ముహమ్మద్ ఉమర్
అనంత కరుణామయుడు, అపార కృపాశీ లుడు, అనంత శక్తిమంతుడు సకల లోకాలకు ప్రభువు అయిన అల్లాహ్‌ా పేరుతో మొదలు పెడుతున్నాను.
నా పేరు నేరెళ్ళ రాజశేఖర్, తండ్రి పేరు నాగేశ్వర రావు. తల్లి పేరు శశికళ డేవిడ్. మాది సనాతన క్రిష్టియన్ సంప్రదాయ కుటుం బం. మా సొంత ఊరు కర్నూలు జిల్లా చాగల మర్రి మండలం, చింతలచెరువు గ్రామం. కోలుముల పేటకు ఆనుకొని ఉన్న క్రిష్టియన్ కాలనీలో బ్రిటిష్ వారు కట్టించిన చర్చీ ఉన్నది. అక్కడ ఉన్న వారందరినీ సంఘంగా చేశారు. ఆ సంఘంలో పేరున్న కుటుంబం మాది. ఎందుకంటే మా నాన్నగారు ఆర్మీలో రిటైర్డ్ అయిన తరువాత లోకల్ కరెంట్ ఆఫీస్ లో లైన్‌మెన్‌గా పని చేశారు. అందువలన మా అబ్బగారిని సంఘమయ్యగా ఎన్నుకొన్నారు ఊరి ప్రజలు. మేము చర్చీలో ప్రార్థన చేయించడమే కాక చావులకు, పెళ్ళిళ్ళకు ఇంటింటికీ వెళ్ళి ప్రార్థనలు చేయించేవాళ్ళం. నా చిన్నప్పుడు మా నానమ్మ చర్చీలో పాస్టర్‌గా పని చేశారు. నేను నానమ్మతో పాటు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుండే వాణ్ణి. నాకు ఊహ తెలిసిన తరువాత మా అబ్బ, నానమ్మ పాస్టర్ గా గతించారు. పెద్దయ్యాక మా అన్నకు, నాకు ఈ సంఘపు బాధ్యతలు అప్పగించ బడినాయి. నేను బాప్తిస్మా మరియు నిర్ధారణ తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. యెహోవా (అల్లాహ్ ) మెష్షే ప్రవక్త కు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలతో పాటు మరి కొన్ని ప్రార్థనలు వచ్చి ఉండాలి. ఆ ఆజ్ఞలతో మొట్టమొదటిది ”నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశమందే గానీ, క్రింద భూమియందే గానీ, భూమి క్రింద నీళ్ళయందే గానీ ఏ విగ్రహము అయిననూ గానీ నీవు చేసుకొనకూడదు. వాటిని పూజించకూడదు. వాటికి సాగిలపడ కూడదు” అన్నది. ఈ ఆజ్ఞయే నాలో ఆలోచన ను రేకెత్తించింది. నా మతం సరియైనదే అని నమ్మకం ఉన్నా ఏదో వెలితి నన్ను వేరే మతాలలోనికి తొంగి చూసేలా చేసింది. అందులో నన్ను ఇస్లాం ఆకర్షించింది.
ధర్మభ్రష్టుణ్ణి అవుతున్నానేమో అని ఒకవైపు, నిజమార్గమేమిటో తెలుసుకోవాలన్న తపన మరో వైపు ఎటూ తేల్చుకోలేక పోయేవాణ్ణి. అయినా ఇస్లాం వైపునే నా చూపు మాటి మాటికీ పోయేది. ఎందుకు ఇలా జరుగు తున్నది అని తరచి చూస్తే నా జీవితంలోని సంఘటనలు, నా పరిసరాలు, స్నేహితులూ అన్నింటినీ మించి అల్లాహ్‌ా కరుణా కటాక్షా లు నామీద ప్రభావం చూపి ఉండవచ్చు. అందులో కొన్ని అనుభవాలు మీతో పంచు కోవాలనుకుంటున్నాను.
