెల్లు. సత్యా సత్యాలేవో తెలుపడం ఆయన బాధ్యతే, మరే శక్తికయినాసరే మానవునికి చట్టాన్ని ఇచ్చే యోగ్యత లేదు. ఏ మానవుడూ, మరే ఇతర శక్తీ ఈ సర్వాధికార సత్తా కలిగిలేరు. కడకు దైవప్రవక్తకు కూడా ఆ స్థానం దక్కదు. ఇదే ఆధారంగా పరమ ప్రభువు మానవులకు ఒక ధర్మాన్ని, అధి కారికంగా ఒకే ధర్మాన్ని ఆమోదించి ప్రసాదించాడు. అదే దైవ విధేయతా ధర్మం, ఇస్లాం.
 ఈ ఒక్క ధర్మమే మానవులకు, సర్వ లోకాల్లోనూ ప్రవక్తల ద్వారా అంద జేయ బడుతూ వచ్చింది. ఏ ప్రవక్త అయినా సరే తనదంటూ ప్రత్యేక ధర్మాన్ని స్థాపించు కోలేదు. దేవుని ఈ ధర్మాన్నే ప్రవక్తలం దరూ ఆది నుండీ మానవాళికి దైవం తరఫున అందజేస్తూ, అనుసరిస్తూ, ప్రచారం చేస్తూ వచ్చారు. దాన్ని కేవలం అనుసరించడం, ప్రచారం చేయడం
వరకే వారి బాధ్యత కాదు. వారు దాన్ని సంస్థా పించడానికీ బాధ్యులే. అదే కృషి వారం దరూ జీవితాంతం చేెశారు.
మానవాళికి దైవం తన ప్రవక్తల ద్వారా అందజేసిన ఈ నిజ ధర్మాన్ని, ప్రవక్తల తరువాత వారి అనుయాయులూ తమ సమకాలీన మానవులకు అందజేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే అనుయా యుల్లోని స్వార్థపరులయిన వారు, తమ స్వప్రయోజనాలు, స్వీయ ఇష్టాయిష్టాలు, స్వీయో త్కర్షల కారణంగా దైవ ధర్మాన్ని విభే దాలకు గురి చేశారు. అందులో విభిన్న వ్యత్యాసాలను సృష్టించారు. ఈ విభేదాలు, వ్యత్యాసాల ఆధారంగా విభిన్న వర్గాలు, మత వర్గాలు, మతాలు కల్పించారు. ప్రజల్లో ఏర్పడిన ఈ మతాలన్నీ ఆ ఒక్క దైవ ధర్మానికి వికృత రూపాలే. ఆ ధర్మాన్నే ప్రక్షాళించి, పునరుజ్జీవింపజేసి పునః స్థాపించడానికి మహనీయ ముహమ్మద్‌ (స) ఆవిర్భవించారు.
”ఆదిలో మానవులంతా ఒకే సముదా యంగా ఉండేవారు; తరువాత వారు విభిన్న విశ్వాసాలు, పంథాలు రూపొం దించుకున్నారు. నీ ప్రభువు వద్ద తొలి నుంచే ఒక విషయం నిర్ణయమయి ఉండకపోతే వారు విభేదించుకుంటున్న విషయంలో తీర్పు చేసివేయబడేది.” (దివ్యఖుర్‌ఆన్‌- యూనుస్: 19)
విలక్షణ వ్యక్తిత్వం
ఇదీ మహనీయ ముహమ్మద్‌ (స) సందేశం. ఇదే ఆయన జీవిత   ధేయం,  ఇదే ఆయన బోధించిన పరమార్థం. ఆయన స్వయంగా తన జీవితంలో ఈ దైవ ధర్మాన్ని సైద్ధాంతిక స్థాయిలో, ఆచరణ స్థాయిలో అవలంబించి, అనుసరించి తన ఆదర్శం ద్వారా అదే నిజ ధర్మమని నిరూ పించారు. తనను నమ్మి ఈ దైవ ధర్మాన్ని స్వీకరించిన వారిని సంస్కరించి, తీర్చిదిద్ది వారి వ్యక్తి గత జీవితాలను ప్రక్షాళించి, మెరుగు పరచి ఉత్తమ మానవులుగా రూపొం దించారు. వారి ద్వారా ఏర్పడిన సమా జాన్ని ఆదర్శ సత్సమాజంగా మలిచారు.
