Originally posted 2013-02-07 07:34:29.
అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను పుట్టించిన విశేష ధ్యేయాన్ని తెలియజేశాడు: ”మేము జిన్నాతులను మరియు మానవులను కేవలం మా ఆరాధనకై సృష్టించాము.” (జారియాత్ :56)
పేరుప్రతిష్ఠల కోసం మంచిపనులు చేయాలన్న ప్రదర్శనాబుద్ధి (రియా) నుండి కాపాడుకునే పద్ధతి ఏమిటంటే, చిత్తశుద్ధితో దైవ ప్రసన్నతను ఆశించాలి. మనసులో లేశమైనా ప్రదర్శనాతత్వం రాకుండా ఉండటానికి క్రింద పేర్కొనబడిన దుఆ చేయాలి. దైవ ప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ప్రజలారా! మీరు ఈ షిర్క్ నుండి మిమ్మల్ని కాపాడుకోండి”. అడిగేవాడొకడు ఇలా అడిగాడు: ’ఓ దైవప్రవక్తా!(స) అది చీమ కదలిక కన్నా గుట్టుగా ఉన్నప్పుడు మేము దాని పట్ల ఎలా జాగ్రత్త పడేది? దానికి ఆయన(స) ఇలా సూచించారు, మీరు ఈ విధంగా ప్రార్థించండి: ’ఓ అల్లాహ్ ! తెలిసీ మేము నీకు సహవర్తుల్ని కల్పించే చేష్ట నుండి నీ శరణు వేడుతున్నాము. తెలయని స్థితిలో గనక మా వల్ల షిర్క్ జరిగిపోతే క్షమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాము’. (అహ్మద్ )
దైవేతరుల పేర ప్రమాణం చేసినందుకు పరిహారం ఏమిటి? దీని గురించి మహాప్రవక్త(స) ఇలా వక్కాణించారు:’ఎవరయినా లాత్, ఉజ్జాలపై ప్రమాణం చేస్తే వారు లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు) అని అనాలి’. (బుఖారీ,ముస్లిం)అపశకునాలు చూసినందుకు చెందే ప్రాయశ్చిత్తం గురించి చెబుతూ ఆయన(స) ఇలా అన్నారు: ’అపశకునం మూలంగా తన సంకల్పాన్ని విరమించుకున్నవాడు షిర్క్‌కు పాల్పడ్డాడు’. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? అని సహచరులు అడిగితే ఆయన (స) ఇలా అన్నారు: ’మీరు ఈ దుఆ చేయండి: ”ఓ అల్లాహ్ ! నీ మేలు తప్ప మరే మేలూలేదు. నీ భాగ్యం రేఖ తప్ప మరే భాగ్య రేఖాలేదు. నీవు తప్ప మరో నిజదైవం లేనే లేడు.” (అహ్మద్ )