Originally posted 2013-02-03 22:04:10.
మౌలానా సఫీయుర్రహ్మన్ ముబారక్పూరీ
దైవ ప్రవక్త (స) గారి ధర్మ ప్రచార కాలాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1) మక్కా జీవితం: దాదాపు 13 సంవత్సరాలు 2) మదీనా జీవితం: 10 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రతి కాలం అనేక ఘట్టాలుగా విభజితమౌతుంది. అందులో ప్రతి మలుపు కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ విధంగా మక్కా జీవితాన్ని మూడు థలుగా విభజించ వచ్చు- 1) రహస్య సందేశ ప్రచారం – దాదాపు మూడు సంవత్సరాలు.
2) మక్కా లోపల బహిరంగంగా ప్రచారం – నబవీ శకం నాల్గవ సంవత్సరం మొదలు పదవ సంవత్సరం చివరి వరకు.
3) మక్కా వెలుపల సందేశ ప్రచారం – నబవీ శకం 10వ సంవత్సరం చివరి నుండి ప్రవక్త (స) మదీనాకు వలస వెళ్ళేవరకు.
తొలి దశ – రహస్య సందేశ ప్రచారం
సహజంగా దైవప్రవక్త (స) ఇస్లాం సందేశాన్ని ముందు తన ఇంటివారికి, స్నేహితులకి అందజేయాలి. అందుకే వారందరినీ ఇస్లాం వైపు ఆహ్వానించారు. మొట్ట మొదట ఇస్లాం స్వీకరించిన వారిలో ఆయన (స) గురించి బాగా తెలిసిన సహధర్మచారిణి హజ్రత్ ఖదీజా (ర.అ). ఆయన బానిస జైద్ బిన్ హారిసా (ర). మరియు పెదనాన్న కొడుకు హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ (ర). అప్పుడు అలీ గారి వయస్సు 10 సంవత్సరాలు. ఆయన ప్రవక్త (స) గారి సంరక్షణలోనే పెరిగారు. అదే విధంగా ప్రవక్త (స) గారి ఆప్తమిత్రుడైన హజ్రత్ అబూబకర్ (ర) కూడా ఇస్లాం స్వీకరించారు. ఆయన కూడా ధర్మ ప్రచారం ప్రారంభించారు. అబూ బకర్ (ర) గారికి మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. ఆయన నడవడిక సయితం ఎంతో ఉత్తమ మైనది. ఆయన ప్రోద్బలం, ఉపదేశాల వల్ల ‘ఉస్మాన్ బిన్ అప్ఫాన్, సాద్ బిన్ అబీ వఖాస్, జుబైర్ బిన్ అవ్వామ్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, తల్హా బిన్ ఉబైదుల్లాహ్‌ా (రజియల్లాహు అన్హుం)లు ముస్లిములయ్యారు. ఈ ఎనిమిది మంది ఇస్లాం ప్రారంభం లోనే చేతికి అందిన ఆణి ముత్యాలు. అలాగే హజ్రత్ బిలాల్ బిన్ రిబాహ్‌ా, అర్ఖమ్ బిన్ అర్కమ్, ఖబ్బాబ్ ఇబ్నుల్ అరత్ కూడా ఇస్లాం మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత ముస్లింల సంఖ్య పెరగసాగింది. కాకపోతే బలాన్ని పుంజుకోలేదు.
వారందరూ గుట్ట్టుగానే ఇస్లాం స్వీకరించారు. వీరందరిని తీసుకునీ మహా ప్రవక్త (స) ‘దారుల్ అర్ఖమ్’ (అర్ఖమ్ నివాసం)లో సమావేశమయి, రహస్యంగా ధర్మం గురించి బోధించేవారు. దైవ వాణి అవతరణ కొనసాగుతూనే ఉంది. ఈ కాలంలో అవతరించిన ఖుర్‌ఆన్ భాగాలు సందేశపు తొలి థకు అనువుగా చిన్న చిన్న వాక్యాలతో, ఆత్మల్ని తట్టి లేపేవిగా, శుద్ధపర్చేవిగా ప్రాపంచిక వ్యామోహానికి దూరంగా ఉంచేవిగా ఉండేవి. స్వర్గ – నరకాలను అభివర్ణించే ఆయతులు కూడా ఉండేవి. ఇస్లాం ప్రారంభంలో ‘ఇష్రాక్ రెండు రకాతులు (సూర్యోదయం తర్వాత) మరియు సంధ్యాకాలపు రెండు రకాతుల (సూర్యాస్తమయ వేళలో) నమాజును అల్లాహ్‌ా విధిగా నిర్ణయించాడు.
