మహా ప్రవక్త ముహమ్మద్ (స) నిలువెల్లా కారుణ్యం. ఆయనలో దయాగుణం, క్షమా గుణం, సం స్కారం, మర్యాద, మృదుత్వం, వాత్సల్యం, నిజాయితీ,సచ్చీలత, సత్యసంధత, సౌమ్యం, దాతృ త్వం, ప్రేమ, జాలి సంపూర్ణంగా మూర్తీభ వించి ఉండేవి. ఖుర్‌లో ఇలా ఉంది: ”(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నీవు మహోన్నత శీలశిఖర అగ్ర భాగాన్ని అధిరో హించి ఉన్నావు”.(నూన్: 4)
ఏ సత్యసంధుని (సాదిఖ్) గురించయితే ఆయన సతీమణి, విశ్వా సుల మాత హజ్రత్ ఆయిషా(ర) ”ఆయన గుణగణాలు ఖుర్‌ఆన్‌కు దర్పణం వంటివి” (ముస్లిం) అని చెప్పారో….
ఏ సచ్చీలుని (అమీన్) గురించి ఆయన ప్రభువు ”నిశ్చయంగా మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సమస్త లోకాల పాలిట మూర్తీభ వించిన కారు ణ్యంగా చేసి పంపాము” (అన్బియా: 107) అని కితాబు ఇచ్చాడో, ఏ ప్రవక్తల అధినాయకుని (సయ్యిదుల్ అన్బియా)పై ”చదువు” అన్న పదంతో దివ్యవాణి అవతరించిందో, ఏ ఆదరణకర్త (అహ్మద్, ఫార్‌ఖలీత్) గురించయితే దైవ ప్రవక్తలు,ఆకాశ గ్రంథాలన్నీ గళమెత్తి భవిష్యవాణులు విన్పించా యో, ఏ అల్లాహ్ నేస్తం (ఖలీలుల్లాహ్) సహచర్యం కోసం ఓ బాలుడు తన తల్లిదండ్రుల్ని సయితం వదులుకోవడానికి సిద్ధమయ్యాడో,ఏ స్వేచ్ఛాప్రదాత (ఇబ్నుల్ అవాతక్) అయితే సఫా పర్వతంపై నిలబడి ”మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే- లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకండి, అరబ్బు, అరబ్బేతర రాజ్యాలు మీ వశమవుతాయి, మీ సకల సమస్యలకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుంది. మీరు ఇహపరాలసఫలీకృతులవుతారు” అని ఘంటాపథంగా ప్రకటిం చారో,ఏ క్రాంతికారుడు(మాహి) అయితే – బద్ర్ రణభూమిలో సయితం చేతిలో కరవాలం పట్టుకోవడానికి బదులు తన నొసటను దైవ సన్నిధిలో వాల్చి దీనాతిదీనంగా ‘మానవ జాతి ముక్తి’ కోసం వేడుకున్నారో, ఏ (అగ్రజులు) హాషిర్ అయితే ప్రియాతి ప్రియమయిన మక్కా నగరాన్ని వదలిపోవడానికి కారకులయినవారు యుద్ధ ఖైదీలుగా పట్టుబడి వచ్చినప్పుడు గౌరవాదరణలతో సాగనంపారో,ఏ సత్పురుడు, సంపూర్ణుడయితే (ఆఖిబ్) మక్కా విజయం లభించిన సందర్భంగా కృతజ్ఞతాభావంతో, తలను వంచి, నుదురు మాటి మాటికీ ఒంటె మూపురానికి తగులుతుండగా అత్యంత నిరాడంబరతతో మక్కాలో ప్రవేశించారో, ఏ ధృవీకరణకర్త (ముఖ్ఫీ) అయితే రేయింబవళ్లు తన చావు ప్రణాళిలు వేసేవారిని, తన బాబాయిను చంపి గుండె కాయను కరకర నమిలిన కసాయి వారిని కనికరించి వదిలేశారో, ఏ ప్రక్షాళనకర్త (ముజక్కి) అయితే కాళ్ళు ఉబ్బిపోయేంత సుదీర్ఘ ప్రార్థనలు చేస్తే, స్వయంగా ఆ సర్వేశ్వరుడే (ఓ ముహమ్మద్!) ”నిశ్చయంగా నువ్వు ఒక్కోసారి మూడింట రెండు వంతుల రాత్రికంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావని నీ ప్రభువుకు తెలుసు” అని కితాబు ఇచ్చాడో, ఏ సాక్షి (షాహిద్) మరియు పూర్తి అరబ్బుకి అధినాయకుని ఇంట్లోనయితే ఆయన పరమపదించిన నాటికి దీపం వెలిగించడానికి నూనె లేదో, ఏ శుభవార్త విన్పించేవారి (ముబష్షిర్) కుటుంబీకులయితే రోజులు, వారాలు, నెలల తరబడి ముప్పూటలా భోంచేసి ఎరుగరో, ఏ భయపెట్టేవారయితే (నజీర్) ‘లేదు’ అన్న మాట ఒక్క ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ లో తప్ప చెప్పి ఎరుగరో, ఏ ప్రబోధకుని (దాయీ) పట్లయితే ఆయన సహచరులు అమిత ప్రేమాభిమానాలు కనబర్చారో, ఏ దీప శిఖామణి (సిరాజ్ – మునీర్) వుజూ నీళ్ళను, చెమటను, రక్తాన్ని భూమి మీద పడకుండా దాచుకునే