మొట్టమొదటిది: నా తల్లిగారు నర్స్. ఉద్యోగం రీత్యా మేము చాలా ఊర్లు మార వలసి వచ్చేది. కడప జిల్లా సుండుపల్లెలో ఉండగా నేను చాలా చిన్నవాణ్ణి. ఒక సారి మా అమ్మ గారు అర్జెంట్ డ్యూటి మీద వెళుతూ మా పొరుగున ఉండే అజీజ్ ఖాన్ గారి భార్యకు నన్నప్పగించి వెళ్ళారు. ఆమెకు కూడా నా వయసు కుమార్తె ఉంది. నేను ఆకలితో ఏడ్చే సరికి తన బిడ్డకు పట్టవలసిన పాలను నాకు త్రాపినది ఆ మహాతల్లి. నాకు ఊహ తెలిసిన తరువాత నా తల్లిదడ్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఆమె త్యాగబుద్ధితో నాకు పాలు త్రాపించినందులన ఆ తల్లి వారసత్వం గా నాలో ఇస్లాం ప్రవేశించినదో లేక ఒక ముస్లిం మహిళ నాకు పాలు త్రాపినది అన్న కారణంగానో తెలియదు గానీ ముస్లిమ్స్ అంటే నాకు చాలా అభిమానం ఏర్పడినది.
సుండుపల్లె నుండి ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ నిమిత్తం అమ్మగారు లక్కిరెడ్డిపల్లెకు మార వలసి వచ్చినది. అక్కడ అబ్బాస్ అలీ ఖాన్, అనే స్నేహితుడు పరిచమయ్యాడు. ఇతని ద్వారా ఇస్లాం వైపు నా ప్రయాణం మొదలై నది. తరువాత అమ్మకు కడపకు ట్రాన్స్‌ఫర్ అయినది. అక్కడికి పోయిన తరువాత అబ్బాస్ అలీ ఖాన్, తన చిన్నాన్న కుమారుడు నవాజ్ అలీ ఖాన్‌తో పరిచయం చేయించాడు, నవాజ్ స్నేహితులు నా స్నేహితులయ్యారు. అందులో బషీర్ ఖాన్ ఆనే స్నేహితుని ద్వారా నేను ఇస్లాంకు మరింత దగ్గరయ్యాను. నేను బషీర్‌తో ఇస్లాం స్వీకరిస్తానని చెప్పాను. మా ఇంటివారు గొడవ పడతారనే అనుమానంతో బషీర్ ఇప్పుడే వద్దు నీ కాళ్ళ మీద నీవు నిల
బడ్డ తరువాత ఇస్లాం స్వీకరిస్తువులే అని నచ్చ జెప్పాడు. బహుశా అప్పుడు ఇస్లాం స్వీకరించి ఉంటే నికలడ ఉండేది కాదేమో! ఎందుకంటే టీనేజీ తొందరపాటు నిర్ణయం మరియు నాకు ఇస్లాం గురించి తెలిసినది చాలా తక్కువ గనక.
తరువాత మేము సొంత ఊరుకు చేరు కున్నాము. అక్కడ చర్చీలో మా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారము. కొంతకాలం తర్వాత అన్నగారి లాయర్ ఉద్యోగం రీత్యా మరియు ఆయన చదువు రీత్యా మండల కేంద్రమైన చాగల మర్రికి మేమందరము రావలసి వచ్చినది. అక్కడ మొహిద్దీన్, అబ్దుల్లాహ్ , అహ్మద్, యాకూబ్ అనే స్నేహి తులు పరిచమయ్యారు. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. నవ యువకులలో ఉండే అన్ని లక్షణాలు వీరిలో ఉన్నా నమాజు సమయం కాగానే వీరందరూ మసీదుకు వెళ్ళేవారు. నేను నా కుటుంబ సభ్యులు ఆది వారం చర్చీకి వెళ్ళేవారం. ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన చేస్తుండేవారము. కానీ వీరిలా రోజూ 5 పూటల ప్రార్థన నా ఊహకందని విషయం. నాలో అలజడి మొదలయినది. ఎందుకంటే ఎంతో చిలిపిగా, ఉల్లాసంగా, జాలిగా గడిపే సమయంలో అజాన్ వినబడగానే వీరి ప్రవ ర్తన మారిపోయేది. ఏదో శక్తి వీరిని కమాండ్ చేస్తున్నట్లు నన్ను ఒంటరిగా వదిలేసి మసీదు కు వెళ్ళి పోయేవారు. ”ఇస్లాంలో నమాజుకు ఇంత ప్రాధాన్యత ఉందా? ఏ శక్తి వీరిని ప్రార్థన సమయంలో ప్రాపంచిక విషయాల నుండి ప్రార్థనా మందిరానికి తీసుకొని వెళుతు న్నది?” అన్న చింతన నాలో చిగుళ్ళు పోసు కుంది. వారు నమాజు నుండి రాగానే మళ్ళీ సంతోషంగా కబుర్లలో పడేవారము. వీరు స్టూడెంట్స్ జమాఅత్ సభ్యులు (ఎస్‌ఐఒ) అయినందు వలన ఇస్లాం గురించి, మరియు జమాఅతే ఇస్లామీ హింద్ ప్రోగ్రామ్స్, తబ్లీగ్ జమాఅత్ ఇజ్తిమాల గురించి కూడా మాట్లాడు కుంటూ వుండేవారు. నేను అవన్నీ వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయిత్నించేవాన్ని. ముఖ్యంగా అబ్దుల్లాహ్ మరియు యాకూబ్ చెప్పిన మాటలు నాలో సెన్స్‌ను, కామన్సెన్స్‌ను పెంచాయి. ”యేసు దేవుడు కాదు, దైవ కూమారుడూ కాదు. ఆయన దైవ ప్రవక్త మాత్రమే. ఆయన చనిపోలేదు సజీవంగా పై ఆకాశాలలోకి లేపు కోబడ్డారు. తిరిగి వచ్చి ముహమ్మద్(స) ప్రవక్త వారి సముదాయంలోని ఓ వ్యక్తిగా రాజ్యపాలన చేస్తారు. అప్పుడు అత్యధిక శాతం మంది క్రైస్తవ సోదరులు సత్యం గ్రహించి దైవ ధర్మమైన ఇస్లాం ఛత్రఛాయల్లో వచ్చి చేరతారు” అన్న మాట నాలోని సత్యార్తి మరింత పెంచింది.
బైబిల్‌లో కూడా యేసు ”నేను దేవుడని, నన్నే ఆరాధించండి అని ఎక్కడా చెప్పలేదు.” ఆయన ప్రతి పనిని సృష్టికర్త నామమునే చేసేవారు. సృష్టికర్తనే ఆరాధించేవారు. పాత నిబంధన చూసినట్టయితే యెహోవా ఇలా సెలవిచ్చెను: ”నీ దైవమైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండ కూడదు.”
ఈ ఆజ్ఞ ద్వారా యేసు (ఈసా అలై) దైవ ప్రవక్త మాత్రమే అని, దైవానుగ్రహం వలన ఆయన అద్భుతాలు చూపినంత మాత్రాన ఆయన దైవ కుమారుడు కాజాలడని గ్రహిం చాను. నా ఇంటిల్లిపాదికీ పదేపదే వివరిం చినా వారు విశ్వసించలేదు, నా మనసు మాత్రం విశ్వసించింది. నేను మసీదుకు వస్తానని నా స్నేహితులతో చెప్పాను. వారు ఒక ప్రోగ్రాంకు స్నానం చేసి రమ్మని ఆహ్వా నిస్తే జీవితంలో మొదటిసారి చాగలమర్రి మసీదులో అల్లాహ్ కృప వలన ప్రవేశిం చాను. అక్కడ ఇమామ్ మహబూబ్ సాహెబ్ గారి ప్రసంగంతో చాలా ప్రభావితమయ్యాను. తరువాత అప్పుడప్పుడూ జమాఅత్ ప్రోగ్రామ్స్ కు హాజరవుతుండేవాన్ని. మా ఇల్లు మసీదు కు ఆనుకునే ఉండేది. ప్రతి అజాను పిలుపు నాలో ఏదో అలజడి రేపేది. క్రమంగా సకల లోకాల సృష్టికర్త ఒక్కడే అని సృష్టికర్త నామ మునే హృదయంలో ఆరాధించే స్థితికి చేరుకున్నాను. అయితే నా ఆరాధనకు రూపు లేఖలు లేవు. ఇస్లాం స్వీకరించాలంటే కుటుంబ, ఆర్థిక, సామాజికంగా ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చని వెనకంజ వేశాను.
