Originally posted 2013-05-17 21:32:46.
”ఖస్ర్” మానవులకు దేవుడిచ్చిన ఒక వరం (ఓ సౌకర్యం). కనుక దాన్ని వద్దనకండి. – ముహమ్మద్ (స)
”ఖస్ర్” అనగా సంక్షిప్తంగా చేయటం, తగ్గించి చేయడం అని అర్థం. ఖస్ర్ నమాజు అంటే నమాజులోని రకాతుల సంఖ్యను తగ్గించుకొని నమాజు చేయడమని భావం. ప్రయాణంలో మనిషి అలసిపోతాడు. మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు. అలాంటి సమయంలో పూర్తి నమాజు చేయటం ఎంతైనా ఇబ్బందికరమే. అల్లాహ్‌ా తన దాసులను ఇలాంటి అసౌకర్యాల నుంచి కాపాడటానికి ప్రయాణంలో నమాజును సంక్షిప్తంగా చేసుకునే సౌలభ్యాన్ని కలగజేశాడు. నేడు ప్రపంచమంతటా రవాణ రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. బస్సు, రైలు, విమాన ప్రయాణాలు మానవుని ప్రయాణ బడలికను తగ్గించాయనడంలో సందేహం లేదు. కాని నేటికి కూడా మనిషి ఎన్నో మానసిక ఒత్తిళ్ళకు లోనై తీవ్రంగా అలసిపోతున్నాడన్న నిజాన్ని ఎవరూ కాదనలేరు. ”ప్రయాణం నరక యాతనలో భాగం” అన్న దైవ ప్రవక్త (స) దివ్య వచనం నేటికీ నిజమవుతూనే ఉంది. ఏమయినప్పటికీ ప్రయాణంలో అలసట కలిగినా కలగకపోయినా ఈ సౌకర్యం మాత్రం ప్రళయం వరకూ ఉంటుంది. ఇది మానవుల పాలిట దేవుని మహదానుగ్రహం. దివ్య ఖుర్‌ఆన్‌లో నాల్గవ సూరాలోని 101వ సూక్తిలో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:
”మీరు ప్రయాణానికి బయలుదేరినప్పుడు నమాజు సంక్షిప్తంగా చేస్తే అది తప్పు కాదు”.
దైవ ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”ఖస్ర్ ఒక ఉపకారం. నమాజును ఖస్ర్ చేసుకునే సౌలభ్యాన్ని కలుగజేసి అల్లాహ్ మీకు ఉపకారం చేశాడు. అల్లాహ్ చేస్తున్న మేలును వద్దనకండి”. (ముస్లిం)
ప్రయాణంలో పూర్తి నమాజు చేసుకోవచ్చు కాని ఖస్ర్ ఉత్తమం
పై హదీసు ద్వారా బోధపడేదేమిటంటే ప్రయాణంలో శక్తి ఉండి పూర్తి నమాజు చేసుకుంటే తప్పు లేదు కాని ఖస్ర్ చేయటమే ఉత్తమం. అయినా దేవుడు చేస్తున్న ఉపకారాన్ని స్వీకరించని దౌర్భాగ్యుడు ఎవడుంటాడు చెప్పండి! అందుకే దైవప్రవక్త (స), ఆయన అనుచరులు అత్యధికంగా ఖస్ర్ విధానాన్నే ఆచరించేవారు.
1) ప్రయాణంలో ఉన్నప్పుడు జుహర్, అసర్, ఇషాలలో నాలుగు రకాతుల ఫర్జ్ నమాజులను రెండేసి రకాతుల చొప్పున మాత్రమే చేసుకోవాలి.
2) మగ్రిబ్‌లో ఫర్జ్ నమాజు (ఎలాంటి తగ్గింపు లేకుండా) మూడు రకాతులే చేయాలి.
3) ప్రయాణంలో సున్నతులకు మినహాయింపు ఉంది. అయితే వితర్ నమాజ్ మరియు ఫజ్ర్ వేళ రెండు రకాతుల సున్నత్ నమాజు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా చేయాలి.
గమనిక: ప్రయాణీకుడు స్థానికుడై ఇమామ్ వెనుక నమాజ్ చేెస్తున్నప్పుడు ‘ఖస్ర్’ చేయకూడదు.
రెండు నమాజులు కలిపి చేయటం (జమా బైనస్సలాతైన్)
ప్రయాణావస్థలో జుహర్-అస్ర్ మరియు మగ్రిబ్-ఇషా నమాజులను కలిపి ఒకేసారి చేసుకోవచ్చు. దైవప్రవక్త (స) ఆ విధంగా చేసేవారని హదీసుల ద్వారా తెలుస్తోంది. దీనిని అరబీలో ‘జమా బైనస్సలాతైన్’ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన మదీనా నగరంలో ఎలాంటి భయానక వాతావరణం గాని, వర్షం గాని లేనప్పుడు కూడా పైన పేర్కొనబడిన నమాజులను కలిపి ఒకేసారి చేశారు (బుఖారీ). జమా బైనస్సలాతైన్ చేయాలనుకున్నప్పుడు జుహర్- అస్ర్‌ను కలిపి జుహర్ లేక అసర్ వేళలో చేసుకోవచ్చు. అలాగే మగ్రిబ్-ఇషా నమాజులను కలిపి మగ్రిబ్ లేక ఇషా వేళలో చేసుకోవచ్చు.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్, ఇబ్నె ఉమర్ (ర)లు 40 మైళ్ళ దూర ప్రయాణం చేసినప్పుడు ‘ఖస్ర్’ చేసేవారు. అలాంటి ప్రయాణంలో వారు ఉపవాసాలు కూడా ఉండేవారు కాదు. (బుఖారీ)
గమనిక: ఒక నిర్ణీత గడువు కంటే ఎక్కువ రోజులు ఏదయినా ప్రదేశంలో విడిది చేస్తే, ఖసర్ చేయకూడదని ఖుర్‌ఆన్ హదీసుల్లో ఎక్కడా నిర్ణయించబడలేదు.
ప్రయాణానికి బయలుదేటప్పుడు చేసే దుఆ
ప్రయాణీకుడు వాహనం మీద కూర్చోగానే ‘బిస్మిల్లాహ్’ అనాలి. ఆ తర్వాత ‘అల్‌హమ్దులిల్లాహ్’ అంటూ క్రింది దుఆ పఠించాలి.
”సుబ్హానల్లజీ సఖ్ఖరలనా హాజా వమా కున్నా లహూ ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్‌ఖలిబూన్”.
(వీటిని మాకు వశపరచినవాడు పరిశుద్ధుడు. లేకపోతే, వీటిని వశపరచుకునే శక్తి మాకు లేదు. ఏదో ఒక రోజున మేము మా ప్రభువు వైపునకు మరలి పోవలసి ఉన్నది.) (అబు దావూద్, తిర్మిజీ)
ప్రయాణం నుండి తిరిగొచ్చేటప్పుడు చేస దుఆ
”ఆయిబూన తాయిబూన ఆబిదూన సాజిదూన లిరబ్బినా హామిదూన.”
(మేము ప్రయాణం నుండి తిరిగొస్తున్నవాళ్ళం, పాపాలపై పశ్చాత్తాప పడేవాళ్ళం. దైవారాధకులం. దైవ సన్నిధిలో సాష్టాంగపడేవాళ్ళం, మా ప్రభువును స్తుతించేవాళ్ళం.) (ముస్లిం)