”సమాధులు పెళ్ళగించబడినప్పుడు..ప్రతి ఒక్కరికీ తాను ముందుకు పంపుకున్నదీ, వెనక వదలి పెట్టినదీ (అంతా) అర్థమయిపోతుంది”. (ఇన్ఫితార్: 4-5) మనోరంజక సుఖ సౌఖ్యాలతో కూడుకున్న ఈ మూన్నాళ్ళ మచ్చట తీరిన తర్వాత రాబోవు మజిలీలు మనిషిని ముచ్చెమటలు పట్టిస్తాయి. ప్రాంచిక వ్యామోహం, అధికంగా పొందాలన్న ఆత్రం, అత్యాశ, అతని లో లోభత్వాన్ని పెంచి అల్లాహ్‌ా ఆదేశాల పట్ల, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి సంప్రదాయాల పట్ల అశ్రద్ధ వహించేలా చేసింది. అలా అన్ని విధాల పరధ్యానానికి గురైన మనిషి ఆశల ఆరాటంలోనే, కాంక్షల దాస్యంలోనే కాటికి చేరుకుంటాడు. ఎంత దర్జాగా తను బతికినా, వందల ఎకరాల్లో చూపరుల్ని కట్టి పడేసే ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్నా, కనీస అవసరాలయిన కూడు, గూడు, గుడ్డకు సయితం నోచుకోక జీవించినా చావు గుటక వేయ వలసిందే. ఎంతో గారాబంగా పెంచుకున్న ఆరగడుల అందమ యిన శరీరం ఎంత ఇష్టం లేక పోయినా కాటి మట్టిలో కలిసిపోవల సిందే! ఎంత విశాలమయిన భవనాల్లో నివాసం ఉండినా, ఆరడుగుల సమాధిలో ఎంత అసౌకర్యంగా ఉన్నా, ఏ సౌకర్యం లేకుండా అడ్జస్ట్ అవ్వాల్సిందే!! ”ప్రతి ప్రాణీ మృత్యు రుచి చవి చూడాల్సిందే”.
(ఆల్ ఇమ్రాన్: 185)
మరణం అనే ఘట్టం ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంది. ఇరుకయిన ఈ కనుమ గుండా ప్రతి ఒక్కరూ పయనించాల్సిందే. వింత ఏమిటంటే, అది ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో తెలీదు, ఎవరూ తేల్చి చెప్పనూ లేరు. ఇదే యదార్థాన్ని కుర్‌ఆన్ ఇలా పెర్కొంటుంది: ”తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. మరియు తాను ఏ గడ్డపై మరణిస్తుందో కూడా ఏ జీవికి తెలీదు. అల్లాహ్‌ాయే అన్ని తెలిసినవాడు, సర్వజ్ఞుడూను”. (లుఖ్మాన్: 34)
ఎవరి చావు ఎలా ఉన్నా, చావు తీవ్రత మాత్రం చాలా భయంకరమ యినది. హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర) వంటి వారే ”ఓ అల్లాహ్! నా మరణ పీడనలోని తీవ్రతను తగ్గించు స్వామీ!” అని వేడుకునేవారంటే అదెంత యాతనతో కూడినదయి ఉంటుందో ఆలో చించండి!
మరణం ఓ పీడనయితే, సమాధి దానికన్నా పెద్ద యాతన. ”నేను సమాధికాన్న దుర్భరమయిన, ఆందోళనకరమయిన స్థలం మరొకటి చూడలేదు” అని స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారు సెల వియ్యడమే కాక, ”సమాధి యాతన నుండి అల్లాహ్‌ా శరణు కోరు కోండి” అని నొక్కివక్కాణించారు. ”మీరు సమాధుల్లో దజ్జాల్ ఉపద్రవం నుండి పరీక్షించబడినట్లు పరిక్షించ బడతారు”. అన్నారు ప్రవక్త (స).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) ఇలా అన్నారు: ”సమాధి ఉప ద్రవం నుండి శరణు వేడుకునే ప్రార్థనను ప్రవక్త (స) వారు, మాకు ఖుర్‌ఆన్‌లోని సూక్తులు నేర్పించినట్లు నేర్ఫించేవారు”. అలాగే మనం రోజూ ఐదు ఫుటల నమాజులలో చదివే దుఆలలో – ”ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను” అన్నది ఒకటి. ప్రవక్త (స) వారు సమాధి యాతన నుండి శరణు వేడు కోని రోజంటూ లేదు” అన్నారు హజ్రత్ ఆయిషా (ర.అ).
హజ్రత్ ఉస్మాన్ (ర) గారయితే సమాధి ప్రస్తావన వస్తే చాలు బోరున విలపించేవారు. ఎంతగా ఏడ్చేవారంటే ఆ అశ్రువుల ధాటికి గడ్డం తడిసిపోయేది. ‘నరక ప్రస్తావన వచ్చినప్పుడు కూడా తమరు ఇంతగా విలపించరే! మరి, సమాధి ప్రస్తావనతో ఎందుకు భయకంపితులవు తున్నారు’ అని కొందరు అడగ్గా – ”పరలోక మజిలీలలో తొలి మజిలి సమాధి. ఈ ఘట్టాన్ని అవలీలగా దాటగలిగితే తర్వాతి ఘట్టాలు వాటం తట అవే సులభతరమయిపోతాయి. ఇక్కడ ముక్తి లబించని వానికి తర్వాతి ఘట్టాలు ఇంకా దుర్భరంగా ఉంటాయి” అనేవారు.
