భానుడి ప్రతాపానికి తాళలేక మారు మూలలో దాగిన జీవకోటి మొత్తం తొలకరి చినుకు తాకగానే భూపొరల్ని చీల్చుకుని బయటికి వస్తాయి. వాడిపోయిన నేల పొత్తిళ్ళలో తలవాల్చిన మొక్కలన్నీ మొగ్గ తొడిగి మౌనరాగమాలాపిస్తాయి. కొత్త చిగురై పల్లవిస్తాయి. నవ్వుల జల్లులు వెల్లి విరుస్తాయి. పుడమి పరవశించి పచ్చని ప్రకృతిని ప్రసవిస్తుంది. మామి చిగురు తిన్న కోయిలలన్నీ గొంతెత్తి స్వరఝరిని అందు కుంటాయి. నీరసంగా నదురించే నెమలి ఒక్కసారిగా పురివిప్పి నాట్యమయూరి అవుతుంది. పక్షుల కిలకిలలు, నదుల గలగలలతో వాతవరణమంతా ఆనంతభరిత మౌతుంది. ఇది వాన జల్లు తాకిడితో ధరణిలో వచ్చిన పరివర్తనం. అదే అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) వారి అమృత పలుకుల తాకిడితో మానవ మనో మస్తిష్కాలు విప్పారుతాయి. మానవ మనో ధరణిలో మూఢ విశ్వాసాలకు తాళ లేక మూలమూలల్లో దాగిన గుణకోటి మొత్తం ప్రవక్త (స) వారి అమృత జల్లుతో జీవం పోసుకుంటాయి. దానవుడికన్నా మానవుడే గొప్పంటూ హృదయ కవాటాలు తెరుచు కుంటాయి. ఎండిపోయిన మనో భూమి పొత్తిళ్ళలో తలవాల్చిన ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, అనురాగం, త్యాగం అన్నీ మొగ్గలు తొడిగి మానవత్వపు దివ్వెలు వెలిగిస్తాయి. మనిషిలోన అణగారి ఉన్న నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు పురి విప్పి ప్రగతి పథాన పయనిస్తాయి. శాంతి మూర్తులై, క్రాంతికారులై లోకశాంతికై పోరాడుతాయి. జగమంతా శాంతి సాత్వికతలను నెల కోల్పుతాయి.
ఎంత మధురం! ఆయన పలుకులు. ఎంత మనోహరం ఆ స్పర్శ సత్యామృతాన్ని గుండెలో నింపుకొచ్చినట్లు. ఎంతటి సుగంధభరితం! నిదురపోతున్న మానవుణ్ణి తట్టి లేపుతున్నట్లు. ఎంత హాయి! మరచిపోయిన మనిషి పాఠాన్ని గుర్తు చేస్తున్నట్లు. అన్నీ ఆయన అమృత పలుకుల చిలుకులతోనే సాధ్యం. అవి నిత్యం, నిర్విఘ్నంగా కురిసే స్వాతి చినుకులు. పడిన స్థలాన్ని బట్టి ఫలాన్నిస్తాయి. తూర్పు పడమరల స్వామి సాక్షిగా! సత్య ప్రేరణలను సదా మానవ హృదయాల్లో కలిగించేందుకు
ఆయన పలుకులు క్షణం వింటే చాలు. వందేళ్ళు జీవించే మనిషైనా, నీటి మీద బుడగలా క్షణకాలం బ్రతికే వ్యక్తి అయినా ఆయన పలుకుల్ని హృదయానికి హత్తు కుంటే, ఆయన ఆదర్శాల్లో నడుచుకుంటే అతని బ్రతుకు ధన్యమవుతుంది. మరణించాక కూడా ఆయన (స) చేసిన ఉపకారానికి రుణపడి ఉంటుంది. అట్టి ఆత్మకు దేవుని దీవెనలూ అందుతాయి, దైవ దూతల ఆశీర్వాదాలూ ప్రాప్తమవుతాయి, ప్రజల ప్రశంసలూ లభిస్తాయి. అదిగో దైవ వాణి ఏదో చెబుతున్నట్లుంది…. శ్రద్ధగా వినండి!