వీరాభిమానులుండే వారో, ఏ వాత్సల్యమూర్తి (రవూఫ్) అయితే దారిన నడిచి వెళుతుంటే చెట్లు సయితం సగౌరవంగా సలామ్ చెప్పేవో, ఏ దయాహృదయుడి (రహీమ్) తోనైతే పశువులు సయితం వాటి గోడుని చెప్పుకుని విలపిం చేవో, ఏ విశ్వసనీయుని (ముతవక్కిల్ ) విరహావేదనతో చెట్లు సయితం ఎక్కి ఎక్కి ఏడ్చేవో, ఏ ముస్తఫా అయితే ధాన్య, ధన రాసుల్ని ప్రజలలకు పంచేసి, అవసరం కోసం వచ్చిన గారాల పట్టి ఫాతిమా (ర)ను ”33సార్లు సుబ్హానల్లాహ్, 33 అల్‌హమ్దు లిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 1 సారి లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహు లా షరీక లహు లహుల్‌ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్- చదువుకో, అది నీ రోజంతటి శ్రమ నుండి ఉపశమనం కలిగిస్తుంది” అని సాగనంపారో, ఏ ముజ్‌తబా అయితే అతిథి మర్యాదలు ఘనంగా చేయడమే కాక, ఆ అతిథి మహారధుడు చేసిన నిర్వాకాన్ని ఎవ్వరికి చెప్పకుండా తన స్వహస్తాలతో అతని మలినాన్ని శుభ్ర పర్చారో, ఏ నిరక్షరాసి (ఉమ్మీ ) అయితే అలవాటు ప్రకారం తలపై చెత్త పడ లేదేమిటి? చెత్తపోసే వ్యక్తికి ఏమయిందోనని కలత చెంది పరామర్శించడానికి అతని ఇంటి తలుపు తట్టారో, ఏ పాపరహితులయితే (మాసూమ్) అయితే దారమ్మిడి తనను బండ బూతులు తిట్టే ఓ పెద్దమ్మ బరువు ఎంతో ఓపిగ్గా మోసుకెళ్ళి ఆమె గమ్యానికి చేర్చి, ‘ఎవరు నాయనా నువ్వు?’ అని ఆ పెద్దమ్మ అడిగితే – ‘అవ్వా! ఏ వ్యక్తికయితే దారి పొడుగునా నీవు తీట్ల పురాణం విన్పించావో తను నేనే’ అని ఎంతో వినయంగా చెప్పారో, ఏ ఖాసిమ్ అయితే మెడలో త్రాడేసి బిగించి చంపాలనుకున్నా వారికి సన్నార్గం చూపించమని ఆ సర్వేశ్వరుని సన్నిధిలో వేడుకున్నారో, ఏ వాలిద్ (తండ్రి) ఆవేదన చూసి విశ్వకర్త సయితం విస్మయం చెంది ”(ఓ ముహమ్మద్!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను (దివ్యవాణిని) విశ్వసించక పోతే నువ్వు వారి వెను దుఃఖంతో కుమిలి పోతూ నీ ప్రాణాలు పోగుట్టుకుంటావా ఏమి?” అని ఓదార్చాడో, దైవ ప్రవక్తల పరంపరను పరిసమా ప్తంగావించిన ఏ వ్యక్తి (ఖాత ముల్ అన్బియా వర్రుసుల్) పవిత్ర జీవితాన్ని స్వయంగా ఆ సత్య దైవమే ”(ఓ ముహమ్మద్!) నీ ఆయుష్షు సాక్షిగా!” అని ప్రమాణంగా తీసుకున్నాడో, ఏ నరాశంస హృదయాన్ని,నేత్రాన్ని, మాటని, బాటని, నడకని, నడవడికని గురించి స్వయంగా అల్లాహ్ జమానతు తీసుకోవడమేకాక, ”ఆయన జీవితంలో అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించే వారి కోసం అత్యు త్తమ ఆదర్శం ఉందని, ఆయన (స) అనుసరణే దైవ ప్రేమకు సోపానమని, ఆయన (స) అయిష్టతే దైవాగ్రహానికి కారణభూతమ”ని చెప్పాడో,అటువంటి మహోన్నత శీల శిఖరం తన ప్రత్యర్థులతో కఠినంగా వ్యవహరించారని, అభిమానం, అనురాగం ఆయనకు ఆమడ దూరంలో ఉండేదని, ఆయనది కఠిన హృదయం అని ప్రచారం చేయడం, ఆయన తీవ్రవాద స్వభావం గలవారనే ధోరణిలో ఆయన కార్టూన్లు గీయటం, చిత్రాలు తీయడం మానవతే సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. అట్టి దుష్ట స్వభావులు ఎంత మంది ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రవక్త (స) వారి కీర్తి పెరుగుతుందేగానీ తగ్గదు అనడానికి ప్రతి ఏటా ప్రపంచ నలు మూలల నుండి హజ్ కోసం తరలి వచ్చే జనసంద్రమే సజీవ సాక్షి! ఇక కుత్సిత మతుల విష యంటారా? వారందరికి అల్లాహ్ ఒక్కడే సరిపోతాడు: ”(ఓ ముహమ్మద్!) నిన్ను పరహసిమచేవారి సంగతి చూసుకోవడానికి మేమే చాలు”. (అల్‌హిజ్ర్: 95)
మన తక్షణ కర్తవ్యం ఏమిటి?
