దైవ ప్రవక్త (సఅసం) సమాధిని మస్జిదె నబవీలోనికి తీసుకోవటంలోని ఔచిత్యం?
”జాగ్రత్త! మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల, సజ్జనుల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. మీరు మాత్రం అలాంటి చేష్టలకు ఒడిగట్టకండి అని నేను మీకు తాకీదు చేస్తున్నాను”.
సందేహం: ఇంతకీ మహాప్రవక్త (సఅసం) వారి సమాధిని మస్జిదె నబవీ లోపలికి తీసుకోవటంలోని ఆంతర్యం ఏమిటి?
సమాధానం: ”యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్ శాపం పడుగాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిద్ (సాష్టాంగ ప్రణామ స్థలం) గా చేసుకున్నారు” అని మహాప్రవక్త (సఅసం) ప్రవ చించారు (బుఖారీ, ముస్లిం).
వేరొక హదీసు ద్వారా కూడా రూఢీ అయ్యేదేమిటంటే హజ్రత్ ఆయిషా (ర.అన్‌హా) కథనానుసారం – ఉమ్మె సలమా, ఉమ్మె హబీబాలిద్దరూ (ర.అన్ హుమా) దైవప్రవక్త (స) దగ్గర ఒక చర్చీ గురించి ప్రస్తావించారు. ఆ చర్చీలో చిత్ర పటాలు, విగ్రహాలు ప్రతిష్ఠించి ఉండటం తాము చూశామని వారు చెప్పగా, ఆయన (సఅసం) ఇలా అన్నారు; ”వారు (గ్రంథంగల ప్రజలు) తమలోని పుణ్య పురుషులు చనిపోయినప్పుడు వారి సమాధులపై ఆరాధనాల యాన్ని నిర్మించి, వాటిలో వారి చిత్రపటాలను ఆవిష్కరించేవారు. అల్లాహ్‌ా దృష్టిలో అత్యంత నికృష్ట జనులు వీరే”. (బుఖారీ, ముస్లిం).
ఇంకొక హదీసు –
ఇమామ్ ముస్లిం (రహ్మ.లై) గారు తన సహీహ్‌ా ముస్లింలో హజ్రత్ జున్దుబ్ బిన్ అబ్దుల్లాహ్ (రజి) ఉల్లేఖనాన్ని పొందుపరిచారు. దాని ప్రకారం ఆయనిలా అన్నారు: దైవ ప్రవక్త (సఅసం) చెప్పగా నేను విన్నాను – ”జాగ్రత్త! మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల, సజ్జనుల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. మీరు మాత్రం అలాంటి చేష్టలకు ఒడిగట్టకండి అని నేను మీకు తాకీదు చేస్తున్నాను”.
హజ్రత్ జాబిర్ (రజి) ఉల్లేఖనం ప్రకారం ”మహనీయ ముహమ్మద్ (సఅసం) వారు సమాధులను పటిష్ట పరచటాన్ని, వాటిపై కూర్చోవటాన్ని, వాటిపై నిర్మాణాలు చేపట్టడాన్ని వారించారు”.(ముస్లిం)
పైన పేర్కొనబడిన ప్రామాణిక హదీసులను బట్టి ఎట్టి పరిస్థితిలోనూ సమాధులను ‘సజ్దా’ స్థలాలుగా చేసుకోరాదని స్పష్టంగా విదిత మవుతోంది. అలాగే గోరీలపై నిర్మాణం చేయటం, గుంబదులు వంటివి కట్టడం కూడా అధర్మమే. ఎందుకంటే ఇవన్నీ ప్రజలను దేవుని ఏక త్వం నుండి దూరం చేసి, షిర్క్ (బహుదైవోపాసన) కు మార్గం తెరు స్తాయి.
ఇక ప్రవక్త (సఅసం) సమాధిని మస్జిద్ లోపలికి తీసుకోవటం గురించి చెప్పుకుందాం –
దైవప్రవక్త (సఅసం) గానీ, ఆయన గారి ఇద్దరు ప్రియ సహచరులు (అబూబక్ర్, ఉమర్) గానీ వాస్తవానికి మస్జిద్ లోపలి భాగంలో ఖననం చేయబడలేదు. నిజానికి వారు ముగ్గురూ హజ్రత్ ఆయిషా (ర.అన్‌హా) నివసించే కుటీరంలో ఖననం చేయబడ్డారు. అయితే మస్జిద్‌కు వచ్చేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండటం వల్ల వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ కాలంలో మస్జిదె నబవీ విస్తృతి జరిగింది. ఆ సందర్భంగా – హి. మొదటి శతాబ్ది చివర్లో – హజ్రత్ ఆయిషా (ర.అన్‌హా) గారి కుటీరం కూడా మస్జిద్‌లో విలీనం చేసుకోబడింది.
తత్కారణంగా దైవ ప్రవక్త (సఅసం) సమాధితోపాటు, ప్రియ సహచరులిద్దరి సమాధులు కూడా ఆ విలీన స్థలంలో అంతర్లీనమై నాయి. కాబట్టి ఇది మస్జిద్‌లోపల జరిగిన ఖనన సంస్కారం అని చెప్పటం సరైనది కాదు. ( – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ – రహ్మ)
ఫోన్‌లో ‘మైనె ఖుబూల్ కియా’ అంటే సరిపోతుందా?