ఆయన నిరక్షరాసి. ఆయనకు చదవనూ, వ్రాయనూ తెలియదు. గ్రంథం అంటే ఏమిటో ఆయన ఎరుగడు. నలభయ్యేళ్ళ జీవితం అలాగే సాగింది. విశ్వాసాలు, వాదనలు,చర్చలు అసలే తెలియవు. కాని అకస్మాత్తుగా నలభయ్యేళ్ళ తరువాత గ్రంథాన్ని అందజేయడం, విశ్వాసాలను సుబోధకంగా వివరించటం, ఆధారాలు, నిదర్శనాలతో చర్చించడం, వాదించడం, ఆయన దైవ దౌత్యానికి, ప్రవక్తగా నియుక్తులయ్యారనడానికి అత్యంత పటిష్ట మయిన అఖండనీయ మయిన నిదర్శనం.
  అయితే తాను అందజేస్తున్న గ్రంథం నిస్సందేహంగా దైవ గ్రంథమే, దైవ వచనమే, దైవ ప్రోక్తమే అయినప్పటికీ తాను దైవంతో ప్రత్యక్షంగా, ముఖా ముఖిగా మాటలాడానని ఆయన దావా చేయలేదు. ప్రవక్తలందరి మాదిరిగానే దైవం తనకూ దైవవాణిని పంపే తన మార్గాల ద్వారానే ఈ బోధనలు అంద జేశాడని విస్పష్టపర్చారు. ఈ తాత్విక జ్ఞానం, ఈ జీవన సంవిధానం, ఈ ప్రపంచ వ్యవహారాలన్నింటికీ సమా ధానం, తన ఆలోచనా ఫలితం కాదు దైవప్రసాదిత జ్ఞానం మాత్రమే అని అతి వినయంగా చాటుకున్నారాయన.
‘మీ సహచరుడు దారి తప్పనూ లేదు, దారి వదలనూ లేదు. అతను తన మనోకాంక్షల ఆధారంగా ఏమాటా పలు కడు, ఇదయితే ఒక వహీ (దైవాణి), అతనిపై అవతరిస్తుంది. అతనికి జ్ఞాన బోధన గరిపిన వాడు మహాశక్తిమంతుడు, ఆయన మహా వివేచనాపరుడు”.   (దివ్యఖుర్‌ఆన్‌- అన్‌ నజ్మ్: 2-4)
దేవుడు ఒక్కడే ప్రభువు, ఆయనే సకల పూజలకు అర్హుడు, అన్ని అక్కరలనూ తీర్చేవాడూ ఆయనే, అందువల్ల చట్టాన్ని అందజేసేవాడు, నియమాలను నిర్ధారించే వాడూ ఆయనే అనే మహనీయ ముహమ్మద్‌ (స) వాదనకు విస్తు పోయారు ప్రజలు. వారి ఆవేదన ఏమి టంటే అన్నీ చేసేవాడు దేవుడే అయితే మా మహనీయులు, మా ఊరి దేవతలు, ఇలవేల్పుల మాటేమిటీ అన్నది! ”అల్లాహ్‌ా మాత్రమే మిమ్మల్ని సృష్టించిన వాడు, మీకు ఉపాధినిచ్చిన వాడు, ఆపైన మీకు మృత్యువునిస్తాడు, తిరిగి ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. అయితే మీరు కల్పించుకున్న సహవర్తులలో ఎవరయినా ఉన్నారా వీటలో ఏ ఒక్క పనయినా చేసే వారు? పరిశుద్ధుడాయన, వీరు చేసే బహుదైవోపాసనకు ఎంతో అతీతుడు”.  (దివ్యఖుర్‌ఆన్‌- అర్‌ రూమ్: 40)
ఆయన తన మాటను, తన సందేశాన్ని, వాస్తవానికి దైవ సందేశాన్ని ఎన్ని విధాలుగా బోధపరచినా, ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా, ఎన్ని ఆధారాలతో రుజువు పరచినా, ఎన్ని నిదర్శనాలతో నిరూపిం చినా ప్రజలు అర్థం చేసుకోవడం లేదే అని బాధపడేవారు మహనీయ ముహమ్మద్‌ (స). తిరస్కారుల మొండి పట్టుకు, మంకుతనానికి లోలోనే కుమిలి పోయేవారు. దైవం తన గ్రంథంలో ప్రవక్త శ్రీ (స)కి సాంత్వన వచనాలు పలికి ఓదార్చేవాడు.
