ఏకాంత నిశ్శబ్దంతో సత్యం తన శక్తిని కళ్ళకు కడుతుంది. ప్రజలారా! నిశి రాత్రి నిశ్శబ్దంలో ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు పవిత్రంగా భావించే కట్టుబాట్లను బేరీజు వేసుకోండి. ఈ లోకంలో ‘నిన్నటివారు – రేపటివారు’ అనే రెండు రకాల మనుషులుంటారు. మీరు దేనికి చెందినవారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు తేజోవంతమైన రేపటి జీవితంలో ప్రవేశించేవారో, లేక నిన్నటి అంధకార ఊబిలో మరింత లోతుకు కూరుకుపోయేవారో ఆత్మ విమర్శ చేసుకోండి. నిన్నటి బానిస బ్రతుకు మీకిష్టమో, రేపటి స్వేచ్ఛాయుత బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుంటారో మీకు మీరే తేల్చుకోండి. మానవుని అంధ విశ్వాసాలు కడలిపై తెలియాడే నురుగు వంటివి. గాలి వీస్తే అది గల్లంతే! సత్యం వస్తే అంధ విశ్వాసాలన్నీ ఇక అంతే!!
ఆ విధంగా ప్రవక్త శ్రీ (స ) ప్రజా విద్రోహక చర్యల్ని శాంతి విఘాతక పద్ధతుల్ని, సమాజ విచ్ఛన్నకర ధోరణిని ఖండించారు. సమాజాన్ని, ప్రజల్ని – వారి ఆచార వ్యవహారాల్ని, మూఢ నమ్మకాల్ని ప్రతిఘటించారు. శాంతి సందేశంతో ప్రజా విప్లవాన్ని తెచ్చేందుకు ప్రయత్నించారు.
మహా ప్రవక్త ( స ) వారి మాట అక్షర సత్యంగా, శైలి అందంగా, నడవడిక ఆకర్షణీయంగా ఉంది. ప్రజలు సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తున్నది. ఇది గమనించిన కొందరు పుర ప్రముఖులు – ప్రవక్త శ్రీ (స ) వారి సందేశం తమ ఇష్టారాజ్యాలకు ప్రమాదకరమైనదని, భావించి ఆయన్ను అన్ని విధాలా నిలువరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను, ఆయన పక్షాన నిలిచిన ఆయన వంశీయులను సంఘం నుండి బహిష్కరించి ‘షొబె అబూ తాలిబ్’ లోయలో మూడు ఏండ్ల పాటు నిర్బంధించారు. వారిపై అనుచితమైన ఆంక్షల భారాన్ని వేశారు. అప్పటికీ ఆయన్ను విశ్వసించినవారు చాలా మందే ఉన్నారు. ఆయన (స ) వారి సందేశాన్ని తొలుత స్వీకరించినవారు; పురుషులలో – హజ్రత్ అబూ బకర్ (ర ). స్త్రీలలో హజ్రత్ ఖదీజా (ర ). వృద్ధులలో హజ్రత్ యాసిర్ (ర ). వృద్ధ స్త్రీలలో హజ్రత్ సుమయ్యా (స ). బాలల్లో హజ్రత్ అలీ (ర ) ప్రముఖులు.
ముహమ్మద్ (స ) సత్యసంధుడు – సచ్చీలత గల పరమ ఆదర్శ పురుషుడు. అయినప్పటికీ ధర్మం పేరుతో మా ఆచార వ్యవహారాలను తప్పు పడుతున్నాడు. మాది బూజు పట్టిన వ్యవస్థ అని, కాలం చెల్లిన శాస్త్రం అని కొట్టి పారేస్తున్నాడు. యజమాని – బానిస అన్న కృత్రిమమైన గీతలు సమసిపోవాలంటున్నాడు. బానిసగా మార్చబడ్డ వారే గానీ బానిసగా తల్లి కడుపున పుట్టిన ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. మనిషిలోని మంచితనమే ఏ వంశ విశిష్టతకైనా వన్నె తెస్తుంది అంటున్నాడు. అతన్ని అనుసరించేవాళ్ళు దేన్నయినా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సత్యాన్ని మాత్రం ప్రాణాలు పోయినాగాని విడిచి పెట్టం అంటున్నారు. ఇది మన పూర్వీకులు ఏర్పరచిన వ్యవస్థపై తిరుగుబాటే. కాబట్టి మహమ్మద్ (స ) ఆగడాలను ఎలాగైనా అరికట్టాలి. అతని పోకడలను నియంత్రించాలి.
అలా ప్రవక్త (స ) వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. శారీరకంగా బాధించేవారు కొందరైతే, మానసికంగా క్షోభకు గురి చేసేవారు కొందరు. ఆయనపై చెత్తా చెదారం విసిరేసేవారు. రాత్రివేళ ఆయన నడిచి వెళ్ళే మార్గంలో ముళ్ళ కంపలు పడేసేవారు. ఆయన ప్రార్థన చేస్తుంటే దుప్పటిని త్రాడుగా చేసి గొంతు నులిమేసేవారు. ఆయన సజ్దాలో ఉండగా ఆయనపై ఒంటె ప్రేగుల్ని తీసుకొచ్చి పడేసేవారు. అందరూ ఆయన్ని బాధ పెట్టి పైశాచికంగా ఆనందిస్తున్నారు. తాము చేసిన ఘనకార్యాన్ని నలుగురితో చెప్పుకుని మీసాలు మెలేస్తున్నారు.
ఓ రోజైతే విసిరిన రాళ్ళ దెబ్బలకు దేహమంతా రక్తంతో తడిసి ముద్దయింది. తల సైతం పగిలి రక్తం చిమ్ముకొస్తూ ఉంది. ఆ రక్తాన్ని తుడుస్తూ చిన్న పిల్ల హజ్రత్ ఫాతిమా (ర ) నాన్నా! ఎందుకు మీకే ఇన్ని కష్టాలు? అని బోరున ఏడ్చేశారు. అమ్మా! నాకు జరిగింది తక్కువమ్మా. పూర్వం ప్రవక్తల్ని సత్యసందేశం అందజేసి నందుకు శిక్షగా కొందరిని నిలబెట్టి నిలువునా రంపంతో చీరేస్తే, ఇంకొందరి దేహ మాంసాల్ని లోహపు దువ్వెనలతో లాగి ఎముకల్నుంచి వేరు చేసేవారు; మరికొందరి శిరస్సులను ఖండించి కాబోయే భార్యలకు బహుమానంగా ఇచ్చారు. అమ్మా! ధర్మ సంస్థాపన జరగాలన్నా జరగాలి. లేదా ఈ మార్గంలో నా ప్రాణాలైనా పోవాలి. ధర్మసంస్థాపనార్థాయ వందసార్లు మరణించి వందసార్లు బ్రతికించబడినా నేను ధర్మోన్నతి కోసమే పోరాడుతాను. అన్నారు ప్రవక్త శ్రీ (స ).
కెరటాల నురుగు చూసి, సాగర సామర్థ్యం అంచనా వేసినట్లు, మక్కా ప్రజలు ప్రవక్త (స ) వారి సందేశాన్ని చిన్న చూపు చూశారు. ఇది చాలా తేలికైన విషయంగా భావించారు. ఆయన సందేశం సత్య సస్య విప్లవానికి నాంది అని వారు ఆ క్షణం గ్రహించలేకపోయారు. జీవిత వాస్తవమే సత్యం. దాని ఆది ఏ గర్భంలోనూ లేదు. దాని అంతం ఏ సమాధిలోనూ లేదు. అది నిత్యం – నిర్మలం. అది నిజం – మారని ఇజం.