సందేహం: ఈ మధ్య ఇంటర్‌నెట్, ఫోన్ల ఆధారంగా ఎన్నో చోట్ల నికాహ్‌ాలు (వివాహాలు) జరుగుతున్నాయి. ఈ రకమైన వివాహాలు షరియతు పరంగా ధర్మబద్ధమేనా?
సమాధానం: నికాహ్‌లో ‘ఏజాబ్ వ ఖుబూల్’ (ప్రతిపాదన, ఆమోదం) కీలకమైనది. వివాహబంధంలో ఇమిడిపోయే నూతన వధూవరులు కూడా స్వయానా ఈ తంతు జరుపుకోగలరు. లేదా వారిరువురి తరఫు ‘పెద్ద మనుషులు’ కూడా జరిపించగలరు. ఒక సారి దైవప్రవక్త (సఅసం) ఒక వ్యక్తినుద్దేశించి, ”నీ వివాహం ఫలానా స్త్రీతో జరిపించమంటావా?” అని అడగ్గా ”సరే” నని ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడాయన (సఅసం) వారిరువురికీ నికాహ్ జరిపిం చారు (సుననె అబుదావూద్).
నికాహ్‌ా (వివాహం) కోసం షరీయతు ప్రకారం నాలుగు మూలాంశాలుంటాయి. (1) వధువు అంగీకారం (2) ఆమె సంరక్ష కుని అనుమతి (3) మహర్ సొమ్ము నిర్థారణ (4) సాక్షులు. నికాహ్‌ా సందర్భంగా ఈ షరతులు పూర్తవ్వాలి. అన్యధా అట్టి నికాహ్‌ా సరైనది కాదు.
ఇక ఫోన్ లేదా ఇంటర్‌నెట్ సంభాషణ ద్వారా నికాహ్ విషయానికి వస్తే – అందులో ‘ఖుబూల్’ చేసే వ్యక్తి గురించి పెళ్ళి కూతురు తరఫువారు ‘ఆ వ్యక్తి అతనే’ నని నిజ నిర్థారణ చేయాలి. అంటే ఆ స్థలంలో ‘వరుడు’ ఉండడు. కానీ దూర భాషణ ద్వారా అతని ‘ఆమోదకంఠం’ మాత్రం వినబడుతుంది. ఆ వివాహ మహో త్సవానికి విచ్చేసిన వధువు తరఫువారు, సాక్షులు, ఇతర బంధు మిత్రులు ఒక నిర్థారణకు వస్తారు. ఇలాంటి ‘నికాహ్‌ా’లో షరీయతు పరంగా ఎలాంటి దోషం లేదు. కాకపోతే ఇంతకు ముందు పేర్కొన బడిన నికాహ్‌ా ‘నియమ నిబంధనలు’ పరిగణనలోకి వచ్చి ఉండాలి. (నిజము దేవుడెరుగు)
నమాజులో తల్లిదండ్రుల కొరకు ‘దుఆ’ చేయవచ్చా?
సందేహం: ఫర్జ్ నమాజులో తల్లిదండ్రుల కోసంగానీ, వేరితరుల కొరకుగానీ ‘దుఆ’ చేయటం సమ్మతం కాదని కొందరంటున్నారు. ఇది నిజమేనా?
సమాధానం: నమాజులో దుఆ – తన కోసం చేసుకున్నా, తన తల్లి దండ్రుల, వేరితరుల కోసం చేసుకున్నా – ఆక్షేపణీయం ఏమీ కాదు. ”దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంలో ఉండేది ‘సజ్దా’ స్థితిలోనే కాబట్టి మీరు (ఆ స్థితిలో) అత్యధికంగా దుఆ చేసుకోండి” అని మహనీయ ముహమ్మద్ (స) వారు ఉపదేశించారు (ముస్లిం).
ఆయన (సఅసం) ఇంకా ఈ విధంగా ప్రవచించారు; రుకూలో మీ ప్రభువు ఔన్నత్యాన్ని కీర్తించండి. సజ్దాలో మాత్రం అత్యధికంగా వేడుకోలు చేయండి. బహుశా మీ వేడుకోలు ఆమోదించబడవచ్చు. (ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్‌ా బిన్ మస్‌వూద్ (రజి) ఇలా అన్నారు: మహా ప్రవక్త (సఅసం) తనకు తషహ్హుద్ నేర్పిన తర్వాత ఇలా ఉద్బోధించారు – ”ఇక నీవు నీకు ఎంతో ఇష్టమైన దుఆను ఎంపిక చేసుకుని దుఆ చెయ్యి. లేదా నీకు కావలసినది కోరుకో (వేడుకో)” అన్నారు. (బుఖారీ, ముస్లిం)
కాబట్టి ఎవరయినా నమాజు ముగించక ముందే సజ్దా స్థితిలో గాని, ఖాయిదా స్థితిలోగానీ తన కోసం లేదా తన మాతాపితల కోసం, ఇంకా సమస్త ముస్లిముల కోసం వేడుకుంటే అది అభ్యంతర కరం ఏమీ కాజాలదు. ఇది ధర్మసమ్మతమే.
-షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ (రహ్మ.లై)