నేను ఇబ్రాహీం (అ) ప్రార్థనా ఫలాన్ని, ఈసా (అ) సువార్త రూపాన్ని – 2

muhammad

హజ్రత్‌ హాజిరా (అ), హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అ) అరేబియా వచ్చి స్థిరపడ్డారు అన్న విషయాన్ని కూలంకషంగా తెలుసుకున్నాము. ఇక హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారుల్లో బలి ఇవ్వబోయింది ఎవర్ని? ఇస్సాకునా? ఇస్మాయీల్నా? అన్న విషయాన్ని తెలుసుకుందాం!
”అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృకము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసేను”. (ఆది కాండము – 21: 33)
”అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను”. (ఆదికాండము- 22: 19)
శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరవది యేడు. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను”. (ఆదికాండము: 23: 1,2)
పై మూడు వచనాల్ని బట్టి కాబా గృహ నిమ్మాణం పూర్తయిన తర్వాత ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) బెయేర్షిబాలోనే స్థిరపడ్డారని విదితమవు తుంది. అలాగే హాజ్రత్‌ హాజిరా నివాస స్థలం కనాను దేశం అని, అమె మరణించినప్పుడు ఇబ్రాహీమ్‌ (అ) బెయేర్షెబా నుండి వచ్చారని కూడా తెలుస్తుంది. అసలు విషయానికొస్తే దేవుడు బలి ఆదేశం ఇబ్రాహీమ్‌ (అ) బెయేర్షెబాలో ఉండగా ఇచ్చాడు. బెయేర్షెబాలో ఉన్నది హజ్రత్‌ హాజిరా (అ) మరియు ఇస్మాయీల్‌ (అ). అయితే మోరియా (నేటి మర్వా లోయ)కు తీసుకెళ్ళి బలివ్వమని ఇచ్చిన ఆదేశం ఇస్మాయీల్‌కు వర్తిస్తుందా? ఇస్హాకునకు వర్తిస్తుందా?
ఈ ఆజ్ఞ వచ్చినప్పుడు పూర్వపరాల్ని వెలుగులో ఇస్హాకు పుట్టనే లేదు. ఎందు కంటే; ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రాహాముకు 86 ఏండ్లు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాముకు 100 ఏండ్లు. (ఆదికాండము- 16:16- 21:6) ఒకవేళ పుట్టి ఉన్నా తల్లి సారాతో కనాను దేశంలో ఉండాలి కదా! కనాను దేశంలో ఉన్నా తను జేష్ఠ కుమారుడు ఎలా కాగలడు?
(దీని గురించి మనం గత సంచికలో చర్చించుకున్నాము. ఏ విధంగా 16 ఏండ్ల యువకుణ్ణి పాలు త్రాగే బాలుడిగా మార్చేశారో తెలుసుకున్నాము.) అంటే ఇబ్రాహీమ్‌ (అ) తన జేష్ఠ కుమారుడు ఇస్మాయీల్‌తో బెయేర్షెబాలో ఉన్నారు అంతే తప్ప ఇస్సాకుతో కాదు. ఆదికాండము- 22: 2, 12, 16 వాక్యాలలో ‘నీకు ఒక్కడైయున్న నీ కుమారుని’ అని పదే పదే చెప్పబడినా ‘అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా…’ అన్న అదనపు అనవసర వివరణను జొప్పించి సత్యాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నించారు. అలాగే (ఆదికాండము -21: 12) చూపించి ఇస్సాకే ఇబ్రాహీమ్‌ సంతానం అని, దాసి పుత్రుడు సంతానం కాజాలడని చేసే వాదన సయితం పస లేనిది. (ఇస్మాయీల్‌ దాసి సంతానమా? కాదా? అన్న వివరణ తర్వాత రానున్నది.) మరి దేవుడు ఇబ్రాహీమ్‌ సంతానాన్ని కేవలం ఇస్సాకు ద్వారానే కాకుండా ఇస్మాయీల్‌ (అ) ద్వారా సయితం అబివృద్ధి పరుస్తానని చెప్పడం కూడా ఇస్మాయీల్‌ (అ)ను జేష్ఠ కుమారుని స్థానంలోనే నిలబెడుతుంది. అదే విధంగా దేవుడు ఇస్మాయీల్‌ను పదే పదే ఆశీర్వదించినట్లు ఇస్సాకును ఒక్కసారి మాత్రమే దీవించినట్లు బైబిలు ద్వారా మనకు తెలుస్తుంది.
మరలాంటి శ్రేష్టుడిని అడవి గాడిద అని చెప్పడం ఎంత వరకు సబబు? దీనికి హిబ్రూ మూలం ”పారా” అని ఉంది. దీనికర్థం ఫలవంతమైనది, విజయవంతమైనది. అంతటి గొప్ప పదాన్ని ఇంత దారుణంగా అనువాదం చేయడం దేన్ని సూచిస్తుందో ఆలోచించండి!