కుటుంబ కలహాలు లేక ఆర్థిక కారణాలు కావచ్చు లేక నా స్నేహితులు బషీర్‌ఖాన్, ననాజ్ ఖాన్, అహ్మద్‌లు కువైట్‌లో ఉన్నందు వలనో నేను కూడా కువైట్‌కు వెళ్ళాలని నాలో కోరిక కలిగింది. అయితే 11 సంవత్సరాలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు అల్లాహ్‌ా కృప వలన నా ప్రయత్నం ఫలించి 5 జూన్ 2008లో కువైట్‌కు చేరుకున్నాను. ఎ.సి పని అయినందువలన బరువుతో బిల్డింగ్‌లు ఎక్కడం దిగడంతో నా కాలు వాపు వచ్చి ఆ పని వదిలేయవలసి వచ్చింది. ఈ మధ్య కాలంలో నా స్నేహితుని ద్వారా గీటురాయి, నెలవంక, నేను ఆరాధించే ఇస్లాం పుస్తకాలు నాకు అందినవి. అది చదివి మరింత జ్ఞానం పెరిగినది. ఎ.సి పని వది లేసిన తరువాత సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కొరకు మాలియాలోని వారి ఆఫీసుకు వెళ్ళి మేనేజరు కోసం వెయిట్ చేస్తుండగా నా చూపు (ఐ పి సి ) వారి ఉచిత పుస్తకాల స్టాండ్ మీద పడింది. సత్య ప్రియులకు అన్న కరపత్రాన్ని తీసుకున్నాను. అందులో యేసు (అ) గురించి ఉంది. యెహోవా అల్లాహ్‌ా ఒక్కడే అని తెలిసి నా కళ్ళలో ఆనంద భాష్పాలు. నా సంతోషానికి అవధులు లేవు. వెంటనే నా ఇంటికి ఫోన్ చేసి నా సత్యాన్వే షణ ఫలించిందని శుభవార్త తెలిపాను. సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగంలో చేరినాను. అల్లాహ్ అని స్మరించడం మొదలు పెట్టాను. నాతోటి ఉద్యోగుల వెంట నమాజు చేస్తుండే వాణ్ణి. అయితే నమాజు ఎలా చేయాలో తెలియక తప్పులు చేస్తుంటే వారు చూసి నీవు చేస్తున్నది తప్పు అంటే ఇన్షాఅల్లాహ్ త్వరలో సరిదిద్దుకుంటానని చెప్పేవాడిని. అప్పుడు నేను చేసుకున్న దుఆ నాకు ఇప్పటికీ గుర్తు న్నది – ”ఓ అల్లాహ్! నిన్ను ప్రతిరోజూ సరైన రీతిలో ఆరాధించే భాగ్యాన్ని కలిగించు. అలాంటి వాతావరణం నాకు కల్పించు”.