హజ్రత్ ఉమర్ (ర) గారు సమాధిని, పరలోక జీవితాన్ని గుర్తు చెసుకుని ఎంతగా ఏడ్చేవారంటే, ఆయన ముఖం మీద చారలు ఏర్ప డ్డాయి. ప్రవక్త (స) వారి నోట సమాధి యాతన తాలూకు సంగతులు విని హజ్రత్ అబూ జర్ గిఫారీ (ర)- ”అయ్యో! నేను చెట్టునయి ఉంటే ఎంత బాగుండేది. ఎవరి చేతనయినా కోయబడేవాడిని” అని అంటుం డేవారు.
హజ్రత్ అబూ హురైరా (ర) గారికి మరణ ఘడియ సమీపించినప్పు డు ఆయన బోరున విలపించ సాగారు. అది చూసిన ప్రజలు – ‘ఏమండి! ప్రపంచాన్ని వదిలి పెట్టి వెళ్ళాలిస్స వస్తున్నందుకు విలపిస్తు న్నారా?’ అని అడిగారు. దానికాయన –
”కాదు, ప్రయాణం చూస్తే బహు సుదీర్ఘమయినది. నా దగ్గరేమో ప్రయాణ సామగ్రి అంతంత మాత్రమే ఉందాయే! అందుకని నా ఈ పరలోక ప్రస్థానం ఎలా సాగుతుందన్న బెంగతో ఏడుస్తున్నాను. ప్రస్తు తం నేను ఎదుర్కోబోతున్న స్థితిగతుల ఉపమానం ఎలాంటిదంటే – ”నేనొక ఎత్తయిన గుట్ట మీద నుంచుని ఉన్నాను. దాని ఆవల స్వర్గమ యినా ఉంది, నరకమయినా ఉంది. వాటిలో నా గమ్యస్థానమేదో నాకే తెలియని అయోమయ స్థితి” అని విచారం వ్యక్తం చేశారు.
ధర్మఖలీఫాలో జుగ్రజులయిన హజ్రత్ అబూ బకర్ (ర) గారు మర ణాన్ని, సమాధిని తలచుకుని ఎంతగా భయపడేవారో ఆయన ఈ వేడు కోలు ద్వారా అంచనా వేయవచ్చు: ”దేవా! నా పరిస్థితి ఎలా ఉండబో తుందో! నా వద్ద చెప్పుకోదగ్గ ఒక్క సత్కర్మ లేకపాయే! నా దుష్కర్మలు చూస్తే చాలానే ఉన్నాయి. దీనికి తోడు విధేయత సామగ్రి కొరత మాత్రం కొట్టుకొచ్చినట్లు కనబడుతుందాయే!!
భయంకరమయిన సమాధి ఇరుకయిన కనుమను తలచుకుని సజ్జను లయిన మన పూర్వీకులు అంతగా కంపించిపోతుంటే, మనం మాత్రం రోజూ ఎవరో ఒకరిని కాటికి సాగనంపుతూ కూడా ఘోరమైన ఏమరు పాటుకి లోనయి జీవిస్తున్నాము. మరణం, మరణానంతర జీవతం తాలూకు చింతనే మనలో లేకుండా పోతుంది. ”ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినా వారు ఏమరుపాటుకి లోనయి విముఖులయి జీవిస్తున్నారు”. (అన్బియా: 1)
ఓసారి దైవప్రవక్త (స) తన ముందు నుంచి ఒక శవం పోతుంటే చూసి – ”సౌఖ్యాన్ని పొందేవాడు లేదా సౌఖ్యాన్న ఇచ్చేవాడు” అన్నారు. విషయం అర్థం అవ్వక అనుచరుల ‘అంటే ఏమిటి దైవప్రవక్తా! అని అడగ్గా- ”విశ్వాసి చనిపోయాక ఐహిక కష్టాల నుండి విముక్తి పొంది అల్లాహ్‌ా కారుణ్య ఛాయలో సౌఖ్యం పొందుతాడు. పాపాత్ముడు చనిపోతే, ప్రజలు, ప్రాంతం, పట్నం, దేశం, చెట్టు, చతుష్పాదాలు, సర్వానికి అతని కీడు నుండి విముక్తి కలుగుతుంది” అని సమాధానమి చ్చారు ప్రవక్త (స. (బుఖారీ)
పాఠక మహాశయులారా! మనం మరణించాక మన జనాజా మోసుకె ళ్ళేందుకు కనీసం నలుగురు వ్యక్తులయినా మనస్ఫూర్తిగా ముందుకు రావాలంటే నలుగురికి మేలు చేసినప్పుడే, నలుగురిలో మంచిగా వ్యవహరించినప్పుడే అది సాధ్యం. కాదు, కూడదు అంటే మాత్రం ‘పీడ విరగడయ్యింది’ అంటూ దాటి పోతారు. ఇదే యదార్థాన్ని ఓ కవి ఇలా అన్నాడు: ”ఓ ఆదం పుత్రుడా! అది నువ్వే – నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడుస్తూ ఉంటే, నీ చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంతో నవ్వుతుండే వారు. నువ్వు నీ స్వయం కోసం ఎలాంటి సత్కర్మల సామగ్రిని సమకూర్చుకోవాలంటే, నీవు మరణించిన నాడు వారందరూ శోక సముద్రంలో మునిగి ఉండగా నువ్వు మాత్రం నవ్వుతూ ఈ లోకాన్ని వీడాలి”.