తండ్రికి తగ్గ తనయుడు ఇస్మాయీల్‌ (అ)

ఖుర్బానీ అయినా, త్యాగమైనా, ఇస్లాం అయినా – ఇవన్నీ పర్యాయపదాలు. ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) గారికి కల రూపంలో జిబహ్‌ా ఆదేశం అందిననప్పుడు ఆయన అణువణువూ దైవ ప్రేమతో నిండి ఉంది. దైవాజ్ఞను శిరసావహించడంలో తన తరఫున ఎలాంటి సంకోచం ఉండకూడద్న సదుద్దేశ్యంతో తూచా తప్పకుండా ఆ కలకు క్రియాత్మక రూపం ఇవ్వాలని సంకల్పించుకున్నారు. ఈ పరీక్షలో దైవ సన్నిధిలో పూర్తిగా ఉత్తీర్ణత పొందాలన్నదే ఆయన అభిమతం. కుమారుడిని బలి ఇచ్చే బదులు అతన్ని కాబా గృహ సేవలకు కోసం అంకితం చేస్తే సరిపోతుందని ఆంతర్యంలో జనించే మోసపూరిత ప్రేరణల నుండి సురక్షితంగా ఉండాలనుకున్నారు.
హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ)కి ఇటు తన మనో స్థయిర్యంపై, అటు త్యాగశీలునిపై పూర్తి విశ్వాసం ఉంది. మనుజుడే అయినా అతని మనో గతాన్ని కూడా తెలుసుకోవాలనిపించింది. మెడపై కత్తి పెట్టినప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆలోచన వచ్చింది. ఆ మాటే అడిగేశారు:
”ఒరేయ్‌ ముద్దల కన్నా! నేను నిన్ను జిబహ్‌ చేస్తున్నట్లు కలగన్నానురా! మరి నువ్వేమంటావురా!”( సాఫ్పాత్‌: 102)
ఆ నూనూగు మీసాల కుర్రాడు కూడా ఏమన్నాడో చూండి-
”నాన్నా! మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నిర్వర్తించండి. దైవ చిత్తమయితే (ఇన్ షాఅల్లాహ్‌) మీరు నన్ను సహనశీలిగా పొందుతారు”. (సాఫ్ఫాత్‌ – 102)
ఒకవైపు 90 ఏళ్ళ వయో వృద్ధుడు! మరో వైపు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఆశా దీపం! తాను కన్న కలల పంట! మానవాళి మార్గదర్శకత్వం కోసం ఒక్కగానొక్క నలుసునైనా ప్రసాదించమని దీనంగా ప్రార్థించగా, దేవుడిచ్చి వర ప్రసాదం! ఇబ్రాహీమ్‌ (అ)కి లోకంలో ఆ బాలునికన్నా ఎక్కువ ప్రియతముడు వేరెవరూ లేరు. కాని ఇప్పుడు ఆ గారాల సుతుణ్ణే బలి ఇవ్వటానికి కత్తి పట్టుకున్న ఆ పండు ముదుదసలి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి!

మరో వంక అస్తమించటానికి తయారుగా ఉన్న ఆ ఉదయభానుని పరిస్థిత కూడా నెమరువేసుకోదగినదే. చిన్న నాటి నుండి నేటి వరకూ ఏ తండ్రి వాత్సల్యభరితమైన ఆలనాపాలనలో తాను పెరిగి పెద్దయ్యాడో ఆ తండ్రి చేెతుల మీదుగా తాను జిబహ్‌ా కాబోతున్నాడు. దైవ దూతలు, విశ్వమండలంలోని మానవాతీత శక్తులు, ఆకాశంలోని మేఘాలు ఈ అద్వితీయ దృశ్యాన్ని తదేకంగా తిలకిస్తున్నాయి. చివరకు ఆ కలకు క్రియాత్మక రూపం ఇచ్చే ఘడియ రానే వచ్చింది. ఒక వైపు ప్రవక్త ఇబ్రాహీమ్‌ ముద్దుల కొడుకును జిబహ్‌ా చేెసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు ఇస్మాయీల్‌ (అ) తనంతట తానుగా సంతోషంగా జిబహ్‌ా అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. తండ్రికొడుకుల ఆ నిరుపమాన త్యాగాన్ని అల్లాహ్‌ మెచ్చుకున్నాడు. పైలోకాల నుంచి ఓ ధ్వని ప్రతిధ్వనించింది:
”ఓ ఇబ్రాహీమ్‌! నువ్వు నీ కలను నిజం చేెసి చూపావు. మేము సజ్జనులకు ఇటు వంట మంచి ఫలితమే ఇస్తాము”. (సాప్ఫాత్‌: 104, 105)
ఆ కీలక ఘడియల్లో తనయుడు చూపిన స్థిర సంకల్పానికి, అపూర్వ త్యాగానికి మంచి ప్రతిఫలం దొరికి తీరవలసిందే కదా! అల్లాహ్‌ ఇలా అన్నాడు: ”మేము పరిహారంగా ఒక పెద్ద ఖుర్బానీని ఇచ్చాము. ఇంకా భావి తరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము”. (సాప్ఫాత్‌ – 107, 108)
ఆ ప్రతిఫలమే ‘ఖుర్బానీ’ రూపంలో ప్రళయం వరకూ ప్రపంచానికి జ్ఞాపకార్థంగా నిలిచిపోయింది. అభిమాన సోదరులారా! నాటి నుండి నేటి వరకు ఈ త్యాగఫలాన్ని కాపాడుకుంటూ వస్తున్నదెవరు? ముస్లింలు కారా?ఈ ఖుర్బానీని విశ్వ జనుల్లోని విశ్వాసు లందరూ ఒకచోట చేరి సమర్పించు కుంటున్న ఆ పవిత్ర పట్టణం ఏది? మక్కా పట్టణం కాదా? అవును; ముస్లిం సముదాయంపై ఈ ఖుర్బానీ ‘తప్పనిసరి’గా ఖరారు చేయబడింది. అంటే ఖుర్బానీ పశువు రూపంలో మనిషి తన శారీరక, ఆర్థిక విధేయతను, త్యాగనిరతిని నిరూపించుకుంటాడు.

