సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు

 

mza_1422451740360034279.1024x1024-65

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

నమాజు చేసే ప్రతి వ్యక్తీ శుచీ, శుభ్రతలను పాటించటం అవశ్యం. ఇస్లాం తొలి ఆజ్ఞలలో తహారత్‌ ఒకటి. దైవప్రవక్త ముహమ్మద్‌ (స)పై రెండవసారి అవతరించిన దివ్యవాణి శుచీశుభ్రల (తహారత్‌) కు సంబంధించినదే. ఉదాహరణకు:- ”నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. అశుద్ధతను వదలిపెట్టు”. (అల్‌ ముద్దస్సిర్‌ – 4,5)

అందుకే ఇస్లాం పరిశుభ్రత, పరిశుద్ధతలకు సంబంధించిన సూత్రాలను నిర్థారించింది. దైవప్రవక్త (స) తన బోధనల ద్వారా దాని సరిహద్దులను ఖరారు చేశారు. నమాజు సజావుగా నెరవేరాలంటే మనిషి శరీరం, అతను తొడిగే దుస్తులతోపాటు అతను నమాజు చేసే స్థలం కూడా పరిశుభ్రంగా ఉండాలి – ఎలాంటి మలినం ఉండకూడదు. ఒకప్పుడు అరబ్బులు కూడా ఇతర అనాగరిక జాతుల మాదిరిగా శుచీశుభ్రతలను బొత్తిగా పాటించేవారు కాదు. ఉదాహరణకు ఒక పల్లెటూరి బైతు సాక్షాత్తూ మస్జిదె నబవీలోనే – అందరి సమక్షంలో – మూత్రం పోసేశాడు. సహచరులు (ర) అతన్ని కొట్టేందుకు ఎగబడ్డారు. దైవప్రవక్త (స) వారందరినీ వారించారు. ”నాయనా! ఇది ప్రార్థన చేసే స్థలం. ఇలాంటి చోట మల మూత్ర విసర్జన చేయకూడద”ని ఎంతో నిదానంగా నచ్చచెప్పారు. ఆ వ్యక్తి మూత్రం పోసిన చోట నీళ్లు కుమ్మరించమని ప్రియసహచరుల్ని పురమాయించారు.

ఒకసారి ఆయన (స) ఒక సమాధి దగ్గరి నుంచి సాగిపోతూ, ”ఈ సమాధిలోని వ్యక్తి యాతనకు గురవుతున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి (వల్ల జరిగిన అశ్రద్ధ ఏమిటంటే) మూత్రపు తుంపరలు తన శరీరంపై పడుతున్నా లక్ష్యపెట్టేవాడు కాదు” అన్నారు. ఈ విధంగా ముస్లింలు శుచీశుభ్రతల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలని నొక్కి వక్కాణించబడింది. కాలకృత్యాలు తీర్చుకునే విషయంలోనూ, వుజూ గుసుల్‌ విషయంలోనూ గొప్ప నాగరీక జాతులు సయితం పాటించని మర్యాదలు ముస్లింలకు బోధించ బడ్డాయి.
తమ శరీరాన్ని, దుస్తులను, నివాస గృహాలను అన్ని రకాల మలినాల నుండి కాపాడుకుంటూ షరీయతు బద్ధంగా తహారత్‌ పాటించే ప్రవక్త శిష్యులను అల్లాహ్‌ ఈ విధంగా కొనియాడాడు:
”ఈ మస్జిద్‌లో ఉండే వారిలో కొందరు బాగా పరిశుద్ధతను పాటించటాన్ని ఇష్టపడతారు. అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించే వారంటే ఎంతో ఇష్టం”. (దివ్యఖుర్‌ఆన్‌ – 9:108)

దేవుని ప్రేమాభిమానానికి పరిశుభ్రత (తహారత్‌) ఒక ప్రధాన కారణమైనప్పుడు ఈ భాగ్యానికి ఎవరయినా ఎలా దూరంగా ఉండగలుగుతారు??
నమాజు వల్ల కలిగే ఇంకొక ప్రయోజనమేమిటంటే, అది మనిషిని అనుదినం నీటుగా ఉండేలా చేస్తుంది. అతడు నిత్యం తన ఒంటిని, దుస్తులను శుభ్రంగా ఉంచుకుంటాడు. నమాజు చేసే వ్యక్తి రోజుకు ఐదు సార్లు తన ముఖాన్ని, కాళ్ళుచేతులను నియమబద్ధంగా కడుక్కుంటాడు. ముక్కులో సయితం నీళ్ళు జొన్పి నాసిక పుటాలను శుభ్రపరుస్తాడు. దీనివల్ల వైద్య పరంగా కలిగే లాభాలు ఎన్నో. ముక్కు పుటాల మార్గంగ ుండా శరీరం లోపలికి వెళ్ళే సూక్ష్మక్రిములు ఈ ‘వుజూ’ ద్వారా దూరమవుతాయి. ముక్కులో సయితం నీరు పోసి శుభ్రపరచే శిక్షణ బహుశా ఇస్లాం ఒక్కటే ఇచ్చింది. ప్రపంచంలో మరే మతం కూడా ఈ శిక్షణ ఇవ్వదు. దీన్నిబట్టి ఇస్లాం ఆదేశాలు వైద్యశాస్త్రం దృష్ట్యా కూడా ఎంతో మేలైనవే. ఒకప్పుడు నీరు అతి తక్కువ మోతాదులో లభ్యమయ్యే అరబ్బు ప్రదేశంలో రోజుకు ఐదు సార్లు ‘వుజూ’ చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పటం ఇస్లాంకే చెల్లింది.

అరబ్బులు – ముఖ్యంగా పల్లెటూళ్లలోని వారు – పల్లు తోము కోవడం పట్ల మరీ సోమరితనం ప్రదర్శించేవారు. తత్కారణంగా నోట్లో నుంచి దుర్వాసన రావటమేగాకుండా, రకరకాల దంత వ్యాధులు కూడా సోకేవి. మహా ప్రవక్త (స) ప్రతి నమాజు సందర్భంగా ‘మిస్వాక్‌’ (దంత ధావనం) చేయాలని తాకీదు చేశారు. ”ఒకవేళ నా అనుచర సమాజం ఇబ్బందికి గురవ దనుకుంటే మిస్వాక్‌ చేయటాన్ని అవశ్యంగా ఖరారు చేెసి ఉండేవాణ్ణి” అని ఆయన (స) చెప్పటం గమనార్హం.

అలాగే వీలునుబట్టి స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేశాక పొడి దుస్తులు ధరించటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం మంచిది. ముఖ్యంగా శుక్రవారం (జుమా) నమాజుకైతే స్నానం చేసి మరీ రావాలి.

Related Post