”వారు ఎన్నో తోటలను, ఎన్నో ఊటలను వదలి పోయారు. మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నియాలను. ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమయిన వస్తువులను (వదలిపోయారు). అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నింటికీ వారసులుగా చేశాము. వారి స్థితిపై నింగీ ఏడ్వలేదు, నేలా విలపించలేదు. వారికి (కనీసం) గడువు కూడా లభించలేదు”. (అద్దుఖాన్: 25-29)
దీనికి భిన్నంగా ”విశ్వాసి మరణిస్తే, 40 రోజుల వరకు భూమ్యాకాశాలు, సృష్టిలోని చరాచరాలు రోధిస్తాయి” అని ప్రవక్త (స) అన్నారు. పరలోక శిక్ష అంటే, ప్రళయం రావాలి. తీర్పు దినం నెలకొనాలి. ఆ తర్వాతే శికాబహుమానాలు అన్న భ్రాంతిలో ఉంచే ప్రయత్నం చేస్తాడు షైతాన్. తస్మాత్ జాగ్రత్త! స్వర్గనరకాల తీర్పు ప్రళయ దినాన ఇవ్వ బడినా, ‘కోర్టు తీర్పు వెలువడనంత వరకూ నేెరస్థుడు జైల్లో అనుభ వించే శిక్ష వంటిదే సమాధి శిక్ష. అసలు నరక యాతన చవి చూడక ముందు దైవదూతలతో నడ్డి విరగ్తొట్టుకొని తీర్పు దినం వరకూ సమాధి లో దుర్భర జీవితం గడపవలసి ఉంటుంది. ఇదే ఘట్టాన్ని గుర్తు చేస్తూ ప్రవక్త (స) అన్నారు: ”సమాధి స్వర్గవనాలలోని ఓ వనం లేదా నరక కూపాల్లోని ఓ కూపం”. (తిర్మిజీ)
మరణ ఘడియ సమీపించాక పశ్చాత్తాపం చెందడం వల్ల ప్రయో జనం లేదు. దుఆ ద్వారాలు ప్రళయ సమయంలో పడమర నుండి సూర్యుడు ఉదయించేంత వరకు తెరవబడే ఉంటాయన్నది నిజమే. కానీ ‘ప్రతి మనిషి తాలూకు ప్రళయం అతని మరణమే’ అన్నది కూడా అక్షర సత్యం. ఆ ఘడియ సమీపించినప్పుడు అవిధేయుల స్థితిని వర్ణిస్తూ ఖుర్‌ఆన్ ఇలా అంటుంది: ”చివరికి వారిలో ఎవరికయినా చావు మూడినప్పుడు అతను (పశ్చాత్తాపంతో) ‘ప్రభూ! నేను వదలి వచ్చిన ప్రపంచంలోకి నన్ను మరో సారి పంపించు. నేనిప్పుడు నా ప్రవర్తన మార్చుకుని, సత్కార్యాలు చేస్తాను’ అంటాడు. అలా ఎన్నటికీ జరుగదు. అతను పనికిమాలిన మాటలు వదరుతున్నాడు. (చని పోయిన) వారందరి వెనుక ఇప్పుడొక అడ్డు తెర (బర్జఖ్) ఏర్పడింది. పునరుత్థాన దినం వరకూ వారా స్థితిలోనే ఉంటారు”.
(దివ్య ఖుర్‌ఆన్-23: 99,100)
కాబట్టి మనందరి ప్రభువు మనల్ని ఎంతో ప్రేమతో ఇస్తున్న పిలుపు ఇది: ”మీలో ఎవరికయినా చావు వచ్చి – ‘నా ప్రభూ! నాకు మరి కొంత గడువు ఇవ్వలేదెందుకు? (ఇచ్చి ఉంటే) నేను కూడా ధాన ధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాడిని కదా!’ అని (కడు దీనంగా) పలికే దుస్థితి దాపురించక ముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు చేయండి. ఏ ప్రాణికయినా, దాని నిర్థారిత సమయం ఆసన్నమయ్యిందంటే, ఇక అల్లాహ్ ఎట్టి స్థితిలోనూ దానికి గడువు ఇవ్వడు”. (మునాఫిఖూన్: 10,11)