”సరే ముహమ్మద్‌, వారు ఈ బోధనను విశ్వసించకపోతే, ఈ బాధతో వీరి వెన కాల బహుశా నీవు నీ ప్రాణాలనే ధార బోస్తావేమో”.  (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ కహ్ఫ్: 6)
  ”ముహమ్మద్‌, బహుశా నీవు ఈ జనులు విశ్వసించడం లేదనే దుఃఖంతో నీ ప్రాణాలనే కోల్పోతావేమో. మేము కోరినట్లయితే ఆకాశం నుండి సూచనను అవత రింపజేయగలము, తద్వారా దాని సమక్షంలో వీరి మెడలు వంచేలా చేెయ గలము”. (దివ్యఖుర్‌ఆన్‌- అష్‌ షు,రా: 3,4)
దైవం కోరుకునేది, మానవులు స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా సత్యాన్ని స్వీకరించాలన్నదే అనీ, తాము ఇష్టపడిన దాన్ని ఎన్నుకునే, అవలంబించే స్వాతంత్య్రం ఇవ్వడం ద్వారానే మానవుల్ని పరీక్షించడం జరుగు తోందని అల్లాహ్‌ ప్రవక్త శ్రీ (స)కి బోధ పర్చాడు తన గ్రంథంలో. ధర్మ ప్రచార కార్యం అత్యంత కష్టభూయిష్టమయినదే. అందులో నిరంతర పరిశ్రమ, అవిరళ కృషి తప్ప మరో ప్రత్యామ్నాయం, మాయలు, మంత్రాలు, తంత్రాలు అసలే లేవని ఖచ్చితంగా చెప్పివేశారు.
”ఆదిలో మానవాళి అంతా ఒకే విధానాన్ని అవలంబించేది. (ఆ తర్వాత పరిస్థితులు మారగా విభేదాలు ఉత్పన్న మయ్యాయి) అప్పుడు అల్లాహ్‌ ప్రవక్తల్ని పంపాడు; వారు సన్మార్గావలంబనకు శుభ వార్త అందజేసేవారు, దుర్మార్గావలంబన పరిణా మం పట్ల భయపెట్టేవారు. వారితోపాటు, ప్రజల మధ్య సత్యం పట్ల పొడసూపిన విభేదాల తీర్పు చెయ్యటానికి సత్య విలసిత గ్రంథాన్ని అవతరింపజేశాడు – (ఈ విభేదాలు తలెత్తడానికి కారణం ఆదిలో జనానికి సత్యం ఏదో తెలుపక పోవడం కాదు) అలా విభేదించినవారు ఎవరో కారు, సత్యజ్ఞానం పొందిన వారే”.   (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ బఖర: 213)
”ఆ తరువాత, ముహమ్మద్‌, మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని పంపాము. ఇది సత్యం తీసుకువచ్చింది. ఇది, దీనికి పూర్వం (గ్రంథాలలో) ఉన్న అల్‌ కితాబ్‌ (ఉద్గ్రంథం)లోని అంశాలను ధ్రువీకరి స్తుంది, వాటిని కనిపెట్టుకు ఉంటుంది”.  (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ మాయిదా: 48)
ఆయన ఒకే ఒక్క దైవం సమక్షంలో తల వంచాలని, ఆయన అనుగ్రహించిన ధర్మాన్నే అనుసరించాలని మాత్రమే బోధిం చాడు. ఈ ధర్మ మార్గంలో బుద్ధి బలాన్ని ఉపయోగించుకుని   తమకంటూ  ప్రత్యేక స్థానం కోరుకునేవారికి అలాంటి అవ కాశమే లేదు. వారి పెద్దరికం చెలామణి అయ్యే పథకం లేదు. జనం వారి వెనకా ముందూ గుమిగూడి వారి సమక్షంలో తలలు వంచడమే కాక జేబులు ఖాళీ చేసే ఆస్కారం అసలే లేదు.
ఇలాంటి అత్యాశాపరులే కొంగ్రొత్త నమ్మ కాలు, తత్వాలు, సరికొత్త ఆరాధనా రీతులు, మత వ్యవహారాలు, విచిత్ర     మయిన జీవన విధానాలూ సృష్టించారు. కొత్త మతభావనలు కల్పించారు. మానవాళిని దైవవిధేయతా రాచబాట నుండి వేరు చేసి చిన్న చిన్న కాలి బాటలు అనేకం కల్పించి మానవుల్ని అనుసరింపజేసి, మానవాళిని ఛిన్నాభిన్నం చేసివేశారు. దీని ఫలితంగానే మతం పేరిట వాదులాటలు, పోరాటాలు, సంఘర్షణలు, మత ఘర్షణలు జరిగాయి, మానవ చరిత్ర అంతా రక్తసిక్తమయి పోయింది అని ఆయన మానవుల్ని హెచ్చ రించారు.