ఇస్మాయీల్‌ (అ) గారి వివాహం

కాబా శుభం, ఆకర్షణ వల్ల జనులు ఆ పవిత్ర గృహానికి దగ్గరలో నివాసమేర్పచుకో సాగారు. అందిరికన్నా ముందు జుర్‌హుమ్‌ తెగ వారు వచ్చి నివసించారు. ఆ తెగలో మిజాజ్‌ బిన్‌ అమ్ర్‌ జుర్‌హుమీ అనే ఒక ప్రముఖుడుండేవాడు. అతని కూతురును హజ్రత్‌ స్మాయీల్‌ (అ) మనువాడారు. ఆమె ద్వారా 12 మంది పిల్లలు పుట్టారు. వారి పేర్లు సయితం తౌరాతులో ఉన్నాయి. వారి ద్వారా అరేబియాలో జనాభా వ్యాపించింది. హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అ) మరణానంతరం ఆయన కుమారుడు నాబిత్‌ కాబా గృహ ధర్మకర్త అయ్యాడు. ఆ విధంగా కాబా ధర్మకర్తృత్వ బాధ్యతలు ఇస్మాయీల్‌ (అ) వంశీయుల నుండి జుర్‌హుమ్‌ వంశీయుల పరమయినాయి. కానీ ఆ తర్వాత ఖుజాఅ అనే తెగ కాబాను అక్రమించింది. చాలా కాలం దాకా ఈ వంశీయులలోనే కాబా గృహ బాధ్యతలుండేవి. ఎట్టకేలకు ఖసాబ్‌ బిన్‌ కిలాబ్‌ తన తాతముత్తాతల హక్కును హస్తగతం చేసుకోవడంలో సఫలీకృతు డయ్యాడు.

హజ్‌ పిలుపు

ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మేము ఇబ్రాహీమ్‌కు కాబా గృహ స్థలాన్ని నిర్థారించినప్పుడు పెట్టిన షరతు ఇది: నాకు బాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచే (రుకూ చేసే)వారి కోసం, సాష్టాంగ పడే (సజ్దా చేసే)వారి కోసం పవిత్రంగా ఉంచాలి. హజ్‌కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలి నడకన కూడా వస్తారు. బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు.”
(అల్‌ హజ్‌: 26,27)

ఆ కాలంలో ఎలాంటి ప్రచార, క్రటనా సాధనాలు లేవు. పైగా అదొక నిర్మానుష్యమైన ప్రదేశం. కోసులు నడిచి వెళ్ళినా మనుషుల జాడ ఉండేది కాదు. ఇబ్రాహీమ్‌ (అ) గొంతెత్తి అరిచినా, ఆ ఘోష పుణ్య క్షేత్రం పరిధి దాటి వెళ్ళదు. కాని గొప్ప మహిమే జరిగింది. ఆ పిలుపే ఓ ప్రభంజనం అయింది. అది ప్రాక్పశ్చిమాలకు ప్రాకింది. ఉత్తర దక్షిణాదుల్ని చట్టేసింది. నేల నుంచి నింగి వరకూ ప్రతిధ్వనించింది. ప్రళయం వరకూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

సోదరులారా! నాటి నుండి నేటి వరకు ఇబ్రాహీమ్‌ (అ) గారి మాధ్యమంతో దైవం ఇచ్చిన ఆ పిలుపుకి స్పందించి ప్రతి యేటా హజ్‌ ఉమ్రాల కోసం కొన్ని వేల మైళ్ళ దూరం నుండి ప్రయాణం చేసి వెళుతున్నది ఎవరు? ముస్లింలు కారా? అదే విధంగా ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) గారి సుంతీ (ఒడుగులు) విధానాన్ని నేటికి పాటిస్తున్నదెవరు? ప్రశాంత చిత్తంతో ఆలోచించండి! ఇక ఇస్మాయీల్‌ (అ) దాసి కుమారుడా? కాదా? అన్న ఒకే ఒక్క ప్రశ్న మిగిలుంది. సమాధానం కోసం వేచి చూడండి.

Related Post