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”మీకు నిజంగానే అల్లాహ్‌ా పట్ల ప్రేమ ఉంటే (మీరు నిజంగా అల్లాహ్‌ాను ప్రేమించేవారైతే) మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు”. (ఆలి ఇమ్రాన్: 31)
ప్రియ ప్రవక్త (స) తల పైకెత్తి అందరి వంకా చూశారు. అనిర్వచనీయమైన ప్రశాంతత వారందరిని ఆవహించింది. గంభీర స్వరంతో ఆయన (స ) ఇలా ప్రబోధించారు:
”ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూ”. భూప్రపంచం మీ వశమయ్యే అద్భుత సూత్రం చెప్పనా – ‘దేవుడ ఒక్కడే’ అని విశ్వసించండి. ఇది పూబాట అని నేననటం లేదు. సత్యమార్గం కఠినమైనదే అయినా ఆ బాటనే సాగిపోండి. ఇనుప దువ్వెనలతో ఎముకల నుంచి మీ మాంసాన్ని వేరు చేసినా, మిమ్మల్ని నిలబెట్టి నిలువునా రెండుగా చీల్చినా, భగభగమండే అగ్ని గుండంలో మిమ్మల్ని పడేసినా, అగ్గి మీద కట్టేసి మిమ్మల్ని వేంచేసినా, ఆస్తిపాస్తుల్ని కొల్లగొట్టినా, మిమ్మల్ని అనాథల్ని చేసినా మీరు మాత్రం ధర్మ మార్గాన్నే అంట బెట్టుకుని ఉండండి. ఎటువంటి క్లిష్ట స్థితిలోనూ దైవ త్రాటిని విడనాడకండి. శిశిరం అందమైన తోటంతటినీ ధ్వంసం చేసినట్టు జీవిత పరీక్షలు మిమ్మల్ని అతలాకుతలం చేసేసినా మీరు సత్యాన్నే నమ్ముకోండి. మిథ్యావాదాల్ని, దైవాల్ని త్యజించండి. గుర్తుంచుకోండి, సత్యం మిమ్మల్ని దైవ ప్రేమకు పాత్రుల్ని చేసినట్లే, అది మిమ్మల్ని మరణ శిక్షలు కూడా వేయిస్తుంది. ఆదరిస్తే అది మీ పురోభివృద్ధికి, స్వర్గ అధిరోహణకు తొడ్పడినట్లే, అదమరిస్తేఅధఃపాతాళానికి తొక్కివేస్తుంది. అది మీ ఔన్నత్యాన్ని కీర్తిశిఖరాలకు చేర్చినట్లే, కాసింత అశ్రద్ధ వల్ల కిందికి దిగి భూమిని గట్టిగా అంటిపెట్టుకుని ఉన్న మీ పాదాల్ని ఊపివేస్తుంది. మీలో విశ్వాసులు ఎవరో, కపటులెవరో నిగ్గు తేల్చడానికి అది అలా చేస్తుంది. మిరు సాధుస్వభావులుగా, శాంతికాముకులుగా, సత్యవంతులుగా ఉండాలనీ, మిమ్మల్ని అన్నీ దాస్యపు బంధనాల నుండి బంధ విముక్తుల్ని చేయాలనీ, మిమ్మల్ని సంపూర్ణ స్వేచ్ఛాపరుల్ని చేయాలనీ, ధాన్యాన్ని దంచినట్లు, సత్యం మిమ్మల్ని దంచి, పొట్టంతటినీ చెరుగుతుంది. మీరు సాధుస్వభా వులుగా ఉండాలని సత్యం మీ మధ్య విశ్వాస సంబంధాన్నిపటిష్టపరుస్తుంది. మీరు చేసే ప్రతి పని దైవానికి ప్రియమయ్యేటట్లు మీ వ్యక్తిత్వాలను మలుస్తుంది. కొలిమి నగల తయారీలో వాటిలోని నురుగును ఎలా తిసిపారేస్తుందో, అలాగే సత్యం మీలోని లొపాలను పాపాలన్నింటిని కడిగివేస్తుంది. ప్రభువుకు నచ్చినది, ప్రజలు మెచ్చినది మేలు చేసేది మాత్రమే మీ మనో భూమిలో మిగిలి ఉంటుంది. మీ హృదయ ప్రక్షాళనం చేస్తుంది. మీ ఉనికి లక్ష్యాన్ని మీరు గ్రహించేలా మీకు జ్ఞాన బోధ చేస్తుంది. దివ్యవాణి ఇలా అంటుంది:
”మేము విశ్వసించాము” అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదలివేయ బడతామనీ, తాము పరీక్షింపబడమనీ ప్రజలు అనుకుంటున్నారా? వారికి పూర్వం గతించిన వారిని కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్‌ా తెలుసుకుంటాడు”. (అల్ అన్‌కబూత్: 3)
”ఏమిటి? వీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించ గలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానే లేదు. వారిపై కష్టాల కడగండ్లు, రోగాల వరదలు విరుచుకు పడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయ బడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) ”ఇంతకీ దైవ సహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు పెడబొబ్బలు పెట్టారు. వినండి! అల్లాహ్‌ా సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చడం జరిగింది). (అల్ బఖరా: 214)