ఐ పి సి తెలుగు విభాగం
తయమ్ముమ్: భాషాపరంగా ఉద్దేశించడం.
తయమ్ముమ్: షరీయతు పరిభాషలో ఒక ప్రత్యేకమయిన పద్ధతితో సంకల్పం చేసుకొని ముఖం మరియు రెండు చేతులను మట్టితో స్పర్శించడం.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”మీరు రోగ గ్రస్తులయితే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకొని వస్తే లేక మీరు స్త్రీలను కలిస్తే అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమయిన మట్టిని తీసుకొని తయమ్ముమ్ చేసుకోండి. దాని మీద చేతులు కొట్టి వాటితో ముఖాలను, చేతుల్ని స్పర్శించండి. నిశ్చయంగా అల్లాహ్‌ా మన్నించేవాడు.
(నిసా 43)
హుజైఫా (ర) కథనం: దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: మాకు ఇతర సముదాయలపై మూడు విషయాల ద్వారా ఔన్నత్యం అనుగ్రహించబడింది. (నమాజులో) మా పంక్తుల్ని దైవదూతల పంక్తుల్లా చేయడం జరిగింది. సమస్త భూమండలం మా కొరకు సజ్దా స్థలంగా చేయబడింది. దాని మట్టి మా కొరకు పరిశుద్ధంగావించబడింది. నీరు లభించని పక్షంలో. ఆయన మరో లక్షణాన్ని కూడా ప్రస్తావించారు.” (ముస్లిం 522)
తయమ్ముమ్ కారణాలు
1. ప్రయాణావస్థలో ఉండి నీరు లభించకపోవడం
2. నీరు ఉంది కానీ అది త్రాగడానికి అవసరం.
3.నీళ్ళున్నాయి కానీ మనిషి ఉన్నచోటునుండి అవి 2 1/2 కి.మీ దూరంలో ఉన్నాయి. అట్టి స్థితిలో అతను తయమ్ముమ్ చేసుకోవచ్చు. అదే పనిగా కష్టపడి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు.4. మనిషి ఉన్న చోటుకి సమీపంలో నీళ్ళున్నప్పటికీ దగ్గరకెళ్తే తన ధన,మానాల ప్రమాద భయం ఉండటం.
5. నీటి ఉపయోగం వల్ల వ్యాధి అధికమయ్యే లేక ఆరోగ్యంపై చెడు ప్రభావం ప్రమాదం ఉన్నప్పుడు తయమ్ముమ్ చేసుకుంటే చాలు. నీటిని వాడాల్సిన అవసరం లేదు. తలకు గాయమయి స్నానం చేసి మరణించిన వ్యక్తి సంఘటనలో ప్రవక్త(స)వారు ఇచ్చిన అనుమతి దీనికి ఆధారం.
6. చలి తీవ్రత ఎక్కువగా ఉంది, చన్నీటిని వాడితే (న్యుమోనియా,పక్షవాతం) జబ్బు పడే భయం ఉంది, చన్నీటిని వేడి చేయగలిగే పరికరం శక్తి లేనప్పుడు.