నెల పూర్తయిందో లేదో అకామా తగిలి స్తామని ఉద్యోగంలో చేర్చుకున్న సెక్యూరిటీ కంపెనీ వారు అకామా ఇవ్వలేము అని మోసం చేశారు. ఇక గత్యంతరం లేని పరిస్థితులలో నాకు డ్రైవింగ్ తెలిసినందు వలన ఇస్మాయిల్ అనే స్నేహితుని ద్వారా సబా అల్ నాసిర్‌లోని ఒక కువైటీ ఇంటి డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాను. ఈ విధంగా దేవుడు నా మొరను ఆలకిస్తాడన్న విషయం అప్పుడు నాకు తెలియదు. నా సెలవుదినమైన ఒక జుమా రోజు మాలియాకు వెళుతుంటే నా స్నేహితుడు ఫోన్ రిపేర్ చేయించుకుని రమ్మని నాకు ఇచ్చాడు. అది చూపెడితే మాలియాలోని షాప్ వారు చైనా ఫోన్లు ఇక్కడ చెయ్యరు; సూఖ్ వతనియాలో పొమ్మని చెప్పారు. బస్సు ఖర్చు ఎందకు అని కాలి నడకన పోతుంటే దారిలో ఐపిసి బోర్డు ఉన్న కార్యాలయం కనబడింది. బయట ఉచిత తెలుగు పుస్తకాల కోసం వెతుకుతుండగా ఒక వ్యక్తిలోనికి వెళ్ళు ఉంటాయని చెప్పాడు. మెట్లు దిగి ఆఫీసులోనికి వెళుతుంటే తెలుగు మాటలు నా చెవిన బడ్డాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఇస్లాం గురించి అల్లాహ్‌ా గురించి తెలుగులో వివరంగా చెబు తున్నారు. దీన్ విషయం అయినందువలన ధైర్యంగా క్లాస్ రోమ్‌లోనికి వెళ్ళాను. ప్రస్తుత నెలవంక ఎడిటర్ గారయినటువంటి సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ గారు పాఠం చెబుతు న్నారు. నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగ తం పలికారు. అక్కడ చాలా మంది విద్యా ర్థులు ఉన్నారు. వారంతా న్యూ ముస్లిమ్స్ అని తరువాత తెలిసింది. సార్ గారు ‘ఐపిసి క్లాసులకు వస్తుండండి మారడానికి తొంద రేమీ లేదు’ అని ఇస్లాం గురించి బాగా అర్థ మయ్యే రీతిలో చెప్పారు. 2 శుక్రవారాలు క్లాసులకు హాజరయ్యాను. ఈ మధ్యలో డాక్టర్ జాకిర్ నాయక్ గారి ఇస్లాం ఔర్ ఈసాయియత్ డీవీడీలు చూసి మా ఇంటి వారికి ఫోన్ చేసి నేను ఇస్లాం స్వీకరిస్తున్నాని చెప్పాను. నీవు ఎప్తుడో స్వీక రించావు ఇప్పుడు కొత్తగా స్వీకరించడమే మిటని మా అమ్మ అన్నది.(ఆమే ఉద్దేశం ఏమంటే నేను ముందు నుండి ముస్లిం స్నేహితులతో ఎక్కువగా తిరుగుతుండే వాన్ని అందువలన అలా అన్నది).
సత్యాన్వేషణలో నా సుదీర్ఘ ప్రయాణం అల్లాహ్ అనుగ్రహం వలన ఫలించింది. నా మొదటి ప్రచార కార్యక్రమం నా ఇంటివారి తోనే మొదలు పెట్టాను. నా భార్యాపిల్లలు ఇస్లాం స్వీకరించారు. పిల్లలంటే చిన్నవారు కానీ భార్య మాత్రం నా పయనం నీతోనే అంటూ మనస్ఫూర్తిగా స్వీకరించింది. ఇప్పుడు నా భార్య పేరు షబానా పర్వీన్, పెద్ద కుమారుడు అబ్దుల్లాహ్‌ా, చిన్న కుమారుడు అఫ్జల్, పెద్ద కూతురు రుఖయ్యా, చిన్న కూతురు హఫ్సా.
ఇస్లాం అంటే శాంతి అని అందరూ అంటూంటే ఏమో అనుకునేవాణ్ణి. కానీ మేము ఇస్లాంలోనికి ప్రవేశించగానే నిజమని అర్థమయింది. నేను నా భార్య ముందు ఎప్పుడూ గొడవ పడే వారం. కానీ ఇప్పుడు మా జీవితంలో ప్రశాంతత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం నెలకొంది. నేను కార్గోలో పంపిన ఐపిసి వారి పుస్తకాలు, డీవీడీల వలన నా భార్య కూడా ఇస్లాం గురించి బాగా తెలుసుకున్నది. ఏదైనా భేదాభి ప్రాయాలు వచ్చినా ఖుర్‌ఆన్, హదీసు వెలు గులోనే మా సమస్యలు సింపుల్‌గా పరిష్కార మవుతున్నాయి. అల్లాహ్‌ా మరియు ఇస్లాం గొప్పతనం, మహత్యం చూడాలనుకుంటే ఆచరించి అయినా చూడాలి లేక చనిపోయి అయినా తెలుసుకోవాలి. చనిపోయిన తరువాత తెలుసుకుంటే ఫలితం ఉండదు కావున ఈ జీవితంలోనే ఆచరించి ఇహపర లోకాలలోని శాంతిని పొందుదాము రండి.
