Originally posted 2013-05-17 21:47:56.
”ఓ విశ్వాసులారా!
మీరు గనక (పరస్పరం) రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయభక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు”. (అల్ ముజాదలా -9)
తాత్పర్యం:
మదీనాలో యూదులు, కపటులు ఈ రకంగానే చెవులు కొరుక్కునేవారు. ముస్లింలను ఈ దురలవాటు నుంచి దూరంగా ఉంచే ఉద్దేశ్యంతో ఈ విధంగా తాకీదు చేయబడింది.
1) ”ఓ ముస్లిములారా! మీరే గనక మీ విశ్వాసం (ఈమాన్) విషయంలో నిజాయితీ) గలవారయితే ఇలాంటి పాపకార్యాలతో కూడిన మంతనాలకు, గుసగుసలకు దూరంగా ఉండండి” అని సావధాన పరచబడింది.
2) ఒకవేళ మీరెప్పుడైనా రహస్య సమాలోచన జరపవలసిన అవసరం అంతగా ఏర్పడితే అందులో పరోపకారం, శ్రేయోభిలాష, దైవభక్తి, దైవ ప్రవక్త (స ) యెడల విధేయతా భావం తొణికిసలాడుతూ ఉండాలి. అపకార బుద్ది ఏ కోశానా ఉండరాదు. సత్కార్యం, దైవ భీతి (తఖ్వా) అంటే ఇదే.
3) అపచారాన్ని, అవిధేయతను, అపరాధాలను ప్రేరేపించే ‘రహస్య మంతనాలు’ షైతాను తరఫుననే ఉంటాయి. దుష్ప్రేరణల ద్వారా విశ్వాసులను ఇరకాటంలో పెట్టాలన్నదే ఆ ధూర్తుడి ఉద్దేశం.
రహస్య మంతనాలు
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (ర ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స ) ఇలా ఉపదేశించారు: ”మీరు ముగ్గురు వ్యక్తులున్నప్పుడు – ఇద్దరు వ్యక్తులు ఏకమై, మూడో వానిని వేరు చేసి, రహస్య సమాలోచన చేయరాదు. అతను (మూడో వ్యక్తి) జన సమూహంలో కలిసిపోయిన తరువాత సమాలోచన జరుపుకుంటే అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ (వేర్పాటు) ధోరణి అతణ్ణి దుఃఖానికి, మనస్తాపానికి లోను చేస్తుంది”. (బుఖారీ, ముస్లిం – వాక్యాలు ముస్లింలోనివి)
సారాంశం:
తోడుగా ఉన్న వ్యక్తిని ఉపేక్షించి ఇతరులతో గుసగుసలాడటాన్ని, రహస్య సమాలోచన జరపటాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది. సాటి మనుషుల మనోభావాలు, భావోద్రేకాలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని వాటిని గౌరవించాలని, ఏ థలోనూ మనోభావాలను గాయపరచరాదని కూడా ఈ హదీసు మనకు ఉపదేశిస్తుంది. ఈ ఉపదేశాల్ని లెక్క చేయకుండా తోటి మనిషిని వేరుపరిస్తే అతని మనస్సు చివుక్కుమంటుంది. వీళ్ళిద్దరూ కలిసి నన్ను పరాయివానిగా చూస్తున్నారేనన్న ఆలోచన అతనిలో వస్తుంది. బహుశా తనకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర పన్నుతున్నారేమోనన్న అనుమానం కూడా రావచ్చు. ఈ అనుమానాలే వ్యక్తుల మధ్య అంతరాల అగాథాలను సృష్టిస్తాయి. పరస్పర సహకార భావం బదులు సహాయ నిరాకరణ ధోరణి ప్రబలుతుంది. కాబట్టి సామూహిక జీవనంలో కొందరు కొందరిని వేరు చేసి, ఇంకొందరితో కలిసి రహస్య మంతనాలు సాగించటం, చెవులు కొరుక్కోవటం వారించబడింది. అయితే మూడో వ్యక్తి అక్కడ లేనపుడు ఇద్దరు కలిసి సమాలోచన సాగించటం మాత్రం తప్పు కాదు.