జాబిర్ (ర) గారి కథనం: ఓ సారి మేము ప్రయాణావస్థలో ఉన్నాము. మాలో ఒక వ్యక్తి రాతిపై పడి తల తీవ్రంగా గాయపడింది. అదే సమయంలో అతనికి స్వప్నస్ఖలనం కూడా జరిగింది. అప్పుడా వ్యక్తి తన సహచరుల్ని ”తయమ్ముమ్ చేసే అనుమతి ఉందా?” అని ప్రశ్నించాడు. అందు వారు నీకా అనుమతి లేదు. నీకు నీరు పుష్కలంగా లభ్యమయి ఉంది కదా! అన్నారు. అతను స్నానం చేశాడు. ఫలితంగా మరణించాడు. మేము దైవప్రవక్త(స)వారి సన్నిధికి వచ్చాక జరిగిందంతా ఆయనకు వివరించాము. సాంతం విన్న ఆయన(స) ఇలా అన్నారు: వారు అతన్ని చంపేశారు. అల్లాహ్‌ా వారిని హతమార్చుగాక! వారికి తెలియనప్పుడు అడిగి తెలుసుకోలేకపోయారా?! అజ్ఞానికి విరుగుడు అడగటం,ప్రశ్నించడం. అతడు తయమ్ముమ్ చేసుకొని ఉంటే సరిపోయేది. తన గాయంపై కట్టుకట్టి మసహ్‌ా చేసుకొని మిగిలిన శరీరాన్ని కడుక్కొని ఉంటే ఈ స్థితి ఏర్పడేది కాదు కదా!”. (అబూ దావూద్ 336)
అమ్ర్ బిన్ ఆస్(ర) కథనం: లైంగిక అశుద్ధత-జనాబత్‌కు గురయిన ఆయన చన్నీటి స్నానం వల్ల ప్రాణాపాయం ఉంటుందని భయపడి తయమ్ముమ్ చేసుకున్నారు. ప్రవక్త(స) ఆయన ఆ పనిని ధృవీకరించారు.”(అబూదావూద్, ఇబ్ను హిబ్బాన్)
తయమ్ముమ్ షరతులు:
1.నమాజు వేళ అవడం
2. నమాజు వేళ నీటి అవసరం ఏర్పడటం
3.పరిశుద్ధమైన మట్టి, దుమ్ము ధూళిలాంటిది లేకపోవడం
4. ముందు అశుద్ధతను దూరం చేయాలి.
5. తయమ్ముమ్‌కి ముందు ఖిబ్లా దిశన ప్రయత్నించడం.
తయమ్ముమ్ అర్కాన్లు
1. సంకల్పం
2. తయమ్ముమ్
(అ) రెండు చేతుల్ని పరిశుభ్రమయిన మట్టిపై కొట్టాలి.
(ఆ) దుమ్మును ఊది వాటితో పూర్తి ముఖాన్ని స్పర్శించాలి.
(ఉ) ఎడమచేతిని వినియోగించి కుడి చేతిని మోచేతి వరకు స్పర్శించాలి.
(ఊ) కుడి చేతిని వినియోగించి ఎడమ చేతిని మోచేతి వరకు స్పర్శించాలి.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: ”తయమ్ముమ్ రెండు సార్లు (నేలకు) కొట్టడం వల్ల పూర్తవుతుంది. ఒక దెబ్బ ముఖం రుద్దడం కోసం. మరో దెబ్బ మోచేతులు సమేతంగా రెండు చేతులను స్పర్శించడం కోసం.
(దారు ఖుత్నీ 1/256)
ఒకవేళ చేతికి ఉంగరం ఉంటే రెండో దెబ్బకు ముందు దాన్ని తీసివేయాలి.
(ఎ) పై పేర్కొన్న క్రమాన్ని పాటించడం. ఎందుకంటే వుజూకి బదులు చేయబడే తయమ్ముమ్. మరి వుజూలో క్రమాన్ని పాటించడం రుకున్ అన్నది విదితమే. అదేలాగు తయమ్ముమ్‌లో కూడా అది రుకునే అనబడుతుంది.
తయమ్ముమ్ సున్నతులు
వుజూలో ఏవైతే సున్నత్‌గా ఉన్నాయో అవే తయమ్ముమ్‌లో కూడా ఉంటాయి.
1.తయమ్ముమ్‌కి ముందు తస్మియా పలకడం (బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీ అనడం)
2. ముఖం పైభాగంతో తయమ్ముమ్ మొదలు పెట్టాలి.
3. ముందు కుడి చేత్తో ఎడమ చేతిని స్పర్శించాలి.
4. ముఖం మరియు చేతుల్ని స్పర్శించే విషయం ఒకటి వెంట మరొకటి చేయాలి. అనంతరం షహాదహ్‌తో పాటు వుజూ
తర్వాత చదవాల్సిన దుఆలు చదవాలి.