ఆయన ప్రకటన నేను మానవులకు మధ్య నెలకొన్న ఈ వర్గాలు, మఠాలు, భేదభావాలు, తార తమ్యాలు – అన్నింటికీ అతీతంగా నిష్పక్ష  పాతంగా న్యాయప్రియతను మాత్రమే ఆశ్ర యిస్తాను. నేను ఒక వర్గానికి సానుకూలం గాను  మరో వర్గానికి వ్యతిరేకంగా పక్ష పాతంతో వ్యవహరించలేను. నా సంబం ధం సకల మానవులతోనూ సమాన
మయినదే. మానవాళితో నా సంబంధం సత్యం, న్యాయం ఆధారంగానే ఏర్పడుతుంది. సత్యం ఎటువైపు ఉంటే నేను దాని పక్షాన నిలబడతాను. సత్యం ఆశ్రయించిన వ్యక్తి పరాయివాడయినా, వ్యతిరేకి అయినా, విరోధి అయినా నేనతని పక్షానే నిలు స్తాను. సత్యవిరుద్ధమయిన మాటకు నేను విరోధిని. ఆ అసత్యవాది నా వాడు, నా సన్నిహితుడు, నా మిత్రుడు, నా బంధువు అయినా నేనతన్ని వ్యతిరేకిస్తాను. నేను అసత్యానికి విరోధిని.
  నేను మీకు అందజేస్తున్నది, ప్రతిపాది స్తున్నది సత్యం. నేను ఈ సత్యాన్ని అంద జేయటానికి నియుక్తుణ్ణి. ఇందులో ఎటు వంటి వ్యత్యాసాన్ని పాటించను. ఇది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఇందులో తన వారని, పరాయివారని తేడా లేదు. పెద్దవారని, చిన్నవారని, అధము లని, అగ్రులనీ తారతమ్యం లేదు. బీద వారని, ధనవంతులని, పండితులని, పామరులని బేధభావం లేదు. శిష్ఠ జనులని, అల్ప జనులనీ హెచ్చు తగ్గులు లేవు. వేర్వేరు వర్గాలకు వేర్వేరు హక్కులు లేవు, అందరికీ సమానమయిన హక్కులే వర్తిస్తాయి.
ధర్మమయితే అందరికీ ధర్మమే. అధర్మమయితే అందరికీ అధర్మమే. ఒకరికి పాపమయినది అందరికీ పాపమే.   ఒకరికి పుణ్యప్రదమైనది అందరికీ పుణ్య ప్రదమయినదే. నేరం అన్నది ఎవరు చేసినా నేరమే. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం వర్తించదు.
ఈ నిష్పక్షపాత నియమంలో నా స్వంత జనులకు, నా ఆత్మీయులకు, ఆప్తులకు, స్వయంగా నాకూ ఎలాంటి మినహా యింపు లేదు.నేను ప్రపంచంలో న్యాయ సంస్థాపనకు వచ్చాను. అందుకే నియుక్తుణ్ణి. ప్రజల మధ్య ఎటువంటి బేధభావం చూపించ కుండా న్యాయంగా వ్యవహరించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి నాపై బాధ్యత మోపబడింది. ప్రజల జీవితాలలో నెల  కొన్న అసంఖ్యాకమయిన అసంతుల నాలను రూపు మాపడానికి, అన్యాయాలను అంతమొందించడానికి, సమాజంలో పొడసూపుతున్న అసమానతలను తుడిచి ప్టెడానికి నియోగించబడ్డాను నేను. అంతే కాదు నేను మీ మధ్య న్యాయ మూర్తిగా కూడా వ్యవహరిస్తాను. మీలో తలెత్తే తగాదాలకు సరయిన, న్యాయవంతమయిన తీర్పులను చేయడానికి దైవం నియమించిన న్యాయ నిర్ణేతను నేను అని కూడా ఆయన చాటారు. తదనుగుణంగా మదీనా లో స్థాపించిన తొలి ఇస్లామీయ నగర రాజ్యానికి న్యాయమూర్తి, జడ్జిగా కూడా ఆయన భూమిక అద్భుతమయినది.
న్యాయానికి చిహ్నం ”మీజాన్‌” (తుల మానం, తరాజు, తక్కెడ) అని, నేటికి   పదిహేను వందల ఏళ్ళ క్రితం చాటింది, ఎత్తి చూపింది
ప్రవక్త మహనీయుల (స) ద్వారా అందిన దివ్యఖురాన్‌ మాత్రమేఅన్నది అఖండనీయమయిన సత్యం.
 ”సత్యం, ధర్మంతోపాటు ఈ గ్రంథాన్నీ, (న్యాయ నిర్ణయానికి) తులమానాన్నీ అవతరింపజేసినవాడే అల్లాహ్”.  (దివ్య ఖుర్‌ఆన్‌- అష్‌ షూరా: 17)

Related Post