మనం ఇస్లాం స్వీకరించి పశ్చాత్తాప పడితే మన గత పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు. అల్లాహ్ను సరియైన రీతిలో వేడుకుంటే ప్రవ క్తలకు, ప్రవక్త అనుచరులకు ఎలాగైతే సహా యం చేశాడో ఇన్షాఅల్లాహ్ మనకు కూడా మనం ఊహించని రీతిలో సహాయం చేస్తాడు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఉదా హరణగా నా కువైట్ జీవితంలోని ఒక సం ఘటన తెలియజేస్తున్నాను.
నేను ముస్లిం కాక ముందు ఒక వ్యక్తి వద్ద 100 దినార్లు అప్పు తీసుకోవలసి వచ్చింది. దానికి వడ్డీ 5 దీనార్లు. ఒకరోజు అతను అర్జంటుగా నాకు డబ్బు అవసరం పడింది. త్వరగా నా డబ్బు ఇవ్వాలి అని చెప్పాడు. మానవ ప్రయత్నంగా నా స్నేహితులకు అడిగాను కానీ ఎవరూ ఇవ్వలేక పోయారు. అవతల అతను రోజూ ఒత్తిడి చేస్తున్నాడు, నాకు ఏ దారి కనబడక మసీదులో నమాజు తర్వాత బాధాతప్త హృదయంతో ”నీవు తప్ప వేరే దిక్కు లేదని అల్లాహ్తో వేడుకున్నాను” నా దుఆ అయిపోయింది. మసీదులో ఓ మూలన ఒక కువైటీ ఉన్నాడు. అతను నన్ను పిలిచాడు, జేబులో చెయ్యి పెట్టి చాలా దినార్లు తీసి ఎంచుతున్నాడు. నేను మనసు లో ఇలా అనుకుంటున్నాను. ఇంత డబ్బు ఉన్న వ్యక్తి కనీసం నాకు 5 దినార్లు అయినా ఇవ్వకపోతాడా అని. కాని అతను కొన్ని దినార్లు నా చేతిలో ఉంచి వెళ్ళి పోయాడు. అవి లెక్క పెట్టి చూస్తే 110 దినార్లు. నా అవసరం కూడా కరెక్ట్‌గా అంతే. నా కళ్ళలో ఆనందభాష్పాలు! వెంటనే సజ్దా చేసి అల్లాహ్‌ా కు కృతజ్ఞతలు తెలుపుకొని వెంటనే అప్పు ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి పిలిచి అతని డబ్బు 110 దినార్లు ఇచ్చేసి ఋణ విముక్తుణ్ణయ్యాను.
అల్లాహ్ దయ వలన ఐపిసి వారి పుణ్యమా అని ఇస్లాం గురించి మరియు ఆరాధనా పద్ధతులు నేర్చుకున్నాను. ఐపిసి వారి తర పున ఉమ్రాకు వెళ్ళాను, తరువాత హజ్‌కు కూడా వెళ్ళాను. కొద్దికాలంలోనే అల్లాహ్‌ా దయ వలన ఇవన్నీ నెరవేరినవి. ఇందుకు అల్లాహ్‌ాకు, ఐపిసి వారికి, నా కఫీల్ జమాల్ సఅద్ సఖలాన్ అల్ అజమీ గారికి మరియు మా సార్ సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ గారికి, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అల్లాహ్‌ా వారికి ఇహపరలోకా లలో అనుగ్రహించుగాక!