అమ్మార్ బిన్ యాసిర్(ర) కథనం: వారు ప్రయాణావస్థలో ప్రవక్త(స)వారితో ఉండగా ఫజ్ర్ నమాజు కోసం పరిశుభ్రమయిన మట్టితో తయమ్ముమ్ చేశారు. రెండవసారి అరచేతుల్ని మట్టిపై కొట్టి రెండు చేతుల్ని మోచేతుల వరకు స్పర్శించారు.
(అబూదావూద్ 318)
గమనిక: మట్టిపై కొట్టేటప్పుడు వేళ్ళను విడదీసి కొట్టడం మంచిది. మట్టి శాతాన్ని తగ్గించేందుకు చేతుల్ని తట్టడం, లేదా
ఊదటం లాంటిది చేయాలి.
అమ్మార్ బిన్ యాసిర్ (ర), ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర)గారినుద్దేశించి ఇలా అన్నారు: మేమిద్దరం ఓ ప్రయాణంలో తోడుగా ఉన్న విషయం మీకు గుర్తుందా!! (నీరు లేని కారణంగా) నీవు నమాజు చేయలేదు. మరి నేనేమో మట్టిలో దొర్లి నమాజు చేశాను. తరువాత జరిగిందంతా దైవప్రవక్త (స)వారికి వివరించాను. అప్పుడు దైవప్రవక్త (స) నీవు చేత్తో ఈ విధంగా చేసి ఉంటే సరిపోయేది అంటూ తన రెండు అరచేతులనూ ఒకసారి నేలపై తట్టి ఎడమ చేతిని కుడి చేతిపై రుద్దారు. ఆ తర్వాత చేతుల ఉపరితలాన్ని ముఖాన్ని స్పర్శించారు.” ( బుఖారి 331)
వేళ అయ్యాకే తయమ్ముమ్:
పై షరతులు ఉండి నమాజు వేళ అయితేనే తయమ్ముమ్ చేయాలి. నమాజు వేళకు ముందు తయమ్ముమ్ చేయడానికి అనుమతి లేదన్న విషయం పలు హదీసుల ద్వారా రూఢీ అవుతుంది.
ప్రతి నమాజుకోసం తయమ్ముమ్:
ఒక తయమ్ముమ్‌తో ఒక ఫర్జ్ నమాజు మాత్రమే చేయాలి. సున్నత్ నమాజులు ఎన్నయినా చదవచ్చు. అలాగే జనాజా నమాజు కూడా. రెండో ఫర్జ్ చదవాలనుకుంటే తయమ్ముమ్ చేసుకోవాలి. తయమ్ముమ్‌ను భంగపర్చేది ఏవి సంభవించక పోయినా సరే. చేసే ఫర్జ్ నమాజులు వేళకు చెందినదయినా, ఖజా అయినా.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) కథనం: ”భంగపర్చేది ఏది సంభవించకపోయినా ప్రతి నమాజు కోసం తయమ్ముమ్ చేసుకోవాలి”. అన్నారాయన. (బైహఖీ 221/1)
ఫర్జ్ గుసుల్‌కి బదులు తయమ్ముమ్:
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”…ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి పరిస్థితిలో-నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో ‘తయమ్ముమ్’ చేసుకోండి….” (మాయిదా: 6)
ఇమ్రాన్ బిన్ హుసైన్ (ర) కథనం: మేము ప్రవక్త (స)వారితో ఓ ప్రయాణంలో ఉన్నాము. అప్పుడు ఆయన ప్రజల్ని నమాజు చేయించారు. వారిలో ఓ వ్యక్తి నమాజులో పాల్గొనలేదు. అది గమనించిన ప్రవక్త(స) అతన్నుద్దేశించి ‘ఏ విషయం నిన్ను నమాజు నుండి అడ్డుకుంది’? అని ప్రశ్నించారు. అందుకావ్యక్తి: నేను లైంగిక అశుద్ధతకు గురయ్యాను.(స్నానం చేయడానికి) నీరు అందుబాటులో లేదు. అన్నాడు. నీవు పరిశుద్ధమయిన మట్టితో తయమ్ముమ్ చేసుకొని ఉంటే నీకది సరిపోయేది కదా! అన్నారు ప్రవక్త(స). (బుఖారి 341, ముస్లిం 682)
తయమ్ముమ్‌ను భంగపర్చేవి:
1. వుజూను భంగపర్చే వాటన్నింటితో తయమ్ముమ్ సయితం భంగమవుతుంది.
