Originally posted 2013-03-30 06:16:41.
ముహమ్మద్ ఉమర్
మనం మనుషులం. అందరం సమానులం. అస్పృశ్యతా అంటరాని తనాలకు అతీతులం. దైవ దాసులం. ఆది మానవుడైన ఆదం (అ) వారి బిడ్డలం. ఒకే కుటుంబానికి చెందినవారలం. మనల్ని పుట్టించిన దేవుడు మనందరి మార్గదర్శక నిమిత్తం ఒక లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను ప్రభవింపజేయడమేగాక, అనేక గ్రంథాలను అవతరింపజేశాడు. అలా లోక కళ్యానార్థం వచ్చిన మహా మహులలో మొదటివారు ఆదమ్ (అ). ఆయన మొదలు ప్రవక్తలందరూ తీసుకొచ్చిన ధర్మం ఒక్కటే. అది ”లా ఇలాహ ఇల్లల్లాహ్” – దేవుడు ఒక్కడే. అదే నిజం. తక్కినవన్నీ మిథ్య. దేవుడు ప్రజలందరికి ఉపదేశించిన జీవన విధానం ఒక్కటే. అగ్ర వర్ణాల వారికి, అధమ వర్ణాల వారికి అంటూ వేర్వేరు శాసనాలు ఆయన చేయలేదు. ధనికులైనా, పేదలైనా, అరబ్బులైనా, అరబ్బేతరులైనా, నల్లవారైనా, తెల్లవారైనా, కనక పిపాసులైనా, కార్మికులైనా అందరి కోసం ఆయన నిర్దేశించిన జీవన విధానం ఒక్కటే. నాటి నుండి నేటి వరకు. అదే ఇస్లాం.
ఇస్లాం చూపే జీవన విధానం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అన్ని విధాల ఆమోదయోగ్యంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ముందు మనిషి, నిజ స్వామిని గుర్తించాలంటుంది. ఆయన ప్రసన్నతను కోరుతూనే ప్రతి పని చెయాలంటుంది. తల్లిదండ్రుల్ని గౌరవించమంటుంది. వారితో కసురుకుంటూ మాట్లాడకూడదంటుంది. పొరుగువారితో మంచిగా మసలుకో మంటుంది. కుడి ఎమడల ఉన్న నలభై ఇళ్ళు పొరుగువారి క్రిందికి వస్తాయి అంటుంది. తాము పుష్టిగా భోంచేసి పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే అతను పరిపూర్ణ విశ్వాసి కాజాలడు అని హెచ్చరిస్తుంది. ఇస్లాం శుచీ శుభ్రతల గురించి నొక్కి మరీ చెబుతుంది. దేహ పరిశుభ్రత విశ్వాసంలోని సగ భాగమైతే, ఆత్మ పరిశుద్ధత విశ్వాసంలోని మరో సగ భాగం అంటుంది.
ఇన్ని చెబుతున్న నేనెవర్ని? అని తెల్లబోతున్నారా? నా పేరు పడిగ పాలేటి. నేను 2006లో ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించాను. తోటి స్నేహితులు, మరియు అన్య పుస్తకాల నుండి ఇస్లాంను గ్రహించిన నేను ఇస్లాం ఆది ధర్మం అని గ్రహించాను. విశ్వ మానవాళి కోసం విశ్వకర్త పంపిన జీవన విధానం అని తెలుసుకున్నాను. భాష, ప్రాతం, దేశం, కాలం వేరయినా అందరూ తీసుకొచ్చిన ధర్మం ఇస్లాం మాత్రమే అని తెలుసుకున్న నేను ఇస్లాం స్వికరంచాను. నేను ఇస్లాం ధర్మాన్ని నా జీవన విధానంగా చేసుకున్నప్పటి నుండి నాలో అనూహ్య రీతిలో మార్పు వచ్చింది. మంచి ఏది, చెడు ఏది అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే గుణం అలవడింది. ఒక్క మాటలో చెప్పాలంటే – ”మంచికి మారు పేరే ఇస్లాం”. ప్రస్తుతం నా పేరు ఉమర్.