ఇండియాలో అయితే ఇస్లాం స్వీకరించడం నిలకడగా ఉండటం మరియు ప్రచారం చేయటం ఇబ్బంది ఏమో కానీ అరబ్ కంట్రీ అయినందువలన ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐపిసి వారి కృషి చాలా ఉన్నది. అయితే సన్మార్గము పొందా లనే తపన మనలో కలుగనంత వరకు అల్లాహ్‌ా అనుగ్రహించడు. వారు ముస్లిమ్ అయినా సరే గైర్ ముస్లిం అయినా సరే. భార్యాపిల్లలను, తల్లిదండ్రులను, స్నేహి తులను అందరినీ వదలి కువైట్‌కు వచ్చి డబ్బు పేరు ప్రఖ్యాతులు కూడబెట్టుకొని కొందరు, మరియు వ్యసనాలకు మనో వాంఛలకు బానిసలై దివాళ తీసి అపఖ్యాతి మూటకట్టుకొని కొందరు వెళుతుంటారు. కానీ అల్‌హమ్దులిల్లాహ్‌ా నేను మాత్రం ఇహ పరలోకాలలో విజయం సాధించే ఇస్లాం పొందగలిగాను. చివరగా నా సూచన ఏమి టంటే ఇస్లాం స్వీకరించాలని ఉన్నా- బంధువులు, సమాజం ఏమంటారో? మన భవిష్యత్తు ఏమవుతుందో? మన పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయో లేదో? అని మధనపడే నా సోదర సోదరీమణులారా! చిన్నచిన్న సమస్యలు కొద్దికాలం మాత్రమే. ప్రాపంచిక జీవితం ఎలా గడవాలన్నది మనం పుట్టుక ముందే అల్లాహ్ లిఖించాడు. కానీ పరలోకం ఎలా ఉంటుంది అనేది అల్లాహ్ ఆజ్ఞలు, ప్రవక్త సాంప్రదాయాన్ని మనం పాటించ డాన్ని బట్టి ఉంటుంది. సకల శక్తి సంపన్నుడైన అల్లాహ్ అండ మనకు ఉండగా మనం దేనికీ భయపడనవ సరం లేదు. ఒక కఫీల్ గానీ, ఒక అధికారి గానీ మరెవరైనా మనకు అప్పజెప్పిన పని పూర్తి చేస్తే దాని ప్రతిఫలం దొరకవచ్చు దొరక్క పోవచ్చు. కువైట్‌లో ఎందరి అనుభ వాలు మనం వినలేదూ! కానీ ఎవరి చేతిలో నా జీవన్మరణాలు ఉన్నాయో ఆ అల్లాహ్‌ా సాక్షి! అల్లాహ్ చెప్పిన పని పూర్తి చేస్తే ప్రతి ఫలం ఇహపరలోకాలలోనూ తప్పక దొరు కును. పని పూర్తి చేయకపోతే శిక్ష కూడా తప్పక లభిస్తుంది. అసలు పని ఏమిటి? మనల్ని అల్లాహ్ను ఎందుకు పుట్టించాడు? అని ఆలోచిస్తే ఖుర్‌ఆన్‌లో దీని సమాధానం దొరుకుతుంది.
”నేను మానవులను జిన్నాతులను నా ఆరాధన కొరకే పుట్టించాను” (అజ్‌జారియాత్; 56)
”ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయండి అని ఆ జ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. అల్లాహ్‌ాను విశ్వసిస్తారు. ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉన్నట్లయితే, వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కాని వారిలో అధికులు అవిధేయులు”. (ఆలి ఇమ్రాన్ : 110)
ఈ ప్రపంచంలో మన అకామా ఎంతకాలం ఉంటుందో తెలియదు. మహా అయితే 60 లేక 70 సంవత్సరాలు. ఇందులో ఎన్ని సంవత్సరాలు వృధా అయ్యాయో మనం దరికీ తెలుసు. ఇక మిగిలిన కాలం అయినా పశ్చాత్తాప పడి అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్త (స) గారి సాంప్రదాయాలను పాటించి ఇహ లోకంలోనూ మరియు పరలోకంలోనూ సుఖశాంతులు పొందుదాము. ఏ లక్ష్యం కోసం అల్లాహ్ మనల్ని పుట్టించాడో అది నెరవేరుద్దాం. ఇస్లాం స్వీకరిద్దాం, పాటిద్దాం. మరియు ఇతరులను కూడా ఆహ్వానిద్దాము. నా ప్రయత్నంగా నా స్వదేశంలోని ప్రజలను కూడా జాగృతం చేయడానికి జూన్‌లో సెలవు మీద ఇండియాకు వెళుతన్నాను. నా ప్రయత్నం ఫలించాలని దుఆ చేయండి. అల్లాహ్ అందరికీ సన్మార్గము ప్రసాదించుగాక ! ( ఆమీన్)