రెండవ దశ – బాహాటంగా ప్రచారం
”నీ దగ్గరి బంధుమిత్రుల్ని భయపెట్టు” అన్న ఆదేశం ఈ థలో అవతరించింది. అప్పుడు ప్రవక్త (స) తన జాతివారిని అల్లాహ్‌ా వైపు ఆహ్వానించారు. అందులో తొలుత ప్రవక్త (స) బనూ హాషిమ్‌ను పిలిచారు. వారు తమ వారైన బనూ అబ్దుల్ ముత్తలిబ్, బనూ అబ్దుల్ మునాఫ్‌తో హాజరయ్యారు. ఆ తర్వాత ప్రవక్త (స) వారందరినీ ఏకదైవారాధన వైపు పిలిచారు. అల్లాహ్‌ాకు సహవర్తుల్ని కల్పించరాదని నచ్చ జెప్పారు. తాను అల్లాహ్ ప్రవక్తనని, మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడు కోండని హితోపదేశం చేశారు. అప్పుడు పెదనాన్న అబూ తాలిబ్ ”నీకు ఆజ్ఞాపించ బడిన దానిని నీవు చేస్తూ ఉండు, అయితే అబ్దుల్ ముత్తలిబ్ (తాతముత్తాతల నాటి) సాంప్రదాయక మతం వదలి పెట్టాలంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. నీవు మాత్రం నిస్సంకోచంగా దీన్ని అనుసరించవచ్చు. దైవసాక్షి! నేను బ్రతికున్నంత కాలం నీకు అండగా నిలుస్తాను” అన్నారు. అయితే అబూ లహబ్ మాత్రం ప్రవక్త (స) గారు మాటలు విని మండిపడ్డాడు. ‘ఈ రోజంతా నీపై శాపం కలుగు గాక! దీని కోసమేనా మమ్మల్ని సమావేశపర్చావు?’ అని అమర్యాదకరంగా ప్రవర్తించాడు. సత్య ప్రకటన, బహుదైవారాధకుల వ్యతిరేకత
”నీకు ఆదేశిస్తున్న విషయాన్ని ఎలాంటి దాపరికం లేకుండా ప్రజలకు చేరవేయి. బహుదైవారాధకులను ఏ మాత్రం ఖాతరు చేయకు”. (నహల్: 94) అన్న దైవాజ్ఞ వచ్చేంతవరకు ప్రచార పిలుపు గుట్టుగానే సాగింది. ప్రవక్త ముహమ్మద్ (స) సందే శాన్ని బాహాటంగా ప్రకటించడానికి సన్నద్ధులయ్యారు. ఓ రోజు ఆయన సఫా గుట్టపై ఎక్కి ‘యా సబాహా’ అని కేక వేశారు. ఈ పదం ఏదో పెద్ద విషయమే జరగనున్నది అన్నదానికి పర్యాయ పదంగా ఉండేది. కేక విని ఖురైషు తెగలన్నీ ఆయన దగ్గరకు చేరగా, వారందరని ఉద్దేశించి: ”ఈ కొండ ఆవల లోయలో మీపై దండయాత్ర చేయడానికి ఓ సైనికి పటాలం పొంచి ఉంది అని నేను చెబితే మీరు నమ్ముతారా?” అని అడిగారు. ప్రజలంతా ముక్త కంఠంతో ”అవును! మీరెప్పుడూ సత్యమే చెబుతారన్న అనుభవం మాకుంది’ అన్నారు. అప్పుడు ఆయన (స) వినండి! నేను ఒక భయంకరమయిన యాతనల గురించి హెచ్చరించడానికి పంపబడ్డాను’ అన్నారు. ఆ తర్వాత వారిని లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా ముహమ్మదుర్రసూలుల్లాహ్‌ా – సద్వచనం వైపు ఆహ్వానించారు. విగ్రహాలను, బహు దైవారాధనను తప్పు పట్టారు. విగ్రహాల యొక్క నిస్సహాయతను ఎండగట్టారు. అవి ఏ విధమైనటువంటి లాభం గాని, నష్టంగాని చేకూర్చలేవని స్పష్టపర్చారు. ఇది విన్న అబూ లహబ్ నీవు నాశనంగాను! ఈ మాటలు చెప్పడానికే మమ్మల్ని ప్రోగుచేశావా? అని చిర్రుబుర్రులాడాడు. ఈ సందర్భంగా ‘తబ్బత్ యదా అబీ లహబిన్వ తబ్బ్’ ‘అబూ లహబ్ చేతులు విరిగిపోయాయి! అతడు సర్వ నాశనం అయిపోయాడు’ అన్న దైవ సూక్తులతో సూరయె మసద్ అవతరించింది.