2. నీరు లభించడం లేదా కారణం తొలగడం. ఎందుకంటే నీటిలేమి, లేదా బలమైన కారణం వల్లనే తయమ్ముమ్
అనుమతి ఉంటుంది గనక.
అబూజర్ (ర) కథనం: దైవప్రవక్త (స)ఇలా ప్రవచించారు: పరిశుద్ధమయిన మట్టి ముస్లిం పాలిట శుచీశుభ్రతనిచ్చేది. పదేళ్ళ వరకూ నీరు లభ్యం కాకపోయినా సరే! అయితే నీరు లభించగానే అతను తన శరీరంపై నీరు పోసుకోవాలి. అందులో నిజంగా మేలుంది.” ( అబూదావూద్ 332)
ఒకవేళ నమాజు అయ్యాక నీరు లభ్యమయితే నమాజు నెరవేరుతుంది. మళ్ళీ ఖజా చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నమాజు ప్రారంభించిన తర్వాత నీరు లభిస్తే నమాజును పూర్తి చేయాలి. ఒకవేళ నమాజును మధ్యలోనే ఆపినట్లయితే మాత్రం వుజూ చేసుకుని నమాజు చేసుకోవడం ఉత్తమం.”
3. కారకం దూరమయితే. అనారోగ్యంగా ఉండి స్వస్థత లభిస్తే.
పరీక్ష 9
సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(ఎ) ఉపవాసం (బి) నమాజు (సి)శత్రు భయం (డి) వేరు చేయాలి (ఇ) వుజూను భంగపరిచేవి
1. నీటికొరత మరియు………………………….. జబ్బు తయమ్ముమ్‌ను ముబాహ్‌ా చేసే కారకాలు.
2. తయమ్ముమ్ కోసం మట్టి మీద చేయి తట్టినప్పుడు వేళ్ళను……………………………….
3. నమాజు వేళ ముగియడం, నీరు లభించడం మరియు …………………..తయమ్ముమ్‌ను భంగపరుస్తాయి.
సరైన సమాధానం ఎన్నుకోండి:
4. క్రిందివాటిలో ఒకటి తయమ్ముమ్ షరతుల్లో లేదు.
(అ) నమాజు వేళ తెలుసుకోవడం
(ఆ) అశుద్ధతను దూరం చేయడం
(ఇ) లైంగిక అశుద్ధత (జనాబత్)
5. కుడి మోచేతిని ఎడమ మోచేతికన్నా ముందు స్పర్శించాలి.
(అ) సున్నత్
(ఆ) ఫర్జ్
(ఇ) ముబాహ్‌ా
6. తయమ్ముమ్ చెల్లుతుంది
(అ) ఒక ఫర్జ్ నమాజు కోసం
(ఆ) రెండు ఫర్జ్ నమాజుల కోసం
(ఇ) నాలుగు ఫర్జ్ నమాజుల కోసం
7. నమాజు సంకల్పం తయమ్ముమ్ షరతుల్లో ఓ షరతు
(అ) అవును
(ఆ) కాదు
8. మనిషి నమాజు వేళ కాకముందే తయమ్ముమ్ చేసుకోవాలి.
(అ) అవును
(ఆ) కాదు
9.వాజిబ్ వుజూకి సరిపడ నీరు లభ్యం కానప్పుడు ముస్లిం తయమ్ముమ్ చేసుకోవాలి.
(అ) అవును
(ఆ) కాదు
10. తయమ్ముమ్ చేస్తూ ఓ వ్యక్తి ముఖాన్ని స్పర్శించడం మర్చిపోయాడు. అతని తయమ్ముమ్:
(అ) సరైనదే
(ఆ) సరైనది కాదు.