శాంతికి శత్రువులు ఇటువంటి చేష్టల ద్వారా ముస్లిం జన సమూహ సహనానికి అగ్ని పరీక్షే పెడుతున్నారు. ప్రవక్త (స) వారిని తమ, తన మాన, ధనాలకన్నా ఎక్కువగా అభిమానించే కొందరి తొందరపాటు చర్యల్ని ప్రపంచానికి చూపించి – ‘ఇస్లాం, ముస్లింలంటే ఇదే’ అని నమ్మబలకడానికి వేసిన ఎత్తుగడలలో భాగమే ఇటు వంటికవ్వింపు చేష్టలు. నేడు మానవ సమాజం ఎదుర్కొం టున్న సకల సమస్యలకు పరిష్కారంగా వేదిక మీదికి వస్తున్న ఇస్లాం అఖండ జ్యోతిని అర చేత్తో ఆపాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు.2030వరకు ముస్లిం ల సంఖ్య 3 వందల కోట్లకు చేరుకునే అవకాశం ఉందనే అంచనాలతో భయపడుతూనే వారిని ఎన్ని విధాలుగా వీలయితే అన్ని విధానాలను అవలంబించి సంహరించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు, కొన్ని చోట్ల వారి ఎత్తుగబడలు ఫలిస్తున్నాయి కూడా.
ఇట్టి క్లిష్ట స్థితిలో మనం తీవ్ర భావావేశంతో విజృంభించడం అనేది వారి చదరంగంలో పావులుగా మారడమే అవుతుంది. కాబట్టి ప్రవక్త (స) వారి పవిత్ర జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకునే మనం సమయస్ఫూర్తిని ప్రదర్శి స్తూ యుక్తితో వ్యవహరించాల్సి ఉంది. పెద్ద ఎత్తున ప్రవక్త మహనీయుల పవిత్ర జీవితం గురించి ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉంది. బ్లాగులు, వెబ్‌సైట్లు, దిన, వార, మాస పత్రికలు, డివిడీల మాధ్యమంతో ‘ఇస్లాం అంటే పరిష్కారమే గానీ సమస్య కాదు, కాజాలదు’ అని తెలిజేయాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో దైవ ప్రవక్త పట్ల అనుచితంగా వ్యవహరించేవారిని కఠినంగా శిక్ష అమలు పర్చేలా చట్టం తీసుకు వచ్చేందుకు అవిరళంగా శ్రమిం చాల్సి, పోరాడాల్సి ఉంది. చివ రిగా ప్రస్తుత ప్రతికూల పవనాలను చూసి నిరాశకు గురి కాకూడదు. ఆ విషయానికొస్తే నిరాశ చెందటం విశ్వాసికి శోభించని విషయం. ప్రస్తుతం మనం ఎదుర్కొటున్న సమస్యల్లో ఖచ్చి తంగా అల్లాహ్ మేలు పెట్టి ఉంటాడని మనం బలంగా నమ్ముతూనే, మన క్రియా జీవితం ప్రవక్త (స) వారి పవిత్ర జీవనానికి ప్రతిబింబంగా ఉండేలా అహర్నిశలు పరిశ్రమించాలి. మనం మారాలి, మన ప్రవర్తన మారాలి, మారుతూనే ఉండాలి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు; ”ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చింది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే (ఈ కుట్రలో భాగస్తులయిన) వారి లో ప్రతి ఒక్కరికీ వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహా శిక్ష పడు తుంది”. (అన్నూర్: 11)